రాష్ట్రవిభజన జరిగితే దళితులకు అధికారం దక్కుతుందని, రెండు చోట్లా దళితులు ముఖ్యమంత్రులుగా వచ్చేస్తారనీ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. కత్తి పద్మారావుగారి వంటి మేధావులు, దళితనాయకులు, తెలంగాణ ఉద్యమకారులు దీని గురించి అనేకసార్లు చెపుతున్నారు. సమైక్యవుద్యమంలో కూడా కొన్ని దళితసంఘాలనాయకులు కలవకుండా ‘విడిపోవడమే మాకు కావాలి’ అనే స్టాండ్ తీసుకున్నారు. కిరణ్ సమైక్యత గురించి మాట్లాడుతూంటే ఆయనను వ్యతిరేకించడానికి, అడ్డుకోవడానికి అధిష్టానం దళిత నాయకులను ఉపయోగించుకుంటోంది. రేపు అసెంబ్లీలో టి-బిల్లు గురించి చర్చ జరిగినపుడు అన్ని ప్రాంతాల దళితనాయకులు విభజనను సమర్థించేట్లా కాంగ్రెసు ప్రణాళిక రచిస్తోందని ప్రచారం జరుగుతోంది. విభజన జరిగితే నిజంగా దళితులు అధికారంలోకి వచ్చేస్తారా?
కులం బట్టి అధికారం వచ్చేయదు
ఎవరికైనా అధికారం కావాలంటే ఏం చేయాలి? ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. వాళ్లను ఆకర్షించడానికి పాట్లు పడాలి. ఎన్నికలలో నానా వాగ్దానాలు చేయాలి. నెగ్గాక పార్టీ అధినాయకత్వం కళ్లల్లో పడాలి. గాడ్‌ఫాదర్‌ను సంపాదించుకోవాలి. ప్రత్యర్థులను పడగొట్టాలి. పదవిలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి మిత్రులను కలుపుకోవాలి, శత్రువులను నిర్జించాలి. ప్రజల ఆదరణ సంపాదించాలి. ఇవేమీ చేయకుండా కేవలం పుట్టుక వలన అధికారం వచ్చేయదు. వైయస్ ముఖ్యమంత్రి అయ్యారంటే ‘ఈయన క్రైస్తవుడు కదా, యిప్పటిదాకా యీ రాష్ట్రానికి క్రైస్తవ ముఖ్యమంత్రి లేడు పాపం’ అంటూ చేసేయలేదు. ఇప్పుడు జగన్ ఎంత పోరాటం చేస్తున్నాడో చూస్తున్నాం. ఉద్యోగంలో కూడా ఫలానా కులంలో పుట్టావా, రా వచ్చి కుర్చీలో కూర్చో అనరు.
కొన్ని వర్గాలకు రిజర్వేషన్ యిచ్చినా మళ్లీ దానిలో కూడా పోటీ వుంటుంది. వారిలో ప్రతిభ వున్నవాడికే దక్కుతుంది. విభజిస్తే ఏరియా ఆఫ్ ఆపరేషన్ చిన్నదవుతుంది, అంతే. దానిలో దళితుల జనాభా సగటు కంటె ఎక్కువగా వుంటే అప్పుడు దళితులకు ఛాన్సు ఎక్కువ. ఈశాన్య రాష్ట్రాల్లో పర్వతప్రాంతం కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్లు చాలామంది వుంటారు. వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చు. అక్కడ ఎస్‌టి ముఖ్యమంత్రిగా వచ్చాడు కదాని యిక్కడ ఎస్‌సి ముఖ్యమంత్రిగా వస్తాడని ఎలా అనగలం? ఈ విభజన చేసేటప్పుడు ఎస్‌సి జనాభా ఎక్కువగా వున్న ప్రాంతాలన్నీ ఒక రాష్ట్రంగా ఏర్పరిస్తే అలాటి పరిస్థితి వచ్చేదేమో! ఇక్కడ ప్రాంతాలవారీ విభజన జరుగుతోంది. దీనివలన రెండు రాష్ట్రాల్లోని దళితుల సంఖ్య ఎప్పటి నిష్పత్తిలోనే వుండబోతోంది.
సత్తా వుంటే పెద్ద రాష్ట్రమూ ఏలవచ్చు
చిన్న రాష్ట్రం అయినంత మాత్రాన దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని ఎలా వాదిస్తారో నాకు అర్థం కాదు. అయ్యే సత్తా వుంటే పెద్ద రాష్ట్రానికైనా అవుతారు. మాయావతి ఉత్తరప్రదేశ్ వంటి సువిశాల రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా? మన రాష్ట్రానికి దామోదరం సంజీవయ్య కాలేదా? సంజీవయ్య ఎక్కువకాలం పాలించలేకపోయారు అంటే దానికి కారణం – ఆయన దళితుడు కావడం కాదు, రాజకీయంగా లైట్ వెయిట్ కావడం. పివి నరసింహారావు బ్రాహ్మడు అయినా, రోశయ్య వైశ్యుడు అయినా వాళ్లకూ అదే గతి కదా. రాజకీయంగా నేర్పు వుంటేనే ఎక్కువకాలం వుంటారు. అదే రెడ్డో, కమ్మో అయితే ఎక్కువకాలం పాలించేసేవారు అనడానికీ లేదు. భవనం వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రిగా చేసినట్టుగా కూడా ఎవరూ గుర్తుంచుకోలేనంత తక్కువ కాలం చేశారు. అంజయ్యని అందరూ బిసి అనుకునేవారు, ‘కాదు రెడ్డిని’ అని చెప్పుకున్నాడు పదవిలోకి రాగానే. కానీ ఆయన ఎంతకాలం పాలించాడు కనుక? ఎన్టీయార్ కమ్మ. రెండోసారి అధికారంలోకి రాగానే రాజకీయ చతురత లేక ఏడాది కూడా పాలించలేకపోయారు. బాబు కమ్మ. ఎన్టీయార్‌ను దింపి, అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పాలించారు. వెంగళరావు వెలమ. చాలాకాలమే పాలించారు. పదవిలోకి రావడం, నిలదొక్కుకోవడం – యిదంతా వ్యక్తుల చాకచక్యం బట్టి వుంటుంది తప్ప కులం బట్టి వుండదని అర్థమవుతోంది.
దళితులకు దీపస్తంభం లాటివాడు జగ్‌జీవన్ రామ్. దశాబ్దాలపాటు కేంద్రంలో అనేక ముఖ్యమైన పదవులు అలంకరించారు. ఉపప్రధాని కూడా అయ్యారు. మరి ఆయన సొంత రాష్ట్రమైన బిహార్‌లో ఒక్క దళిత ముఖ్యమంత్రీ లేడు. దీనికి ఏమంటారు? దళితుల్లో వుండే చీలికల వలన కూడా కొన్ని అవకాశాలు మిస్సవుతారు. మన రాష్ట్రంలో సిఎంగా కోస్తా నుండి కిరణ్‌ను ఎంపిక చేశాక ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణ వ్యక్తికి యిద్దామని అధిష్టానం అనుకుంది. కానీ ఎవరికి యివ్వాలి? మాలకా? మాదిగకా? గీతారెడ్డికా? దామోదర రాజనరసింహకా? అనే మీమాంసలో పడి చివరకు ఏడు నెలలు లేటుగా పదవి యిచ్చారు. మన దగ్గర మాదిగ రిజర్వేషన్ పోరాటం మాలలకు వ్యతిరేకంగా సాగుతోంది కాబట్టి సమస్య మరింత జటిలం అవుతోంది. ఎవరికి యివ్వబోయినా అవతలివాళ్లను కూడా ఏదో విధంగా సంతృప్తి పరిస్తే తప్ప యివ్వలేని పరిస్థితి.
విడిపోతే ఏ రాష్ట్రంలో దళిత సిఎం వస్తారు చెప్పండి
ఇలాటి పరిస్థితుల్లో దళితులకు ఆటోమెటిక్‌గా పదవి దక్కుతుందని ఎలా అనగలరు? ఇప్పుడు జనవరి 1 కల్లా రాష్ట్రం విడిపోయిందనుకోండి. కిరణ్ దిగిపోయారనుకోండి. ఆంధ్రకు కాపు నాయకుడు సిఎం అంటున్నారు, తెలంగాణలో జయపాల్ రెడ్డి, జానా రెడ్డి, డి శ్రీనివాస్.. యిలాటి పేర్లు వినబడుతున్నాయి తప్ప దామోదర పేరు వినబడుతోందా? డిప్యూటీ సిఎంగా వున్నారు కాబట్టి ఆటోమెటిక్‌గా ఆయనే ఫస్ట్ కాండిడేట్ అనుకోవాలి. కానీ అలా అనుకోవటం లేదు. ఎందువలన? ఆయన పెర్‌ఫామెన్సు గొప్పగా వున్నట్టు రిపోర్టులు ఏమీ లేవు. రాజకీయంగా మద్దతు వున్నట్టూ లేదు. ఇటీవల ముఖ్యమంత్రిని రన్‌డౌన్ చేయడానికి తెలంగాణవాదులు ఆయనను ఉపయోగించు కుంటున్నారు తప్ప మొదటినుండీ జానారెడ్డియే ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చారు. కేంద్రం నుండి ముసుగువీరుడుగా వుంటూ వచ్చిన జయపాల్ రెడ్డి యిప్పుడు ముసుగు తీసి బయటకు వచ్చారు కాబట్టి, ఆయనకూ ఛాన్సుంది అంటున్నారు. పూర్తి రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పని చేసిన దళితుడు సగం రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి కాకుండా పోతే, యిక కొత్త రాష్ట్రంలో దళితుడు సిఎం అవుతాడని ఎలా అనుకుంటాం?
కెసియార్ ఎప్పణ్నుంచో చెప్తూన్నారు – తెలంగాణలో తెరాస అధికారంలోకి వస్తే దళితుడు సిఎం అనీ, ముస్లిం డిప్యూటీ సిఎం అనీ. చెప్పడమే తప్ప తన పార్టీలో దళితుల నెవరినీ పైకి రానివ్వలేదని అందరూ ఎత్తి చూపుతున్నారు. ఒక్క జిల్లా యిన్‌చార్జి కూడా దళితుడు లేడట. కడియం శ్రీహరి చేరారు కాబట్టి ఆయన వాళ్ల తరఫున సిఎం కాండిడేటు అవుతారు అని జోస్యం చెపితే అందరూ నాకు పిచ్చెక్కిందనుకుంటారు. ఎన్నికయిన ఎమ్మెల్యేలలో మెజారిటీ అభిప్రాయం ప్రకారం మా అబ్బాయే సిఎం అని రేపు కెసియార్ అంటే ఏం చేయగలం? ఎన్నికయ్యే వాళ్లలో ఎంతమంది దళితులు వుంటారు? వారికోసం రిజర్వ్ చేసిన సీట్లలో కూడా వేరే చోట కూడా దళితులకు యిచ్చినపుడు కదా, వాళ్లు మెజారిటీలో వుండేది! టిక్కెట్టు యిచ్చేటప్పుడు విన్నబిలిటీ చూస్తారు. మహిళల విషయంలోను అదే జరుగుతోంది. నెగ్గే అవకాశాలు లేవు కాబట్టి టిక్కెట్టు యివ్వలేదు అంటారు. సామాజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ బిసిలకు చాలా చోట్ల టిక్కెట్టు యిస్తే ఏం జరిగింది? నెగ్గలేదు. ఇవన్నీ చూస్తూ కూడా రాష్ట్రం చిన్నదై పోగానే దళితులను నెగ్గించేస్తారని ఎలా అనుకుంటారో నాకు తెలియదు.
ఇటీవల విభజించిన రాష్ట్రాలలో ఏం జరిగింది?
యుపి నుండి ఉత్తరాఖండ్ విడగొట్టారు. దళితుడు సిఎం అయ్యాడా? అగ్రవర్ణస్తులే కదా అయినది. మధ్యప్రదేశ్ విడగొట్టి ఛత్తీస్‌గఢ్ ఏర్పరచారు. షెడ్యూల్డ్ ట్రైబ్‌కు చెందిన అజిత్ జోగిని సిఎం చేసి కూర్చోబెట్టారు. మూడేళ్ల తర్వాత 2003 ఎన్నికలలో ఆయన ఓడిపోయాడు. బిజెపికి చెందిన రమణ్ సింగ్ (దళితుడు కాదు) నెగ్గి పదేళ్లగా పాలిస్తున్నాడు. ఇక జార్ఖండ్ – అది ట్రైబల్స్ అధికసంఖ్యలో వున్న రాష్ట్రమే. దళితుడు సిఎం అయినా అధికారంలో నిలదొక్కుకో లేకపోతున్నాడు.13 ఏళ్లలో 9 మంది ముఖ్యమంత్రులు, మూడుసార్లు రాష్ట్రపతి పాలన! అంటే దళితుడు అధికారం చేయలేక పోతున్నాడన్నమాట! చిన్న రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, గోవా, త్రిపుర, సిక్కిం.. వేటిల్లో దళితుడు ముఖ్యమంత్రిగా వున్నాడు?
దళితనాయకులకు ఈ ప్రశ్నలు సంధిస్తే వాళ్లు ఆంబేడ్కర్‌ని వల్లిస్తారు. చిన్న రాష్ట్రాలుంటే దళితులకు అధికారం వస్తుందని ఆయన చెప్పాడంటారు. ఆయన నిస్సందేహంగా మేధావి. అయితే భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పగలిగే జ్యోతిష్కుడు కాడు. అప్పటికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. కాలానుగుణంగా వచ్చే మార్పులు ఆ సిద్ధాంతాలను పూర్వపక్షం చేసిన సందర్భాలూ వున్నాయి. కార్ల్ మార్క్స్ విషయంలోనూ అది జరిగింది. సాంకేతిక విప్లవం వచ్చిన యూరోప్‌లో శ్రామిక విప్లవం వస్తుందని ఆయన వూహించాడు. అక్కడ రాలేదు. రాచరికపు రష్యాలో వచ్చింది. మార్క్స్ బతికి వుంటే తన సిద్ధాంతాలను సవరించుకుంటూ ఆయన పుస్తకాలు రాసి వుండేవాడు. గతితార్కిక భౌతికవాదమే అది. కానీ మార్క్సిస్టులు మార్పుకి ఒప్పుకోరు. అవే సిద్ధాంతాలను వల్లె వేస్తూ వుంటారు.
ఆంబేడ్కర్ చెప్పినవన్నీ జరిగాయా?
ఆంబేడ్కర్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయన మరణించి 57 ఏళ్లు అయింది. ఈలోగా సమాజం ఎన్నో మార్పులకు గురైంది. దళితుల సామాజిక స్థితిగతుల్లో, రాజకీయ అవగాహనలో మార్పు వచ్చింది. అదే సమయంలో వాళ్లను అదుపు చేసే శక్తులు కూడా కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా 60 ఏళ్ల క్రితం ఆయన అలా చెప్పారు కాబట్టి యిప్పుడు అదే జరుగుతుంది అని వాదించడం పొరబాటు. ఆంబేడ్కర్ భారతవిభజనను సమర్థించారని అందరికీ తెలుసు. దానికి గల కారణం ఏమిటో విశ్లేషిస్తూ సోషలిస్టు నాయకుడు, మేధావి మధు లిమయే ‘‘ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’’లో 1984 జూన్‌లో ఒక పెద్ద వ్యాసం రాశారు. దానిలోని కొన్ని ముఖ్యమైన భాగాలు యిక్కడ ఉటంకిస్తున్నాను –
‘పాకిస్తాన్-భారత విభజన’ అనే పుస్తకంలో ఆంబేడ్కర్ బ్రిటిషువారు మొత్తం భారతదేశాన్ని తమకు అప్పగించి వెళతారని హిందువులు అనుకోకూడదని హెచ్చరించారు. బ్రిటిషువారు వెళ్లిపోయాక ప్రజాస్వామ్యం వస్తుందని, ప్రజాస్వామ్యం అంటే అత్యధికప్రజల అభిమతమే అనీ, హిందువులు అధికసంఖ్యలో వున్నారు కాబట్టి కేంద్రప్రభుత్వంలో బ్రిటిషువారి స్థానంలో హిందువులు వుండి, తాము అధికంగా వున్న రాష్ట్రాలపై పెత్తనం చలాయిస్తారనీ ముస్లిములు భయపడుతున్నారు కాబట్టి విభజన అనివార్యమని ఆంబేడ్కర్ వాదించారు. అంతమాత్రం చేత ముస్లిము ఛాందసవాదాన్ని ఆంబేడ్కర్ సమర్థించారని అనుకోకూడదు. హిందూఅగ్రవర్ణస్తుల పెత్తనాన్ని ఎలా ఖండిరచారో దాన్నీ అలాగే నిరసించారు. పాకిస్తాన్ ఏర్పడ్డాక ఇరాన్, ఇరాక్, అరేబియా, టర్కీ, ఈజిప్టు అన్నీ కలిసి మహా ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పరుస్తాయని ప్రతి ముసల్మాను దానివలన ఉత్తేజితుడవుతాడని ఆంబేడ్కర్ భవిష్యవాణి చెప్పారు. కానీ అలా జరగలేదు. ముస్లిము రాజ్యాలు సైతం తమలో తాము కలహించుకున్నాయి.
ముస్లిములు వెళ్లిపోతేనే షెడ్యూలు కులాలకు లాభం
‘హిందూస్తాన్ నుండి ముస్లిములు విడిగా వెళ్లాలని ఆయన ఎందుకు కోరుకున్నారు? ఆంబేడ్కర్ జీవితలక్ష్యం – షెడ్యూల్ కులాల అభ్యున్నతి. రాష్ట్రాలకు హక్కులు యిస్తే అవి షెడ్యూలు కులాల వారిని అణచివేస్తాయని ఆయన భయం. అందుకే బలమైన కేంద్రం వుండాలని, రాజ్యాంగంలోనే రక్షణలు కల్పిస్తే ద్వారా షెడ్యూలు కులాలు క్షేమంగా వుంటాయని ఆయన అభిప్రాయం. ముస్లిములు దానికి అభ్యంతరపెడతారని ఆయన భయపడ్డాడు. లక్నో ఒప్పందం ద్వారా ఫెడరల్ లెజిస్లేచర్‌లో ముస్లిములకు 33% వాటా దక్కింది. యుద్ధసమయంలో బ్రిటిషు ప్రభుత్వం జిన్నాకు అపరిమిత అధికారాలు కట్టబెట్టింది. హిందువులతో సమానసంఖ్యలో తమకు సెంట్రల్ కాబినెట్‌లో ప్రాతినిథ్యం వుండాలని జిన్నా, ముస్లింలీగ్ వాదించారు. కాంగ్రెసుకు సన్నిహితంగా వున్న జమాయిత్ ఉలేమా ఎ హింద్ విభజనను వ్యతిరేకిస్తూనే హిందువులకు, ముస్లిములకు సమానప్రాతినిథ్యం వుండాలని డిమాండ్ చేసింది. లేకపోతే ముస్లింలలో తమకు మద్దతు తగ్గిపోతుందని ఆ పార్టీ భయం.
‘విభజన నుండి తప్పించుకోవడానికి ముస్లింలతో రాజీ కుదుర్చుకోవాలసిన అగత్యం కాంగ్రెసు నాయకులకుంది. ఆ పరిస్థితుల్లో వాళ్లు ముస్లింలకు సగం వాటా యిచ్చి తక్కినవాటిల్లోనే హిందువులలోని అన్ని కులాల వారికీ సర్దవలసి వస్తుంది. అదే జరిగితే వాళ్లు అగ్రవర్ణాల వారికందరినీ సంతృప్తి పరచిన తర్వాతే షెడ్యూల్ కులాల వారి వద్దకు వస్తారు. షెడ్యూల కులాల వారికి దక్కేది అడుగూబడుగే. ఇదే ఆంబేడ్కర్‌ను బాధించింది. ఆయన తన పుస్తకంలో యిలా రాశారు – ‘‘అస్పృశ్యుల హక్కులను, అవసరాలను కాపాడడం కంటె ఎక్కువగా ముస్లిముల హక్కులను, అవసరాలను కాపాడడానికి కాంగ్రెసు నాయకత్వం శ్రమించలేదా? అస్పృశ్యులకు ఎలాటి రాజకీయ వెసులుబాటు కల్పించడానికి యిష్టపడని గాంధీ ముస్లిములకు బ్లాంక్ చెక్కు యివ్వడానికి సిద్ధపడలేదా? అస్పృశ్యులతో, శూద్రులతో అధికారం పంచుకోవడాని కంటె ముస్లిములతో అధికారం పంచుకోవడానికి కాంగ్రెసు ఉవ్విళ్లూరుతోంది.’’ ఈ కారణం చేతనే పాకిస్తాన్ ఏర్పడి ముస్లిములు వెళ్లిపోతే, కాంగ్రెసు షెడ్యూల్ కులాల వారికి న్యాయం చేస్తుందని ఆంబేడ్కర్ ఆశించారు.’ – ఇదీ మధు లిమయే వ్యాససారాంశం.
ఆచరణలో ఏం జరిగింది?
ఆంబేడ్కర్ ఊహలు ఎంతవరకు నెరవేరాయో చూదాం. పాకిస్తాన్ ఏర్పడిరది. ముస్లింలందరూ భారత్ విడిచి వెళ్లలేదు. ముస్లింలను బుజ్జగించే కార్యక్రమం యింకా కొనసాగుతూనే వుంది. కాంగ్రెసు షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్లు యిచ్చింది. రిజర్వేషన్ల కాలపరిమితి పొడిగిస్తూ పోతోంది. అందరూ వారి గురించి మాట్లాడేవారే కానీ వాటి ఫలాలు ఆ కులాలకు పూర్తిగా అందలేదు. కొందరు దళితులు పదవులు అధిష్టించినా ఏ ఒక్క రాష్ట్రంలోనూ దళితుల స్థితి అద్భుతంగా వున్నట్టు చెప్పలేం. ఆంబేడ్కర్ విగ్రహాలు వెలుస్తున్నాయి కానీ ఆయన స్థాపించిన రిపబ్లికన్ పార్టీ పుంజుకోలేదు సరికదా 50 ముక్కలుగా చీలిపోయింది. ఆయన సొంత రాష్ట్రంలో తప్ప వేరెక్కడా కనబడటం లేదు. ఆంబేడ్కర్ ఆశయాలతో అంటూ బహుజన సమాజ పార్టీ ఏర్పడిరది. ఒకసారి బిసిలతో, మరొకసారి బ్రాహ్మణులతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తోంది, పోగొట్టుకుంటోంది. వ్యక్తి ఆరాధనతోనే ఆ పార్టీ నడుస్తోంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా కాదు. ఇతర కులాల రాజకీయనాయకులకు, దళిత నాయకులకు తేడా లేకుండా వుంది.
ఆయన దళితులకై ఏర్పరచిన నియో-బుద్ధిజం ఎవర్నీ ఆకర్షించలేకపోయింది. కొందరు దళితులు హిందువులుగానే కొనసాగుతూండగా మరి కొందరు క్రైస్తవం పుచ్చుకున్నారు. దళితులందరూ కలిసి యితరులను ఎదిరించడం మాట ఎలా వున్నా వారిలో వారే కలహించుకుని వర్గాలుగా విడిపోతున్నారు. అధికారం అందిపుచ్చుకున్న దళితులకు తక్కిన దళితులకు సాయపడుతున్న ఉదాహరణలు అతి తక్కువ. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంలో వారు అగ్రవర్ణస్తులతో సమాన స్థాయిలో వున్నారు.
అందువలన చిన్న రాష్ట్రాలు ఏర్పడితే దళితులు పాలకులవుతారని ఆంబేడ్కర్ అప్పుడు అనుకుంటే అనుకోవచ్చు కానీ యిప్పటి పరిస్థితులు చూసి వుంటే మరో రకమైన అభిప్రాయం వెలిబుచ్చేవారు. వేర్పడితే అధికారం రాదు, పోరాడితేనే వస్తుంది. దళితులకైనా సరే, మరొకరికైనా సరే యీ సూత్రం వర్తిస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2013)