మోహన : నన్ను సినిమాల్లోకి పంపింది డబ్బు కోసమా?

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా  Advertisement నన్ను సినిమాల్లోకి పంపింది డబ్బు కోసమా?      ఇప్పటిరోజుల్లో టీవీలు వచ్చి సినిమాతారలు బాగా కనబడుతున్నారు. 1954 ప్రాంతాల్లో సినిమాతారలు మద్రాసు…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా 

నన్ను సినిమాల్లోకి పంపింది డబ్బు కోసమా?
    
ఇప్పటిరోజుల్లో టీవీలు వచ్చి సినిమాతారలు బాగా కనబడుతున్నారు. 1954 ప్రాంతాల్లో సినిమాతారలు మద్రాసు విడిచి బయటకు వచ్చేవారే కాదు. అందువలన మామూలు జనాల్లో తారలంటే విపరీతమైన క్రేజ్‌ వుండేది. మా కుటుంబం మద్రాసు విడిచి గుంటూరు వెళుతోందని వార్త ఎలా పొక్కిందో అందరికీ తెలిసిపోయింది. దారి పొడుగునా రైల్వే స్టేషన్లలో నేనున్న బోగీ దగ్గరకు నన్ను చూడడానికి జనం వచ్చారు. నేను అప్పటికే పేరు ప్రఖ్యాతులు గడించిన బాలనటుణ్నిగా!

మా నాన్నగారు జోక్‌ చేశారు. ''వీళ్లంతా నన్ను చూడడానికి వచ్చారనుకున్నాన్రా. వచ్చి నీ గురించి అడుగుతున్నారు..'' అని. 

''వాడు యాక్టరండీ..'' అంది అమ్మ సాగదీసుకుంటూ.

''అబ్బ, నేనూ యాక్టరేలేవే'' అన్నారు నాన్న ఆమె మాట కొట్టేస్తూ.

నిజానికి ఆయనా వాహినీ వారి ''దేవత'' సినిమాలో ఓ చిన్న పాత్ర వేశారు, సరదాకి.

xxxxxx

టీవీల్లో వచ్చే కార్యక్రమాలలో చిన్నపిల్లలు పాల్గొంటే చూడడానికి సరదాగా వుంటుంది. చిన్నపిల్లలు శాస్త్రీయ గీతాలు ఆలాపించినపుడు, మాధుర్యం తొణికిసలాడే అలనాటి సినీగీతాలు పొల్లుపోకుండా, అక్షరం తప్పురాకుండా పాడుతున్నపుడు పులకించి పోతూ వుంటాం. ఈ కాన్వెంటు పిల్లలు తెలుగుపై యింత పట్టు ఎప్పుడు సంపాదించారు, యిన్ని వివరాలు ఎక్కడ సేకరించి గుర్తు పెట్టుకున్నారు అని విస్తుపోతూ చూసి, 'దేశం గొడ్డుపోలేదు. తెలుగు భాషకూ, సంగీతానికీ ఇప్పట్లో ఢోకా లేదు' అని ఊరడిల్లుతూంటాం. వారిలో ప్రతిభావంతులకు గుర్తింపు వస్తూండడం చూసి చప్పట్లు చరుస్తాం.

అయితే ఈ చప్పట్లూ, బహుమతులే వారి పాలిట శాపాలుగా మారుతున్నాయని వార్తలు వింటున్నాం. పిల్లలలో నిబిడంగా వున్న ఆసక్తిని, శక్తిని బయటకు వెలికిదీసే క్రమంలో వారి తలిదండ్రులు వారిపై ఒత్తిడి పెడుతున్నారని, జడ్జీలు కూడా కావాలని, అంటే టీవీతెరపై నాటకీయతకోసం, వాళ్లని తిట్టి, ఏడ్పిస్తున్నారని, టీవీ ఛానెళ్లవారు పిల్లల కన్నీళ్లను సైతం చిత్రీకరించి సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ ఒత్తిడి భరించలేక పిల్లలు డిప్రెషన్లకు లోను గావడం, ఆత్మహత్యలకు తెగించడం జరుగుతోందని పేపర్లలో వస్తున్నాయి, లలితకళలను ఉద్ధరించడం పేర పిల్లల బాల్యంనుండి లాలిత్యాన్ని హరిస్తున్నారని కోర్టులో కేసులూ నడుస్తున్నాయి. ఇక నృత్యాల పేర పిల్లల చేత అసభ్య, అశ్లీల నృత్యాలు చేయించడంతో బాటు వారిని విపరీతమైన శారీరక శ్రమకు గురి చేస్తున్నారు. మానవహక్కుల కమిషన్‌ దాకా ఫిర్యాదులు వెళ్లాయి. కొన్ని కార్యక్రమాలను నిషేధించారు. 

కళలు లేకపోతే పీడాపాయిరి, పిల్లల్ని యింత హింస పెట్టాలా? మీరూ బాలనటులు కదా, ఆనాటి మీ అనుభవాలు ఏమిటి? మీ నుండి నటన రాబట్టినవారు కూడా మిమ్మల్ని చితకబాదారా? మీ తల్లిదండ్రులు ఆస్తిపరులే కదా, మిమ్మల్ని సినిమాల్లోకి పంపి డబ్బు సంపాదించవలసిన అవసరం ఏమొచ్చింది వారికి? అని నన్ను అడుగుతూంటారు. ఆ ప్రశ్నలకు స్పందనే యీ వ్యాసం.

xxxxxx

మొదటగా చెప్పాల్సింది – నేను సినిమాలలో ప్రవేశించినది – ఆంధ్ర బాలానంద సంఘం ద్వారా. మా అమ్మే నన్నూ, మా అక్కనూ బాలానంద సంఘంలో చేర్పించింది. మా అక్క కల్పకం (సీతారాం యేచూరి తల్లి) డాన్సు చేసేది. పెళ్లవగానే అమ్మ మాన్పించేసింది. ఆవిడకు ఓ ఖచ్చితమైన లెక్క – దిస్‌ ఫార్‌, నో ఫర్‌దర్‌ అని. ('అంతొద్దు, యింత చాలు' అనవచ్చేమో). 

నన్నూ అంతే, చిన్నప్పుడే ప్రోత్సహించింది. నాన్నగారు మద్రాసు నుండి గుంటూరు వచ్చేయడంతో సినిమాలు కట్‌. అప్పుడు నాకు 8,9 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత సినిమాలకేసి తిరిగి చూడనివ్వలేదు. చదువుమీదే పూర్తి దృష్టి. అప్పటివరకూ మాత్రం ప్రోత్సహించింది. ఆంధ్ర బాలానంద సంఘం వాళ్లు వేరే వేరే వూళ్లు తీసుకెళ్లి ప్రదర్శనలు యిప్పిస్తానన్నా నిర్భయంగా పంపించింది. 

నిజానికి ఆ కాలం వాళ్లకు మూఢనమ్మకాలు ఎక్కువ. ఫోటో తీయిస్తే ఆయుక్షీణం అనీ, నాటకాల్లో, సినిమాల్లో వేస్తే దిష్టి తగులుతుందనీ… నేను పుట్టడానికి ముందు అమ్మకు ఏడు కాన్పులు పోయాయి. నాకు దిష్టి తగిలి ఏమైనా అవుతానేమోనన్న సంకోచం లేకుండా నన్ను స్టేజి ఎక్కనిచ్చింది. దిగాక దిష్టి తీసేసేదేమో. (మా అమ్మకు యీ గుణం వాళ్ల నాన్నగారి నుండి వచ్చి వుంటుంది) ఆ తర్వాత సినిమాల్లో వేషాలు వచ్చినపుడు మా నాన్నగార్ని ఒప్పించింది. పారితోషికం ఆశించలేదు. పిల్లవాడిలో ఓ ఆర్ట్‌ వుంది, దాన్ని ప్రోత్సహించాలి.. అంతే లెక్క!

xxxxxx

ఇక నా నుండి నటన రాబట్టడానికి నా పట్ల దర్శకనిర్మాతలు ఎలా ప్రవర్తించారు అన్నదానికి ఒకటి రెండు సంఘటనలు –  ముక్కామల గారు ఆరడుగుల విలన్‌. ఆజానుబాహువు. ఆయన నన్ను భలే ముద్దుగా చూసుకునేవారు. అరచేతిలో ఎక్కించుకుని ఫ్లోరంతా తిప్పేవారు. ఏదో గుర్రమెక్కినట్టో, సైకిలెక్కినట్టో నేను ఆయన అరచేయి ఎక్కి నిలబడేవాణ్ని. చిన్నపిల్లవాణ్ని కదా, ఆయన్ని చూస్తే భయమేసేది కాదా? అబ్బే, నేనే ఆయన్ని భయపెట్టేశాను ఓ సారి….  

ఆయన ''మరదలు పెళ్లి'' సినిమాలో బాలనటుడిగా వేశాను. ఆ సినిమాలో తల్లి చనిపోయిన సీనుంటుంది. శవం దగ్గర పిల్లవాడు బావురుమని ఏడవాలి. టంగుటూరి ప్రకాశం గారి తమ్ముడు కుమార్తె టంగుటూరి సూర్యకుమారి గారు తల్లిపాత్ర వేశారు. కొడుకు పాత్ర నాది. అమ్మ చచ్చిపోయిందని ఏడవమంటే 'మా అమ్మ బతికేవుంది, ఏడవను పొమ్మ'న్నాను. దానితో ఆయనకు దాదాపు ఏడుపు వచ్చినంత పనయింది. ఆయనే ఆ సినిమా దర్శకుడు, నిర్మాత. 

నాకు నచ్చచెప్పలేక, చివరికి మా అమ్మని  షూటింగ్‌ స్పాట్‌కి రప్పించి ఎదురుగా చూపించి ''ఇదిగోరా మీ అమ్మ యిక్కడే వుంది, ఏమీ కాలేదు. ఈ పడుక్కున్నావిడ.. వుట్టినే.. మీ అమ్మన్నమాట.. ఏది నాయనా.. నా బంగారు తండ్రీ.. యించక్కా ఏడమ్మా'' అని బతిమాలాడు. అప్పుడు పోనీ కదాని ఏడ్చి పెట్టాను. ఇలాటి ఘట్టాల గురించి బాపుగారు ''బుడుగు''లో ఓ కార్టూన్‌ వేశారు.

దీన్ని బట్టి అప్పట్లో బాలనటులు కూడా స్టార్‌ టాంట్రమ్స్‌ చూపించినట్టు అనుకోవచ్చు. సరదాగా చెప్పాలంటే మన దగ్గర ఎల్వీ ప్రసాద్‌గారి ఆటలే సాగలేదు. చివరకో ఆట కొనిచ్చి మచ్చిక చేసుకున్నారు.

xxxxxx

ఆ కథేమిటంటే – ''పెంపుడుకొడుకు'' సినిమాకు ఎల్‌.వి.ప్రసాద్‌ గారు డైరెక్టరూ, యాక్టరూను.  నేను ఆయన కొడుకు పాత్ర వేశాను. ఒక సన్నివేశంలో ఇంట్లో తినడానికి లేక, పూటగడవక వున్న పరిస్థితులలో, మిగతా పిల్లలు ముష్టెత్తడం చూసి ఓహో ఇది బాగుందనుకొని బస్‌ స్టాండ్‌లో అడుక్కుంటూవుంటాను. అది తండ్రిచూసి భరించలేక ఇంటికి తీసికొచ్చి కొడతాడు. 

ఆ కొట్టే సీను బాగా ప్రాక్టీస్‌ చేశాం. ఆయన ఒక చేయి అడ్డుపెట్టి కొట్టినట్లు నటించడం, తగిలినట్టు నేను ఏడవడం అదీను. మరీ ఏమయిందో ఏమో ఒక దెబ్బ పొరబాటున తగిలేసింది. 

అంతే! 'నన్ను కొడతావా' అని చెప్పి ఇంటికొచ్చేశానట. పదిహేను రోజులో, ఇరవైరోజులో మళ్లీ షూటింగ్‌కి వెళ్లలేదు. ఆయన రోజూ రావడం, మా అమ్మను బతిమాలడం. చివరికి ఆయనకో ఐడియా వచ్చింది. ట్రేడ్‌ ఆట  నాకు ఇష్టమని ఆయన ఎక్కడో తెలుసుకొని అదొకటి కొని ఇంటికి తీసుకొచ్చి నాకిస్తే, మా అమ్మ చెబితే అప్పుడు వెళ్లా! మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టి ఆ సినిమా పూర్తి చేశామన్నమాట. 

ఇప్పుడు టీవీల్లో జడ్జిలు పిల్లల్ని ఏడిపించడం గురించి చెప్తున్నాం కదా. అప్పట్లో మా పట్ల మహామహులు కూడా ఎటువంటి ఆదరం చూపేవారో చెప్పడానికి ఓ సంఘటన చెప్తాను. మా బాలానందం వాళ్లు వేసే రెండు నాటికలు అప్పట్లో బాగా పాప్యులర్‌. ఒకదాని పేరు ''బూరెల మూకుడు'', మరోటి ''కొంటె కృష్ణయ్య''. అప్పుడు ఎవరికో ఐడియా వచ్చింది. ఇంకో నాటిక కూడా రాయించి యీ మూడిటిని కలిపి ''బాలానందం'' అనే పేర సినిమాగా రిలీజ్‌ చేస్తే బాగుంటుందని. అంటే ఒకే టిక్కెట్టు మీద మూడు హ్రస్వచిత్రాలు చూడవచ్చన్నమాట. మూడిటిలోనూ నటీనటులందరూ బాలబాలికలే. పెద్దవాళ్లెవరూ లేరు. ఈ నాటికలను రంగస్థలంపై రేడియో అన్నయ్య, అక్కయ్య డైరక్టు చేసినా, సినిమాలను మాత్రం తాతినేని ప్రకాశరావుగారు డైరక్టు చేశారు. 1954లో రిలీజైంది. ఇలాటి ప్రయోగం మళ్లీ ఎవరూ చేసినట్టు లేదు. 

వీటిలో మొదటి రెండు తయారుగా వున్నాయి. మూడో నాటికగా ఓ జానపద ఫక్కీ కథ అనుకున్నారు. ఆరుద్రగారిని కథ రాయమన్నారు. రాశాక దానికి పేరేం పెట్టాలాన్న అనుమానం వచ్చింది. ఇది చూసేది చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లల దృక్కోణంలో నుండి ఆలోచించి పేరు పెట్టాలనుకున్నారాయన. దానికి నన్ను ఎంచుకున్నారు. ఓ రోజు నెప్ట్యూన్‌ స్టూడియోలో కూర్చోబెట్టి, ''ఒరేయ్‌, ఈ కథ విని దీనికి మంచి పేరు చెప్పరా'' అని తను అనుకున్న కథంతా చెప్పారు. 

అంతా విన్నాక నేను చెప్పాను – ''ఏమండీ, దీనికి 'మరణ దండన' అని గాని 'రాజయోగం' అని గాని పెడితే బాగుంటుంది.'' అని. ఆరుద్రగారి గొప్పతనం ఏమిటంటే ఆయన వాటిని ఆమోదించారు. ''రాజయోగం'' అని పేరు నిర్ధారించారు. అంటే ఏ ఉత్పత్తినైనా సరే అంతిమంగా ఉపయోగించేవారికి (ఎండ్‌-యూజర్‌) అనువుగా వుండేటట్లు తయారు చేయాలన్న సిద్ధాంతాన్ని అమలు చేశారు.  నా కప్పుడు ఏడెనిమిదేళ్లు వుంటాయి. ఆ సినిమాలను చూడబోయేది నా వయసువాళ్లే. మాకు ఏది ఎపీలింగ్‌గా వుంటుందో, ఏది నచ్చుతుందో ఆయన చిన్న పరీక్ష పెట్టి చూశారన్నమాట. ఏది ఏమైతేనేం మాకు అంత విలువ నిచ్చారు తప్ప తీసి పారేయలేదు.

xxxxxx

నా తలిదండ్రుల గురించి చెప్పాను కాబట్టి తండ్రిగా నా పిల్లల అభిరుచుల పట్ల ఎలా ప్రవర్తించానో చెప్పకపోతే వ్యాసం పూర్తయినట్లు కాదు. నేను ఎంత బాధ్యతాయుతమైన పదవులలో వున్నా మా పిల్లల హాబీల పట్ల అశ్రద్ధ వహించలేదు. అఫ్‌కోర్స్‌, దీనిలో నా శ్రీమతి పాత్ర ఎక్కువే. అయినా నేనూ వాళ్లను ప్లే గ్రౌండ్‌లకు, స్విమ్మింగ్‌ పూల్స్‌కు, ఆర్ట్‌ స్కూల్స్‌కు స్వయంగా తీసుకెళ్లే వాణ్నని గర్వంగా చెప్పుకుంటాను. 

మా అమ్మాయి అపర్ణ డాన్సు నేర్చుకుంది. మహామహోపాధ్యాయ నూకల  చినసత్యనారాయణ గారి వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకుంది. టెన్నిస్‌ ఆడుతుంది. ఈత కొడుతుంది, సర్ఫ్‌ రైడింగ్‌ చేస్తుంది. 

ఇక అబ్బాయి అరవింద్‌ – 'పద్మశ్రీ' యెల్లా వెంకటేశ్వరరావుగారి వద్ద మృదంగం నేర్చుకున్నాడు. వాడిని ప్రోత్సహించడానికి వాడితో బాటు నేనూ నేర్చుకున్నాను. మా వాడు క్రికెట్‌ ఆటగాడు. అండర్‌ 19 టీములో నేషనల్‌ టోర్నమెంటులో హైదరాబాదు తరఫున ఆడాడు.

మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసిన ఆంధ్ర బాలానంద సంఘం నిర్వాహకులు రేడియో అన్నయ్య, అక్కయ్యలను ఎప్పుడూ మర్చిపోలేదు. వారికి ఏం కావాల్సినా ఎప్పుడూ అందుబాటులో వుండేవాణ్ని. నా భార్య ఉష ఆంధ్ర బాలానంద సంఘానికి కార్యదర్శిగా చాలా ఏళ్లు పనిచేసింది. 

కొసమెరుపు – అసలు కంటె కొసరు ముద్దు అంటారు. అందువలన దీనికి కొసమెరుపు మా మనవరాలి గురించే! మా కూతురి కూతురు, పేరు గాయత్రి. సంగీతం నేర్చుకుంటోంది. నా దగ్గర్నుంచి గిటార్‌ పట్టుకుపోయింది.  మా కుటుంబాని కంతటికీ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారంటే చాలా అభిమానం. ఓ సారి ఎయిర్‌పోర్టులో కలిసినపుడు నమస్కారం పెట్టి మా మనవరాలిని పరిచయం చేశాను. అది వెంటనే ఆయన గానం చేసిన రామదాసు కీర్తనలు పాడి వినిపించింది. బాలమురళిగారు ఎంత సంతోషించారో చెప్పలేను – ఆ తరంవరకూ ఆయన గానం చేరినందుకు! 

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version