ఎమ్బీయస్‌: సిబిఐ చేతికి వ్యాపమ్‌- 1

ఇవాళ్టి నుంచి సిబిఐ వ్యాపమ్‌పై విచారణ ప్రారంభించింది. సాధారణంగా సిబిఐకు అప్పగించినా పనులు త్వరగా సాగవు. సిబ్బంది కొరత వుందంటారు. కానీ దీనికి మాత్రం 40 మందిని కేటాయించారట. జాయింటు డైరక్టరు పర్యవేక్షిస్తారట. ఇది…

ఇవాళ్టి నుంచి సిబిఐ వ్యాపమ్‌పై విచారణ ప్రారంభించింది. సాధారణంగా సిబిఐకు అప్పగించినా పనులు త్వరగా సాగవు. సిబ్బంది కొరత వుందంటారు. కానీ దీనికి మాత్రం 40 మందిని కేటాయించారట. జాయింటు డైరక్టరు పర్యవేక్షిస్తారట. ఇది ఓ పట్టాన అర్థమయ్యే కథ కాదు. చాలాకాలంగా ఎన్నో స్కాండల్స్‌ గురించి చదివాను, కానీ వాటన్నిటి కంటె యిది భిన్నమైనది – హత్యల కారణంగా! ఇందిర హయాంలో నగర్‌వాలా కేసులో వరుస హత్యల గురించి విని ఉలిక్కిపడ్డాను. (ఎమ్బీయస్‌ క్రైమ్‌ రచనలలో దాని గురించి రాస్తాను) కానీ వ్యాపమ్‌ ముందు అదెందుకూ పనికి రాదు. హత్యలొక్కటే కాదు, రాష్ట్రప్రభుత్వం దాన్ని హ్యేండిల్‌ చేస్తున్న తీరు కూడా ఆశ్చర్యకరంగా వుంది. రాష్ట్రం హోం మంత్రి ఏ మాత్రం చలించకుండా పుట్టినవారు గిట్టక మానరు అని వేదాంతోక్తులు వల్లిస్తున్నాడు. 2008 డిసెంబరు నుండి 2012 మార్చి వరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పోర్టు ఫోలియో ముఖ్యమంత్రి చౌహాన్‌ వద్దే వుంది. అనేక సందర్భాల్లో కొందరిపై అనుమానాలు వెలిబుచ్చి ఆన్సర్‌ షీట్లు, ర్యాంకుల షీట్లు యిమ్మనమని కొందరు ఆర్‌టిఐ కింద అడిగినపుడు ప్రభుత్వం యివ్వలేదు. గతంలో ఆన్సర్‌ షీట్లు పదేళ్ల పాటు భద్రపరచాలన్న రూలుండేది. ఆ రూలును 2011- 2013 మధ్య 6 సార్లు మార్చారు. ఇప్పుడు మూడు నెలల కంటె ఎక్కువ వుంచటం లేదు. ఇవన్నీ సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నాలు కాదా? ఈ మిస్టరీ ఎప్పటికి తేలుతుందో ఏమో. అసలు యీ స్కాము స్వరూపస్వభావాల గురించి, హత్యల వెనుక వున్నవారి గురించి కనిపెట్టి మనకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఏ మలయాళీ సినిమా స్క్రిప్టు రైటరో దిగి రావాలి.

గతంలోనే వ్యాపమ్‌ గురించి, మార్కు షీట్లు ఎలా మార్చేస్తున్నారో దాని గురించి రాశాను. వ్యాపమ్‌ (వ్యావసాయిక్‌ పరీక్షా మండల్‌)ను మధ్య ప్రదేశ్‌లో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షల కోసం 1982లో పెట్టారు. ఇంజనీరింగు, మెడిసిన్‌ ఎడ్మిషన్లు చూసేది. మొదట్లో బాగానే నడిచిందట. తర్వాత డెంటల్‌, పాలిటెక్నిక్‌, ఆర్కిటెక్చర్‌, పీజీ ఎంట్రన్స్‌, మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌.. యిలా అన్నీ దానికే కట్టబెట్టారు. ఇక ఆరోపణలు రావడం మొదలుపెట్టాయి. వ్యాపమ్‌ లేని కాలంలో సిఫార్సులతో సీట్లు, ఉద్యోగాలు దొరికాయని, తాము వచ్చి వ్యవస్థీకరించామని బిజెపి వారంటారు. కానీ 2003లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే అక్రమ వ్యవహారాలు పెద్ద ఎత్తున జరిగాయన్నది నిజం. 2008 నుంచి సర్వీసు కమిషన్‌ పరిధిలోకి రాని పోలీసు కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డులు, జైలు గార్డులు, కాంట్రాక్టు టీచర్లు, ఫుడ్‌ యిన్‌స్పెక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు  వగైరా ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ను కూడా దీనికే అప్పగించి అక్రమాల స్కేలు పెంచారు. చివరకు యిది ఉద్యోగ నియామకాల, కాలేజీ ప్రవేశాల కుంభకోణంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు వేర్వేరు వర్గాలు. ఇద్దరికీ కలిపి ఒకే సంస్థ పరీక్షలు నిర్వహించడమేమిటి? అవినీతికి అవకాశం వుండే నియామకాలన్నిటిని ఒక చోటకు చేర్చినట్లున్నారు. ప్రైవేట్‌ పెట్టుబడులు, పారిశ్రామికీ కరణ తక్కువగా వున్న మధ్య ప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగం గురించి వెంపర్లాడడంలో, దానికై అడ్డదోవలు తొక్కడంలో ఆశ్చర్యం లేదు. ''భారతీయుడు''లో చెప్పినట్లు ఆ తోవలో ఉద్యోగం సంపాదించినవారు అడ్డగోలుగా అవినీతికి పాల్పడతారని కూడా వూహించవచ్చు. అంటే భవిష్యత్తును కూడా భ్రష్టు పట్టిస్తున్నారన్నమాట.

వ్యాపమ్‌ ఇప్పటిదాకా 68 పరీక్షలు నిర్వహించింది. సుమారు 77 లక్షల మంది అభ్యర్థులు దానిలో పాల్గొన్నారు. 2009లో ఫిర్యాదు చేసినపుడు 300 మంది అనర్హులకు సీట్లు వచ్చాయన్నారు. ఐదేళ్లలో 1087 మంది ఎడ్మిషన్లు కాన్సిల్‌ చేశారు. ఉద్యోగాలకు వస్తే 1.40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. వేలాది మంది అడ్డదారుల్లో సంపాదించుకున్నారని సింపుల్‌గా అనేశారు కానీ కరక్టుగా ఎంతమందో యింకా తేలలేదు. 140 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు అయ్యాయి. 3800 మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు. వీరిలో అభ్యర్థులు, వారి తలిదండ్రులు, దళారులు అందరూ కలిపి అయి వుంటుంది. ఇన్ని లక్షల ఉద్యోగాల్లో, యిన్ని లక్షల అభ్యర్థుల్లో అవకతవకలు జరిగిన సంఘటనలు 1-2%కు మించి లేవు కదా అంటాడు ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌! నిజమే కదా! ఆ పాటి ఏ రాష్ట్రంలోనైనా మరో పేరు మీదైనా జరుగుతాయి. మొత్తం రూ.6300 కోట్ల (ఈ అంకె కూడా నమ్మాలని లేదు. స్కాముల్లో ఉన్నదానికి ఎన్నో రెట్లు పెంచి చెప్తూ వుంటారు) స్కాము అంటున్నారు. కాండిడేటుకు రూ. 15-50 లక్షలు లంచం పుచ్చుకున్నారని ఒక అంచనా. మెడికల్‌ కాలేజీ సీటుకి, ఫారెస్టు గార్డు ఉద్యోగానికి ఒకే రేటు వుండదు కదా. సగటున ఏ రూ. 30 లక్షలో వుందనుకుంటే మొత్తం రూ.6300 కోట్లను 21 వేల మంది అభ్యర్థుల నుండి వసూలు చేసి వుండాలి.  మధ్యేమార్గంగా ఏ పదివేల మందో అక్రమంగా, అన్యాయంగా ఉద్యోగాలు, సీట్లు సంపాదించారని అనుకోవచ్చు. 

నేను స్కామును తగ్గించి చూపే ప్రయత్నం చూపటం లేదు. పదివేల మంది కాదు, పదిమంది అక్రమంగా సంపాదించినా తప్పే. కానీ స్కేల్‌ ఆఫ్‌ స్కామ్‌ గురించి చర్చిస్తున్నాను. ఈ పాటి దానికి యిన్ని హత్యలా? ఎవరు చేయిస్తున్నారు? గవర్నరు నిందితుడు. కానీ నిందితుడైన అతని కుమారుడు కూడా చచ్చిపోయాడు. అదీ సొంత యింట్లో. అతన్నీ చంపగలిగారా? నమ్మశక్యంగా లేదు. చావులకు, కేసులకు సంబంధం లేదని తీర్మానించేద్దామా? పాలకపక్షం వారు అలా నచ్చచెప్పుకున్నా నిందితులు మాత్రం అలా అనుకోవటం లేదు. వారిలో 1800 మంది అరెస్టయ్యారు. 600 మంది పరారీలో వున్నారు. అరెస్టయి బెయిలుపై బయటకు వచ్చినవారిలో 200 మంది తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ పిటిషన్‌లు దాఖలు చేశారు. కొంతమందికి బెయిలు వచ్చినా బయటకు వెళ్లటం లేదు, ప్రాణాలు పోతాయన్న భయంట! ఇటీవలి రోజుల్లో ఒక్క వారంలో అయిదుగుర్ని లేపేశారు. వారిలో ఆజ్‌తక్‌ రిపోర్టరు అక్షయ్‌ కుమార్‌ ఒకడు. అమ్మాయి మెడికల్‌ కాలేజీలో అక్రమంగా సీటు పొందిన నమ్రతా దామర్‌ 2012 జనవరిలో రైలు పట్టాలపై శవంగా కనబడింది. అది హత్యా, ఆత్మహత్యా పరిశోధిద్దామని అక్షయ్‌ సింగ్‌ పోస్ట్‌ వెళ్లి కుటుంబసభ్యుల్ని కలిశాడు, మాట్లాడాడు. వాళ్లు ఆత్మహత్య కాదన్నారు. 

వాళ్లింటి నుంచి వచ్చిన కొద్ది సేపటికే నురగలు కక్కుకుని చచ్చిపోయాడు. నమ్రత తలిదండ్రులు అతనికి విషం కలిపిన పానీయం యిచ్చారా? ఎందుకిస్తారు? కూతురి పట్ల సానుభూతితో వచ్చిన జర్నలిస్టు పట్ల ద్వేషం ఏమిటి? ఇవ్వకపోతే చంపేస్తామని వాళ్ల నెవరైనా బెదిరించారా? చావు ఎలా సంభవించిందో యిప్పటిదాకా తెలియదు. అతని పోస్ట్‌ మార్టమ్‌ గుజరాత్‌లోని దహోద్‌లో జరిగింది. దాని రిపోర్టును రిజర్వ్‌లో వుంచారు. అంతర్గత అవయవాలను ఎయిమ్స్‌లో పరీక్షిస్తారట. ఇండియా టుడే యీ కేసును సీరియస్‌గా తీసుకుని దుమ్ము రేపింది. నమ్రత పోస్టు మార్టమ్‌ రిపోర్టు సంపాదించి చూస్తే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి చంపారని తేలింది. ఆమె చావు కేసు మూసేశామని, మళ్లీ తెరిచామని, మళ్లీ మూసేశామని పోలీసులు రకరకాల స్టేటుమెంట్లు యివ్వడాన్ని ఇండియా టుడే ఎత్తి చూపింది.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]