కేంద్ర రైల్వే మంత్రిగా వున్న లలిత్ నారాయణ్ మిశ్రా అనే బిహారు నాయకుడు 1975 జనవరి 2 న బిహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో బాంబుదాడికి గురయ్యాడు. అతనితో పాటు అతని తమ్ముడు జగన్నాథ్ మిశ్రా కూడా. ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. పొట్ట, కాళ్ల మీద గాయాలైన లలిత్ మర్నాడు ఆపరేషన్ టేబుల్ మీదే గుండెపోటుతో 52 ఏళ్లు నిండకుండానే మరణించాడు. కాళ్లు మాత్రమే గాయపడిన జగన్నాథ్ బతికాడు, వెంటనే బిహార్ ముఖ్యమంత్రి అయ్యాడు. దరిమిలా అన్నగారి పేర యూనివర్శిటీలు, కాలేజీలు పెట్టాడు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మిశ్రా హత్యపై చాలా ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక మహాత్మా గాంధీ తర్వాత జరిగిన యీ రాజకీయ హత్య వెనుక అనేక కారణాలున్నాయన్నారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో జరుగుతున్న సంపూర్ణ క్రాంతి ఉద్యమం వలన బిహార్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి యిది నిదర్శనమని, సిఐఏ (అమెరికన్ గూఢచారి సంస్థ) సహాయంతో భారతదేశాన్ని అల్లకల్లోలం చేయడానికే ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయని చెప్పడానికి వేరే సాక్ష్యం అక్కరలేదని వాదించారు. మరో ఆరు నెలల తర్వాత అత్యవసర పరిస్థితి విధించడానికి దీన్ని ఒక కారణంగా వాడుకున్నారు.
ఫిరోజ్ గాంధీకి ఒకప్పటి స్నేహితుడిగా ఇందిర వద్దకు చేరిన మిశ్రా కాంగ్రెసులోని పాత నాయకుల (సిండికేట్ అనేవారు)తో పోరాడడానికి ఇందిర పక్షాన నిలిచాడు. 1969లో కాంగ్రెసు చీలిపోయాక గతంలో అతుల్య ఘోష్, ఎస్ కె పాటిల్‌ల తరహాలో పార్టీకి నిధులు సమకూర్చే బాధ్యత తలకెత్తుకున్నాడు. ఇందిర అతనికి డిఫెన్సు, ప్రొడక్షన్, ట్రేడ్ వంటి కల్పవృక్షాల శాఖలను కట్టబెట్టింది. ట్రేడ్ మంత్రిగా వుండగానే 'లైసెన్సు రాజ్' ప్రవేశపెట్టి పరిశ్రమ పెట్టడానికి లైసెన్సు కావాలంటే కాంగ్రెసు పార్టీకి నిధులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అక్కణ్నుంచి రైల్వే మంత్రిగా చేశారు. అతని అవినీతిపై చాలా చర్చలు జరిగాయి. కోసీ ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడ్డారని బిహార్ అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ మిశ్రాపై, అతని కుటుంబసభ్యులపై నింద మోపింది. ఫారిన్ ట్రేడ్ శాఖ మంత్రిగా వుండగా ఇంపోర్ట్ లైసెన్సుల స్కాండల్‌లో నిందితుడైన తుల్‌మోహన్ రామ్ లలిత్ మనిషే అని కూడా ఆరోపణ వుంది. అతనిపై పార్లమెంటులో అనేక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అతనిపై చర్య తీసుకోమని అనేకమంది కాంగ్రెసు సభ్యులు కోరినా ఇందిర చర్య తీసుకోలేదు. దానికి రెండు కారణాలున్నాయని చెప్తారు. ఒకటి 1971 రాయబరేలీలో ఎన్నిక సమయంలో లలిత్ ఇందిర తరఫున చాలా ఖర్చు పెట్టాడు. వాటికి రసీదులు, రుజువులు తన దగ్గరే పెట్టుకున్నాడు. అప్పటికే ఆ ఎన్నికపై రాజ్ నారాయణ్ కోర్టులో కేసు వేసి వున్నాడు. లలిత్‌తో చెడగొట్టుకుంటే అతను ఆ రసీదులు రాజ్ నారాయణ్‌కి యిస్తే కేసు పోతుంది. ఇక రెండో కారణం ఏమిటంటే లలిత్ సంజయ్ గాంధీ మారుతి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాడట. అందుకని ఇందిర సహిస్తూ వచ్చిందని, కానీ ఎక్కడో కాని లలిత్ హద్దు మీరాడనీ, కాలక్రమంలో చాలా భాగం నిధులు తనవద్దే అట్టే పెట్టేసుకున్నాడనీ, దానితో కోపగించిన ఇందిరే అతన్ని తన ప్రయివేటు సెక్రటరీ అయిన యశ్‌పాల్ కపూర్ ద్వారా చంపించి వేసిందనీ పుకార్లు వచ్చాయి.
1974లో దేశవ్యాప్తంగా జార్జి ఫెర్నాండెజ్ నాయకత్వంలో నడిచిన రైల్వే సమ్మెను రైల్వేమంత్రిగా ఇందిర ఆదేశాలపై కఠినంగా అణచివేసినందుకు తనపై రైల్వే ఉద్యోగులు కక్ష పెంచుకుని తనకు ప్రాణాపాయం పెరిగిందని మిశ్రా అనేకమంది దగ్గర అన్నాడు. అయినా అతని సెక్యూరిటీ పెంచలేదు. బాంబు దాడి జరిగాక అక్కడి డాక్టర్లు లలిత్‌కు పెద్దగా ప్రమాదం ఏమీ లేదన్నారు. చికిత్స కోసం సమస్తిపూర్ నుండి 50 కి.మీ. దూరంలో వున్న దర్భంగాకు కాకుండా 100 కి.మీ.ల దూరంలో పట్నా వద్ద వున్న దానాపూర్ వద్దకు రైల్వే కోచ్‌లో తీసుకెళ్లారు. ఆ ప్రయాణానికి రైల్వే వాళ్లు 8 గంటలు తీసుకున్నారు – లోపల సాక్షాత్తూ రైల్వే మంత్రే వున్నా! ఆసుపత్రిలో కూడా చికిత్స ఆలస్యంగా ప్రారంభమైంది. ఎవరో కావాలనే యిలా చేయించారని అందరూ నమ్మారు. విచారణ సవ్యంగా జరిగితే నిజానిజాలు బయటకు వచ్చేవేమో! కానీ కేసు అస్తవ్యస్తంగా నడిచింది. 22 మంది జజ్‌లు మారారు. 200 మంది సాక్షులను విచారించారు. చివరకు 2012లో 'కేసు మొదలుపెట్టి మూడున్నర దశాబ్దాలు అయింది కాబట్టి కేసు మూసేయాల'ని నిందితులు కోరడంతో సుప్రీం కోర్టు 'దినవారీ విచారణ నిర్వహించి కేసును ఒక కొలిక్కి తెండి' అని ఆదేశించడంతో యింకో రెండేళ్ల తర్వాత 2014 డిసెంబరు 8 న న్యూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు 6000 పేజీల తీర్పు వెలువరించింది. మిశ్రా హత్య కేసులో రంజన్ ద్వివేది(వయసు 66 సం||లు), సంతోషానంద అవధూత 75, సుదేవానంద అవధూత 79, గోపాల్‌జీ 73 అనే ఆనందమార్గీయులను దోషులుగా నిర్ణయించింది. యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఇద్దరికి రూ. 25 వేల జరిమానా, తక్కిన యిద్దరికి రూ.20 వేల జరిమానా. ఇప్పుడు వారంతా 66-79 ఏళ్ల వయసులో వున్నారు. ఇది జిల్లా జజ్ తీర్పు. దీని తర్వాత హైకోర్టు అంటారు, సుప్రీం కోర్టు అంటారు. అప్పటికి యీ నిందితులు మేం ముసలివాళ్లం దయ చూడండి అంటారు. కేసు 40 ఏళ్ల పాటు సాగదీయడంతో వచ్చే ముప్పు యిది.
ఇంతకాలం ఎందుకు పట్టింది అనే ప్రశ్న సహజంగా వస్తుంది. కేసు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంటుంది. లలిత్ చనిపోయాక పోస్టుమార్టమ్ నిర్వహించలేదు. హత్య జరగగానే జయప్రకాశ్ నారాయణ్ నడుపుతున్న ఉద్యమం కారణంగా బిహార్‌లో శాంతిభద్రతలు నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని, అదే లలిత్ ప్రాణం తీసిందని అతని శాఖ డిప్యూటీ మినిస్టర్ బూటా సింగ్ ప్రకటించాడు. వెంటనే ప్రతిపక్షాలు, మీడియా చీల్చి చెండాడాయి. దాంతో వెనక్కి తగ్గాడు. జనవరి 2 న దాడి జరిగితే బిహార్ పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. నాలుగు రోజులు తిరక్కుండా ఎవరూ కోరకుండా కేంద్రం ఆధిపత్యం లోని సిబిఐ కేసును తన చేతిలోకి తీసేసుకుంది. ఆనంద్ మార్గ్, ఆరెస్సెస్, కక్ష పెంచుకున్న రైల్వే ఉద్యోగులు కారణం అనే అనుమానంతో సిబిఐ విచారణ ప్రారంభమైంది. ఆనంద్ మార్గ్ అనే ధార్మిక, సామాజిక సంస్థను ప్రభాత్ రంజన్ సర్కార్ అనే అతను ఆనందమూర్తి అనే పేరుతో బిహార్‌లో 1955లో ప్రారంభించాడు. దీని అనుయాయులు కాషాయం ధరించేవారు. స్కూళ్లు అవీ తెరిచి సామాన్యులను ఆకర్షించేవారు. కమ్యూనిజం ప్రబలుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టి అక్కడి పేదలను ఆకట్టుకోవడంతో సిఐఏ నిధులతో యిది నడుస్తోందన్న అనుమానం బలపడింది. ఎందుకంటే వారికి నిధులు ఎక్కణ్నుంచో ధారాళంగా వస్తూండేవి. 1960ల కల్లా అది బాగా విస్తరించేసి యితర దేశాలకు కూడా వ్యాపించింది. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆనంద మార్గీయులు, కమ్యూనిస్టులు ముఖాముఖీ తలపడేవారు. ఆనంద మార్గీయులు పూజలో వామపంథా (మాంసం, మద్యం, మగువ వంటి పంచ మకారాలతో) అవలంబిస్తారని, చిన్నపిల్లలను బలి యిచ్చి కపాలాలను ధరిస్తారని నమ్మకం వుండేది. చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్నారన్న అనుమానంతో కలకత్తాలోని టాలీగంజ్‌లో 1982లో 16 మంది ఆనంద మార్గీయులను కొంతమంది పౌరులు పట్టపగలు సజీవదహనం చేశారంటే పరిస్థితి వూహించుకోండి. దానిపై ఓ పట్టాన విచారణ సాగలేదు. 2012లో జ్యుడిషియల్ కమిషన్ వేసినట్టున్నారు. కమ్యూనిస్టులపై నింద మోపడానికే కాంగ్రెసు వారు యిది చేశారని అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు ఆరోపించారు. ఏది ఏమైనా ఆనంద్ మార్గ్ 1970లలో కమ్యూనిస్టు వ్యతిరేకతతోనే పనిచేసిందన్నది నిర్వివాదాంశం. కమ్యూనిస్టులను అణచడానికి ఇందిర వారిని ఉపయోగించుకుందని పరిశీలకులు అంటారు. సంఘవ్యతిరేక కలాపాలు చేస్తున్నారన్న ఆరోపణపై ఆనందమూర్తి అరెస్టు అయ్యాడు.
విచారణ ప్రారంభించిన కొన్ని రోజులకే సిబిఐ ఆనంద్ మార్గ్‌ను అనుమానితుల లిస్టులోంచి తీసేసి అరుణ్ కుమార్ ఠాకూర్, ఆరుణ్ కుమార్ మిశ్రా అనే యిద్దరు వ్యక్తులను స్వాధీనంలోకి తీసుకుని వారిని తమ పద్ధతిలో విచారించి వారిచేత నేరాన్ని అంగీకరింపచేశారు. శివ్ నారాయణ్ శర్మ, 'బాస్' ఝా అనే యిద్దరితో కలిసి తామే కుట్ర చేసి చంపేశామని వాళ్లు చెప్పారని అన్నారు. 1979లో ''ఇండియా టుడే''కు యిచ్చిన యింటర్వ్యూలో అరుణ్ ఠాకూర్ తనను సిబిఐ 23 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిందని చెప్పుకున్నాడు. ఈ ఒప్పుకోలు కోర్టులో నిలవదని అనిపించి సిబిఐ ఆ 'బాస్' ఎవడో కనుక్కుందామని ప్రయత్నించింది కానీ వీళ్లిద్దరూ నోరు విప్పలేదు. అప్పుడు సిబిఐకు డైరక్టరుగా వున్న డి.సేన్ బిహార్ సిఐడి సహకారాన్ని కోరాడు. ఇది చాలా వింత. సాధారణంగా రాష్ట్ర పోలీసు నుండి సిబిఐకు కేసు వెళుతుంది తప్ప, సిబిఐ నుంచి యిటు రాదు. కానీ యీ కేసు వచ్చింది. నిందితులు సమస్తిపూరు జైల్లో వున్నారు. అక్కడి జైలరు రహమాన్ అరుణ్ మిశ్రాతో కబుర్లు చెపుతూ అతని విశ్వాసం చూరగొని ఆ 'బాస్' ఎవరో చెప్పమని అడిగాడు. అతని పేరు రామ్ బిలాస్ ఝా అని, తనకు అరుణ్ ఠాకూరుకి చెరో 20 వేలు యిస్తానని చెప్పి హత్య జరిగిన తర్వాత 400 చేతిలో పెట్టాడని తిట్టుకుంటూ చెప్పాడు అరుణ్ మిశ్రా. ఆ సంభాషణను టేప్ రికార్డులో రికార్డు చేసి రహమాన్ బిహార్ సిఐడికి అందచేశాడు. వాళ్లు దాన్ని కాపీ చేసి సిబిఐకు పంపించారు. టేపు ముట్టినట్లుగా సిబిఐ రసీదు కూడా యిచ్చింది.
సిబిఐ అక్కణ్నుంచి దూసుకుని వెళ్లిపోవాల్సింది కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఈ రామ్‌బిలాస్ ఝా యశ్‌పాల్ కపూర్‌కు సన్నిహితుడు, కాంగ్రెసు నాయకుడు. హత్యకు కొద్ది రోజుల ముందు యశ్‌పాల్ బిహార్ వచ్చి రామ్‌బిలాస్‌కు సహచరుడైన రఘునాథ్ పాండేను కలిశాడు. రామ్‌బిలాస్ పేరు వెల్లడిస్తే యశ్‌పాల్ కపూర్ పేరు, తద్వారా ఇందిర పేరు బయటకు వస్తాయని సిబిఐ డైరక్టరు సేన్ భయపడ్డాడు. టేపు పంపగానే బిహార్ సిఐడితో సంబంధం తెంపుకున్నాడు. దాన్ని ఎక్కడో పారేశాడు. మేజిస్ట్రేటు ముందు రామ్‌బిలాస్ పేరు చెప్పకూడదనే షరతుపై కాబోలు అరుణ్ మిశ్రా, అరుణ్ ఠాకూరు యిద్దరినీ విడిచి పెట్టేశాడు. వారి స్థానంలో ఎవరో ఒకర్ని యిరికించాలి కాబట్టి ఆనంద్ మార్గ్ అసలు దోషి అన్నాడు. ఆనందమూర్తి బెయిల్ కోసం అప్లయి చేస్తే చీఫ్ జస్టిస్ ఎ.ఎన్.రాయ్ యివ్వలేదు. ఆయనపై హత్యాప్రయత్నం జరిగింది. దానిలో నలుగురు ఆనందమార్గీయులు – సంతోషానంద, సుదేవానంద, రంజన్ ద్వివేది, విక్రమ్ అరెస్టయ్యారు. మళ్లీ కొత్తవాళ్లనేం వెతుకుతాం అనుకుని, పనిలో పనిగా వాళ్లమీదే మిశ్రా హత్యానేరం కూడా మోపేశాడు. విక్రమ్ ఎప్రూవర్‌గా మారి, గోపాల్‌జీ అతని స్థానంలో నిందితుడుగా చేరాడు. మేం లలిత్, ముఖ్యమంత్రి అబ్దుల్ గఫూర్ వంటి ప్రముఖులను చంపి, ఆనందమూర్తి అరెస్టుపై దేశం దృష్టి ఆకర్షించాలని పథకం వేశార అని విక్రమ్ చెప్పాడట.
దర్భంగాలోలో పబ్లిక్ వర్క్‌స్ డిపార్టుమెంటులో క్లర్కుగా పనిచేస్తూ 11 ఏళ్లగా సస్పెన్షన్‌లో వున్న మదన్ మోహన్ శ్రీవాస్తవ అనే అతను పోలీసు యిన్‌ఫార్మర్. 'నేను సంతోషానంద లలిత్, గఫూర్‌ల హత్య గురించి మాట్లాడుతూండగా విన్నాను. నిజానికి నేను విశ్వేశ్వరానంద అనే మారుపేరుతో ఆనంద్‌మార్గ్‌లో వుంటాను. ఆనందమూర్తి కేసులో ఎప్రూవర్‌గా మారిన మాధవానందను చంపడానికి నేను సిద్ధపడ్డాను. అందుకే మిశ్రా హంతకులు నాతో ఫ్రీగా మాట్లాడారు' అని అతను చెప్పినట్లు సిబిఐ పేర్కొంది. ఇలా చెప్పినందుకు సిబిఐ అతనికి ఉద్యోగం మళ్లీ యిప్పించింది. సమస్తిపూర్ కలక్టరేట్‌లో స్టెనోగా పనిచేసిన గిరిజానందన్ ప్రసాద్ 'నేను యీ హంతకులకు మా యింట్లో ఆశ్రయం యిచ్చాను' అని చెప్పాడంది సిబిఐ. (కాంగ్రెసు గద్దె దిగిపోయాక అతను తన స్టేటుమెంటు వెనక్కి తీసుకున్నాడు. సిబిఐ తనను చితక్కొట్టి ఆ స్టేటుమెంటు యిప్పించిందని చెప్పాడు) ఇలా సిబిఐ ఏదేదో చెప్తూ కేసు ఫైల్ చేయడం తాత్సారం చేశారు. ఇందిర అధికారంలో వున్నంతకాలం కేసు ఫైల్ కాలేదు.
1977 ఎన్నికలలో ఇందిర ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మే నెలలో లలిత్ భార్య కామేశ్వరీదేవి హోం మంత్రి చరణ్ సింగ్‌కు విచారణ విషయం గుర్తు చేసింది. తనకు ఆనందమార్గీలపై అనుమానం లేదంది. చరణ్ సింగ్ కనుక్కుంటే బిహారు సిఐడివాళ్లు తాము రికార్డు చేసిన టేపును ఆయనకు వినిపించారు. ఈ లైనులో ఎందుకు విచారణ జరపలేదని ఆయన సిబిఐను అడిగితే, వాళ్లు మాకు ఆ టేపు రాలేదని బుకాయించారు. 'మీకు ముట్టింది, మీ ఐజి హింగోరానీ సంతకంతో వున్న రసీదు యిదిగో' అని బిహార్ సిఐడి చూపించింది. సిబిఐ ఏదో గోల్‌మాల్ చేసిందని సందేహించిన చరణ్ సింగ్ యీ వ్యవహారంపై విచారణకు ఆదేశించాడు కానీ పొరపాటు ఎక్కడ జరిగిందంటే దాన్ని సిబిఐ అధికారికే అప్పగించాడు. ఆయన అంతా లక్షణంగా వుందని, యీ విషయంలో తదుపరి విచారణ అక్కరలేదని తన పై అధికారులకు సర్టిఫికెట్టు యిచ్చేశాడు. హోం శాఖలో స్టేట్ మంత్రిగా ధనిక్‌లాల్ మండల్‌కి యిదేమీ నచ్చలేదు. చరణ్ సింగ్ కాళ్లీడీస్తున్నాడని భావించి 1978 జులైలో ప్రధాని మొరార్జీకి ఉత్తరం రాసి, కేసు తిరగతోడమని కోరాడు. మొరార్జీ బిహార్ ముఖ్యమంత్రిగా వున్న కర్పూరీ ఠాకూర్‌కు ఆ బాధ్యత అప్పగించాడు. ఆయన విచారణ జరిపించి సిబిఐ ప్రవర్తన సవ్యంగా లేదని తేల్చి ఆ నివేదికను కేంద్రానికి పంపాడు. దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకోమని కేంద్రం సూచిస్తే ఖండేల్‌వాల్ అనే క్రిమినల్ లాయరును సలహా అడిగితే అతను పునర్విచారణ అక్కరలేదని చెప్పాడు. అప్పుడు కర్పూరీ ఠాకూర్ జస్టిస్ వి ఎమ్ తార్కుండే అనే ప్రజాహక్కుల ఉద్యమకారుడికి విచారణ అప్పగించాడు. తార్కుండే ఏం రాసి యిచ్చారో ప్రభుత్వం వెల్లడించలేదు. ఎందుకంటే 1979 నాటికే జనతా పార్టీలో లుకలుకలు ప్రారంభమై యీ కేసు వెనకబడింది. 1979 మేలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తార్కుండే నివేదిక ఆధారంగా కథనాలు వేసింది. ఇందిరా గాంధీ చెప్పడం బట్టే సిబిఐ విచారణ పక్కదారులు పట్టిందని తార్కుండే అభిప్రాయపడ్డారు. 1975లో ఇందిర గఫూర్‌ను ఢిల్లీకి రప్పించి అరుణ్ మిశ్రా స్టేటుమెంటు రికార్డు చేసిన జైలరు రహమాన్‌కు ప్రమోషన్ ఎందుకిచ్చారని అడిగిందని, యిది చాలా వింతగా వుందని తార్కుండే రాశారట.
జనతా ప్రభుత్వం కొనసాగినా విచారణ పూర్తయేదేమో. కానీ అది 1979 జులైలో కుప్పకూలింది. ఆ తర్వాత 1979 నవంబరు 1న సిబిఐ పట్నాలో చార్జిషీటు ఫైల్ చేసింది. 1980 కల్లా ఇందిరా గాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చేసింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా విచారణను ఢిల్లీలో నిర్వహించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. విచారణలో అడుగడుగునా లొసుగులు వున్నాయి కాబట్టి నిందితులు వాటిని అడుగడుగునా సవాలు చేస్తూ పోవడంతో కేసు నత్తనడక నడిచింది. అందువలననే యింత తాత్సారం. ఎప్రూవర్‌గా మారిన విక్రమ్ చెప్పిన విషయాలపై ఆధారపడి యిచ్చిన తాజా తీర్పు కూడా అంతిమం కాదు. మిశ్రా హత్యకు అసలు కారణం ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)