దర్శకశిఖరం, దర్శకులకే దర్శకుడు, అనేకమంది తారలను తయారుచేసిన బ్రహ్మ బాలచందర్ (కె.బి) వెళ్లిపోయారు. తెలుగు మీడియా ఘననివాళి అర్పించింది. ఆయన 101 సినిమాలకు పనిచేస్తే వాటిలో 80 తమిళంలోనే. తక్కినవాటిలో కన్నడ, మలయాళ, హిందీ పోగా తెలుగువి కొన్నే వున్నాయి. అయినా ఆయన పక్కా తెలుగు దర్శకుడే అన్నంత యిదిగా తెలుగు మీడియా గౌరవించింది. 1965 నుండి 15, 20 ఏళ్ల పాటు బాలచందర్ సినిమా జగత్తును వూపేశారు. గత పాతికేళ్లగా సినిమాలపై ఆయన ప్రభావం క్షీణించిందనే చెప్పాలి. మన టీవీలు, పేపర్లు కూడా ఎంతసేపూ మరో చరిత్ర, ఆకలిరాజ్యం, అంతులేని కథ, వంటి 1980ల నాటి సినిమాలనే ఎక్కువగా ప్రస్తావించాయి. 50 ఏళ్ల కె.బి. కెరియర్‌లో మలి సగభాగంలో ఆయన నిర్మాతగా ఎక్కువ రాణించారు, టీవీ రంగంలో వెలిగారు. ఒకలా చెప్పాలంటే ఆయన నాటకాల్లోంచి వచ్చారు, మధ్యలో సినిమాల్లో తన ముద్ర వేసి మళ్లీ నాటకరంగం లాటిదే అయిన టీవీకి వెళ్లిపోయారు.
కెబి సినిమాలను తెలుగువాళ్లు ఆదరించడం మానేశారని అంటే బాధగా వుంటుందేమో కానీ నిజం అదే. ''రుద్రవీణ'' (1988)ని యీనాడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు కానీ ఆనాడు విజయవంతం చేయలేదు. చేసి వుంటే చిరంజీవి ఆయనతో మరో సినిమా నిర్మించి వుండేవారు. ''47 రోజులు'' (1981) చాలా మంచి సినిమా కానీ హీరో విలనిజాన్ని ప్రేక్షకులు భరించలేకపోయారు. మరో పారలల్ హీరో వున్నా సరిపోయేది. శరత్‌బాబును అలా వాడుకోలేదు. 1981 నాటివే అయిన ''ఆడాళ్లూ మీకు జోహార్లు'', ''తొలికోడి కూసింది'', 1983 నాటి ''కోకిలమ్మ'' కూడా బాగా ఆడలేదు. ''అందమైన అనుభవం''(1979)లో పాటలు ఎంత బాగున్నా, కమలహాసన్, రజనీకాంత్ యిద్దరూ వున్నా, చివర్లో జయప్రద చచ్చిపోవడం మనవాళ్లు హరాయించుకోలేక పోయారు. హిందీవాళ్లు మన కంటె అన్యాయం. ఆయన సినిమాల్లో ''మరో చరిత్ర'' రీమేక్ అయిన ''ఏక్ దూజే కే లియే''(1981) తప్ప మరి దేన్నీ ఆడించలేదు. ''తూర్పు-పడమర'' (తమిళంలో ''అపూర్వ రాగంగళ్'')ను హిందీలో ''ఏక్ నయీ పహేలీ'' (1984) గా రీమేక్ చేసిన తెలుగువాడు పింజల సుబ్బారావు ఘోరంగా నష్టపోయారు.
ఎందుకిలా అంటే బాలచందర్ సినిమాల్లోని హెవీ మెలోడ్రామా తమిళులకు నప్పినట్లుగా వేరెవ్వరికీ నప్పలేదు. ఆయన తమిళ మధ్యతరగతి వాళ్ల మనస్తత్వాలను కాచి వడపోసి, వాళ్లకు తగినట్లు, వాళ్లలో ఆలోచనలు రేకెత్తేట్లు సినిమాలు తీశాడు. వాటిని తెలుగువాళ్లు ఓ మేరకు ఆదరించారు. మరీ ఎక్కువైతే తిరస్కరించారు. ''గుప్పెడు మనసు''(1979)లో ఒక యింటాయన తన కూతురు వయసున్న అమ్మాయితో అనుకోకుండా శృంగారంలో పాల్గొంటాడు. అది యింట్లో అందరికీ తెలిసిపోతుంది. దాన్ని అతని భార్య ఎలా డీల్ చేస్తుంది అన్నది కథాంశం. ఈ పజిల్ తెలుగువాళ్లను ఆకర్షించినట్లుగా తమిళులను ఆకర్షించలేదు. దాని తమిళవెర్షన్ ''నూల్ వెలి'' (దారపు కంచె) ఫెయిలయింది. కథాంశం గొప్పగా వుంది కదా ముగింపు ఎలా వుంటుందోని చూడబోతే దానిలో ఆ చిన్న పిల్ల ఆత్మహత్య చేసేసుకుంటుంది. ''సింధుభైరవి'' (1985) హీరో – వివాహేతర సంబంధంలో చిక్కుకున్న సంగీత విద్వాంసుడు. క్లయిమాక్సులో భార్య, ప్రియురాలు ఒకర్ని మించి మరొకరు త్యాగాలు చేసేస్తూ వుంటే అతను డమ్మీగా దిక్కులు చూస్తూంటాడు. ఎక్‌స్ట్రా మారిటల్ రిలేషన్ వంటి పెద్ద సమస్యను ఎత్తుకుని ఏం చేయాలో తోచక హీరోని సడన్‌గా తాగుబోతుని చేసి, అతని పతనాన్ని భీకరమైన మెలోడ్రామాతో చూపించి చివరకు ఎక్కడో తేల్చారు. 1977 నాటి ''అవర్‌గళ్'' (తెలుగులో ''ఇది కథకాదు (1979) లో హీరోయిన్ ఒకతన్ని ప్రేమిస్తుంది, విధిలేక మరొకణ్ని పెళ్లాడుతుంది. వాడి శాడిజం భరించలేక విడిపోతుంది. ఆమెను, ఆమె బిడ్డను పరోపకారంతో ఆదుకుని పెళ్లి చేసుకుందామని యింకో అతను సిద్ధపడతాడు. శాడిస్టు మొగుడు వచ్చి చెడగొడతాడు. చివరకు ఆమె ఎవర్నీ చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతుంది. రైలెక్కి ఎక్కడికో వెళ్లడంతో సినిమా ముగుస్తుంది. చివరకు ఆమెకు తోడుగా మిగిలినదెవర్రా అంటే – అత్తగారు! ఆమె సమస్యకు పరిష్కారం చూపనే లేదు.
బేతాళ కథల్లో ఆఖరి కథ ఆధారంగా అల్లిన ''తూర్పు-పడమర''లో తండ్రి-కొడుకుల జంట కూతురు-తల్లి జంటను ప్రేమించి పెళ్లి చేసుకోబోతారు. క్లయిమాక్స్‌లో పెళ్లిళ్లన్నీ ఆగిపోతాయి. ఇలా ఒకటి రెండు సినిమాలైతే ఫర్వాలేదు, అన్నిటిల్లోనూ అదే ధోరణి కనబడడం మనవాళ్లకు నచ్చినట్లు లేదు. ''పున్నగై మన్నన్'' (1986-తెలుగులో ''డాన్స్ మాస్టర్'' పేరుతో డబ్ చేశారు) లో ప్రేమికుల జంట కొండ మీద నుంచి దుమికి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అమ్మాయి చచ్చిపోతుంది, అబ్బాయి చెట్లకొమ్మలపై వుండిపోయి బతికిపోతాడు. గొప్ప ఓపెనింగ్. ఏమవుతుందా అని చూస్తాం, అతను మళ్లీ ప్రేమలో పడతాడు. రేదర్ అతని హితైషులు అతని క్షేమం కోరి పడేస్తారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతే విలన్లు బాంబు పెట్టడం చేత ఆ అమ్మాయీ చచ్చిపోతుంది. హతోస్మి! మనవాళ్లు సారీ బాస్ అన్నారు. అంతెందుకు ''మన్మథలీలై'' అనే ఎడల్ట్ కామెడీ సినిమా తీసి, దానిలో పెళ్లి చేసుకోమని మంగళసూత్రంతో వెంటపడే అమ్మాయి వున్న ఒక విషాదకరమైన ఎపిసోడ్ పెట్టారు బాలచందర్ (అక్కడ యేసుదాస్ పాట వుంటుంది). సినిమా అంతా నవ్వు తెప్పిస్తుంది కానీ యీ ఉదంతం బాధ పెడుతుంది. ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేసిన విజయ బాపినీడు ఆ ఎపిసోడంతా ఎత్తేశారు – యేసుదాసు పాటతో సహా! డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో బ్రహ్మాండంగా ఆడింది. అవి కమలహాసన్ తొలిరోజులు. దానితో అతను తమిళంలో కుర్రాడిగా వేసిన చెత్త సినిమాలన్నీ ఆ లీల, యీ లీల అంటూ డబ్ అయి వచ్చిపడ్డాయి.
నిజానికి బాలచందర్ కామెడీ చాలా బాగుంటుంది. తెలుగులో ''భలేకోడళ్లు'' (1968-తమిళంలో ''భామావిజయం'' హిందీలో ''తీన్ బహూరాణియాఁ'') ఆయన తొలి సినిమా. సూపర్ హిట్. అంతకుముందు ఏడాదే నాగేష్ ద్విపాత్రాభినయంతో ''అనుభవి రాజా అనుభవి'' అనే పూర్తి కామెడీని తెలుగులో ''అనుభవించు రాజా అనుభవించు'' పేరుతో డబ్ చేశారు. ఇక్కడా బాగా ఆడింది. దాన్ని ''సత్తెకాలపు సత్తెయ్య'', 'సంబరాల రాంబాబు'' హిందీ వెర్షన్‌లలో నటించిన మెహమూద్ చాలా ఏళ్ల తర్వాత ''దో ఫూల్'' పేరుతో హిందీలో రీమేక్ చేసి తమిళ సినిమా పాట పల్లవి ''ముత్తుక్కొడిక్కు వారిగళా''ని హిందీలో కూడా వాడుకున్నాడు. ''పూవా తలైయా?'' (1969) నాటి తెలుగు రీమేక్ ''బొమ్మా? బొరుసా?'' (1971) కూడా ఔట్ అండ్ ఔట్ కామెడీ. దీనిలో చంద్రమోహన్, వెన్నిరాడై నిర్మల ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ యింకు చల్లేసుకుంటారు. ఇలాటి 'అరవ' హాస్యం బాలచందర్ సినిమాల్లో అక్కడక్కడ భరించాలి మరి. అమోల్ పాలేకర్ వేసిన ''గోల్‌మాల్'' సినిమాను ఆయన తమిళంలో ''తిల్లు-ముల్లు''గా రజనీకాంత్‌తో తీశాడు. అది తెలుగులో ''మీసం కోసం'' అనే పేరుతో రీమేక్‌గానో, డబ్బింగ్ గానో వస్తుందన్నారు కానీ రాలేదు. తన హాస్యం తెలుగువాళ్లకు నప్పదని దడిశారో ఏమో. అదే థీమ్‌తో యీ మధ్య ''మసాలా'' సినిమా వస్తే మనవాళ్లు ఆదరించలేదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)