ఫిబ్రవరి 28 న అరెస్టయిన సహారా గ్రూపు చైర్మన్ సుబ్రత రాయ్ బెయిల్ కోసం అప్లయి చేసుకుంటే భారత చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా పదివేల కోట్ల రూ.లు కట్టమంది సుప్రీం కోర్టు. 2.90 కోట్ల మంది పెట్టుబడిదారులకు 2012లో సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారం 24 వేల కోట్ల రూ.లు చెల్లించనందుకు పెట్టిన కేసుకి యింత పెద్దమొత్తంలో బెయిలు కట్టాలంటే అంత వైట్ మనీ ఎక్కణ్నుంచి వస్తుంది? కట్టలేమని సహారా చేతులెత్తేసింది. అందుచేత సుబ్రత ఏప్రిల్ 3 వరకు జైల్లో వుండడం ఖాయం. చూడబోతే కోర్టు సుబ్రతకు బుద్ధి చెప్పాలని చూస్తున్నట్లుంది. సహారా కంపెనీ దబాయింపు మీదే బతుకుతూ వచ్చింది. సుబ్రత అరెస్టు తర్వాత అతని రెండో కొడుకు సీమాంత రాయ్ ఢిల్లీలో క్యాంప్ వేసి 8 మంది సహారా అధికారులతో టీము ఏర్పరచాడు. వాళ్లు మార్చి 12 న హెబియస్ కార్పస్ (మనిషి కనబడటం లేదని, వెంటనే హాజరు పరచాలని అడిగే అభ్యర్థన) పిటిషన్ వేస్తూ, సుబ్రత కస్టడీ చట్టవిరుద్ధమని, మధ్యంతర బెయిలు యివ్వాలనీ వాదించారు. మర్నాడే సుప్రీం కోర్టు దాన్ని కొట్టి పారేసింది. అంతకుముందు డిపాజిటర్లకు డబ్బు ఎలా యిస్తావని కోర్టు అడిగితే సహారా గ్రూపు ''మా వద్ద 36,631 ఎకరాల భూమి వుంది. ముంబయికి 120 కి.మీ.ల దూరంలో మేం కడుతున్న యాంబీ వ్యేలీకి చెందిన 1700 ఎకరాల భూమి దస్తావేజులను సెబికి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చూపిస్తాం. దాన్ని అమ్మేసి మూడు రోజుల్లో రూ.2500 కోట్లు చెల్లిస్తాం. తక్కినది ఐదు విడతల్లో 2015 జులై కల్లా చెల్లిస్తాం.'' అని ప్రతిపాదించింది. ''మీరు ఎక్కడా నియమనిబంధనలు పాటించకపోవడం వలన ఆ భూములన్నీ వివాదాల్లో చిక్కుకుని వున్నాయి. ఈ ప్రతిపాదన తిరస్కరిస్తున్నాం.'' అంది కోర్టు.
నిజానికి రిజర్వు బ్యాంక్ 2015 జూన్ 30 లోపున డిపాజిట్లన్నీ వెనక్కి యిచ్చేయమని చెపితే సహారా గ్రూపు ఆ పని చేయకుండా కొత్తగా డెయిరీ, ఫాస్ట్‌ఫుడ్ హోటళ్లు, హెల్త్ కేర్, వాటర్ బేస్‌డ్ టూరిజం రంగాల్లో పెట్టుబడి పెట్టబోయింది. అంతేకాకుండా యిప్పటికే వున్న కన్స్యూమర్ గూడ్స్, రియల్ ఎస్టేటు రంగాల్లో యింకా పెట్టుబడులు పెడుతోంది. ఈ వరస చూసే కోర్టుకి కోపం వచ్చి వుంటుంది. పరిస్థితి యిలా వున్నా మాకేమీ ఫర్వాలేదు అని చూపించుకోవడానికి లక్నోలో సంస్థ హెడాఫీసులో వున్న పెద్దకొడుకు సుశాంత రాయ్ రాబోయే మూడేళ్లల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు యివ్వబోతున్నాం, అప్లికేషన్లు పంపండి అంటూ పేపర్లలో యాడ్స్ గుప్పించాడు. అదీ జబర్దస్తీ అంటే! 36 ఏళ్ల క్రితం లాంబ్రెట్టా స్కూటర్‌పై గుమ్మంగుమ్మం తిరుగుతూ డిపాజిట్లు వసూలు చేసి, 1978లో 2,000 రూ.ల పెట్టుబడితో ఒక ప్యూను, ఒక గుమాస్తాతో గోరఖ్‌పూర్‌లో కంపెనీ ప్రారంభించిన వ్యక్తికి యింత డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందనే అందరికీ సందేహం. 2006 లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (సహారా, మార్గదర్శి, పియర్‌లెస్ వంటివి)లు తాము సేకరించిన డిపాజిట్లకు దీటైన సొమ్ము తాము అనుమతించిన సెక్యూరిటీస్‌లో పెట్టాలని ఆర్‌బిఐ ఆదేశాలిచ్చింది. సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పోరేషన్ పట్టించుకోకపోవడంతో 2008లో యికపై డిపాజిట్లు సేకరించవద్దని ఆదేశాలు యిచ్చింది. అప్పుడు సహారా గ్రూపు సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్, సహారా హౌసింగ్ యిన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ అనే రెండు కొత్త కంపెనీలు నెలకొల్పి ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఓఎఫ్‌సిడి)లు జారీ చేసింది.
సెబిలో హోల్‌టైమ్ మెంబర్‌గా వున్న కేరళ క్యాడర్ ఐయేయస్ అధికారి కెఎమ్ అబ్రహామ్‌కు యీ వ్యవహారంపై వాసన తగిలింది. అలా సేకరించిన డబ్బును ప్రయివేటుగా వేరే చోట దాస్తోందని, ఇన్వెస్ట్ చేసినవారి వివరాలు సరిగ్గా మేన్‌టేన్ చేయడం లేదని కనుగొన్నాడు. డిపాజిటర్ల పేరు తిరగేస్తే 6 వేల కళావతులు, 13 వేల అటల్ బిహారీ వాజపేయిలు, కొన్ని వేలమంది లాలూ ప్రసాద్ యాదవ్‌లు కనబడ్డారు. ఇక్కడ మార్గదర్శితో పోలిక కనబడుతుంది. మార్గదర్శి డిపాజిటర్ల వివరాలు కూడా అస్పష్టంగా వున్నాయి. పొడి అక్షరాలలో పేర్లు యిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకు వ్యతిరేకంగా పరిమితికి మించి డిపాజిట్లు సేకరించారు. ఉండవల్లి యీ విషయాన్ని లేవనెత్తినపుడు మార్గదర్శి యాజమాన్యం మొదట్లో బుకాయించ బోయింది. ఒక న్యాయమూర్తి సలహా మేరకే అలా చేశాం అంది. ఆ న్యాయమూర్తి పేరు ఎప్పటికీ చెప్పలేకపోయింది. తెలుగు రాజకీయనాయకులు తమ బ్లాక్ మనీ మార్గదర్శిలో దాచుకున్నారని అందరికీ అర్థమై పోయింది. కొన్నాళ్లదాకా దబాయింపుతో నడిపినా, రాష్ట్రప్రభుత్వం మద్దతు లేకపోవడంతో డిపాజిట్లు యిక సేకరించడానికి వీల్లేదని కోర్టు చెప్పడంతో గత్యంతరం లేక మార్గదర్శి వ్యాపారం ఆపివేయాల్సి వచ్చింది.
సహారాలో ఆ యింగితం లోపించింది. సెబితో తలపడింది. తప్పులు ఎత్తిచూపిస్తూ సెబి 2011 జూన్‌లో ఆర్డర్ వేస్తే దానిపై సహారా ట్రైబ్యునల్‌కు వెళ్లింది. సెబి చేసినది కరక్టే అని ట్రైబ్యునల్ అంటే సుబ్రత 2012 ఆగస్టులో సుప్రీం కోర్టుకి వెళ్లాడు. సుప్రీం కోర్టు 90 రోజుల్లో 24 వేల కోట్ల రూ.లు సెబికి కట్టేయమంది. ''రూ.2 వేల కోట్లు తప్ప తక్కినదంతా కట్టేశాం, కావాలంటే చూసుకోండి'' అంటూ సహారా 127 ట్రక్కులలో 31,669 పెట్టెల్లో దస్తావేజులు పెట్టి సెబికి పంపించింది. 'ఇదంతా అయోమయంగా వుంది. సరిగ్గా రికార్డులు చూపండి' అంది సెబి. సహారా సహాయనిరాకరణ చేస్తోంది. సెబి అబద్ధాలు చెప్తోందని యాడ్స్ గుప్పిస్తోంది. దీనితో బాటు సహారా రూ.5120 కోట్లు సెబికి కట్టింది. సెబి దాన్ని డిపాజిటర్లకు పంచిపెడదామని చూస్తే సాధ్యపడలేదు. వచ్చి తీసుకుపొండి అని 21 వేల మందికి నోటీసులు పంపితే తప్పు అడ్రసుల కారణంగా 7 వేల మందికి నోటీసులు అందలేదు. నోటీసులు అందిన 13 వేల మంది నుండి ఉలుకూపలుకూ లేదు. కేవలం 300 మంది మాత్రం వచ్చి డబ్బు తీసుకున్నారు. అంటే యిదంతా నల్లధనం అన్నమాట. బోగస్ పేర్లతో, బోగస్ అడ్రసులతో డిపాజిట్లు వేశారన్నమాట. వేసినవారు కార్పోరేట్లు, రాజకీయనాయకులు కాబట్టే యిలా జరుగుతోంది. కష్టార్జితమైతే ఎవరైనా వదులుకుంటారా?
ఇవన్నీ బయటపెడుతూ ''సహారా – ద అన్‌టోల్డ్ స్టోరీ'' పేరుతో జర్నలిస్టు తమాల్ బందోపాధ్యాయ పుస్తకం రాస్తే అతనిపై, ప్రచురించిన జైకో సంస్థపై కలకత్తా హైకోర్టులో 200 కోట్ల రూ.లకు పరువునష్టం దావా వేసి స్టే తెచ్చుకుంది సహారా! ఇప్పుడు దాదాపు నెలగా తిహార్ జైల్లో 12 అడుగుల పొడుగు, 5 అడుగుల వెడల్పు వున్న చిన్నగదిలో మరో యిద్దరు సహారా డైరక్టర్లతో కలిసి వుంటున్నాడు. బయటకు ఎప్పుడు వస్తాడో తెలియదు.
-ఎమ్బీయస్ ప్రసాద్