దేశ రాజధాని ఢిల్లీలో రకరకాల రాజకీయ పార్టీలుంటాయి. అయితే ఢిల్లీ స్థాయిలో నిలదొక్కుకోవాలంటే రాజనీతిజ్ఞత, హుందాతనం, ఇతర పార్టీల నేతలతో వ్యవహరించదగ్గ లక్షణాలుండాలి. కేవలం ఒకే ఒక సభ్యుడున్న పార్టీ కూడా ఢిల్లీలో హల్‌చల్ సృష్టించవచ్చు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా ఎర్రంనాయుడు కేవలం అయిదుగురు సభ్యులతో రాజధానిలో పార్టీని నిలబెట్టారు. కాని 9 మంది ఎంపీలున్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏమీ చేయలేకపోతున్నది. ఇందుకు ప్రధాన కారణం అందులో ఉన్న వారంతా దాదాపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కండబలం ప్రదర్శించగలిగిన సత్తా ఉన్నవారు. కాని ఈ లక్షణాలు రాజకీయ పార్టీని నిలదొక్కుకోవడానికి తోడ్పడవు. పార్లమెంట్‌లో ఏ బిల్లు వెనుక కథ ఏమిటి? ఏ రాజకీయ నాయకుడు ఏ ఉద్దేశంతో మాట్లాడారు? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాజకీయాలేమిటి తెలుసుకోవడానికి ఎవరికైనా చాలా కాలం పడుతుంది. ఒకరోజు తీవ్రంగా విమర్శించుకుంటున్న నేతలే మరో సందర్భంలో ఆలింగనం చేసుకుంటూ గడుపుతారు. పార్లమెంట్‌లో అనేక అంశాలను అధ్యయనం చేయాలి. అందుకు తగ్గ సిబ్బందిని నియమించుకోవాలి. సీనియర్ జర్నలిస్టులను సంప్రదించాలి. కాని వైసీపీ ఎంపీలు ఒక దారీ తెన్నూ లేకుండా వ్యవహరించడం వల్లే ఇవాళ పార్టీ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నది.
పార్లమెంట్ స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా వైసీపీకి ఒక స్థాయి గల రాజకీయ నాయకులు లేరు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు కుడిభుజంగా కేవీపీ రామచందర్ రావు ఉండేవారు. ఎప్పుడు ఏ దాడి జరిగితే ఎవర్ని ప్రయోగించాలో కేవీపీకి బాగా తెలుసు. హేమాహేమీలైన సీనియర్ నాయకులు కాంగ్రెస్‌లో ఉండడం వల్ల వారిని తనకు అనుకూలంగా మలుచుకోగలిగిన శక్తి కేవీపీకి ఉండేది. పీసీసీ అధ్యక్షుడు కూడా వైఎస్ హయాంలో పిల్లల్లాగా వ్యవహరించేవారు. ఢిల్లీలో కూడా వైఎస్‌కు ఎదురులేకుండా చేసుకునేవారు. ఢిల్లీ నేతలంతా వైఎస్‌ను పొగిడేలా చేసేవారు.
కాని జగన్‌కు అలాంటి వారు లేరు. ఇందుకు కారణం అనుభవం లేకపోవడం. ఎవరైనా ఏమైనా అంటే తీవ్రంగా స్పందించడం, బస్తీమే సవాల్ అన్నట్లు వ్యవహరించడం చేసే వారే వైసీపీలో ఎక్కువ. వైసీపీ అంటే అవినీతి పార్టీ అని, జగన్ దుర్మార్గుడని, ఎవరినైనా అవమానిస్తాడని, సీనియర్లంటే విలువ లేదని, ఏదైనా డబ్బుతో సాధించవచ్చునని భావిస్తాడని ప్రచారం జరిగింది. అంబంటి రాంబాబు లాంటి చిన్నా చితక నేతలు తప్ప జగన్‌కు అండగా సీనియర్‌లు ఎవరూ లేరు. ఉన్నా జగన్‌కు అణిగి మణిగి ఉండాల్సిందే కాని స్వేచ్చగా మాట్లాడే, నిర్ణయాలు తీసుకునే శక్తి వారికి లేదు. ధర్మాన, మైసూరా, మేకపాటి, అనంతవెంకటరామిరెడ్డి చచ్చిన పాముల్లా పడి ఉన్నారు. అసలు జగన్‌ను సమర్థించే నేతలే లేరు. ఢిల్లీలో జగన్ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాల గురించి కథలు కథలుగా ప్రచారమయ్యాయి. ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని, చంద్రబాబు గెలిస్తేనే మంచి జరుగుతుందని జైరాంరమేశ్ వంటి కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీలో చెప్పేవారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టగల రాజనీతిజ్ఞత వైసీపీకి లేదు. వారి ఎంపీలకూ లేదు. కాంట్రాక్టులు, వ్యాపారాల అభివృద్ధి కోసం ఏమైనా చేసేందుకు, ఎవరితోనైనా రాజీపడేందుకు సిద్దపడే వైవీ సుబ్బారెడ్డి లాంటి వారు రాజకీయాల్లో రాణించలేరు. కనీసం వారు పెట్టుకున్న సాక్షి పత్రిక కూడా వైసీపీకి ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు, జగన్‌కు మంచి రాజకీయ నాయకుడుగా గుర్తింపు తెచ్చేందుకు దోహదం చేయలేకపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జనుడు, సీనియర్ జర్నలిస్టు అయినప్పటికీ ఆయన రాజకీయాల్లో కూడా తలదూర్చడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారు. కేవలం వ్యక్తుల భజన చేయడం లేదా ఆ వ్యక్తుల ప్రత్యర్థులపై బురదచల్లడం వల్ల ఆ వ్యక్తులకు మేలు చేయడం కష్టం. పత్రిక డైనమిక్స్ వేరుగా ఉండాలి. కాని సాక్షి కేవలం కరపత్రంగా మారడం వల్లే అది జగన్‌కు సహాయపడలేకపోయింది. అదే ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నప్పటికీ అవి బాబు స్వంత పత్రికలు కావు. కనుక అవి బాబును విమర్శించే స్వేచ్చను కూడా తీసుకోగలవు. బాబుకు అవసరమైనప్పుడే అవి సహాయానికి పూనుకుంటాయి కాని నిత్య బాకాగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇప్పుడు సాక్షిలో చంద్రబాబును నిజాయితీగా విమర్శించినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే సాక్షి జగన్ కరపత్రంగా ముద్రపడింది.
వైసీపీ నుంచి గెలిచిన 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు పార్టీకి వ్యతిరేకంగా మారడానికి జగన్, ఆయన అనుయాయుల వైఖరే కారణం. ముందుగా ఎలాంటి రాజకీయ పునాది లేని వారికి సీట్లు ఇవ్వడం ఒక తప్పిదమైతే, వారు కోట్లు ఖర్చుపెట్టుకుని గెలిచే పరిస్థితి ఏర్పర్చడం మరో తప్పు. ఇక గెలిచిన వారిని జాగ్రత్తగా చూసుకునే యంత్రాంగం జగన్‌కు లేదు. ఏ కారణం వల్ల నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే పార్టీ ఫిరాయించాడో జగన్‌కు తెలియదా? అనంత వెంకట్రామిరెడ్డికి తొలుత ఏ కారణాల వల్ల సీటు నిరాకరించాడో తెలియదా? చివరి నిమిషంలో సీటు ఇచ్చినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. మేము డబ్బిచ్చి కొనుకున్నామండీ.. మాకు ఏ పార్టీలో ఉపయోగం ఉంటే ఆ పార్టీలో చేరతాం.. ఏం జగన్ మాకేమైనా ఊరకే ఇచ్చాడా అని మహిళా నేతలు సైతం అంటున్నారు. ఇలాంటి రాజకీయ సంస్కృతిని పోషించడం వల్లే వైసీపీ రాజకీయ పార్టీగా గుర్తింపు లేకుండా పోయింది.
తాజాగా కొత్తపల్లి గీత చంద్రబాబునాయుడు కలుసుకోవడం, మహిళలంటే పార్టీలో గౌరవం లేదని విమర్శించడంపై జగన్ పార్టీ నేతలు స్పందించిన తీరు దారుణం. గీత గిరిజనురాలు. విద్యాధికురాలు. గ్రూప్‌వన్ అధికారిణి. భర్త కమ్మ వ్యాపారి. బాగా డబ్బు ఆర్జించారు. సీటు కొనుక్కుని పోటీ చేసి గెలిచారు. ఆమె తొలుత తనపై విమర్శలు చేసినప్పుడు జగన్ పిలిపించి మాట్లాడలేదు. స్థానికంగా నేతలు ఆమెను దూరం పెట్టినా, ఆమె పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆమె పట్ల తెలుగుదేశం ఆకర్షణ మంత్రం జపిస్తుందని తెలిసినా తగిన చర్యలు తీసుకోలేదు. పోనీ స్పందించకపోయినా ఫర్వాలేదు. స్థానిక నేతలతో ఆమెను తీవ్రంగా దూషించేలా ఎందుకు చేశారు? వెబ్‌సైట్లలో ఆమె పట్ల బూతు భాషలో ప్రచారం చేసినా తెలిసీ తెలియనట్లు ఎందుకు ఊరుకున్నారు? నిజానికి ఒక పార్టీనుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రజలకు, మేధావులకు వారి పట్ల గౌరవం అంతగా ఉండదు. వారి సిగ్గులేని తనాన్ని అంతా అసహ్యించుకుంటారు. ఎస్‌పీవై రెడ్డి అందుకే అందరికీ దూరందూరంగా తిరుగుతున్నారు. కాని గీత విషయంలో వైసీపీ చేసిన పొరపాటు ఆమెకే సహాయపడింది. ఆమె పట్ల అసభ్య ప్రచారం చేసే ముందు ఆమె ఫిర్యాదు చేస్తారని ఊహించలేదా? ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం కేసు పెడతారని భావించలేదా? పార్లమెంట్‌లో గగ్గోలు జరుగుతుందని అనుకోలేదా? మహిళా ఎంపీ కాబట్టి అంతా ఆమెకు మద్దతునిస్తారని అంచనా వేయలేదా? చంద్రబాబు సర్కార్‌లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో వారికి తెలియదా? తానేమీ తప్పు చేయలేదని, మహిళలకు గౌరవం లేదని మాత్రమే అన్నానని, ఒక ఎంపీగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశానని గీత అమాయకంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అంతా ఆమె మాటల్ని నమ్ముతున్నారు. జగన్ పార్టీని తీవ్రంగా విమర్శింస్తున్నారు. రాజకీయ పార్టీ లక్షణాలు, రాజనీతిజ్ఞత లేకపోవడం వల్లే వైసీపీ ఒక రకమైన దుస్థితిలో ఉన్నది. గీత ఉదంతంతో ఇది బాగా బయటపడింది. నిజానికి గీత ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీతో చేతులు కదపడం వల్ల నైతికంగా జగన్ పార్టీ పట్ల సానుభూతి పెరగాలి. కాని ఇప్పుడదే పార్టీ ఆత్మరక్షణలో పడింది.
-హరీశ్