సుమారు ముఫ్ఫై ఏళ్ల క్రితం..1986లో విడుదలయింది సింహాసనం సినిమా. హీరో కృష్ణ నటించిన 235వ చిత్రం. ఈ సినిమా దర్శకుడిగా కృష్ణకు తోలి సినిమా. ఈ రోజు బాహుబలి గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారో, ఆ రోజు ఆ రేంజ్ హైప్ వచ్చినసినిమా. ఈ సినిమా నిర్మాణం కోసం పద్మాలయా స్టూడియోలో భారీ పర్మనెంట్ సెట్టింగ్ లు వేసారు. అలనాటి టాప్ స్టార్ ల రాధ, జయప్రదలతో పాటు, బాలీవుడ్ హీరోయిన్ మందాకినిని కూడా ఈ సినిమాలోకి తీసుకున్నారు.
రాణిగా నటించిన జయప్రదకు స్వాగత సన్నివేశాలను భారీగా చిత్రీకరించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి సంగీతం దర్శకత్వం వహించారు. షోలేతో పాపులర్ అయిన అంజాద్ ఖాన్ ఈ సినిమాలో వినోదాత్మక పాత్ర పోషించారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ కలయికతో తయారైందీ సినిమా. హిందీలో కూడా ఒకేసారి తయారై, విడుదల కావడం విశేషం.
అయితే సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్, టాక్ ఇవన్నీ ఇప్పటి బాహుబలికి ఏ మాత్రం తీసిపోవు. అయితే విడుదల అనంతరం, ఇప్పటంత మార్కెట్ విస్తృతి అప్పట్లో లేకపోవడం వల్ల బ్లాక్ బస్టర్ అని మాత్రమే అనిపించుకుంది. రికార్డులు బద్దలు కొట్టింది కానీ, మరీ కోట్లకు కోట్లు కొల్లగొట్టలేదు.
చిత్రంగా, అంత భారీ సినిమా తీయడానికి అప్పట్లో హీరో కృష్ణ ఎంచుకున్నదీ జానపద సబ్జెక్టే,.ఇప్పుడు బాహుబలిదీ అదే. ఇదిలా వుంటే జానపద సినిమాలు కనుమరుగైపోయినా, హీరోలు అలాంటి సినిమాలు చేయాలని అనుకోవడం సహజం. బాలకృష్ణ భైరవద్వీపం చేసారు. మంచి విజయం సాధించారు. కాస్త అటు ఇటుగా అలాంటి రాజుల కథకు, వర్తమాన పరిస్థితులు కలిపి చిరంజీవి రాజా విక్రమార్క చేసారు.
ఎన్టీఆర్-రాఘవేంద్రరావు కలిసి సింహబలుడు రూపొందించారు. కళాదర్శకుడు భాస్కర రాజు భారీ సెట్టింగ్ లు వేసారు ఈ సినిమా కోసం. రాఘవేంద్రరావు సినిమాకు ఎమ్ ఎస్ విశ్వనాధన్ సంగీతం అందించడం ఓ విశేషం.ఈ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది కానీ దానికి తగ్గ విజయం రాలేదు. అలాగే దానికి దగ్గరలోనే ఎస్డీ లాల్ ఎన్టీఆర్ తోనే రాజపుత్ర రహస్యం అందించారు. అందులో ఎన్టీఆర్ టార్జాన్ గా నటించారు.
రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ హీరో సిద్దార్థతో అనగనగా ఓ ధీరుడు అని ట్రయ్ చేసారు. కానీ ఫలితం లేకపోయింది. రామ్ చరణ్ మగధీర సంగతి తెలిసిందే. వెంకీ, నాగ్ ఇలాంటి సినిమాలను ట్రయ్ చేయలేదు. వెంకీ బ్రిటిష్ నేఫథ్యంలో జయం మనదేరా, నాగ్ రాజన్న సినిమాలు చేసారు. కానీ అవివేరు.