ఆంధ్రలో టిడిపి ఫిరాయింపులకు గేట్లు తెరిచింది. వైకాపా నుంచి ఫలానా వాళ్లు ఎప్పుడు వెళతారు, మొత్తం ఎంతమంది వెళతారు అనే వూహాగానాలు పత్రికలకు కాలక్షేపం. తెలంగాణలో టిడిపి నాయకుల విషయంలో యిలాగే జరిగింది. ఓ గంట తర్వాత పార్టీ ఫిరాయించబోతూ యీ పార్టీ ఆఫీసులో అధ్యక్షుడి పక్క కుర్చీలో కూర్చుని వెళ్లిన ప్రబుద్ధుడున్నాడు. వైకాపాలో మూడోవంతు చీల్చగల సత్తా మాకుంది అనే టిడిపి నాయకుల మాటల్ని మనం శంకించవలసిన పని లేదు. ఒకప్పటి మాట ఏమో కానీ గత ఐదారేళ్లుగా మన తెలుగు ఎమ్మెల్యేలు, ఎంపీలు హరియాణా వాళ్లను మించిపోతున్నారు. దశాబ్దాలుగా ఎవరి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారో ఆ పార్టీలోనే చేరిపోతున్నారు. నియోజకవర్గంలో పనులు జరగడానికి.. అనే ఒక్క కారణం చాలు. అధికార పార్టీ ఎమ్మెల్యే వున్న నియోజకవర్గంలో పనులు అవుతున్నాయా? అవుతూ వుంటే అక్కణ్నుంచి కూడా పింఛన్ల గురించి, నిలిచిపోయిన కార్యక్రమాల గురించి ప్రజల్నించి ఫిర్యాదులెందుకు వస్తున్నాయి? రైతుల, ఋణగ్రస్తుల ఆత్మహత్య లెందుకు జరుగుతున్నాయి? అని ఎవరూ అడగరు. పార్టీ మారిన ఆర్నెల్ల తర్వాత వచ్చి యిప్పటికి ఎన్ని పనులు అయ్యాయని అడగరు.
అయినా అదేమిటో కానీ ఫిరాయించేవారికి మళ్లీ ఎన్నికలలో నిలబడే ధైర్యం వుండటం లేదు. దొడ్డిదార్లు వెతుకుతున్నారు. తమ పేరంటు పార్టీలో మూడో వంతు మంది చీలి తమపై అనర్హత వేటు పడకూడదని, తాము మళ్లీ ప్రజల దగ్గరకి వెళ్లే అవసరం పడకూడదని దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. గతంలో అయితే మూడో వంతు మంది ఒక్కసారే ఫిరాయించాలని అనుకునేవారు. కొత్త తరం స్పీకర్లు వచ్చాక ఆ బెడద లేదు. ఐదేళ్ల కాలంలో ఎప్పుడు ఎంతమంది వచ్చినా, చివర్లో అందర్నీ కలిపి లెక్కకట్టే సౌలభ్యం వచ్చింది. అందువలన యివాళే వైకాపా నుండి మూడో వంతు వచ్చేస్తారని మనం అనుకోనక్కరలేదు. నెలకో యిద్దరు చొప్పున లాక్కుంటూ వస్తే ఏడాది పాటు పేపర్లకు కాలక్షేపం. తర్వాత ఎవరొస్తారో చెప్పుకో చూదాం అని టీవీ ఛానెళ్లు గేమ్ షోలు పెట్టుకోవచ్చు, కోడిపందాల రాయుళ్లు జూదాలాడవచ్చు. నెలకో శంకుస్థాపన అంటున్నారుగా బాబు. శంకుస్థాపన జరగ్గానే, స్వర్ణాంధ్ర సాధించే సత్తా బాబుకే వుందని మాకు నమ్మకం కుదిరింది, అందుకే చేరుతున్నాం అంటూ ఓ యిద్దరు ఎమ్మెల్యేలు అదే ఫంక్షన్‌లో చేరేట్లు ప్లాన్ చేస్తే భేషుగ్గా వుంటుంది. ఏడాది చివరకు టార్గెట్ పూర్తవుతుంది. ఉపయెన్నికలు పెట్టి రిస్కు తీసుకోనక్కరలేదు.
ప్లాను వరకూ బాగానే వుంది కానీ యిప్పుడీ ప్లానుకి అవసరం ఏముంది అనే ప్రశ్నే వస్తుంది. ఆ మాటకు వస్తే తెలంగాణలో మాత్రం తెరాసకు ఫిరాయింపుదార్ల అవసరం ఏముంది? తగినంత మెజారిటీ వుంది కదా. జాతీయ పార్టీలైన కాంగ్రెసును, బిజెపిలను తుడిచిపెట్టడం కుదరదు కాబట్టి ప్రాంతీయపార్టీలైన వైకాపా, టిడిపిలను నిర్మూలించేస్తే ప్రతిపక్షం బలహీనపడుతుందని, తన చేష్టలను ఎవరూ ఎదిరించలేరనీ కెసియార్ ఆలోచనట. బాబుకీ అదే ఆలోచన వుండవచ్చు కానీ ఆంధ్రలో వైకాపాను సాంతం తుడిచిపెట్టడం అయ్యే పని కాదని ఆయనకూ తెలుసు. మరి ఎందుకీ కసరత్తు? క్యాడర్‌లో నైతిక స్థయిర్యం పెంచడానికి అని కొందరు జవాబు చెపుతున్నారు. అబ్బే, గంటలో పడగొట్టగలనని జగన్ సవాలు విసిరాడు కాబట్టి తిక్కరేగి బాబు యిది మొదలుపెట్టారు అని మీడియాలో వచ్చింది. జగన్ సవాలు కంటె ముందుగానే చాలా నెలల క్రితమే టిడిపి ఫిరాయింపులకు తెర తీసిందన్న మాట ఎలా మర్చిపోగలం? తాజాగా జగన్ సవాలుకు ముందే వైకాపా నుండి 21 మంది మాలో చేరుతున్నారని టిడిపి నాయకులన్నట్లు పేపర్లో వచ్చింది. దానికి స్పందనగానే జగన్ ఛాలెంజ్ వచ్చింది. అయినా జగన్ ఛాలెంజ్‌ను ప్రజలే సీరియస్‌గా తీసుకోలేదు, బాబు తీసుకున్నారా?
జగన్ కుర్చీ ఎక్కనూ లేడు, ఎక్కినవాణ్ని దింపనూ లేడని కిరణ్ కుమార్ టైములోనే రుజువైంది. జగన్ వైపు ఫిరాయించిన వారిని కూడా కిరణ్ మేనేజ్ చేసి వెనక్కి రప్పించుకున్నాడు. కిరణ్ కంటె కాకలు తీరిన బాబు టైములో జగన్ నెగ్గగలడని ఎవరనుకుంటారు? పైగా స్పీకరు జగన్ మీద కత్తి కట్టివున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు సంయమనం కోల్పోయి జగన్ చేతిలోంచి స్వయంగా మైకు లాగేసుకున్నా నేను ఆశ్చర్యపోను. టిడిపి నుంచి ఎవరినైనా తన వైపుకి జగన్ లాక్కుని వచ్చినా వాళ్లందరినీ అనర్హులుగా ప్రకటించే హక్కు స్పీకరుది. అందువలన జగన్ పక్షాన వున్నవాళ్లందరూ ఎమ్మెల్యేలు కారు అని ఒక్క రూలింగు యిచ్చేసి, ఉన్నవాళ్లలో టిడిపికి మెజారిటీ వుంది అని తీర్మానించేయగల ఘనుడు స్పీకరు. స్పీకరును దింపేసి గవర్నరు అ అధికారాలన్నీ తనకు దఖలు పర్చుకోవచ్చు అని సుప్రీం కోర్టు అరుణాచల్ కేసులో తేలిస్తే అప్పుడు స్పీకరుకి మొగుడు సూపరు స్పీకరుగా గవర్నరు అవతరిస్తాడు. కానీ గవర్నరు ఆ అవతారం ఎత్తాలో లేదో తేల్చేది కేంద్రంలోని మోదీ. ఈ పరిస్థితుల్లో గంటలో కూలుస్తా అనే మాటల్ని 'కంటిచూపుతో చంపేస్తా' లాటి డైలాగుగానే తీసుకోవాలి తప్ప 'ఏదీ కంటిచూపుతో, తొడచరుపుతో చంపు చూద్దాం' అని అడక్కూదడు. లోకపు తీరు తెలిసిన బాబు జగన్ మాటలు విని నవ్వుకుని వుంటారు తప్ప 'నా తడాఖా చూపిస్తా' అని జట్టీకి దిగి వుండరు.
మరి ఫిరాయింపులకు ఎందుకు సై అన్నట్లు? అంటే నైతిక స్థయిర్యం అనే జవాబు దగ్గరకు వచ్చి ఆగుతాం. ఇది కూడా అనేక సందేహాలకు దారి తీస్తుంది. ఎక్కడున్న క్యాడర్ నైతిక స్థయిర్యం? పార్టీకి డ్యామేజి జరుగుతున్నది తెలంగాణలో! ఇక్కడ మన పార్టీకి మనుగడ వుందా లేదా అన్న సందేహం కలిగేది అక్కడి కార్యకర్తల్లో! వాళ్లకు వైకాపా నుంచి ఫిరాయింపులు ఏం ఊరట కలిగిస్తాయి? అవే లేకపోతే 'ఫిరాయింపులు – నైతిక విలువల పతనం' అనే పేరుతో సదస్సులు ఏర్పాటు చేసి మేధావుల చేత మాట్లాడించి తెరాస రాజకీయాల పట్ల మధ్యతరగతిలో విముఖత కలిగించే ప్రయత్నమైనా చేయగలిగేవారు. ఇప్పుడు ఆంధ్రలో చేష్టల వలన వాళ్లు డిఫెన్సులో పడ్డారు. కెసియార్‌ను తిట్టినప్పుడల్లా మీ బాబు ఆంధ్రలో చేస్తున్నదేమిటి అన్న ప్రశ్న ఎదుర్కోవలసి వస్తోంది. అది నైతిక స్థయిర్యాన్ని ఎలా కలిగించగలదు? ఇక ఆంధ్రలో క్యాడర్ కంటారా..? వాళ్ల నైతిక స్థయిర్యానికి వచ్చిన లోటు ఏమీ లేదు. అక్కడ టిడిపికి ఎదురే లేదు. కాంగ్రెసు చనిపోయింది, వైకాపా కోమాలో వుంది. ఏం చేసినా, ఏం కబుర్లు చెప్పినా చెల్లిపోతోంది. వైకాపా క్యాడర్ చేర్చుకుని సాధించేముంది? వాళ్లేమైనా కొత్త ఆరోపణలు చేయగలరా? అదే లక్ష కోట్లు, అదే అభివృద్ధికి అడ్డుపడడం కదా! నిజానికి తెలంగాణలో పరిణామాల పట్ల ఆంధ్ర టిడిపి క్యాడర్ సంతోషంగా వుండి వుండాలి. బాబు రెండు రాష్ట్రాల్లో చెరో కాలు పెడితే, ఆంధ్రకు కావలసినంత టైము కేటాయించలేరు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ ముగిసిపోయింది కాబట్టి ఆంధ్రమీదే ఫోకస్ పెట్టి శత్రువులను మరింత శక్తిమంతంగా ఎదుర్కుంటారన్న ఆశ కూడా కలుగుతుంది వారికి.
మరి ఎందుకు ఫిరాయింపులు ప్రోత్సహించినట్లు అనే ప్రశ్న మళ్లీ మళ్లీ ఎదురవుతోంది. నా మట్టుకు నాకు యిది బాబు అహం చల్లార్చుకోవడానికి మాత్రమే అనిపిస్తోంది. డిఫెక్షన్ గేమ్‌లో కెసియార్ చంద్రబాబుకంటె స్మార్ట్‌గా వ్యవహరించారని, ఆయన ముందు బాబు తెలివితేటలు చాలలేదనీ అందరూ వ్యాఖ్యానించడం బాబును బాధించి వుంటుంది. రోషం కంటె ఉక్రోషం ఎక్కువగా వచ్చి దాన్ని జగన్‌పై చూపించి వుంటారు. 'ఊరంతటికీ నేను లోకువ, నాకు నంబి కొండయ్య లోకువ' అని సామెత. కెసియార్‌కు బాబు లోకువ అయిపోతే, బాబుకు జగన్ లోకువ. ఎందుకంటే జగన్‌కు అవకాశాలు వినియోగించుకోవడం రాదు. బాబు పాలనపై ప్రజల్లో రగులుతున్న అసంతృప్తిని నిర్మాణాత్మకమైన కార్యక్రమాల ద్వారా, దీర్ఘకాలపు నిరసనల ద్వారా, ఛానెలైజ్ చేయడం రాదు. ఏ సమస్య పైన స్పష్టమైన విధానాలు ప్రకటించడం చేతకాదు. ''సాక్షి'' పేపర్లో రాసేస్తే చాలు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేసినట్లే అనుకుంటారు. ఆ పేపరు కొనేవారందరూ రాజకీయవార్తలు చదువుతారన్న గ్యారంటీ లేదు. చాలామంది పేపర్లు ఫీచర్ల కోసమే చదువుతున్నారు. పైగా ''సాక్షి''ని మీడియాలో భాగంగా పరిగణించరు. వైయస్సార్ బొమ్మ ముఖపత్రం మీద వేసుకుని వస్తుంది దాన్ని ''విశాలాంధ్ర'', ''ప్రజాశక్తి'' వంటి పార్టీ పత్రికగానే చూస్తారు. దానిలో రాజకీయవార్తలను చదివి నమ్మేవారు యిప్పటికే వైకాపా అభిమానులై వుంటారు. తటస్థంగా వున్నవారిని ప్రభావితం చేయడం ముఖ్యని. దానికి ''సాక్షి'' చాలదు. ప్రజల్లో అవగాహన కలిగించాలంటే పేపర్లో వ్యాసాలు వేస్తే సరిపోదు. పార్టీ కార్యకర్తలు గుడిసెగుడిసెకు వెళ్లి ఎడ్యుకేట్ చేయాలి. కానీ జగన్‌కు మొదటినుంచీ అడ్డదారుల మీదే ఆసక్తి. కొత్తగా పార్టీ పెట్టినపుడు కొత్తవారిని రాజకీయాల్లోకి తెచ్చి తర్ఫీదు యిచ్చే ఓపిక లేదు. కాంగ్రెసు నుంచి వచ్చిన ఫిరాయింపుదారుల మీద ఆధారపడే రాజకీయాలు ప్రారంభించారు. ఈ రోజు పార్టీ పుట్టి మునుగుతున్నది కూడా ఫిరాయింపుదారుల చేతనే! 'కత్తితో వ్యవహరించువాడు కత్తిచేతనే మరణించును' అని బైబిల్ వాక్యం. 'ఒరులేయవి ఒనరించిన తన కప్రియమగునో, తానొరులకు అవి సేయకునికి పరమధర్మము' అని భారతసూక్తి.
తెలంగాణలో పార్టీ ఐసియులోకి చేరడాన్ని బాబు సీరియస్‌గా తీసుకోవడం సమంజసం కాదు. ప్రాంతీయపార్టీలు రెండు రాష్ట్రాల్లో వుండలేవు. తమిళనాడు, పాండిచ్చేరి రెండు రాష్ట్రాలుగా లెక్కకు వున్నా వాటి మధ్య వైరుధ్యం లేదు. కర్ణాటకలో వుండే డిఎంకె లేదా ఎడిఎంకె యూనిట్ కావేరీ విషయంలో ఎటూ మాట్లాడలేదు కాబట్టి కర్ణాటకలో పుంజుకోలేదు. కర్ణాటకలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి అనే పార్టీ వుండేది కానీ అది సరిహద్దు తగాదా వున్న బెళగాంలో మాత్రమే గెలిచేది. 1970 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌లో డిఎంకె అభిమానులు 'ద్రవిడ ముందడుగు కూటమి' అనే పేరుతో పార్టీ పెట్టబోయారు కానీ దాని అడుగు ముందుకు పడలేదు. కెటియార్ తెరాస యూనిట్ ఆంధ్రలో పెడతామని జోక్ చేశారు కానీ అది అయ్యే పని కాదని ఆయనకూ తెలుసు. టిడిపి, వైకాపాలు తెలంగాణలో మనడం కష్టం. రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు ముదిరినకొద్దీ ఎటూ చెప్పలేక అవస్థపడతారు. ప్రత్యేక తెలంగాణ కావాలని లేఖ యిచ్చినపుడే బాబు యీ విషయాలన్నీ ఆలోచించుకుని చేయాల్సింది, యిప్పుడు టూ లేట్. ఇక్కడేదో జరిగిందని, ఆవేశపడి వైకాపాను చీల్చి 'మేమూ మొనగాళ్లమే, మాకూ వచ్చు యీ విద్య' అని చాటుకున్నంత మాత్రాన యిక్కడ ఒరిగేది ఏమీ లేదు.
అక్కడ ఒరిగేది ఏమైనా వుందా అని ఆలోచిస్తే టిడిపికి ఏమీ ఒరగక పోవచ్చు కానీ ఆంధ్ర సమాజానికి మాత్రం కొంత మేలు జరగకపోదు. ప్రస్తుతం టిడిపి ఫోకస్ అంతా రెండు జిల్లాల మీదే, ఒక కులం మీదే వుందని, వాళ్లే లాభపడుతున్నారని ప్రబలమైన భావం వుంది. ఆ కులానికి అనుకూలురు, వ్యతిరేకులుగా సమాజం విడిపోతుందేమోనన్న భయం కలుగుతోంది. ఇప్పుడు ఇలా ఎడాపెడా ఫిరాయింపులను ప్రోత్సహించి అన్ని ప్రాంతాల వాళ్లనీ, కులాల వాళ్లనీ చేర్చేసుకుంటే వాళ్లూ 'అభివృద్ధి' కార్యక్రమాల్లో తమ తమ వాటాలు అడుగుతారు. ఆ విధంగా అభివృద్ధి, దానికి కవల అయిన అవినీతి వికేంద్రీకరణ జరిగి రాష్ట్రమంతటా విస్తరిస్తుంది. 1978లో 175 మంది శాసనసభ్యులతో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఫిరాయింపులను ప్రోత్సహించారు. 30 మంది సభ్యుల్లో కాంగ్రెసు – యు ను 3కి తెచ్చారు, 60 మంది జనతా పార్టీని 16కి తెచ్చారు. సిపిఎంఎల్ సభ్యుడే కాదు, చెన్నారెడ్డిని నిత్యం చీల్చి చెండాడే రోశయ్య, కె కేశవరావు సైతం కాంగ్రెసు-ఐలో చేరేట్లా చేశారు. ఇలా రాష్ట్రమంతా అ-అ పంచారు. దానివలన ప్రజలకు మొహం మొత్తి 1983లో ఎన్టీయార్‌కి ఏకంగా 199 సీట్లు కట్టబెట్టి వీళ్లని యింటికి పంపించేశారు. తెలంగాణలో, ఆంధ్రలో నేడు మూక ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నవారు ఆ కథను ఒక్కసారి మననం చేసుకుని ముందుకు సాగాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)