బిజెపి కొద్ది రోజులుగా అంటోంది – సీమాంధ్రకు కూడా న్యాయం చేయాలి అని. మోదీ రంగంపైకి వచ్చాకనే ఆంధ్ర గురించి ఆలోచించడం మొదలెట్టారు. అప్పటిదాకా రాష్ట్ర బిజెపి నాయకత్వం మొత్తం తెలంగాణవారి చేతిలో వుండడం చేత తెలంగాణ యివ్వాలి అనడం తప్ప మరో మాట లేదు. ఆంధ్రలో ఎటూ ఏమీ లేదు, విభజనకు మద్దతిస్తే తెలంగాణలో బలపడతాం అనే ఆలోచనతో రాష్ట్రనాయకులున్నారు. జాతీయ నాయకులకూ అదే చెపుతూ వచ్చారు. అయితే మోదీ ప్రధాని అభ్యర్థి అనగానే ఆయన సీమాంధ్రపై దృష్టి సారించాడు. 25 ఎంపీ సీట్లున్న ప్రాంతాన్ని ఎందుకు వదులుకోవాలి? అని. ఇరు ప్రాంతాలవాళ్లూ మిఠాయిలు పంచుకున్నపుడే దాన్ని విభజన అంటారు అనే ఆలోచన ముందుకు తెచ్చాడు. ఆంధ్రలో బిజెపి యూనిట్లను మేల్కొల్పాడు. వెంకయ్యనాయుడు గళమెత్తాడు. అప్పటిదాకా రాష్ట్రవ్యవహారాలపై సుష్మా స్వరాజ్‌దే ఆఖరి మాట. కెసియార్ మాటలే ఆవిడా వల్లించేది. నెహ్రూ ఫలానావిధంగా అన్నాడని వీళ్లు చెపితే నమ్మేసి పార్లమెంటులో అది చెప్పింది. అది అబద్ధమని సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ధ్వజమెత్తడంతో నాలిక కరుచుకుని, మళ్లీ ఎన్నడూ దాన్ని రిపీట్ చేయలేదు.
పోనుపోను గతంలో విభజన వ్యతిరేకించిన ఆడ్వానీగారు సుష్మను ఎదిరించ నారంభించారు – ఆంధ్రను తిరుక్షవరం చేసుకున్నా తెలంగాణలో బావుకునేది ఏమిటో చెప్పమని. తెలంగాణ వస్తే ఓట్లు రాలేది తెరాసకే. ద్వితీయస్థానం కాంగ్రెసుకు. పార్టీ కార్యకర్తలున్నారు కాబట్టి అడుగూబొడుగూ టిడిపికి. మధ్యలో మనకెన్ని వస్తాయని అడిగారు. సుష్మలో అంతర్మథన ప్రారంభమైంది. మధ్యలో రాష్ట్రనాయకులు ఆమెను కలిస్తే 'ఎవరి పెళ్లికో మేము బాజాలు వాయించడమేమిటి?' అంది. అయినా ఎన్నికలముందు తెలంగాణ యిచ్చి తీరాలనడంలో రెండో అభిప్రాయం లేదంటూ చెపుతూ వచ్చింది. తెలంగాణ తల్లిగా సోనియా గుడి పక్కనే తన గుడీ కడతారన్న ఆశ ఆమెది! సీమాంధ్ర బిజెపివారు విభజనకు అంగీకరిస్తూనే 'సమన్యాయం' పల్లవి అందుకున్నారు. టిడిపిలా కాకుండా అవేమిటో చెప్పారు కూడా భద్రాచలంను సీమాంధ్రలో కలపాలి దగ్గర్నుంచి హైదరాబాదు చుట్టూ వున్న 140 పై చిలుకు ప్రభుత్వసంస్థల్లో సగం ఆంధ్రకు తరలించాలి దాకా వెళ్లింది. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అన్నారు. తెలంగాణ బిజెపివాళ్లు రెండేళ్లు చాలంటున్నారు. చివరకు వ్యవహారం ఎంతదూరం వెళ్లిందంటే ఆంధ్ర బిజెపివారు తెలంగాణ బిజెపివారితో కాకుండా విడిగా ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలిసి మెమోరాండం యిచ్చారు.
ఇలా బిజెపి కూడా రెండు గొంతుకలతో మాట్లాడి కాంగ్రెసు, టిడిపిల దారి పట్టింది. ఆడ్వానీ, వెంకయ్యనాయుడు, రాజనాథ్ సింగ్, మొన్నటికి మొన్న అరుణ్ జైట్లీ – అందరూ సీమాంధ్రకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడుతూ వచ్చారు. ఎందరు మాట్లాడినా సుష్మా స్వరాజ్ మాత్రం అందర్నీ తోసి రాజంటుందని టి-వాదులు నమ్మకం పెట్టుకున్నారు. అఖిలపక్షంలో సుష్మ మాట్లాడినది విన్నాక ఆ నమ్మకం కూలిపోయింది. సభ ప్రశాంతంగా నడవాలట. సస్పెన్షన్లు చేయకూడదట. కాంగ్రెసువాదులందరూ ఒకే గొంతుతో మాట్లాడాలట. 'తివిరి యిసుమంబున తైలంబు తీయవచ్చు' కానీ కాంగ్రెసులోని యిరు ప్రాంతాల వారు ఒకేలా ఎలా మాట్లాడతారు, చోద్యం కాకపోతే. ఇలా గొంతెమ్మ కోర్కెలు కోరి సుష్మ టి-బిల్లుకు అడ్డుపుల్ల వేసింది. తక్కిన పార్టీలకు యీ శషభిషలు లేవు. 12 రోజుల్లో 39 బిల్లులు ఎలా పెడతారు? పైగా వాటిలో 6 ముఖ్యమైన బిల్లులు అంటున్నారు. ఎన్నికలకు డబ్బులు కావాలి కాబట్టి ఆర్థిక బిల్లులు పెట్టేసి కథ ముగించేయండి చాలు అని కరాఖండీగా చెప్పాయి.
ఇన్నాళ్లూ తెలంగాణకు సై అంటూనే యిప్పుడిలా అని బిజెపి కాంగ్రెసుకు షాక్ యిచ్చింది అంటున్నారు. కమలనాథ్ యిత్యాదులు బిజెపి యిలా డబుల్‌గేమ్ అడుతుందని అనుకోలేదు అంటున్నారు. నిజంగా కాంగ్రెసు అనుకోకుండా ఎలా వుంది? తాము ఏం చేసినా బిజెపి నోరు మూసుకుని కూర్చుంటుందని అనుకున్నారా? బిల్లు మొదటినుండీ చివరిదాకా అడ్డగోలుగా నడిపి, తమ అవకతవక పనులకు బిజెపి మద్దతు యిస్తుంది అని ఎలా అనుకుంటారు? అసెంబ్లీలో బిల్లు తిరస్కరణకు గురైంది. 9 వేల చిల్లర సవరణలు సూచించబడ్డాయి. సోమవారం సాయంత్రానికి ఢిల్లీ చేరితే మంగళవారం మధ్యాహ్నానానికల్లా మంత్రుల ముఠా (అదే.. జిఓఎమ్) అవన్నీ చదివిపడేసి, కొన్ని గంటల్లో ఫైనల్ బిల్లు తయారు చేసి కాబినెట్‌కి సిద్ధం చేసేశారు. జిఓఎమ్ సమావేశాలు దేనీకీి పూర్తి సభ్యులు హాజరు కాలేదు. ఇతర పార్టీ నాయకులను పిలచినపుడు తమ వద్ద సమాచారం ఏమీ లేదని చెప్పారు. ప్రజలను ఈ మెయిల్స్ ద్వారా అభిప్రాయాలు తెలపమన్నారు. ఒక్కటీ చదివినట్టు లేదు. ఇప్పుడు శాసనసభ్యులు తమ అభిప్రాయాలు లిఖితపూర్వకంగా చెపితే వాటిని బుట్టదాఖలు చేసి, గంటల్లో ఫైనల్ బిల్లు తయారు చేసి పడేశారు.
వాళ్లకు ఒకటే ధైర్యం. మహామేధావి చిదంబరం వుండగా తక్కినవాళ్లు బుర్ర పెట్టి ఆలోచించనక్కరలేదు. ఆయనకే అన్నీ తెలుసు. టి-బిల్లు హోం శాఖకు సంబంధించినది. కానీ షిండే కంటె అఖిలపక్షంలో చిదంబరం ఎక్కువ రెచ్చిపోతున్నాడు. 'తెలంగాణలో 17 మంది ఎంపీలు, ఆంధ్రలో 25 మంది ఎంపీలు వున్నంతకాలం పరిస్థితి ఎప్పుడూ యిలాగే వుంటుంది. అందువలన యీ సెషన్లోనే తేల్చిపారేయాలి' అన్నాడు. మూర్ఖత్వం కాకపోతే ఇది అంకెల గొడవ కాదు. ఇరుప్రాంతాలను సంతృప్తి పరిస్తే బిల్లు పాస్ చేయించుకోవడం కష్టం కాదు. సీమాంధ్రకు పూర్తిగా సున్న చుట్టడంతోనే వస్తోంది అసలు సమస్య. చిదంబరం, దిగ్విజయ్, షిండే యిత్యాదులు తమ వదరుబోతుతనంతో సీమాంధ్రులను అనుక్షణం రెచ్చగొడుతున్నారు. భవిష్యత్తుపై భయానికి తోడు, వీరి మాటలతో పౌరుషం పొడుచుకు వచ్చి సీమాంధ్రులు తెగబడుతున్నారు. చిదంబరం వంటి అహంభావికి వారిని సముదాయించాలన్న ఊహే పోదు. తనేదో దిగివచ్చాననుకుంటాడు. నిజానికి యుపిఏ2 రేపటి ఎన్నికలలో చావుదెబ్బ తింటే దానికి ప్రధాన కారణం – అధికధరలు. దానికి ముఖ్యంగా బాధ్యత వహించవలసినది ఆర్థికమంత్రివర్యులు చిదంబరం! తన శాఖ తను చూసుకోలేడు కానీ తెలంగాణ విషయం వచ్చేటప్పటికి వూరికే ఆడిపోతాడెందుకో తెలియదు. బిల్లు పాస్ కాలేదు కానీ అప్పుడే ఉద్యోగులను ప్రాంతాల వారీగా విడగొట్టడానికి కమలనాథన్ కమిటీ అని వేసేశారు. అదేమిటో యీ విభజన విషయంలో ఎటు చూసినా తమిళులే తగులుతున్నారు.
సుష్మ చెప్పినదేమిటి – మీ ముఖ్యమంత్రే ఎదురు తిరుగుతున్నాడు, మీ సీమాంధ్ర ఎంపీలే అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. మీ యిల్లు మీరు చక్కబెట్టుకుని అప్పుడు మా వద్దకు రండి అంది. ఆమె అలా అంటుందని వీళ్లకు తెలియదా? అసెంబ్లీ బిల్లును తిరస్కరించినపుడు, ముఖ్యమంత్రి బాహాటంగా బిల్లుకు వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నపుడు అధికార పార్టీకి వాళ్లను సముదాయించ వలసిన పని లేదా? వారి భయాలను, ఆందోళనలను పట్టించుకోవలసిన పని లేదా? సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు చేసిన అనేక సూచనల్లో ఒక్కటి కూడా పట్టించుకోకుండా, వాళ్లని ప్రజల దృష్టిలో గాడిదలను చేసి వదిలితే వాళ్లూరుకుంటారా? వాళ్ల మనుగడ కోసమైనా అల్లరి చేస్తారు. ఏకాభిప్రాయం సాధించాకే తెలంగాణ బిల్లు అంటూ ఐదేళ్లగా చెపుతూ వచ్చి, అది సాధించకుండానే బిల్లు ప్రవేశపెడితే ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయని కాంగ్రెసు ఎలా అనుకుంటుంది? బిజెపి యిలా అంటుందని తెలియడమే కాదు, ఇలా అనిపించాలని ప్రయత్నించింది అని కూడా అనవచ్చు. మరి అలా అయితే దానికి కలిగే లాభం ఏమిటి? – (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)