కాస్పరోవ్‌ను వెనక్కు పంపినప్పుడే ఆనంద్‌ ఓడెన్‌!

చెస్‌ ప్రపంచపు రారాజు, ఇటలీ పౌరుడు అయినటువంటి విశ్వనాధన్‌ ఆనంద్‌ మహారాజ ప్రస్థానం చరమాంకానికి వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రపంచ చెస్‌ సామ్రాజ్యానికి రారాజు కాదు. పరాజితుడు. కేవలం 22 ఏళ్ల కుర్రాడు నార్వేకు…

చెస్‌ ప్రపంచపు రారాజు, ఇటలీ పౌరుడు అయినటువంటి విశ్వనాధన్‌ ఆనంద్‌ మహారాజ ప్రస్థానం చరమాంకానికి వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రపంచ చెస్‌ సామ్రాజ్యానికి రారాజు కాదు. పరాజితుడు. కేవలం 22 ఏళ్ల కుర్రాడు నార్వేకు చెందిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ విశ్వనాధన్‌ ఆనంద్‌ను సింహాసనం మీదినుంచి ఇంటి దారి చూపించాడు. ఇప్పుడు ఆనంద్‌ మాజీ ప్రపంచ ఛాంపియన్‌. 

ఒకసారి ప్రపంచ ఛాంపియన్‌ హోదా మిస్సయినందుకే ఇంతగా అనుకోవాలా? అనే సందేహం ఎవరికైనా కలగవచ్చు. కానీ ఆనంద్‌ కెరీర్‌లోని నిమ్నోన్నతాలను పరిశీలించిన వారికి మాత్రం అలాగే అనిపిస్తుంది. ఆనంద్‌ తన కెరీర్లో ఒక్క గేం కూడా గెలవకుండా మ్యాచ్‌ ఓడిపోవడం ఇదే ప్రథమం. ఇంకా రెండు రౌండ్‌లు ఆడవలసిన అవసరం రాకుండానే.. ఆనంద్‌ శకం ముగిసింది.  6.5 -3.5 పాయింట్ల తేడాతో ఆనంద్‌ ఓటమి పాలయ్యాడు. 

అయితే నిజానికి ఆనంద్‌ ఆట ప్రారంభమైన తొలిరౌండ్లలోనే నైతికంగా ఓడిపోయినట్లుగా భావించాలి. అవును ఇది నిజం. అదెలాగో చూద్దాం. 

ఆనంద్‌ నాలుగుసార్లు వరుసగా ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ను గెలిచిన రారాజు. ఆయన గతంలో గ్యారీ కాస్పరోవ్‌ను చాలాసార్లు ఓడిరచాడు. నిజానికి క్రీడాస్ఫూర్తి తక్కువగా ఉండే ఈ పర్సనల్‌ గేంలో ఆనంద్‌ అంటే కాస్పరోవ్‌కు మహా అసూయ కూడా ఉన్నదనేది సత్యం. అయితే ఆనంద్‌ ఇప్పుడు కార్ల్‌సన్‌తో తలపడుతుండగా, ఆ మ్యాచ్‌ను చూడడానికి కాస్పరోవ్‌ ప్రత్యేకంగా పనిగట్టుకుని వచ్చాడు. ఆయన ఎటూ మాజీ ఛాంపియన్‌ గనుక.. ప్రేక్షకుల్లో ముందు వరుసలోనే ఆయనకు స్థానం కల్పించారు. అయితే విశ్వనాధన్‌ ఆనంద్‌.. కాస్పరోవ్‌ తన మీద కక్షతో.. తను ఏకాగ్రతతో  ఆడుతున్నప్పుడు.. తనను డైవర్ట్‌ చేయడానికి ప్రయత్నించవచ్చునని.. ఆయనను వెనక్కు పంపాలని నిర్వాహకులను కోరాడు. ఆనంద్‌ కోరిక మేరకు కాస్పరోవ్‌ను రెండు వరుసలు వెనక్కు వెళ్లి అక్కడ కూర్చుని మ్యాచ్‌ చూడాల్సిందిగా నిర్వాహకులు కోరారు.

అయితే క్రీడావిశ్లేషకులు భావిస్తున్నదేంటంటే.. తన పూర్తి కాన్సంట్రేషన్‌ను ఆటమీద కాకుండా, ఇలాంటి పక్క విషయాలమీద పెట్టినప్పుడే ఆనంద్‌ ఓడిపోయినట్లు అయిందని అనుకుంటున్నారు. చెస్‌ అనేది మానసిక దారుఢ్యంతో ముడిపడి ఉండే ఆట. అలాంటిది ఎన్నడైతే ఆనంద్‌ తన కాన్ఫిడెన్స్‌ను కాస్పరోవ్‌ అస్తిత్వంతో ముడిపెట్టుకున్నాడో అప్పుడే అది నీరుగారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. 

ఒక రకంగా చూస్తే ఈ వాదన కూడా నిజమనే అనిపిస్తోంది. మరి దీనిని ఆనంద్‌ ఒప్పుకుంటాడో లేదో?