రాష్ట్ర విభజన రాజకీయకారణాలతో చేసేస్తూ వుంటారు, కానీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోరు. నీటిగొడవలే కాదు, సరిహద్దు గొడవలు కూడా ఎప్పటికీ తేలవు. అటువైపు నాయకులు, యిటువైపు నాయకులు సమస్యను ఎగదోస్తూనే వుంటారు. ఈ జులైలో బెళగాం జిల్లాలోని ఎల్లూరు దగ్గర గొడవలయ్యానని తెలియగానే ఇంకా ఆ గొడవలు నడుస్తున్నాయా అని ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే నా చిన్నప్పటినుండీ కర్ణాటకలోని బెళగాం జిల్లా మాకు రావాలని మహారాష్ట్ర గొడవ చేస్తోందని, మహారాష్ట్రలో విలీనం అనే నినాదంతో ఆ జిల్లాలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి అనే పేరుతో ఒక పార్టీ నడుస్తుందని, అక్కడున్న అయిదు అసెంబ్లీ స్థానాలనూ అదే గెలుస్తూ వుంటుందనీ, పోనుపోను ఉద్యమం చప్పబడి దానికి ఒకటో, రెండో స్థానాలు వస్తున్నాయని చదువుతూ వచ్చాను. ఇప్పటికీ ఆ సమస్యను సజీవంగా వుంచారంటే ఆహా రాజకీయ మహిమ అనిపించింది. ఆ గ్రామాలు ఏ రాష్ట్రంలో వున్నా ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. వాటిని చేర్చుకున్న రాష్ట్రం లాభపడేదీ లేదు, వదులుకున్న రాష్ట్రం పోగొట్టుకునేదీ లేదు. పోలవరం ముంపు గ్రామాల విషయంలో అయితే అవి కలుపుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌కు పునరావాస సమస్య వచ్చి పడుతుంది. అందువలన పట్టుబట్టిందనుకోవచ్చు. ఈ బెళగాం విషయంలో ఆ గ్రామాల్లో వజ్రాల గనులూ లేవు, వైఢూర్యాల పాతరలూ లేవు.
1956లో కర్ణాటక ఏర్పడినపుడు నిజాం రాష్ట్రం నుంచి కొన్ని ప్రాంతాలు, మద్రాసు నుండి కొన్ని, బొంబాయి రాష్ట్రం నుండి కొన్ని ప్రాంతాలు కలిపి ఏర్పాటు చేశారు. అయితే బెళగాం, కార్వార్, బిజాపూర్, గుల్బర్గా, బీదర్, ధార్వాడ్ జిల్లాలలోని 865 గ్రామాల్లో మరాఠీ మాట్లాడేవారు అధికసంఖ్యలో వున్నారు కాబట్టి మహారాష్ట్రలో కలపమని అడిగారు. అక్కడున్న ప్రజలు కన్నడ, మరాఠీ రెండు భాషలూ ధారాళంగా మాట్లాడతారు. ఇంట్లో మాట్లాడుకున్నపుడు రెండూ కలిపి అదో రకమైన యాసలో మాట్లాడతారు. అయినా కొంతమంది మరాఠీ ఆందోళనకారులు మహారాష్ట్రలో కలపాలంటూ గొడవ చేశారు. 1957లో బెళగాం జిల్లాలోని ఎల్లూరులో శరాబంది ఆందోళన జరిగి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చివరకు యీ వివాదంపై 1966లో మహాజన్ కమిషన్ వేస్తే అది అన్ని వాదనలూ విని, 265 గ్రామాలు మహారాష్ట్రకు, తక్కినవి కర్ణాటక యివ్వాలని చెప్పింది. ఈ ఎల్లూరు కర్ణాటకలోనే వుండిపోయింది.
పోనుపోను అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయతా వాదం ప్రబలింది. ప్రాంతీయ భాషలోనే కార్యకలాపాలు జరపాలని, స్థానిక భాషలోనే దస్తావేజులు, ప్రభుత్వ నోటీసులు వుండాలని తీర్మానించసాగారు. తమిళనాడు, మహారాష్ట్ర యిటువంటి వాటిల్లో ముందడుగు వేశాయి. కర్ణాటక కూడా 1973లో ఆ పాలసీ అమలు చేసింది. 1986 నాటికి స్టేట్ సిలబస్ వున్న స్కూళ్లలో కన్నడ భాషను కంపల్సరీ చేసింది. దాంతో మరాఠీ ఉద్యమకారులు ఆందోళన చేస్తూ వచ్చారు. వారికి మద్దతుగా శరద్ పవార్, ఛగన్ భుజబల్ బెళగాం చేరి ఆందోళనలో పాల్గొన్నారు. తమాషా ఏమిటంటే మహారాష్ట్రలో కూడా అదే రూలు వుంది. ఆ రాష్ట్రంలో కన్నడ ప్రజలు అత్యధిక సంఖ్యలో వున్న అక్కల్‌కోట్ తదితర ప్రాంతాల్లో కన్నడ మీడియం స్కూళ్లను కూడా అనుమతించటం లేదు. అంతేకాదు, మహారాష్ట్ర అసెంబ్లీ కర్ణాటకకు వ్యతిరేకంగా 18 సార్లు తీర్మానాలు చేసింది. 2006లో సుప్రీం కోర్టుకి వెళ్లింది. బెళగాం మునిసిపల్ కార్పోరేషన్‌లో మరాఠీ వారే మెజారిటీలో వున్నారు. వాళ్లు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినమైన నవంబరు 1 ని బ్లాక్ డేగా నిర్వహిస్తారు. దాంతో ఒళ్లు మండిన కర్ణాటక బెళగాం పేరును బెల్గావిగా మారుద్దామనుకుంది.
ఎల్లూరులోని మరాఠీ ఉద్యమకారులు 'ఎల్లూరు, మహారాష్ట్ర రాష్ట్రం' అని మరాఠీలో బోర్డు రాసి వేళ్లాడదీశారు. అది చూసిన కన్నడిగులకు ఒళ్లు మండినా చాలా ఏళ్లు వూరుకున్నారు. చివరకు ఎవరో కోర్టుకి వెళ్లారు. హై కోర్టు ఆ బోర్డు తీసేయమంది. పోలీసులు వచ్చి తీసేశారు. తీసేముందు స్థానిక ఎమ్మెల్యే శంభాజీ పాటిల్‌కు, యితరులకు నచ్చచెప్పారు. ఆ గొడవ అంతటితో చల్లారేదే. కానీ మహారాష్ట్రలో అక్టోబరులో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ వివాదం లేవనెత్తితే మరాఠీ ఛాంపియన్లుగా అక్కడ రాజకీయప్రయోజనం కలుగుతుందనే ఆశతో మహారాష్ట్ర రాజకీయ పార్టీలకు దీనిలో తలదూర్చాయి. తమ కార్యకర్తలను ఎల్లూరు పంపి 24 గంటల్లోగా అక్కడ ఆ బోర్డు మళ్లీ పెట్టేట్లు చేశాయి. దాంతో పోలీసులకు శివాలెత్తాయి. అనుమానం వున్నవాళ్లందరినీ చితక్కొట్టేశారు. ఇళ్లలోంచి లాగి మరీ కొట్టారు. దీని మీద మహారాష్ట్ర అసెంబ్లీలో రగడ. లోకసభలో రగడ. బెళగాంను యూటీగా చేయాలని శివసేన ఎంపీల డిమాండ్, వద్దు అని కర్ణాటక బిజెపి ఎంపీల అభ్యంతరం. ఆగస్టు మొదటివారంలో కూడా గొడవ చల్లారలేదు. ఆందోళనకారులపై కర్ణాటక పోలీసులు లాఠీ చార్జి చేస్తున్నారని మహారాష్ట్ర ఏకీకరణ సమితి నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ఓ పెద్ద జోకు! తప్పుడు ఎడ్రసు వున్న ఒక్క బోర్డు ఎంత పని చేసిందిరా అనుకోవచ్చు మనం. చిక్కు బోర్డుతో కాదు, రాజకీయాల్లో చితిమంటల్లో చలికాచుకుందామని చూసే నాయకులది! మన పోలవరం గ్రామాల విషయంలో యిలాటి గొడవలు రావని ఆశిద్దాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)