చాన్నాళ్ల క్రితం సంగతి..స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ అని ఓ సినిమా వచ్చింది. దాని క్రేజ్, హైప్ దానివి. రచయిత యండమూరి డైరక్టర్. ఇళయరాజా పాటలు సూపర్. కానీ సినిమా ఫటేల్ మంది. నిర్మాత కెఎస్ రామారావు కుదేలు. కొన్నావాళ్లు దిగాలు. మొత్తానికి నిర్మాత కుదురుకుని, చంటి అనే ఓ రీమేక్ చేసారు. బయ్యర్లకు గత సినిమా నష్టాలను కాస్త చెల్లు చేసి, తక్కువ ధరలకు ఇచ్చారు. ఆ సినిమా కుమ్మేసింది. నష్టాల నుంచి రికవరీ కావడం కాదు, బయ్యర్లు కొత్త పెట్టుబడులు తెచ్చుకున్నారు. ఇది గతం..
ఇప్పుడు వర్తమానానికి వస్తే,
బాహుబలిని భయంకరమైన రేట్లకు కొన్నారు. నైజాం కొన్న దిల్ రాజు పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. టర్నోవర్ వుంది కానీ, సరైన లాభాలు తెచ్చిన సినిమా లేదు. ఇటు పంపిణీలో కానీ, నిర్మాణంలో కానీ. బెంగుళూరు, సీడెడ్, కృష్ణ కొన్న సాయి కొర్రపాటిది అదే పరిస్థితి. తుంగభద్ర సినిమా దెబ్బతీసింది. లింగా, ఐ వంటి సినిమాల పంపిణీ కూడా అలాగే చేసింది. ఇలాంటి సమయంలో విడుదలకు ముందే బాహుబలి బెంగుళూరు హక్కులు లాభం తెచ్చాయి.
ఇప్పుడు సీడెడ్, కృష్ణా కుమ్ముతున్నాయి. ఇదే పరిస్థితి అమెరికాకు హక్కులు కొన్న బయ్యర్ ది కూడా. ఆయనకు ఈ సినిమా ముందు కాస్త ఆర్థిక ఇబ్బందులే. ఇప్పుడు అక్కడ ఈ సినిమా ఎలా వసూళ్లు సాగిస్తోందో అందరికీ తెలిసిందే.
ఆఖరికి ఫైనాస్స్ చేసిన వారిలో ఒకరైన సత్య రంగయ్యదీ అదే పరిస్థితి. అంతకు ముందు చాలా సినిమాల్లో ఆయన డబ్బు లాక్ అయిపోయింది. కొన్నింట్లో లాస్. కానీ ఇప్పుడు బాహుబలికి ఇచ్చిన ప్రతిపైసా వడ్డీతో సహా వచ్చేలాగే వుంది. మొత్తానికి బాహుబలి పుణ్యామా అని బాకీలు చెల్లుబాటైపోయి, కొత్త పెట్టుబడులు అందివచ్చేలాగే వుంది పరిస్థితి.