ఎమ్బీయస్‌ : బిజెపి షాకిచ్చిందా? – 2

కాంగ్రెసు తెలంగాణ బిల్లు విషయంలో అనుమానాస్పదంగానే వ్యవహరిస్తూ వచ్చింది. రాజకీయలబ్ధి కోసమే విభజన చేపట్టిందని అందరికీ తెలుసు. కానీ దాని మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇంత అస్తవ్యస్తంగా విభజన చేస్తే…

కాంగ్రెసు తెలంగాణ బిల్లు విషయంలో అనుమానాస్పదంగానే వ్యవహరిస్తూ వచ్చింది. రాజకీయలబ్ధి కోసమే విభజన చేపట్టిందని అందరికీ తెలుసు. కానీ దాని మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇంత అస్తవ్యస్తంగా విభజన చేస్తే తెలంగాణలో సీట్లు రావడం మాట ఎలా వున్నా ఆంధ్రలో పూర్తిగా దెబ్బ తింటుందని తెలిసి కూడా యిలా ఎందుకు చేస్తోంది అన్నదే ఎవరూ చెప్పలేకపోతున్నారు. జగన్‌తో కుమ్మక్కయింది, కిరణ్‌ను ఆడిస్తోంది, తెరాసతో బేరం పెట్టుకుంది – యివన్నీ సెకండరీ. అసలు తనంతట తాను కొన్ని సీట్లు తెచ్చుకోవాలి కదా. ఇలా చేస్తే ఎలా వస్తాయి? దీనికి సమాధానం చెప్పలేక ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. నేనూ అలాగే ఊహించి రాస్తున్నాను. అసలు సంగతేమిటో సోనియాకే తెలియాలి.

జులై 30 కి ముందు కాంగ్రెసు పరిస్థితి ఏమిటి? తెలంగాణ విషయంలో అన్ని పార్టీలూ డబుల్‌ గేమ్‌ ఆడినా అందరూ కలిసి కాంగ్రెసునే తప్పుపడుతున్నారు. 'మేము నిర్ణయం తీసేసుకున్నాం, మీరెందుకు తీసుకోవడం లేదు, అసలు మీ అభిప్రాయం కూడా చెప్పలేదు, మీరు ఎటూ చెప్పకపోవడం వలన భయాందోళనలతో వెయ్యిమంది ప్రాణాలు తీసుకున్నారు' అంటూ ప్రతిపక్షాలన్నీ దుయ్యబడుతూ వచ్చాయి. కాంగ్రెసు నింద మోస్తూ వచ్చింది. తక్కిన విషయాల్లో కూడా యుపిఏ పరిపాలన ఘోరంగా వుండడం వలన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండిటిలోనూ కాంగ్రెసు బాగా దెబ్బ తింటుందని, 42 ఎంపీ సీట్లలో 20% సీట్లు వచ్చినా విశేషమేననీ సర్వేలు చెప్పాయి, విశ్లేషకులూ రాశారు. కాంగ్రెసుకు సంస్థాగతమైన బలం వుంది, అలవాటు కొద్దీ వేసే ఓటర్లున్నారు, కొన్ని చోట్ల స్థానికంగా బలమైన నాయకులున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కొన్ని సీట్లు గెలిచి తీరాలి. అయితే మొత్తం మీద చూస్తే ఇమేజి పూర్తిగా దెబ్బ తిని వుంది. 

కాంగ్రెసును దెబ్బ తీయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా బలమైన ప్రతిపక్షం వుండాలి. గతంలో టిడిపి వుండేది. క్రమేపీ అది బలహీనపడింది. అందుకే 2009లో కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి రాగలిగింది. అయితే యిటీవల కాలంలో సీమాంధ్రలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వైకాపా బలపడసాగింది. తెలంగాణలో తెరాస యితర పార్టీల నుండి నాయకులను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. వైకాపా, తెరాస కాంగ్రెసును ఘోరంగా దెబ్బ తీస్తాయని సర్వేలు చెప్తూ వచ్చాయి. పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. అన్ని ప్రాంతాల్లో కాంగ్రెసుకే ఎక్కువ సీట్లు వచ్చాయి. దాని వెనుకే టిడిపికి వచ్చాయి. కానీ పంచాయితీ ఎన్నికలు స్థానిక నాయకుల బలాబలాలపై ఆధారపడతాయి. సాధారణ ఎన్నికల వేళకు తెలంగాణ ముఖ్యమైన అంశంగా వుంటే యీ ఫలితాలు రాకపోవచ్చు. కాంగ్రెసు తన బలాలను నిలుపుకుంటూ, ప్రతిపక్షాలను దెబ్బ తీస్తే ఓట్లు చీలిపోయి, తక్కువ శాతం ఓట్లతోనైనా కాంగ్రెసు కొన్ని సీట్లు గెలవవచ్చు.

ఆ పరిస్థితిలో జులై 30న ప్రకటన వచ్చింది. అనేక పరిణామాలు జరిగాయి. ఈనాడు ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి? సీమాంధ్రలో బ్రహ్మాండంగా, తెలంగాణలో ఒక మేరకు వైకాపా దున్నేస్తుందని, జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని జులై 30కు ముందు చెప్పినవారు యిప్పుడు అంతే ధాటీగా చెప్పగలరా? వారు తీసుకున్న సమైక్య నినాదం వలన తెలంగాణలో ఐదారు జిల్లాలలో బలహీనపడలేదా? ముఖ్యమైన తెలంగాణ నాయకులు విడిచి వెళ్లిపోలేదా? అన్ని జిల్లాలలో ప్రాతినిథ్యం లేకపోతే జగన్‌ ఒంటి చేత్తో ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా? సీమాంధ్రలో కూడా సమైక్య ఉద్యమాన్ని జగన్‌ నడిపించిన తీరును అతని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దాని ప్రభావం ప్రజలపై ఎంతో కొంత పడింది. అతని ఒంటెత్తు పోకడ వెనక కారణాలు వెతుకుతున్నారు. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే 'జగన్‌ గ్రాఫ్‌ తగ్గింది'. సర్వేలు కూడా అవే చెపుతున్నాయి. 

ఇక తెలంగాణలో తెరాస పరిస్థితి – తెలంగాణ ఏర్పడితే తెరాసకు ఓట్లు రావచ్చు తప్ప, విభజన జరగకపోతే అన్ని రావు. తెరాస వేసిన రాజకీయపు ఎత్తుపైయెత్తుల కారణంగా తెలంగాణ రాలేదని తోచి, తెరాసపై టి-వాదులకు విముఖత కలగవచ్చు. టి-కాంగ్రెసు వాదులు ప్రజల్లోకి వచ్చి ''తెలంగాణ ప్రకటిస్తే మా పార్టీలో విలీనం చేస్తానని మాట యిచ్చిన తెరాస తర్వాత మాట తప్పడం వలననే మా అధిష్టానం వద్ద మా పరువు పోయింది. తెలంగాణ యిచ్చి మనం బావుకునేది ఏముందని మా పార్టీ పెద్దలు అడిగితే మేం సమాధానం చెప్పలేకపోయాం. కెసియార్‌ సిఎం పదవి ఆశించడం వలన, తన కుటుంబసభ్యులకు మంత్రిపదవులు అడగడం వలన బేరాలు కుదరలేదు.'' అని ప్రచారం చేయవచ్చు. జులై 30 వరకు తెరాసలోకి యితర పార్టీల నుండి నాయకులు వచ్చారు. ఆ ప్రకటన తర్వాత తెరాస నుండి కొందరు నాయకులు బయటకు వెళుతున్నారు. ఎన్నికలు దగ్గరపడేసరికి యింకెంతమంది దూరమవుతారో తెలియదు. తెలంగాణ ఏర్పడినా తెరాస, కాంగ్రెసు మధ్య పొత్తులు ఎలా కుదురుతాయో, అవి ఎంత లక్షణంగా నడుస్తాయో తెలియదు. జులై 30కి ముందు 100 అసెంబ్లీ సీట్లు, 15 పార్లమెంటు సీట్లు గెలుస్తాం అని నినాదం యిచ్చిన తెరాస యిప్పుడు అంత దృఢంగా చెప్పలేని పరిస్థితి వుంది.

టిడిపి సంగతి తీసుకుంటే – చంద్రబాబు తన పార్టీలోని యిరుప్రాంతాల నాయకులనూ చెరో విధంగా మాట్లాడిస్తూ పబ్బం గడుపుకుని వస్తున్నారు. జులై 30 తర్వాత ఆయన పెద్ద యిరకాటంలో పడిపోయారు. ఇప్పటికీ ఏమీ చెప్పకపోయినా సమైక్యవాదం పట్ల మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం కలిగిస్తున్నారు. బాబు బిజెపితో స్నేహం చేసి వారిని సమన్యాయం వాదనవైపు మళ్లించి, ప్రస్తుతానికి టి-బిల్లు ఆపిస్తున్నారనే ప్రచారం వూపందుకుంటున్నకొద్దీ తెలంగాణ టిడిపి నాయకులు చాలా నిరుత్సాహంగా వున్నారు. సీమాంధ్ర టిడిపి నాయకులు సమరోత్సాహం చూపుతున్నా, చంద్రబాబు మౌనం కారణంగా డిఫెన్సివ్‌గానే వున్నారు. ఎన్నికలలో జగన్‌ అవినీతి, కిరణ్‌ అసమర్థత అంశాలుగా వున్నంతకాలం టిడిపికి అనుకూలంగానే వుంది. ఇప్పుడు విభజన ఎన్నికల అంశమైతే, గతంలో తాము యిచ్చిన లేఖ కారణంగా టిడిపి కూడా దోషిగా నిలబడుతోంది. అందువలన జులై 30 తర్వాత టిడిపి కూడా బలహీనపడిందనే చెప్పాలి.  (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)

[email protected]

Click here For Part-1