సీమాంధ్రలో టిడిపిలోకి పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. అక్కడ టిడిపి గెలుపు తథ్యం అని నాయకులు అనుకుంటున్నారు. అన్ని వేళలా నాయకులు ప్రజల నాడిని పట్టుకోగలరని అనుకోవడానికి లేదు. ఎమర్జన్సీ ముగిసిన తర్వాత 1978 ఎసెంబ్లీ ఎన్నికల వేళ నాయకులు యిలాగే జనతా పార్టీలోకి, వెంగళరావు (బ్రహ్మానందరెడ్డి) కాంగ్రెసులోకి వెళ్లిపోయారు. ఇందిరా కాంగ్రెసుకి అభ్యర్థులే దొరకలేదు. ఇందిరా గాంధీ, చెన్నారెడ్డి అప్పటిదాకా తమ చుట్టూ తిరిగిన కాంగ్రెసు నాయకులను పలకరించబోతే వాళ్లు మొహాలు తప్పుకు తిరిగారు. ఎదురుపడితే టిక్కెట్టు చేతిలో పెడతారేమోనన్న భయం చేత! అనామకులకు టిక్కెట్లు యిచ్చారు. నాయకుల తీరు యిలా వున్నా ప్రజలు ఇందిరా కాంగ్రెసుకు ఓట్లేశారు. మెజారిటీ సాధించి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1982లో ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు నాయకులు పెద్దగా చేరలేదు. సినిమా యాక్టరు కాబట్టి ప్రజలు చూడడానికి వస్తున్నారు అనుకున్నారు. కొత్తవాళ్లకు టిక్కెట్లు దక్కాయి. మూడింట రెండువంతుల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇవన్నీ మీడియాలోని వ్యక్తులకు గుర్తున్నాయో లేదో తెలియదు కానీ యిప్పుడు కొందరు కాంగ్రెసు నాయకులు టిడిపివైపు వెళ్లడంతో కోస్తాలో టిడిపి గెలుపు తథ్యం అని తీర్మానిస్తున్నారు. దానికి కారణం కూడా చెప్తున్నారు – 'సీమాంధ్రులు లోకజ్ఞానం కలవారు. జరిగిపోయినదానికి వగస్తూ కూర్చోరు. జరిగిందేదో జరిగింది, ముందు జరగాల్సింది చూడాలి. మనకు కావలసినది అభివృద్ధి! అది చేయగల సమర్థుడు బాబు ఒక్కడే అని వాళ్లు నమ్ముతున్నారు. బాబును చూసే తెలుగు భాషలో సమర్థుడు అనే పదం పుట్టిందని వాళ్లకు తెలుసు. ఆయన వలన తప్ప సీమాంధ్ర బాగుపడడం కల్ల అని ఏ పసిపాపనడిగినా చెపుతుంది.' – యిదీ మీడియా ధోరణి. ఎడిట్ పేజీ వ్యాసాల్లో, కథనాల్లో, వ్యాఖ్యల్లో, టీవీ చర్చల్లో, టీవీ కథనాల్లో ఎక్కడ చూసినా యిదే వల్లిస్తున్నారు. ఇదంతా నిజమా? ఈ లెక్క ప్రకారం సీమాంధ్రలో టిడిపి స్వీప్ చేసేస్తూ వుంటే జగన్‌కి ఏమీ వుండదా? అనే ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది. దానికి వీరి వద్ద వున్న సమాధానం ఏమిటంటే – 'జగన్‌కు రాయలసీమలోని 4 జిల్లాల్లో కాస్త పట్టుంది, కానీ తక్కిన 9 జిల్లాల్లో టిడిపిదే హవా. దానికి కూడా కారణం వుంది, సమైక్య సెంటిమెంటు కానీ మరో సెంటిమెంటు కానీ రాయలసీమలో అలాటి భావనలు ఎక్కువ. కోస్తా వాళ్లు బొత్తిగా వ్యాపారమనస్తత్వం కలవాళ్లు. ఆచరణవాదులు. మెటీరియలిస్టులు. సెంటిమెంట్లు జాన్తానై. రేపటి సంగతేమిటి? దానిలో మనకు దక్కే లాభం ఏమిటి? – యిదే వాళ్లకు లెక్క. ఆ విధంగా వాళ్లు చంద్రబాబునే ఆదరిస్తారు.' అని.
కోస్తాలో సమైక్య సెంటిమెంటు లేదా? మరి అక్కడ సమైక్య ఉద్యమం ఎవరు చేసినట్లు? ఏ రాజకీయ నాయకుడూ సారథ్యం వహించకుండా, ఏ పార్టీ విరాళాలు గుప్పించకుండా ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారే! కనీసం రెండు నెలలపాటు వంతుల వారీగా, వారంతట వారు చందాలు వేసుకుని, ప్రజలను పీడించకుండా, ఆత్మహత్యలు చేసుకుని జనాల్ని రెచ్చగొట్టకుండా, యితర ప్రాంతీయలను ఎవర్నీ కొట్టకుండా, తిట్టకుండా శాంతియుతంగా చేశారే! ఇది సెంటిమెంటు కాదా? అది చూశాకనే కదా కిరణ్ కుమార్ రెడ్డికి కాస్త ధైర్యం వచ్చి బహిరంగంగా తన నిరసన తెలిపినది! సీమాంధ్ర ప్రజలకు సెంటిమెంటు, చట్టుబండలూ ఏమీ లేవనే తప్పుడు అంచనాలు వేసుకునే అక్కడి నాయకులు ఢిల్లీలో 'ఏం ఫర్వాలేదు, మమ్మల్ని చీల్చేయండి' అని చెప్పారు. దానికి గాను ఏమేం లాభాలు పొందారో జైరాం రమేశ్‌ను అడిగితే చెప్తారు! రాజీనామా చేయగానే కావూరి గురించి కాస్త చెప్పారు. వాళ్ల అబ్బాయి గురించి చెప్పబోయి ఆపేశారు. పురంధరేశ్వరి గురించి కొంత చెప్పారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కాంగ్రెసు నుండి దూరమైనవారి కథలన్నీ చెప్తారేమో! ఈ కథలు వింటే కాంగ్రెసులో వుండిపోయిన వారి కథలు వూహించుకోగలుగుతాం. దాసరి 'బ్రోకర్' కథలు చెప్తానన్నారు. తమ స్వార్థం కోసం యిలా అమ్ముడుపోతూ, ప్రజలు పట్టించుకోరు అనే ధైర్యంతోనే విభజనకు మద్దతిచ్చిన నాయకులు సమైక్య ఆందోళన చూసి తెల్లబోయారు. అప్పటికే వాళ్లకు దక్కాల్సింది దక్కేసింది కాబట్టి వెనక్కి వెళ్లలేక, తలలూపారు.
'సీమాంధ్రలో జరిగిన ఉద్యమమంతా తెలుగుజాతి ఐక్యత కోసం కాదు, కేవలం హైదరాబాదుపై పట్టు పోతుందన్న భయంతోనే ..' అంటారా? ఓకే, అలా అనుకున్నా, తమకు ఫైనల్‌గా హైదరాబాదు విషయంలో జరిగిన నష్టానికి కోపం వుండదా? హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రం కాలేదు, యుటీ కాలేదు, ఎచ్‌ఎండిఏ పరిధి వరకు ఉమ్మడి రాజధాని అంటే అదీ కాలేదు, హైదరాబాదు ఆదాయంలో వాటా అంటే అదీ దక్కలేదు. దానికి ప్రత్యామ్నాయంగా నష్టపరిహారం యివ్వాలంటే మొదటి ఏడాది మాత్రమే యిస్తానన్నారు. సెక్రటేరియట్‌లో, రాజధానిలోని కొన్ని కార్యాలయాల్లో అటెండెర్ ఉద్యోగంతో సహా అన్ని వుద్యోగాలు రాష్ట్ర స్థాయి వుద్యోగాల కిందే లెక్క. రాష్ట్ర స్థాయి వుద్యోగాల్లో దేశంలోని ఏ యితర రాష్ట్రం నుండైనా వచ్చి పోటీపడి వుద్యోగం తెచ్చుకోవచ్చని దేశరాజ్యాంగం చెపుతోంది. ఆ స్థాయి వుద్యోగాల్లో తమ ప్రతిభతో సీమాంధ్రులు అనేకమంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వారిని తొలగించడం, తరిమివేయడం దేశ రాజ్యాంగానికే విరుద్ధం. 'అయినా సరే, వాళ్లు వెళ్లిపోవల్సిందే, లేకపోతే మా వాళ్లకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?' అని నిరుద్యోగులను, విద్యార్థులను వారిపై ఉసికొల్పుతున్నారు టి-ఉద్యోగసంఘ నాయకులు. వారిని పంపించి వేస్తే అర్హులు దొరకవద్దా? అని కమిటీవాళ్లు అడిగితే, 'దానికేముంది? కింది స్థాయిలో వున్న తెలంగాణ వారికి ప్రమోషన్లు యిచ్చేయండి' అని అతి సులభంగా చెప్పేస్తున్నారు. అంటే స్థానికత ముఖ్యం తప్ప అర్హత కాదన్నమాట. తగినంత అర్హతతో న్యాయబద్ధంగా ఉద్యోగం తెచ్చుకున్నా సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ విడిచి వెళ్లవలసినదే. 13 జిల్లాల సీమాంధ్ర, వున్నవారికే జీతాలు యివ్వలేని సీమాంధ్ర ప్రభుత్వం ఎంతమంది ఉద్యోగులను భరించగలదు? అందువలన వీరందరూ ఉద్యోగభ్రష్టులు కాకతప్పదు.
ఈ విధంగా హైదరాబాదు మాత్రమే కాదు, దానిలోని సౌకర్యాలన్నీ తమకు కాకుండా చేసినందుకు ఆ యా పార్టీలపై కోపం వుండదా? ఆ మహానగరం పోయేట్టు చేసినవారిపై ద్వేషం వుండదా? 'అక్కడ భూముల్లో, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి, వాళ్ల భూములకు రేట్లు పెంచి, వాళ్లకు లాభాలు చేకూర్చి, చివర్లో మాట పడ్డాం. మనల్ని తరిమివేశారు, మన ప్రాంతం నుండి వాళ్లకు ఆదాయం, పన్నులు వెళ్లకూడదు. అక్కడి డీలర్లు వద్దు, మనం అక్కడకి వెళ్లి డబ్బు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? కస్టమర్లను, కన్స్యూమర్లను మర్యాదగా చూడడం వాళ్లకు రాదు. మన జాతి మొత్తాన్ని రాక్షసులంటున్నారు. ఆ డబ్బు ఖర్చు ఏదో యిక్కడే పెడదాం. ఆ పెట్టుబడులేవో యిక్కడే ఏడుద్దాం. మన దగ్గరున్న జనం బాగుపడతారు. ఇకపై యిక్కడే మనం అన్నీ కట్టుకోవాలి. ఈ లోపున కావాలంటే మద్రాసు నుండో, బెంగుళూరు నుండో సరుకులు తెప్పించుకొందాం. విద్యకు, వైద్యానికి అక్కడికే వెళదాం.' అనే కసి అక్కడి ప్రజల్లో రగులుతోందని వినబడుతోంది. హైదరాబాదుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతోందని, కాల్ టాక్సీలు 200 దాకా తగ్గాయని విన్నాను. ఇలాటి పరిస్థితి కల్పించినవారిపై కక్ష వుండదని అనగలమా? సిగ్గులేనివాళ్లు కాబట్టి, వాళ్లకు డబ్బే సర్వస్వం కాబట్టి అవమానాల్ని తుడిచేసుకుంటారని అని వూరుకుందామా?
'…అబ్బే కసి ఉంటుంది కానీ, అది కాంగ్రెసు పైన మాత్రమే వుంటుంది' అంటున్నారు మీడియా మోతుబరులు. కసి ఉంటే కాంగ్రెసుతో ఆగిపోదు. లెక్కప్రకారం బిజెపి, టిడిపిలపై కూడా వుండాలి. లోకసభలో సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అవతారం మరవగలరా? బిల్లు ప్రవేశపెట్టలేదని ముందురోజు వాదించి, మర్నాడు ఒక్క సవరణ కూడా ప్రతిపాదించకుండా తలుపులు మూసి ఓకే చేయించిన సంగతి గుర్తుండదా? రాజ్యసభలో వెంకయ్య, అరుణ్ జైట్లే ఏదో మొహమాటానికి మాట్లాడినట్లు అభ్యంతరాలు తెలిపి ఆ తర్వాత సవరణలకు పట్టుబట్టకుండా అన్నిటికీ తలూపినది టీవీల సాక్షిగా చూడలేదా? ఇక టిడిపి ఏం ఉద్ధరించింది? విభజన చేయాలి అంటూ టిడిపి యిచ్చిన లేఖ మరువగలరా? సమన్యాయం చేయాలి, హైదరాబాదులో వాటా వుండాలి, రక్షణలు కల్పించాలి యిలాటి షరతులు ఏమీ లేకుండా, వాటి గురించి ఏ అఖిలపక్షంలోనూ ప్రస్తావించకుండా 2008 నుండి ఆరేళ్లపాటు లాక్కుని వచ్చిన వైనం తెలియదా? లోకసభలో యిద్దరు టి-టిడిపి ఎంపీలు సీమాంధ్ర టిడిపి ఎంపీను చావగొట్టిన సంగతేమిటి? సమైక్యత కోసం మోదించుకున్న మోదుగులకు కనీసం నరసరావు పేట లోకసభ టిక్కెట్టు కూడా లేకుండా చేశారు చంద్రబాబు. ఆయన నోట సమైక్యవాదం అన్న మాట అసెంబ్లీ కూడా పలికించలేకపోయింది. తను ఏ వాదినో చెప్పడానికో రెండు రోజుల గడువు అడిగాడు – రెండు రోజుల తర్వాత అసెంబ్లీకి ఏ గతి పట్టబోతోందో అందరికీ తెలిసినా! సీమాంధ్ర కష్టాల పట్ల, అవసరాల పట్ల ఆయనకున్న అక్కర అంతటిది!
టిడిపి, బిజెపి, కాంగ్రెసు ఎవరైనా సరే – విభజనోద్యమం సందర్భంగా సీమాంధ్రులపై తెలంగాణలోని అనేక పార్టీల నాయకులు మాట్లాడిన పరుషపదజాలం, యిప్పటికీ విషం కక్కుతూండడం ఆంధ్ర ఓటర్లు గమనించడం లేదా? ఉద్యోగులకు ఆప్షన్లు వుండవని కెసియార్ బహిరంగంగా అంటున్నారు. 'కాదు వుంటాయి, ఉండేట్లా చూస్తాం' అని ఒక్క పార్టీ అయినా మానిఫెస్టోలో రాస్తోందా? 'మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అందువలన వారిని తరిమేద్దాం' అనే ప్రతీ టి-నాయకుడు అంటాడు, పోన్లే వుండనిద్దాం అని ఛస్తే అనడు. ప్రయివేటు ఉద్యోగాల్లో కూడా స్థానికులకు రిజర్వేషన్‌లు వుండాలి' అనే అందరూ వాదిస్తారు. పెట్టుబడిదారులను ఆహ్వానిస్తాం – మా వాళ్లకు ఉద్యోగాలు యిస్తే…! అనే స్లోగనే అందరిదీ. తెలంగాణలో ఉద్యోగాల గోల వదిలేయండి. పోలవరం ప్రాజెక్టు సీమాంధ్రకు ఎంతో అవసరమైనది, పోనీ కట్టుకోనీ అని ఒక్కరైనా అంటున్నారా? పడగొడతాం, డిజైన్ మార్చమంటాం, ఎత్తు తగ్గించమంటాం, గిరిజనుల గుడిసె ఒక్కటి మునిగినా వూరుకోం – అని రంకెలు వేసేవాళ్లను నిలవరించే పెద్దమనిషి ఒక్కడైనా తెలంగాణ నాయకుల్లో కనబడుతున్నారా? పోనీ టి-టిడిపి నాయకుల్లో..?ఈ యూనిట్ కూడా చంద్రబాబు కిందే పని చేస్తోంది కదా. ఆయన వాళ్ల చేత యీ ముక్క అనిపించగలడా? అలాటివాడు తమకు ఏదో ఒరగబెడతాడని సీమాంధ్రులు ఎలా అనుకుంటారు?
'సీమాంధ్ర ప్రస్తుతం దిక్కుమాలిన పరిస్థితిలో వుంది. కేంద్రం నిధులు విదిలించకపోతే అడుక్కుతినాలి. అందువలన గడుసుతనంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో సఖ్యంగా వుండే టిడిపిని గెలిపిస్తారు' అనే వాదన ఒకటి ముందుకు తెస్తున్నారు. పాయింటు నెంబరు వన్ – కేంద్రంలో అధికారంలో వున్న పార్టీతో బాంధవ్యాలు బాగుంటే నిధులు వస్తాయన్న మాట ఎంతవరకు నమ్మాలి? పదేళ్లగా అక్కడా, యిక్కడా కాంగ్రెస్సే! ఏం బావుకున్నాం? కొత్త రైల్వే లైన్లు లేవు, వైజాగ్ రైల్వే డివిజన్ కూడా దక్కించుకోలేకపోయాం. ఏ శాఖ చూసుకున్నా, మనకు ఔట్ ఆఫ్ టర్న్ వచ్చినది ఏదైనా వుందా చెప్పండి. రావలసినవే రాలేదు. వరద సహాయనిధి, కరువు సహాయనిధి.. కూడా అందటం లేదు. మనకు దక్కినవేమిట్రా అంటే – విభజనకు ఒప్పుకోండి, బోల్డు హామీలు యిస్తాం అనే ప్రతిపాదన ఒక్కటే. 'కాంగ్రెసుకి అలాటి బుద్ధి లేదు కానీ బిజెపికి వుంది. ఈ సారి కేంద్రంలో బిజెపి వస్తుంది కాబట్టి యిస్తుంద'నుకుంటే వాళ్లకు బాగా ఓట్లేసి గెలిపించబోయే యుపి, బిహార్ లాటి వాటికి నిధులిస్తారు కానీ రెండు, మూడు సీట్లు (పోటీ చేసేదే 5 సీట్లు) యిచ్చిన సీమాంధ్ర రాష్ట్రానికి ఎందుకిస్తారు? యుపి, బిహార్ రాష్ట్రాలలో రాబోయే ఎసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా అక్కడ కేంద్ర నిధులు గుమ్మరించవచ్చు. మనకు యీ ఎన్నికలు జరిగాక ఇంకో అయిదేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేవు. అప్పటిలోగా మనతో ప్రయోజనం ఏమిటి? అందువలన తాము యిచ్చే నిధుల వలన ఒనగూడే లాభాన్ని ఓట్లగా మార్చుకునే పార్టీ యంత్రాంగం వాళ్లకు ఏర్పడేవరకూ ఊరిస్తూ కూర్చోబెడతారు. ఆ పార్టీనిర్మాణం అయిదేళ్లకో, పదేళ్లకో జరుగవచ్చు. అప్పటిదాకా హామీలే దక్కుతాయి.
'అబ్బే అలాక్కాదు, వాళ్లు చాలా ఉత్తములు. మన దీనావస్థ చూసి మనకే యిస్తారు' అనుకుని ఓటర్లు నమ్మిన పక్షంలో అప్పుడు డైరక్టుగా బిజెపికే ఓట్లేయాలి. మధ్యలో టిడిపికి ఎందుకు? 'బిజెపి వాళ్లకు సీమాంధ్రలో పార్టీ నిర్మాణం లేదు కాబట్టి, 5 సీట్ల కంటె ఎక్కువ పోటీ చేయడం లేదు కాబట్టి వారి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు యిచ్చేవారికి వేయాలనుకుంటారు. ఆ విధంగా టిడిపి లాభపడుతుంది.' అని వాదించబోతే మరి వైకాపాకు కూడా సమానమైన ఛాన్సు వుంది కదా! కేంద్రంలో ఎవరున్నా వాళ్లకు మద్దతు యిచ్చి రాష్ట్రాన్ని వృద్ధి చేస్తానని జగన్ కూడా అంటున్నారు. ఈ లాజిక్‌తో ఓటర్లు వైకాపాకు కూడా వేయవచ్చు కదా! అయినా మద్దతుదారులు ఎంతకాలం బిజెపితో వుంటారో ఎవరికి ఎరుక? 2002లో గోధ్రా అల్లర్ల తర్వాత టిడిపి కేంద్ర కాబినెట్ నుండి తన మంత్రులను ఉపసంహరించింది. రేపుమర్నాడు మరో మతకలహం జరిగితే అప్పుడూ విత్‌డ్రా చేస్తే..? ఏదో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ మద్దతుతో, కేంద్ర బలగాలు గుడ్లప్పగించి చూస్తూ వుండగా మెజారిటీ మతస్తులు ముస్లిములను హింసించారని ఆరోపిస్తూ టిడిపియో, క్రైస్తవులను హింసించారని వైకాపాయో మద్దతు ఉపసంహరిస్తే.. సీమాంధ్రకు నిధులు ఆగిపోతాయా? అలా అయితే మధ్యలో సత్రకాయ పార్టీలకు ఓట్లేసి వీళ్ల ద్వారా బిజెపిని మెప్పించాలని చూడడం దేనికి? ఏకంగా బిజెపికే ఓటేసేయాలి…. కానీ వేస్తారని మీడియా గట్టిగా చెప్పగలదా? చెప్పలేదు. చెప్పదు. వాస్తవం మాట్లాడుకోవాలంటే – సీమాంధ్రలో టిడిపి బలాన్ని యింతకింత చేసి చూపడానికే మీడియా చూస్తోంది. దాని కోసం ఏవేవో కారణాలు వెతుకుతోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)