ఎమ్బీయస్‌ : అంతా వాస్తు చాదస్తమేనా? – 4

అయినా స్మార్ట్‌ సిటీలు అంత తేలికైన వ్యవహారం కాదని మొన్న దానిపై జరిగిన కేంద్ర ప్రభుత్వ అధికారుల సమావేశం ద్వారా తేలింది. ఆ వూరి నిర్వహణ యిప్పటికే బాగుండాలట, మునిసిపల్‌ ఉద్యోగులందరికీ సవ్యంగా జీతాలు…

అయినా స్మార్ట్‌ సిటీలు అంత తేలికైన వ్యవహారం కాదని మొన్న దానిపై జరిగిన కేంద్ర ప్రభుత్వ అధికారుల సమావేశం ద్వారా తేలింది. ఆ వూరి నిర్వహణ యిప్పటికే బాగుండాలట, మునిసిపల్‌ ఉద్యోగులందరికీ సవ్యంగా జీతాలు యిస్తూ వుండాలట. తనంతట తను ఆదాయం పెంచుకునే సత్తా కలిగి వుండాలట. ఇదెలా వుందంటే జూనియర్‌ కాలేజీల్లో చేరిన మెరికల్లాటి ముగ్గురు నలుగుర్ని పట్టుకుని వారికి ఐఐటి కోచింగ్‌ యిప్పించి, వారికి సీటు వస్తే కాలేజీవాళ్లు గొప్పగా చూపుకుంటారు చూడండి. అలాటి కేసన్నమాట. ఇప్పటికే బాగా వున్న సిటీలకు మరింత ప్రోత్సాహమిస్తారు, తక్కినవాళ్లను జూనియర్‌ కాలేజీలో తక్కిన కుర్రాళ్లలా పట్టించుకోరు. స్మార్ట్‌ సిటీ అనిపించుకుంటే నిధుల వర్షం కురుస్తుందేమో, ఎంతోకొంత నొల్లుకోవచ్చు అనుకున్న రాష్ట్రపాలకులందరికీ యిది ఆశాభంగం కలిగించే వార్తే. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి వైజాగ్‌ ఒకటే స్మార్ట్‌ సిటీగా వెలుస్తుందేమో, అదీ అమెరికా టేకప్‌ చేస్తోంది కాబట్టి, దానిలో అమెరికా ప్రయోజనాలు యిమిడి వున్నాయి. దేశరక్షణ దృష్ట్యా వైజాగ్‌ వంటి నగరాన్ని నిధులకోసం అమెరికావాళ్ల చేతిలో పెట్టడం ఎంత రిస్కో అనిపిస్తోంది. రేవుతో బాటు, నేవీ యితర డిఫెన్సు సంస్థలు ఎన్నో వున్నాయక్కడ. వైజాగ్‌లో అణువణువూ తెలుసుకునే అవకాశం అమెరికాకు అప్పగిస్తున్నాం మనం. 

వరంగల్‌ స్మార్ట్‌ సిటీయో, సూపర్‌ సిటీయో మరోటో అయ్యే అవకాశాలు సుదూరం కాబట్టి హైదరాబాదునే పట్టించాలి. కొత్తగా కట్టేందుకు ఏమున్నాయి? కాంట్రాక్టర్లను ఆకర్షించడానికే హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ ఆకాశహర్మ్యాలు అన్నారు కెసియార్‌. అందరూ నవ్వారు, స్థలం ఎక్కడుంది? సంజీవయ్య పార్కును కబళిస్తారేమో పర్యావరణ సమస్య వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు. ఆయన సెక్రటేరియట్‌ మీద కన్నేశారని ఎవరికీ తోచలేదు. అక్కడ టవర్లు కట్టడానికే యిప్పుడీ వాస్తు మాట ఎత్తారు కెసియార్‌. కొత్త సెక్రటేరియట్‌కు 150 కోట్లు సరిపోతుందంటున్నారు. సరిపోతుందా? చివరకు 500 కోట్లు అవుతుందని కొందరంటున్నారు. నిధులు లేవని ఋణమాఫీని కుదించారు, రైతులకు కావలసినవి సమకూర్చలేక పోతున్నారు, విభజన తర్వాత ఆదాయం తగ్గిందని, డబ్బు లేదని, ప్రత్యేక హోదా యివ్వకపోతే ఆరిపోతామని కేంద్రానికి  వెళ్లి మొరపెట్టుకుని నెలలు కాలేదు. ఇప్పుడీ పని తలపెడితే ఎక్కణ్నుంచి తెస్తారని కేంద్రం అడగదా? నిధులు యిస్తుందా? అర్జంటుగా మార్చడం దేనికి, అంతగా వాస్తు బాగా లేకపోతే మార్పులు చేయించండి, ఓ మూల గోడ కట్టడమో, మరో మూల గుమ్మం మార్చడమో, బావి తవ్వడమో, ఏదో ఒకటి చేసుకోండి. మొత్తం వేరే చోటికి వెళ్లనేల? అని అడుగుతుంది. 

నాకు వాస్తు మీద ప్రబలవిశ్వాసం వుందని చెప్పుకోవడానికే కెసియార్‌ మొక్కుల సంగతి యిప్పుడు తీసుకుని వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం రావాలనో, దానికి దళితుడు సిఎం కావాలనో, సమర్థుడైన దళితుడు ఎవరూ దొరకని పక్షంలో తను సిఎం కావాలనో ఏదో ఒకటి చెప్పుకుని కెసియార్‌ మొక్కు పెట్టుకున్నారనే అనుకుందాం. రాష్ట్రం ఏర్పడి ఆర్నెల్లు దాటాక అవన్నీ యిప్పుడు గుర్తుకు వచ్చాయా? కెసియార్‌కు డబ్బు లేదా? ఆయన పుట్టడమే కొన్ని ఎకరాల యింట్లో భూస్వామి కుటుంబంలో పుట్టారు, యీ వయసులో కూడా వ్యవసాయంపై ఏటా కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ఈ ముక్కుపుడక మొక్కులు ఓ లెక్కా? ప్రభుత్వానికి మొక్కులేముంటాయి? ఈయన కాకపోతే మరొకడు అవుతాడు. ప్రభుత్వం యిలా మొక్కులు తీర్చడం యిప్పటిదాకా భారతదేశ చరిత్రలో జరిగి వుండదు. భద్రాద్రి రాముడికి తలంబ్రాలు పంపలేదా, కొత్త బట్టలు పంపలేదా? అంటే అది ఒక సంప్రదాయంగా మారింది. అది వ్యక్తిగతమైన మొక్కు కాదు, ముఖ్యమంత్రి సొంత ప్రయోజనం ఆశించి పంపేది కాదు, ముఖ్యమంత్రిగా ఎవరుంటే వాళ్లే పట్టుకెళ్లి యిస్తారు. 
ఏ మతానికి చెందిన భక్తులైనా వారి సౌకర్యార్థం ఏదైనా పుణ్యక్షేత్రంలో వసతిగృహం కట్టడం, బస్‌స్టాండ్‌ కట్టడం, రోడ్లు వేయించడం, ఉత్సవాలు జరిగినపుడు అదనపు పోలీసు బలగాలను పంపండం – అవన్నీ ఓకే. ఎందుకంటే భక్తులు కూడా పౌరులే కదా. వారికి మేలు చేకూర్చడానికి వారు కట్టే పన్నులను వినియోగించవచ్చు. కానీ వ్యక్తిగతమైన నమ్మకాల కోసం ప్రభుత్వధనం వ్యయం చేయడం చాలా పొరపాటు. దీనిపై ఎవరో ఒకరు కోర్టుకి వెళ్లడం తథ్యం. కోర్టు యివ్వడానికి వీల్లేదంటే 'అయితే నా సొంత డబ్బులోంచే యిస్తా' అంటారేమో కెసియార్‌. ఇదంతా దేనికంటే తనకున్న నమ్మకాల కారణంగానే సెక్రటేరియట్‌ మార్చడం జరుగుతోంది తప్ప వేరే ఆర్థికపరమైన కారణాలు లేవని చెప్పుకోవడానికి!

ఇక్కడ సెక్రటేరియట్‌కు నాలుగు వైపులా రోడ్లున్నాయి. ఎర్రగడ్డలో ఒక్కటే రోడ్డు, సెక్యూరిటీ రిస్కు, చాలా వుంది. ఏదైనా ఎటాక్‌ జరిగితే పారిపోవడం కష్టం. చలో అసెంబ్లీలా చలో సెక్రటేరియట్‌ అంటూ ఎవరైనా నిరసన కార్యక్రమం చేపట్టి హేండిల్‌ చేయడం చాలా కష్టం. వాళ్లు రాళ్లేసి ఎర్రగడ్డ పక్కన, వెనక్కాల చిన్న యిళ్లున్న కాలనీల్లో నక్కుతారు. ఇలాటివి వూహించి ముందే ఆ కాలనీలన్నీ ఖాళీ చేయించేస్తారనుకుంటాను. ఇళ్లు కూల్చేసి నలువైపులా రోడ్లు వేస్తారేమో! లేకపోతే ఆ రోడ్డు మీద ట్రాఫిక్‌ జామ్‌ నిశ్చయం. అదసలే నేషనల్‌ హై వే. రాత్రి 8 దాటిందంటే చాలు విజయవాడవైపు వెళ్లే రూటు బస్సులు మెయిన్‌రోడ్డుని ఆక్రమించేస్తాయి. ఇప్పుడు సెక్రటేరియట్‌ సిబ్బంది కోసం వేసే బస్సులే పొద్దున్నా, సాయంత్రం రోడ్డు ఆక్రమిస్తాయి. మంత్రులు వస్తూ పోతున్నారని వాహనాలు ఆపేస్తే జరిగే బీభత్సం వూహించడానికే భయం వేస్తోంది. ఈ రోడ్డు వదలిపెట్టి వేరే మార్గంలో వెళ్లాలంటే పంజగుట్ట, జూబిలీహిల్స్‌ మీదుగా వెళ్లాలి.  ఆ రోడ్డు యిప్పటికే ఘోరంగా వుంది. చంద్రబాబుగారు మాదాపుర్‌లో హైటెక్‌ సిటీ ప్లాన్‌ చేసేటప్పుడు పెరగబోయే రద్దీ అంచనా వేసి, రోడ్డు నెంబరు 36 తో బాటు రేడియల్‌ రోడ్లు వుండాలని కొందరు అధికారులు చెప్పినా ఆయన వినలేదట. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్‌ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇప్పుడీ అదనపు రద్దీని ఎలా పరిష్కరిస్తారో ఏమో! ఊరి ప్లానింగ్‌ టోటల్‌ మెస్‌ చేసి అంతర్జాతీయ నగరం అంటే ఎవరు నమ్ముతారు? 

ఇదంతా దేనికి? ఇప్పుడున్న సెక్రటేరియట్‌ స్థానంలో టవర్లు కట్టడానికి ఏ సింగపూరు వాళ్లకో డెవలప్‌మెంట్‌కి యివ్వడానికి! బాగానే వుంది కానీ వాస్తు బాగా లేదని ఇంత ప్రచారం జరిగిన స్థలంలో టవర్లు కడితే వాటిలో కమ్మర్షియల్‌ స్పేస్‌ ఎవరు కొంటారు? అబ్బే స్థలంలో ఏ డిఫెక్టూ లేదు, పాత బిల్డింగులోనే డిఫెక్టు అంటే నమ్మరు. అలా అయితే ఆ మార్పులేవో చేసి వుండేవారు కదా. పక్కన హుస్సేన్‌ సాగర్‌ వుండడం అరిష్టంట కదా, అందుకే హిస్టరీ అంతా గలీజు అయిందట కదా అంటారు. మా కంపెనీలో మాత్రం కుట్రలు, కూహకాలు జరగాలని మేం కోరుకుంటామా? అంటారు కొనేవారు. ఇక అప్పుడు డెవలపర్స్‌ యీ హుస్సేన్‌ సాగర్‌ ఒకటి, ముందు దాన్ని పూడ్చేయండి సార్‌ అంటారు. కెసియార్‌ ఆ పనికీ ఒడిగట్టినా ఒడిగట్టవచ్చు. వేసవిలో ఖాళీ చేయిస్తారట కదా, అప్పుడు దాన్ని కనీసం వాస్తుకి అనుగుణంగా ఎత్తుపల్లాలు సరిచేసి, అప్పుడు మళ్లీ నింపుతారేమో! నండూరి పార్థసారథిగారి 'అయోమయ రాజ్యం' నవలలో ప్రజలందరూ వెనక్కి నడవాలని రాజుగారు ఆజ్ఞవేశారని రాస్తే వ్యంగ్యం హద్దులు దాటిందనుకున్నాను. లిటరల్‌గా కాకపోయినా, విజ్ఞానపరంగా ప్రస్తుతం జరుగుతున్నది అదే. మనది కచ్చితంగా అయోమయరాజ్యమే! (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3