ఇక్కడితో కింగ్స్ రెండో అధ్యాయం పూర్తయింది. దీని తర్వాత క్రానికల్స్ (రాజుల దినచర్య) పేరుతో రెండు అధ్యాయాలుంటాయి. వాటిలో కథేమీ వుండదు. పాత విషయాలనే పునశ్చరణ చేసి, వంశవృక్షాలు మళ్లీ వల్లె వేస్తారు. తర్వాత దేవాలయాలు ఎలా కట్టారు అని వివరాలు యిస్తారు. మనకు కావలసినది కథ కాబట్టి వాటిని దాటవేసి తర్వాతి అధ్యాయమైన 'ఎజ్రా'కు వెళ్లిపోతున్నాను. ఇదీ, దీని తర్వాతి అధ్యాయమైన నెహెమ్యా అధ్యాయాలు బాబిలోనియా నుంచి యూదులు మళ్లీ వచ్చి జెరూసలెంలో గుడి కట్టుకోవడం గురించి చెప్తాయి.
క్రీ.పూ. 587లో బాబిలోనియా రాజ్య పాలకులు యూదు మండలాన్ని ఓడించి అక్కడివారందరినీ బానిసలుగా తీసుకునిపోయారు. అయితే కొన్నాళ్లకు పర్షియా రాజు సైరస్ (Cyrus) వారిని ఓడించడం చేత వీరంతా అతని పాలనలోకి వచ్చారు. క్రీ.పూ. 538లో దేవుడు సైరస్ కలలోకి వచ్చి తన ప్రజలను విడుదల చేసి పంపాలని, వారు జెరూసలెంలో దేవళం కట్టాలని ఆదేశించాడు. రాజు మర్నాడు యూదు ప్రజలను పిలిచి దేవుని ఆదేశాన్ని వినిపించి 'నెబుచెడ్నజారు మీ నుండి తీసుకుని వచ్చిన 5400 వెండి, బంగారు పాత్రలను వెనక్కి యిచ్చేస్తున్నాను. మీరంతా జెరూసలెం వెళ్లి దేవుడికి గుడి కట్టండి' అని పంపించివేశాడు. అప్పుడు యూదులలో కొన్ని గోత్రాల వారు తరలి వెళ్లారు. వీరంతా జెరూసలెంకు వెళ్లి విరాళాలు పోగు చేస్తే 61 వేల బంగారు నాణాలు, 5 వేల వెండి నాణాలు పోగుపడ్డాయి. పూర్వం గుడి వున్న చోటనే మళ్లీ పని ప్రారంభించారు. కానీ పని ముందుకు సాగలేదు. ఎందుకంటే స్థానికులకు వీళ్ల ప్రయత్నాలు భయం కొల్పాయి. వారు పర్షియా రాజోద్యోగులకు లంచాలిచ్చి వీరి ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించారు. సైరస్ పాలన అంతరించిన కొన్నాళ్లకు కొన్ని జాతుల వారు రాజును ఉద్దేశించి లేఖ రాయడమే కాక, మండలాధికారి (గవర్నరు) చేత కూడా రాయించారు. దాని సారాంశమేమిటంటే – 'జెరూసలెం మొదటినుంచి తిరుగుబాటు చేయడానికి అలవాటు పడిన దుష్టపట్టణం. ఇప్పుడు వాళ్లు గుడి పేరుతో ప్రాకారాలతో, బురుజులతో నగరాన్ని ఒక కోటగా తయారు చేసుకుంటున్నారు. అది పూర్తయిందంటే వాళ్లు పన్నులు కట్టరు. వసూలు చేసుకోవడానికి మీ ఉద్యోగులు దండెత్తి వచ్చినా వాళ్లు సురక్షితంగా ఆ కోటలో వుంటారు. మీ పట్ల విశ్వాసంతో దీన్ని మీ దృష్టికి తెస్తున్నాం.' అది చదివిన రాజు నగర నిర్మాణాన్ని వెంటనే ఆపించేశాడు. తను ఆజ్ఞ యిచ్చేవరకు మళ్లీ మొదలుపెట్టడానికి వీల్లేదన్నాడు. ఆ విధంగా పని ఆగిపోయింది.
పర్షియాకు డారియస్ (Darius I) రాజుగా వచ్చిన తర్వాత రెండో ఏడాది కొందరు ప్రవక్తలు యూదు ప్రజల వద్దకు వచ్చి గుడి పని మళ్లీ ప్రారంభించమని ప్రోత్సహించారు. వాళ్లు మొదలుపెట్టగానే మండలాధికారి వెళ్లి ''ఎవరి ఆజ్ఞతో మీరీ పని చేస్తున్నారు?'' అని అడిగాడు. 'మాకు సైరస్ రాజు గతంలో అనుజ్ఞ యిచ్చాడు' అని వాళ్లు చెప్పారు. విషయాన్ని మండలాధికారి లేఖాపూర్వకంగా రాజుకి తెలియపరచాడు. అప్పుడతను 18 ఏళ్ల క్రితం నాటి దస్తావేజులు తనిఖీ చేయించి సైరస్ యిచ్చిన అనుమతిని ధ్రువీకరించుకుని మండలాధికారి లేఖ రాస్తూ ''గుడి నిర్మాణానికి మీరంతా సహకరించండి. దాని కయ్యే ఖర్చు రాజకోశాగారం నుండి చెల్లించండి.'' ఆదేశాలు యిచ్చాడు. రాజు సహకారంతో క్రీ.పూ. 515 నాటికి గుడి నిర్మాణం పూర్తయింది. ఈ లోపున మరి కొంతమంది యూదు జాతీయులు జెరూసలెంకు తరలి వెళ్లారు. గుడి నిర్మాణం పూర్తయిన పై ఏడాది యింకా కొంతమంది తరలివెళ్లినపుడు వారికి ఎజ్రా (Ezra) అనే రచయిత నేతృత్వం వహించాడు. అతను మోజెస్ ఏర్పరచిన నియమాలను బాగా అధ్యయనం చేసి యూదు జాతి అభివృద్ధికి ఆ నియమపాలన అత్యవసరం అని ప్రగాఢంగా నమ్మాడు. యూదు మండలానికి వచ్చి వీరికి యిన్ని కష్టాలు ఎందుకు వచ్చాయని తీవ్రంగా పరిశోధించి వారు యితర జాతీయులతో కలవడమే అనర్థకారణం అని తేల్చాడు.
అందర్నీ రప్పించి ''యూదు జాతీయులు ఎక్కడకు వెళ్లినా శాంతిగా జీవించే కోరికతో స్థానికులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని, వాళ్ల యింటి ఆడపడచులను భార్యలుగా చేసుకుంటున్నారు. వారి ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఆ స్త్రీలు తమ పాత మతాచారాలను కొనసాగిస్తూ యూదు గృహాలను అపవిత్రం చేసి, దేవుడికి కోపం కలిగిస్తున్నారు. దేవుడి ఆగ్రహానికి గురి కావడం చేతనే మనం స్వాతంత్య్రం కోల్పోయి ఇతర జాతులకు బానిసలవుతున్నాం.'' అని ఉపన్యసించాడు. ''అయితే ఏం చేయమంటారు?'' అని అడిగారందరూ. ''మీరు యితర జాతికి చెందిన మీ భార్యలను, వారి ద్వారా కలిగిన పిల్లలను వదిలేయండి. ఇకపై మీ ఆడపిల్లలను యితర జాతీయుల యిళ్లకు కోడళ్లుగా పంపకండి, మీ మగపిల్లలకై వాళ్ల యింటి నుంచి కోడళ్లను తెచ్చుకోకండి. లేకపోతే దేవుడు శిక్షిస్తాడు.'' అన్నాడు ఎజ్రా. ''ఇలా చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేయాలి. చేయనివాళ్లని యితరులు సంఘంలోంచి బహిష్కరించాలి.'' అని ప్రకటించాడు. ఆ తర్వాత తెగల వారీగా కొందరు పెద్దలను నియమించి, ప్రతి కుటుంబంలో విదేశీ భార్యల, వారి ద్వారా కలిగిన పిల్లల ఏరివేత నిర్వహించాడు. ఇక్కడితో ఎజ్రా అధ్యాయం ముగిసింది.
దీని తర్వాత వున్న నెహెమ్యా (Nehemiah) అధ్యాయం స్వగతంలో నడుస్తుంది. అతను క్రీ.పూ. 464 నుండి 424 వరకు పర్షియాను పాలించిన రాజు ఆర్టాజెరెక్సెస్ (Artaxerexes) వద్ద మద్యపాత్రలు అందించే వుద్యోగంలో వుండేవాడు. జెరూసలెం నగరనిర్మాణం సజావుగా సాగటం లేదని, స్థానికులు దారుద్వారాలు కాల్చి బుగ్గిచేస్తున్నారని, గోడలు కూల్చేస్తున్నారని విని రాజుకి నివేదించాడు. అది విని రాజు జెరూసలెం నగర పునరుద్ధరణ పని పర్యవేక్షించమని చెప్పి పంపిస్తూ అధికారులకు 'ఇతనికి సర్వసహాయం చేయండి, నా అధీనంలో వున్న అరణ్యాల నుంచి ద్వారాలకు, యితని యింటికి కావలసిన కలప యిప్పించండి' అని లేఖ రాసి యిచ్చాడు. అతను క్రీ.పూ. 444లో వచ్చి అక్కడ ఎజ్రా ఏయే సంస్కరణలు సూచించాడో, వాటిని తను ఎలా అమలు చేశాడో గ్రంథస్తం చేశాడు. రాజుగారు అనుమతి యిచ్చి, ప్రోత్సహించినా పనులు సజావుగా సాగలేదు. స్థానికులు అడ్డుపడుతూ వచ్చారు. దాంతో యూదుల్లో సగం మంది గోడలు కట్టగా, మిగతా సగం మంది ఆయుధాలు ధరించి కట్టినదాన్ని రక్షిస్తూండేవారు. వీరిలోనే కొంతమంది అడ్డుపడేవారితో మంతనాలు సాగించేవారు. శత్రువులు నెహెమ్యాను చర్చలకంటూ పిలిచి హతమారుద్దామని చూసేవారు. కానీ యితను దేనికీ లొంగకుండా అక్కడే పన్నెండేళ్లు వుండి ప్రజలను మండలాధికారి హోదాలో పాలించాడు. గతంలో మండలాధికారి ఖర్చుల నిమిత్తం రోజుకి 40 వెండి నాణాల పన్ను తీసుకునేవారు. ఇతను అవేమీ వద్దంటూ అతి సాధారణంగా జీవించాడు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అంతేకాదు, యూదుల్లో కొందరు ధనికులు యూదు పేదలకు అప్పిచ్చి ఆస్తులు తాకట్టు పెట్టించుకుంటే, యితను మధ్యవర్తిత్వం చేసి వాళ్ల ఆస్తులు విడిపించాడు. జెరూసలెంలో జనాభా తక్కువ వుండటం చేత ప్రతి పది కుటుంబాలలో ఒక కుటుంబం అక్కడ వుండేట్లు అందరి చేత ఒప్పందం చేయించాడు. ఎజ్రా పెట్టిన నియమాలను ఉల్లంఘించి అన్యజాతి స్త్రీలను పెళ్లాడినవారిని వెళ్లగొట్టించేవాడు. ఈ వివరాలతో నెహెమ్యా అధ్యాయం పూర్తయింది. దీని తర్వాతి అధ్యాయంగా నేను రిఫర్ చేస్తున్న ''రీడర్స్ డైజస్టు'' వెర్షన్, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి 'గుడ్ న్యూస్ బైబిల్''లలో ''ఎస్తేరు'' వచ్చింది కానీ నేను సంప్రదిస్తున్న మూడో వెర్షన్ – క్యాతలిక్ అనువాదంలో మాత్రం ''తోబీతు'', ''యూదితు'' అనే రెండు అధ్యాయాలున్నాయి.
తోబీతు అధ్యాయం ఒక భక్తుడి కథ. చిన్నపిల్లవాడిగా వుండగానే జెరూసలెం విడిచి అస్సీరియాకు ప్రవాసం వెళ్లిన తోబీతు అనే అతను నీనెవె నగరంలో వుంటాడు. తక్కిన యూదులు స్థానికులు తినే తిండి తింటూ, వారి అలవాట్లు చేసుకున్నా తోబీతు మాత్రం యూదు ధర్మాన్ని అస్సలు దాటడు. తన ఆస్తినంతా దానధర్మాలకు వెచ్చించడమే కాకుండా, రాజు యూదులపై కక్షతో సంహరించినపుడు వారికి అంత్యక్రియలు జరిపేవాడు. ఇది దేవుణ్ని మెప్పించింది కానీ రాజుకి కోపం తెప్పించింది. అతన్ని పట్టి చంపమన్నాడు. కబురు తెలిసి పారిపోతే ఆస్తి స్వాధీనం చేసుకున్నాడు. కొన్నాళ్లకు రాజుని చంపి కొడుకులు రాజులయ్యారు. తోబీతు అన్న కొడుకు కొత్త రాజుల కొలువులో పనిచేస్తూ పినతండ్రి ఆస్తి వెనక్కి యిప్పించాడు. తోబీతు భార్య అన్నా, కొడుకు తోబియా తిరిగి వచ్చారు. అందరూ కలిసి ఆనందంగా భోజనం చేసే వేళ దేవుడు పరీక్షలు పెట్టాడు. తమతో బాటు భోజనం చేసేందుకు పేద యూదుడెవరైనా దొరుకుతాడా అని చూడబోయిన తోబియాకు యూదుడి శవం ఒకటి కనబడింది. వచ్చి తండ్రికి చెప్పగానే అతను భోజనం ముట్టుకోకుండా వెళ్లి శవాన్ని తీసుకుని వచ్చి రహస్యంగా పాతిపెట్టాడు. గతంలో యిలాటి పనులే చేసి రాజాగ్రహానికి గురైన సంగతి గుర్తు లేదా అని యిరుగుపొరుగు వుడికించినా పట్టించుకోలేదు. ఆ రాత్రి యింటిబయట, గోడపక్కన పడుక్కుని నిద్రపోతూ వుంటే గోడమీద పిచ్చుకలు యితని కంట్లో రెట్ట వేశాయి. కళ్లల్లో తెల్లటి పొరలు ఏర్పడి అతను గుడ్డివాడయ్యాడు. ఆస్తి కూడా పోవడంతో భార్య మగ్గం మీద నేత పని చేయడానికి కూలీకి వెళ్లేది. అలా నాలుగేళ్లు గడిచాయి. అయినా అతను తన పట్ల తన విశ్వాసం కోల్పోకపోవడం చూసి దేవుడు తృప్తి పడి, అతనికి మేలు చేద్దామనుకుని తన వద్ద వుండే ఏడుగురు దేవదూతల్లో ఒకడైన రఫాయేలును పంపాడు.
దేవుడి అనుగ్రహం వలన తోబీతుకు హఠాత్తుగా తను యిరవై ఏళ్ల క్రితం రాగీసు పట్టణంలో గబాయేలు అనే బంధువు యింట్లో దాచి వుంచిన పది సంచుల వెండి నాణాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు వాళ్లు ఒక పత్రంపై ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టి, దాన్ని చింపి రెండు ముక్కలు చేసి చెరొకరి దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడా ముక్క చూపిస్తే అతను దాచిన సరుకు యిచ్చేస్తాడు. కానీ యిప్పుడు తను గుడ్డివాడై పోయాడు. అందువలన కొడుకు తోబియాను పిలిచి యీ పత్రం ముక్క చూపించి తీసుకుని రా అన్నాడు. 'నాకు ఆ వూరికి దారి తెలియదు కదా' అన్నాడు తోబియా. ''దారి తెలిసినవారి నెవరినైనా సహాయకుడిగా తెచ్చుకో. వెండి నాణాలు తెచ్చుకునేటప్పుడు రక్షణగా కూడా వుంటాడు. అతనికి రోజుబత్తెం యిస్తానని చెప్పు.'' అని చెప్పాడు. బయటకు వెళ్లి వెతకబోతూ వుండగా రఫాయేలు తారసిల్లాడు. తనకు దారి తెలుసంటూ అతన్ని వెంటపెట్టుకుని బయలుదేరాడు. దారిలో టిగ్రిసు నది తగిలింది. తోబియా నదిలో దిగగానే ఒక చేప అతని పాదం పట్టుకోబోయింది. అప్పుడు రఫాయేలు ''దాన్ని పోనివ్వద్దు, గట్టిగా పట్టుకుని ఒడ్డుకు లాక్కుని రా.'' అన్నాడు. తర్వాత చేప పేగులు పారేసి, పిత్తాన్ని, కాలేయాన్ని, గుండెను తీసి అతని వద్ద పెట్టుకోమన్నాడు. తోబియా అతను చెప్పినట్లు చేశాడు.
ఇంకాస్త ప్రయాణించాక మాదియా దేశంలో ఎక్బటానా నగరం చేరారు. అక్కడ రగూవేలు అనే తోబీతు బంధువు యిల్లుంది. అతనికి సారా అనే అందమైన అమ్మాయి వుంది. కానీ ఆమెను ఒక భూతం పట్టి, ఆమెను పెళ్లి చేసుకున్న భర్తను శోభనం రాత్రే చంపేస్తోంది. ఇలా ఏడుగురు చనిపోయారు. పనివాళ్లతో సహా అందరూ సారాను వెక్కిరిస్తున్నారు. సారా దేవుడి వద్ద అతి దీనంగా మొత్తుకుంది. ఆమె సమస్య తీర్చే పని కూడా దేవుడు రఫాయేలుకి అప్పగించాడు. ఆమెను పెళ్లి చేసుకో అని రఫాయేలు సూచించగానే తోబియా 'శోభనం రాత్రి వచ్చి పడే పిశాచం మాటేమిటి?' అన్నాడు. 'గదిలోకి వెళ్లగానే నీ దగ్గరున్న చేప గుండె, కాలేయాన్ని మండుతున్న సాంబ్రాణిమీద వేయి. నీకే ఆపదా రాదు.' అన్నాడు రఫాయేలు. తోబియాను చూడగానే సారా తండ్రి తన కూతుర్ని యిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. తన ఆస్తిలో సగం యిస్తానన్నాడు. రఫాయేలు మాట కొట్టివేయలేక తోబియా సరేనన్నాడు. శోభనం రాత్రి అతను చెప్పినట్లే చేయడంతో భూతం ఈజిప్టు పై భాగానికి పారిపోయింది. అతను క్షేమంగా వుండడం చూసి సారా తల్లితండ్రులు సంతోషించి రెండు వారాల పాటు తమ యింట్లోనే వుండిపోమని ప్రాధేయపడ్డారు. తోబియా రఫాయేలును గబాయేలు వద్దకు వెళ్లి వెండి తీసుకురమ్మనమన్నాడు. అతను తెచ్చిన వెండి, మావగారు యిచ్చిన సగం ఆస్తి తీసుకుని భార్యతో సహా తన వూరికి చేరాడు.
ఇతను రావలసిన సమయం దాటి పోవడంతో అప్పటికే తోబీతు, భార్య చింతాగ్రస్తులై వున్నారు. ఇతను విషయమంతా చెప్పి వారిని ఆనందింపచేశాడు. రఫాయేలు సలహా మేరకు చేప పిత్తాన్ని తండ్రి కళ్లకు పూశాడు. తర్వాత కళ్లల్లో నుంచి కంటి కొనలతో మొదలుపెట్టి తెల్లని పొరలు పీకేశాడు. 62 ఏళ్ల వృద్ధుడికి నాలుగేళ్ల తర్వాత చూపు తిరిగి వచ్చింది. కొడుకుని, కోడల్ని చూసి సంతోషించాడు. తోడుగా వుండి సరైన మార్గదర్శనం చేసిన సహాయకుడికి తెచ్చిన డబ్బులో సగం యిచ్చేమన్నాడు. అప్పుడు అతను 'తను ఫలానా అని, దేవుడి ఆజ్ఞపై వచ్చానని చెప్పి, దేవుడి మహిమను పదిమందికి చెప్పండి అని ఆదేశించాడు. తోబీతు 112 ఏళ్ల వరకు బతికాడు. మరణసమయంలో కొడుకుని పిలిచి ''ఈ నగరానికి త్వరలోనే శిక్ష పడుతుందని ప్రవక్తలు చెప్పారు. నేను, మీ అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు యీ నగరం విడిచి మీ మావగారి వద్దకు వెళ్లిపో' అని హితవులు చెప్పి మరణించాడు. తోబియా తండ్రి చెప్పినట్లే నడుచుకున్నాడు. దీనితో తోబీతు అధ్యాయం పూర్తయింది. (సశేషం) (ఫోటో – ఎజ్రా నియమావళి చదవడం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)