పదేళ్లలో రెండంటే రెండే సినిమాలు చేశాడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్. తన వెనుక… తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హాస్యనటుడిగా ఎదిగిన తండ్రి అండ ఉన్నా- నెగ్గుకురాలేకపోయాడు. పల్లకిలో పెళ్లికూతురు, వారెవా సినిమాలు పరాజయాల బాట పట్టడంతో గౌతమ్ ఇక సినిమాల్లో కనిపించడేమో అనుకొన్నారు. కానీ బసంతీతో మళ్లీ మేకప్ వేసుకొన్నాడు. వారెవా విషయంలో ప్రచార లోపాలు కూడా చాలా కనిపించాయి. బ్రహ్మానందం కూడా తనయుడి కెరీర్‌పై జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల.. గౌతమ్ వెలుగులోకి రాలేకపోయాడు. తనకున్న పలుకుబడి.. కొడుకు విషయంలో వినియోగించలేకపోయాఉ బ్రహ్మీ. తనయుడ్ని హీరోగా ప్రమోట్ చేయడానికి సాహసం చేయలేదు. సినిమాలు తీసే ఆర్థిక స్థోమత ఉన్నా ఆ దిశగా ఆలోచించలేదు.
పోనీ బయటి నిర్మాతలు కొడుకుతో సినిమా చేస్తే – తెర వెనుక నిలబడి నడిపించలేకపోయాడు. ఆ తప్పుల్ని కాస్త లేటుగా తెలుసుకొన్నాడేమో, బసంతి విషయంలో తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. తన తనయుడి సినిమాని కాస్త ప్రమోట్ చేసి పెట్టమని మీడియా పెద్దల్ని పర్సనల్‌గా కోరాడట బ్రహ్మీ. శ్రీనువైట్ల, మహేష్‌బాబులతో తనకున్న స్నేహంతోనే ఆగడు సెట్లో బసంతీ ట్రైలర్‌ని ఆవిష్కరించేలా ప్లాన్ చేశాడు. ఎప్పుడైతే సూపర్ స్టార్ చేయిపడిందో, అప్పుడు ఈ సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ వచ్చేసినట్టైంది. ఇకమీదటా ఈ సినిమాని ఇలాగే ప్రమోట్ చేయాలని నిర్ణయించుకొన్నాడు బ్రహ్మీ. మరి ఈసారైనా… తండ్రి అండతో తనయుడు హిట్ కొడతాడేమో చూడాలి.