ఎమ్బీయస్‌ : ఆంధ్రుల్ని నరికాం – ఇక అడవుల్ని నరుకుదాం

సీమాంధ్రులకు కొత్త రాజధాని గురించి రాష్ట్రప్రభుత్వం పంపిన నివేదిక అంటూ ఒకటి పేపర్లలో వచ్చింది. రాజధానికోసం లక్ష ఎకరాలు కావాలని, ప్రయివేటు వ్యక్తుల నుండి కొనబోతే కొరివి అయి, కోట్లు ఖర్చవుతాయి కాబట్టి అంతకంటె…

సీమాంధ్రులకు కొత్త రాజధాని గురించి రాష్ట్రప్రభుత్వం పంపిన నివేదిక అంటూ ఒకటి పేపర్లలో వచ్చింది. రాజధానికోసం లక్ష ఎకరాలు కావాలని, ప్రయివేటు వ్యక్తుల నుండి కొనబోతే కొరివి అయి, కోట్లు ఖర్చవుతాయి కాబట్టి అంతకంటె ప్రభుత్వ భూమిగా వున్న అటవీభూమిని తీసుకోవడం మేలని సలహా యిచ్చారట. రాజధాని అనగానే విజయవాడ, గుంటూరు మధ్య పెడతారనడం, అబ్బే అక్కడ ప్రభుత్వ స్థలం లేదు, నాగార్జున యూనివర్శిటీ స్థలం సరిపోదు అనడం జరుగుతూనే వుంది. మరి ప్రభుత్వస్థలం ఎక్కడుంది అంటే వాన్‌పిక్‌ కోసం సేకరించిన వేలాది ఎకరాలు ప్రకాశం జిల్లాలో వున్నాయి కాబట్టి అక్కడే పెడతారు అంటూ వచ్చారు. కోస్తా, సీమలకు మధ్యలో వుంది కాబట్టి, ప్రకాశం జిల్లాలోని కొన్ని తాలూకాలు గతంలో గుంటూరు, నెల్లూరునుండి తెచ్చుకున్నవే కాబట్టి యిరుప్రాంతాల వాళ్లూ రాజధాని తమదే అనుకోవడానికి అవకాశం వుంది. సీమ, కోస్తాల వారిద్దరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అదే – అనే ఉద్దేశం ఎల్లెడలా వుంది. 

వాన్‌పిక్‌ భూములను అలాగే వుంచి, యిప్పుడు అటవీ భూములంటున్నారు. వాన్‌పిక్‌ ఐడియా మంచిదే. పోర్టులను, హింటర్‌ ల్యాండ్‌ను కలపడం అత్యవసరం. కోస్టల్‌ కారిడార్‌కై సేకరించిన భూమిని యితరత్రా వాడేస్తే ఎలా? ఆ ప్రకారం చూస్తే అటవీ భూములను సాగు చేసి వాడదామనడం సమంజసమే. ఇప్పటికే యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వున్న ప్రదేశాల కంటె వర్జిన్‌ ల్యాండ్‌ను తీసుకుని దాన్ని మనకు అనువుగా మలచుకోవడం తెలివైన పని. అలా చేసినా మూడోవంతు అడవులు మిగులుతాయని వీరు హామీ యిస్తున్నారు. కొత్త నగరం కట్టేటప్పుడు దాని విస్తరణను ముందుగానే వూహించి, చండీగఢ్‌ మోడల్లో సెక్టార్లుగా కట్టుకుంటే, రోడ్లు మెలికలు తిరక్కుండా తిన్నగా ప్లాన్‌ చేస్తే అంతకంటె ఏం కావాలి? ప్రస్తుతం నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీ తట్టుకోవడానికి కొన్ని ప్రధాన రహదారులను ఒన్‌-వే గా చేసి వాహనాలను చక్కర్లు కొట్టిస్తున్నారు. పెట్రోలు వృథా, సమయం వృథా, శక్తి వృథా. నగర శివార్లలో వుండే చాలా పల్లెటూళ్లల్లో టౌను ప్లానింగ్‌ వుండదు. రోడ్లు 25 అడుగుల వెడల్పు కంటె వుండవు. రోడ్డుకి అడ్డంగా ఎవడో యిల్లు కట్టుకుంటాడు. దాన్ని తీసేసి యింకో రోడ్డుతో కలుపుదామన్నా, రోడ్డు వెడల్పు చేద్దామన్నా వాళ్లు కోర్టుకి వెళ్లి ఆపేస్తారు. అందువలన అడవుల్లో నగరనిర్మాణం చేస్తే యిబ్బంది వుండదు. ఏ చెట్టుని కొట్టేసినా అది కోర్టుకి వెళ్లదు. పర్యావరణవేత్తలు కాస్త హంగామా చేస్తారంతే. 

చంద్రబాబుగారు హైవేల విస్తరణ భారీ ఎత్తున చేపట్టి వ్యాపారాభివృద్ధికి దోహదపడ్డారు. కానీ ఆ క్రమంలో రహదారులపై వున్న వందల ఏళ్ల నాటి చెట్లను నిర్దాక్షిణ్యంగా కొట్టించేశారు. ఆ చెట్లను రోడ్డు మధ్యలో అలాగే వుంచి అటూ యిటూ రోడ్డు వేస్తే ఏం పోతుందని అనిపించేది. మరి సాంకేతికంగా ఏం యిబ్బందులున్నాయో ఏమో, కొట్టి పడేశారు. ఇప్పుడు హైవేల మీద మధ్యాహ్నం వెళుతూ వుంటే ఎండ పేల్చేస్తుంది. రోడ్డు మీద ఎండమావుల్లా ఏవేవో యిమేజెస్‌ కనబడుతూంటాయి. కొట్టేసిన చెట్లకు బదులుగా చెట్లు ఎక్కడైనా వేయించారో నాకు తెలియదు. మొక్కలు నాటారో, నీరు పోశారో లేదో తెలియదు. అలాటప్పుడు యిప్పుడు రాజధాని కోసం కొట్టేయబోయే చెట్లకు బదులుగా వేరే చోట నాటుతారంటే నమ్మకం కుదరదు. ఊళ్లల్లో వేస్తే అడ్డు వస్తాయనుకుంటే, తిరుపతి కొండల మీదనైనా వేయవచ్చు. తిరుమల కొండలను గ్రీన్‌గా చేసేస్తామని ఎప్పణ్నుంచో చెప్తున్నారు. వృక్షో రక్షతి రక్షితః అని బోర్డులు రాసి పెడతారు. కానీ యిన్నేళ్లగా చూస్తున్నాను, తిరుమలలో హరితత్వం పెరిగింది తప్ప హరితతత్వం పెరగలేదు. ఈ అటవీప్రాంతం కూడా ప్రకాశం జిల్లాలోను, గోదావరి ప్రాంతంలోను వుందంటున్నారు. ప్రకాశం జిల్లా తీరప్రాంతం కదా, ఈ అడవులు కొట్టేస్తే తుపానుల తాకిడికి తట్టుకోవడం మరింత కష్టమవుతుందా? పర్యావరణవేత్తలు చెప్పాలి. ఏది ఏమైనా జనావాసాలను రాజధానిగా మార్చడం కంటె నిర్జన బంజరు భూములనో, అరణ్యాలనో అనువుగా మలచుకోవడం తెలివైన మార్గం. లిటిగేషన్‌ తగ్గి, పని త్వరగా జరుగుతుంది. అయితే కొట్టేసిన చెట్లకు రెట్టింపు నాటితే తప్ప నిధులు విడుదల చేయమని కేంద్రం షరతు పెట్టాలి. 

అయితే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే – రాజధానికి లక్ష ఎకరాలు ఎందుకు? అని. హైదరాబాదుతో పోటీపడాలంటే, ఎచ్‌ఎమ్‌డిఏ పరిధంత వుండాలి కాబట్టి లక్ష ఎకరాల అంచనాకు వచ్చేశారట. అసలు హైదరాబాదుతో పోటీపడడం దేనికి? కనబడ్డవన్నీ హైదరాబాదులో పెట్టేకదా, యింత ముప్పు వచ్చింది, యిప్పటికైనా బుద్ధి రాలేదా? హైదరాబాదు ఒకప్పుడు సుందరనగరం. టౌనులో వుండే సౌకర్యాలు, సిటీలో వుండే సౌలభ్యాలు రెండూ కలగలిపి, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కూడా తక్కువగా వుండి, చక్కటి వాతావరణంతో ఆహ్లాదకరంగా వుండేది. మరి ఇప్పుడు? ఎక్కడికి వెళ్లాలన్నా రానుపోను నాలుగు గంటలు పడుతుంది. చెట్లన్నీ మాయమయ్యి, పార్కులు, చెరువులు కబ్జా అయిపోయి వేడి పెరిగిపోయింది. కూరలు దొరకడం మానేశాయి. ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. గతుకుల రోడ్లు, శబ్దకాలుష్యం, ట్రాఫిక్‌ జామ్‌లు… వూరంటేనే విసుగు పుడుతోంది. మళ్లీ యింకోటి తయారు చేస్తారంటే బాబోయ్‌ అనిపిస్తోంది. రాష్ట్రం మొత్తానికి అన్ని అవకాశాలు హైదరాబాదులో పెట్టడం చేతనే నగరజనాభా రోజురోజుకి పెరుగుతూ పోతోంది. హైదరాబాదుని యుటీ చేసేసి, స్థానికులకే ఉద్యోగాలిస్తాం అని రూలు పెడితే, సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వాళ్లు భోరున విలపించాలి. 

సీమాంధ్రకు రాజధాని విషయంలో మళ్లీ అదే తప్పు చేయకూడదు. మాటవరసకి ప్రకాశం జిల్లాలో రాజధాని పెట్టి అక్కడే విపరీతంగా అభివృద్ధి చేశారనుకోండి. అన్ని జిల్లాల వాళ్లూ అవకాశాలకై అక్కడికే వచ్చి వాలతారు. వాళ్లలో ప్రతిభావంతులు ఉద్యోగాలు చేజిక్కించుకుంటారు. ఇంకో ఇరవై ఏళ్లకి ప్రకాశం జిల్లా వాళ్లు -యిప్పటి తెలంగాణ వాళ్లలాగా- గొడవ మొదలెడతారు. ఎక్కడెక్కడి వాళ్లో యిక్కడికి వచ్చి మా అవకాశాలు తన్నుకుపోతున్నారు. మా నోట్లో మట్టికొడుతున్నారు. మా రాష్ట్రం మాకు విడిగా కావాలి అని. ఇదేదో అభూతకల్పనలా వుందనకండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి చూడండి. చిత్తూరు జిల్లా ఉద్యోగులు ఎందరున్నారో తెలుస్తుంది. ఆ జిల్లా వాళ్లకు వెంకటేశ్వరస్వామి వాళ్ల పెరటిదేవుడని గొప్ప నమ్మకం. వాళ్లకు తప్ప ఆ దేవస్థానంలో ఎవరికీ ఉద్యోగాలు వుండకూడదన్న పట్టుదల. టిటిడి అడ్మినిస్ట్రేటర్లందరూ స్టాఫ్‌లో చిత్తూరు, నాన్‌-చిత్తూరు గొడవలతో వేగాల్సిందే. అక్కడ సిక్స్‌ పాయింటు ఫార్ములా, జోనల్‌ సిస్టమ్‌, 610 జీవో యిలాటివి ఏవీ అక్కరలేదు. వాళ్లు చెప్పినదే వేదం, అంతే. రేపు రాజధాని ఒకచోట కట్టాక ఆ జిల్లావాళ్లూ యిలా పేచీ పెట్టరన్న నమ్మకం ఏమిటి? అసలు రాజధాని అక్కడ పెట్టకపోతే స్థానికులకు ఆ పాటి ఉద్యోగాలుకూడా వచ్చేవి కావు కదా! కానీ ఆ సంగతి వాళ్లు ఆలోచించరు.  అన్ని జిల్లాల వాళ్లూ పెట్టుబడి పెట్టారు కాబట్టే హైదరాబాదు యింత విస్తరించింది. ఇక్కడ భూములున్నవాళ్ల స్వప్రయోజకత్వం ఏమీ లేకుండా, వాళ్లు చిటికెనవేలు కూడా కదపనక్కరలేకుండా ఒకప్పుడు పశుగ్రాసం కోసం జమీందారులు యినాంగా యిచ్చిన భూములకు కోట్ల రూపాయల ధర పలికింది. అందుకు వారు సంతోషించారా? లేదే! మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, మెరిట్‌లో వేరే వాళ్లు తెచ్చేసుకుంటున్నారు అని బాధపడిపోయారు. ఆందోళన జరిగింది. రాష్ట్రం విడిపోతోంది. 

ఇలాటి అవస్థ మళ్లీ రాకుండా వుండాలంటే సీమాంధ్రలోనైనా పెద్ద రాజధాని కట్టకూడదు. మొత్తం ప్రాంతాన్ని అయిదారు జోన్లగా విడగొట్టుకుని, ఒక జోనులో మంచి విద్యాలయాలు, మరొక జోనులో మంచి ఆసుపత్రులు, మరొక జోనులో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మరొక జోనులో జలాధారిత పరిశ్రమలు.. యిలా ఏర్పరచుకుంటూ పోవాలి. ఒక తరహావన్నీ ఒకే చోట ఎందుకు, వాటిని కూడా విడగొట్టవచ్చు కదా అని మీరు అడగవచ్చు. కానీ గమనిస్తే ఒక చోట ఫోకస్‌ చేస్తేనే అక్కడ ఆ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. హోల్‌సేల్‌ బట్టల మార్కెట్‌కి వెళితే బట్టలషాపులన్నీ అక్కడే పెడతారు. తోలు పరిశ్రమకు కాన్పూరు, వజ్రాల మార్కెటుకు సూరత్‌, ఐటీకి బెంగుళూరు, బంగారానికి ప్రొద్దుటూరు.. అన్నట్టు క్లస్టర్స్‌గా ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి చేయడం సులభం. సినిమా పరిశ్రమ మద్రాసులో పాతుకుపోయింది. హైదరాబాదు వచ్చి యిన్నాళ్లయినా మ్యూజిక్‌ విభాగంలో యింకా కొరత వుంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక చిత్రపరిశ్రమను ప్రోత్సహించడానికి రాజధాని అనే పేరుతో ఒంగోలులో స్టూడియో కట్టమంటే ఎవరూ కట్టకపోవచ్చు. ఔట్‌డోర్‌ షూటింగుకు కూడా అనువుగా వుండే రాజమండ్రి, లేదా వైజాగ్‌ వంటివి సినిమావాళ్లకు అనువుగా వుంటాయి. అక్కడ వాళ్లకు తగిన విధంగా ఎయిర్‌పోర్టు సౌకర్యం, రవాణా సౌకర్యం వగైరాలు కల్పించాలి. 

ఇలా కాకుండా అన్నీ ఒకే చోట కడదామనే తెలివితక్కువ ఆలోచన చేసినా లక్ష ఎకరాలు మరీ టూమచ్‌. హైదరాబాదు అంటే 23 జిల్లాలకు రాజధాని. ఆంధ్ర రాజధాని కేవలం 13 జిల్లాల రాజధాని. దానికి యింత షోకెందుకు? మంత్రుల క్వార్టర్లుగా ఖరీదైన విల్లాలు ప్లాను చేస్తున్నారేమో. అంత అక్కరలేదు. పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌ మంత్రులు ఫ్లాట్లలో వుంటారు. ఆంధ్ర రాష్ట్ర మంత్రులు కూడా కావాలంటే 4-బెడ్‌ ఫ్లాట్స్‌లో వుండమనండి. అలాటి యిరవై ఫ్లాట్లతో ఒక కాంప్లెక్సు కడితే అందరికీ కలిపి సెక్యూరిటీ యిస్తే బోల్డు మంది పోలీసులు మిగులుతారు. విభజన తర్వాత నక్సలిజం పెరుగుతుందంటున్నారు కదా, ఇలా మిగిల్చిన పోలీసులను అటు పంపండి. అంతేకాదు, అన్ని రకాల ఆఫీసులూ రాజధానిలోనే వుండనక్కరలేదు. ప్రస్తుతం సముద్రతీరంలో ఆపరేట్‌ చేసే కార్పోరేషన్‌ల ఆఫీసులు కూడా హైదరాబాదులోనే పెడుతున్నారు. ఇకపై అలా మానేసి, ఆఫీసులను కూడా చెల్లాచెదురు చేసేస్తే ఉద్యోగులు ఒకే చోట పోగుపడడం వుండదు. ప్రస్తుతం నగరీకరణ కారణంగా పల్లెలు పాడుపడిపోతున్నాయి. వాటిని ప్రభుత్వం వారు పట్టించుకోవడం మానేశారు. కార్యాలయాల వికేంద్రీకరణ జరిపి పట్టణాలకు తరలిస్తే వాటిని ఆనుకుని వున్న గ్రామాలలో మళ్లీ జనాభా కనబడుతుంది. కొంతమంది వుద్యోగులు స్వగ్రామాల్లో నివసిస్తూ పట్టణాలకు అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తారు. 

ఇది నిజంగా జరిగితే సీమాంధ్ర తెలంగాణ కంటె బాగుపడుతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాదు తప్పిస్తే తక్కిన ప్రాంతాలలో ఆఫీసులు లేవు. జిల్లాల ప్రజలంతా హైదరాబాదు వాసానికి అలవాటు పడి జిల్లా కేంద్రాలకు వెళ్లడం లేదు. వికేంద్రీకరణ జరుపుతున్నాం, మీరు వెనక్కి జిల్లాలకు వెళ్లిపోవాలి అంటే ప్రతిఘటన వస్తుంది కూడా. ఇలాటివి కొత్త రాష్ట్రంలో అమలు జరిగినట్టుగా పాతరాష్ట్రంలో చేయడం కష్టం. ఖాళీపలక మీద రాయడం సులభం. ఇప్పటికే రాసేసినదాన్ని చెరపాలంటే కష్టం. అందువలన గొడవలు రాకుండా వున్నదున్నట్టుగా నడపడానికే ఎక్కువ ఆస్కారం వుంది. దృఢసంకల్పం వుంటేనే, ఆటుపోటులు తట్టుకోగల శక్తి వుంటేనే యిలాటి కసరత్తు సాధ్యం. ఆ శక్తి తెలంగాణ నాయకుల్లోనే కాదు, ఆంధ్ర నాయకుల్లోనే అరుదు. అందుకని మనం ఎంత మొత్తుకున్నా అన్నీ కలిపి ఒకే చోట పెడతాం అనుకుంటూ అడవులు తెగ నరికినా ఆశ్చర్యపడనక్కరలేదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2013)

[email protected]