ఎమ్బీయస్‌: అవినీతి ఆరోపణలపై స్పందన – 3/3

మధ్యలో యీ తెలుగు గొడవేమిటని విసుక్కోకండి. బాబు తన జవాబులో యీ లైను తీసుకున్నారు. ''సాక్షి తెలుగువారి పత్రిక, తెలుగువారికి వ్యతిరేకంగా ఎలా రాస్తుంది'' అని వాదించారు. మరి ఈనాడు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా రాయలేదా?…

మధ్యలో యీ తెలుగు గొడవేమిటని విసుక్కోకండి. బాబు తన జవాబులో యీ లైను తీసుకున్నారు. ''సాక్షి తెలుగువారి పత్రిక, తెలుగువారికి వ్యతిరేకంగా ఎలా రాస్తుంది'' అని వాదించారు. మరి ఈనాడు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా రాయలేదా? వైయస్‌కు వ్యతిరేకంగా రాయలేదా? ఆంధ్రజ్యోతి యిప్పుడు కెసియార్‌కు వ్యతిరేకంగా రాయటం లేదా? ఈ రకంగా చూస్తే తెలుగు పాలకులకు వ్యతిరేకంగా రాసే అర్హత తెలుగునాట ''వార్త''కు, ''హిందు''కు, ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా''కు తప్ప వేరెవరికి లేదన్నమాట. జాతీయస్థాయికి అన్వయిస్తే  ఇండియన్లు షేర్లు కలిగి వున్న ఏ పేపరూ ఇండియాలో అవినీతి గురించి రాయకూడదు. తెలంగాణలో కెసియార్‌ అవినీతి చేస్తూ వుంటే, కొత్త సెక్రటేరియట్‌ పేర వృథా వ్యయం చేస్తూ వుంటే సాటి తెలుగువాడు కదాని బాబు పార్టీని మౌనంగా వుంటుందా? ఆంధ్రలో రేపు బాబు గాక మరొకరు అధికారంలోకి వస్తే అప్పుడాయన మౌనంగా వుంటారా? సాక్షి ఆస్తులు ప్రభుత్వానికి ఎటాచ్‌ అయ్యాయి ప్రభుత్వ ఆస్తి అయిపోయిందట, కాబట్టి అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయకూడదా!? ఈ లాజిక్‌ యిప్పటిదాకా ఎవరికీ తోచి వుండదు. ఇంతకీ అది కేంద్రప్రభుత్వం పత్రికా? రాష్ట్రప్రభుత్వం పత్రికా? ఆంధ్ర ప్రభుత్వం ''ఆంధ్రప్రదేశ్‌'' అనే మాసపత్రిక ప్రభుత్వ వార్తలతో ప్రచురిస్తుంది. దాని సిబ్బందికి జీతాలిస్తుంది. ఇప్పుడు సాక్షి సిబ్బందికి ఏ ప్రభుత్వం జీతాలిస్తోంది? ఎటాచ్‌ చేసినంత మాత్రాన స్వాధీనం అయిపోయినట్లేనా? ఆగ్రిగోల్డ్‌ ఆస్తులు ఎటాచ్‌ అయివున్నాయి, అవి అన్యాక్రాంతమయ్యాయని ఎలా అంటారు అని ఒక పక్క అడుగుతూనే మరో పక్క సాక్షి ఆస్తులు ప్రభుత్వపరం అయిపోయినట్లు ఎలా వాదిస్తున్నారీయన?

పనిలో పనిగా రాజకీయాల్లో యింత సీనియరునైన నన్ను జగన్‌ ఏకవచనంతో సంబోధిస్తున్నారని బాబు బాధపడ్డారు. ఆ ఆవేదనలో అర్థం వుంది. కానీ యివి మాటతీరుకి, సంస్కారానికి సంబంధించిన విషయాలు. బాబునే కాదు, అంతకంటె సీనియరు, తన తండ్రికి అత్యంత ఆత్మీయుడైన రోశయ్యగారిని కూడా వరంగల్‌ ప్రయాణమప్పుడు జగన్‌ 'నువ్వు' అనేశారు. రాజకీయాల్లో ఎంతైన ఘర్షించవచ్చు, కానీ మర్యాద పాటించడం హర్షణీయం. కోస్తా జిల్లాల్లో తప్ప తక్కిన ప్రాంతాల్లో 'నువ్వు' ప్రయోగం అభ్యంతరకరం కాదు. కానీ పేరు చివర్లో గారు చేరిస్తే హుందాగా వుంటుంది. ఆ హుందాతనం లేనిది వైసిపి నాయకుల వద్ద మాత్రమే కాదు, టిడిపి నాయకుల వద్ద కూడా! బాబు అనుచరులు అసెంబ్లీలో బయటా జగన్‌ను మీరు అంటున్నారా? ..గారు అంటున్నారా? ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, కాబినెట్‌ హోదా కలిగిన వ్యక్తి కదా! తెలంగాణ టిడిపివారు కెసియార్‌పై ఎలాటి భాష వుపయోగిస్తున్నారు? బాబే చెప్పి తిట్టించారని ఎర్రబెల్లి చెప్పారు. అబద్ధమనే అనుకుందాం, కానీ బాబు వారించలేదనుకుంటా, వారిస్తే ఆయన భాష మార్చి వుండేవాడు, మోత్కుపల్లి అంత ఘాటుగా మాట్లాడేవారు కారు. ఇప్పటికైనా అందరూ ఒక ఒప్పందానికి రావాలి. నువ్వు, మీరు మాట ఎలా వున్నా పేరు చివర -గారు చేర్చడం అవసరం అని తీర్మానించుకుని, దానికి కట్టుబడాలి. దీనికి సీనియారిటీతో, వయసుతో సంబంధం లేదు. చిన్నవారినైనా గౌరవించవచ్చు, కొంపలంటుకుపోవు. తెలుగు నాయసమూహంలో సంస్కారం స్థాయి పెంచవలసిన అవసరం అర్జంటుగా పడిందని బాబు గుర్తించినందుకు సంతోషం. 

అసలు విషయానికి వస్తే – ఈ ఆరోపణలపై సమాధానం చెప్పడం ఒక ఎత్తు, ఆచరణలో చూపించడం మరో ఎత్తు. వైకాపా చేసిన ఆరోపణలు కాబట్టి పట్టించుకోనక్కరలేదు అంటే, కొన్ని విషయాలపై బిజెపియే విమర్శిస్తోందని గమనించాలి. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావడం లేదో జవాబు చెప్పవలసిన భారం పడడంతో రాష్ట్ర బిజెపి నాయకులు ప్రభుత్వంలో తప్పులు పడుతున్నారు. అమరావతిపై డిపిఆర్‌ పంపలేదు అంటున్నారు. పర్యావరణం గురించి క్లియరెన్సులు రావటం లేదని గుర్తు చేస్తున్నారు. అదేమిటో మర్నాడు శంకుస్థాపన అంటే ముందురోజు వచ్చిందంటారు. దేనికి వచ్చిందో, ఏ మేరకు వచ్చిందో అర్థం కాదు. పట్టిసీమ గురించి కూడా 'అది పోలవరంలో భాగం అని మంత్రి అన్నారు, కాదని బాబు అన్నారు, చివరకు పోలవరంలో భాగం అని క్లెయిమ్‌ చేస్తూ బిల్లు పంపించారు, ముందుగా అనుకున్నది కాదు కదా, ముందస్తు అనుమతి లేకుండా ఎలా కడతారు అని కేంద్రం ఆపేసింది, తప్పేముంది?' అని అడుగుతున్నారు. పట్టిసీమలో విధివిధానాలు పాటించి వుంటే యీ చిక్కులు వుండేవి కావు కదా. ఇలాటివి పరిహరించాలి. 

ఇప్పుడు అమరావతి భూములున్నాయి. రాజధాని ఫలానా చోట అని ప్రకటించాక భూములు కొన్నవాళ్ల గురించి ఎవరేం రాసినా పట్టించుకోనక్కరలేదు. అది యింతకే ఎలా కొన్నారు అంటే కొన్నవాడి యిష్టం, అమ్మినవాడి యిష్టం. బ్లాక్‌ మనీ చేతులు మారింది అంటే అది యిన్‌కమ్‌టాక్స్‌కు సంబంధించిన వ్యవహారం. రాష్ట్రప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు. రాజధాని ప్రకటించే నాటికి ఎసైన్‌మెంట్‌ లాండ్స్‌ ఎవరి పేరిట వున్నాయో వారికే భూ సమీకరణలో భాగంగా వాటా భూములు యిస్తాం అన్నారు బాబు. అసలు ఎసైన్‌మెంట్‌ లాండ్స్‌ కొనకూడదనే చట్టం వున్నపుడు వాటిపై జరిగిన లావాదేవీలన్నీ రద్దు చేయాలి తప్ప వారికి వాటా భూములిస్తామనడం ఏమిటి? రాజధాని రాబోయే ముందు పాలకపక్షానికి చేరువగా వున్నవారు ఆ ప్రాంతంలో కొంటే అది యిన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కింద వస్తుంది. కంపెనీ వ్యవహారాల్లో అయితే అది చట్టవిరుద్ధం, శిక్షార్హం. భూముల విషయంలో దానిపై చట్టం వుందో లేదో నాకు తెలియదు. కావాలంటే కేసు పెట్టుకోండి అని వూరుకోవచ్చు కానీ ప్రజల్లో అనుమానం బలపడుతుంది. దాన్ని దూరం చేయాలంటే ప్రకటనకు నెల ముందు జరిగిన రిజిస్ట్రేషన్లను ప్రకటించి, అమ్మినదెవరో, కొన్నదెవరో, వారి ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్న్‌స్‌తో సహా ప్రకటిస్తే విమర్శకులకు సరైన సమాధానం యిచ్చినట్లుంటుంది. పనిలో పనిగా వారు భూపరిమితి చట్టం ఉల్లంఘించారా లేదా అనేది కూడా క్లారిఫై చేస్తే మంచిది.

అనుమానం వచ్చే ఇంకో విషయం ఏమిటంటే – జోను సరిహద్దులు గీయడంలో కొందరి ఆస్తులు కాపాడడౖం! హైదరాబాదులో వైయస్‌ హయాంలో ఓఆర్‌ఆర్‌ ప్లాను చేసినపుడు అస్మదీయుల భూములు కాపాడుతూ, తస్మదీయులు భూములు ఎగరగొడుతూ ప్లాను చేశారని వార్తలు వచ్చాయి. వాటిపై నేను 'సున్నా చుట్టడం రానివాళ్లు' అంటూ వ్యంగ్యంగా రాశాను కూడా. ఆ అక్రమాల గురించిన పూర్తి వివరాలు యిప్పటికీ తేలలేదు. కానీ వైయస్‌పై అవినీతి, ఆశ్రితపక్షపాతం ముద్ర అయితే గాఢంగా పడింది. ఇప్పుడు లింగమనేని ఎస్టేటు గురించి యిలాటివే వచ్చాయి. కృష్ణానదీగర్భంలో అక్రమంగా, పర్యావరణనియమాలకు విరుద్ధంగా కట్టిన కట్టడంలో ప్రభుత్వ ఆస్తి అంటూ ముఖ్యమంత్రి వుండడం (పర్యావరణాన్ని చెడగొట్టిన చోట ముఖ్యమంత్రి వుంటూ కొత్త రాజధానిలో పర్యావరణం కాపాడతాం అంటే ఏం బాగుంటుంది?) జోన్‌ సరిగ్గా వారి ఎస్టేటుకు 10 మీటర్ల ముందు ఆగిపోవడం, తక్కిన అనేక ప్రాజెక్టులు అనుమతులు ఆగిపోగా వారికీ, జయభేరికి మాత్రం అనుమతులు దక్కడం యివన్నీ ఆశ్రితపక్షపాతం ఆరోపణలకు తావిచ్చే అంశాలు. మురళీమోహన్‌ రియల్‌ ఎస్టేటు వ్యాపారి. ఆయన భూములు కొనడంలో ఆశ్చర్యం లేదు. కానీ వింతేమిటంటే బాబు డెవలప్‌ చేసిన సైబరాబాదులోనూ ఆయన ఎస్టేట్లున్నాయి, కొత్తగా డెవలప్‌ చేస్తానంటున్న అమరావతిలోనూ వుంటున్నాయి. హైదరాబాదులో తక్కిన ప్రాంతాల్లో ఆయన ఎస్టేట్లు కనబడవు. దేవులపల్లివారికి అనుమానం వచ్చింది – 'మావిచిగురు తినగానే కోయిల కూసేనా? కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?' అని. అలా జయభేరి ఎస్టేటు వస్తోందని బాబు అభివృద్ధి చేశారా? బాబు అభివృద్ధి చేస్తారని జయభేరి వస్తోందా? అనిపిస్తుంది. ఒకరి అంశ మరొకరిలో వుందేమో అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆశ్చర్యం వలన యిన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వలన లబ్ధి పొందినవారిలో ఆయనా వున్నాడేమో అనే అనుమానం వస్తుంది. 

ఇక ఆగ్రిగోల్డ్‌ భూముల విషయంలో అయితే బాబు ఏం వివరణ యిచ్చినా సబబుగా కనబడటం లేదు. బాధితులను కదిపితే కథలుకథలుగా చెప్తారు. ఆగ్రిగోల్డ్‌ వాళ్లు మోసం చేసి, ప్రజల డబ్బుతో ఆస్తులు సంపాదించారని ఏడాది క్రితమే తెలుసు. అయినా రాష్ట్రప్రభుత్వం అధీనంలోని పోలీసు శాఖ వారిని మొన్నటిదాకా అరెస్టు చేయకపోవడం, అనేక ఆస్తులు స్వాధీనం చేసుకోకపోవడం, అతి తక్కువ నగదు చూపించడం చూసి కోర్టువారే చివాట్లు వేశారు. విచారణ వేగంగా సాగటం లేదన్న కోర్టు వ్యాఖ్యకు బాబు వద్ద జవాబేముంది? పోలీసు వైఫల్యానికి జవాబు చెప్పాల్సింది వారి ప్రభుత్వమేగా! రాజధాని చుట్టూ వున్న అగ్రిగోల్డ్‌ భూముల కారణంగానే పాలకులు వారిని రక్షిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు ఏమిటి అన్నదానికి జవాబు చెప్పవలసినది పాలకులే. సిబిఐ చేత విచారణ చేయిస్తారా అని ఒక విలేకరి అడిగితే ఏముందని చేయించాలి అన్నారు బాబు. నిజమే సిబిఐ మాత్రం కరక్టుగా చేస్తుందన్న నమ్మకం ఏముంది? వాళ్ల దగ్గర స్టాఫ్‌ లేరుట కూడా. రాష్ట్రస్థాయిలో విచారణ కమిషన్‌ వేయడానికి కూడా బాబు సిద్ధంగా లేరు కాబట్టి ప్రభుత్వమే అన్నీ తనకు తానుగా ప్రకటించేస్తే మంచిది. ప్రతిపక్షం ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడానికి, వాళ్లు అడక్కపోయినా తమంతట తామే ప్రభుత్వం ప్రకటనలు చేయడానికి మన పెద్దలు సమకూర్చిన వేదిక అసెంబ్లీ. ఇద్దరూ దాన్ని సవ్యంగా వుపయోగించుకోవాలి. దాని ద్వారా ప్రజల సందేహాలు నివృత్తి చేస్తే చాలు. ప్రెస్‌ మీట్‌ పెట్టి తెలుగువారి ప్రతిష్ఠకోసం, పెట్టుబడుల కోసం మీరు మౌనంగా వుండాలి అని వాదించనక్కరలేదు. 

2014 ఎన్నికలలో టిడిపి గెలవడానికి కారణం, జగన్‌ అవినీతిపరుడన్న యిమేజి, కేసుల్లో యిరుక్కుని జైలు కెళ్లిన నేపథ్యం. మాట తప్పుతారన్న యిమేజి బాబుకి వున్నా అవినీతి తో పోలిస్తే యిది ఫర్వాలేదనుకున్నారు. గెలిచాక మాట తప్పే యిమేజి బాబు కాపాడుకున్నారు – ఋణమాఫీ, కాపు రిజర్వేషన్‌ వగైరా విషయాల్లో! కానీ బాబు కూడా అవినీతికి పాల్పడ్డారని ఏ మాత్రం రుజువైనా వచ్చినా ఆంధ్రులు హతాశులవుతారు. సీజర్స్‌ వైఫ్‌ మస్ట్‌ బి బియాండ్‌ సస్పిషన్‌ అంటారు. వైయస్‌ కాలంలో ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆయన 'ఆ రెండు పత్రికలు' అంటూ వచ్చారు. చివరకు ఏమైంది? ఆ పత్రికలు నిక్షేపంలా వున్నాయి. వైయస్‌ వెళ్లిపోయారు – బోల్డంత అపకీర్తి మూటగట్టుకుని! వైయస్‌ పాలన మళ్లీ తెస్తామని జగన్‌ వాగ్దానం చేస్తే జనాలు హడిలిపోయి వద్దులే అనేశారు. అది చూసి కూడా బాబు సాక్షి పత్రికను ఆడిపోసుకుంటూ కాలం గడపడం వేస్టు. తప్పుడు రాతలు రాస్తే కేసులు పెట్టవచ్చు కాదు, పెట్టాలి కూడా.  పత్రికలపై కేసులు పెట్టడం సర్వసాధారణం. కేసుల్లేని ఏ పబ్లికేషనూ వుండదు. ఆరోపణలకు గురైనవాడికి కేసు పెడతాననే హక్కు వుంది కానీ బాబు దీనిలో కూడా కొత్త పుంత తొక్కారు. క్షేత్రస్థాయిలో రిపోర్టు చేసిన విలేకరిని ఫోకస్‌ చేసి బెదిరించే ధోరణిలో మాట్లాడి వివాదం కొని తెచ్చుకుంటున్నారు. విలేకరి ఏం రాసినా, అల్టిమేట్‌గా ఎడిటరు, పబ్లిషరు బాధ్యులవుతారు. వాళ్లు కూడా కేసులో భాగస్వాములవుతారు కాబట్టే విలేకరి ధైర్యంగా రాస్తాడు. తనొక్కడే కేసు ఎదుర్కోవాలంటే ఏ అన్యాయం, ఏ అక్రమం జరిగినా విలేకరి రిపోర్టు చేయడం మానేస్తాడు. విలేకరికి వుండే యీ రక్షణ కవచాన్ని ఛేదిద్దామని బాబు ప్రయత్నిస్తే పత్రికాస్వేచ్ఛ హరిస్తున్నారంటూ జాతీయస్థాయి పాత్రికేయుల నుంచి కూడా నిరసనలు వస్తాయి. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016) 

[email protected]

Click Here For Archives