జనవరి 7 న ఫ్రెంచ్ పత్రిక ''చార్లీ హెబ్డో'' పై దాడి చేసి 12 మందిని చంపివేసి, 11 మందిని గాయపరచిన నలుగురు ఇస్లాం ఉగ్రవాదుల్లో యిద్దరు దొరికారు. ఫ్రాన్సు దేశమంతటా హై అలర్ట్ ప్రకటించి పోలీసులు కక్షుణ్ణంగా గాలిస్తున్నారు. కొందర్ని అరెస్టు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయులందరూ ఆ పత్రిక పై దాడిని, ఎడిటర్-ఇన్-చీఫ్ స్టీఫేన్ చార్బోనియర్ తో సహా 10 మంది సిబ్బందిని కాల్చివేయడాన్ని ఖండిస్తున్నారు. స్టీఫేన్ 2013 నుండి అల్ కైదా హిట్‌లిస్టులో వున్నారు.
ఇంతకీ ఆ పత్రిక ఇస్లాం వ్యతిరేకియా? ముస్లిములకు వ్యతిరేకంగా కార్టూన్లు వేసి, వారిని రెచ్చగొట్టి, వారు ప్రతిక్రియ చేయగానే ప్రపంచవ్యాప్తంగా ఖండనలు చేసేట్లు చేయడమే లక్ష్యమా? తరతరాలుగా ఫ్రాన్సులో వెలసిల్లిన స్వేచ్ఛాభావాలకు, ఉదారవాదాలకు ప్రతీక ఆ పత్రిక. మతానికి, రాజకీయాలకు ముడిపెట్టకూడదని, అందర్నీ సమానంగా చూడాలనీ, ఎవరికైనా సరే తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించే వాతావరణం వుండాలని ఫ్రెంచ్ పౌరులు కోరుకుంటారు.
అందుకే రాజకీయాలు కానీ, తత్త్వశాస్త్రం కానీ, కళల విషయంలో కానీ నూతనధోరణులు ఫ్రాన్సులో వచ్చినంతగా వేరే చోట రాలేదు. అలాటి ఫ్రెంచ్ సమాజం యిటీవల సంకుచితం అయిపోతోంది. ఫ్రాన్సుకు గతంలో వలసరాజ్యాలుగా వున్న అనేక దేశాలు, వలస కారణంగా వారికి సిద్ధించిన పౌరసత్వం ఆసరాతో ఫ్రాన్సుకు తరలివచ్చి స్థిరపడుతున్నారు. మౌలికంగా వీరిలో ఫ్రెంచ్ ఉదారవాదం లేదు. సాంకేతికంగా చూస్తే వీరందరూ ఫ్రెంచ్ సమాజంలో భాగమే కాబట్టి యిప్పటి ఫ్రెంచ్ సమాజం గతంలోలా కాకుండా మతమౌఢ్యానికి లొంగుతోంది. ఇది సహజంగా అనాదిగా ఫ్రెంచ్ సంస్కృతిని అభిమానించేవారిని బాధిస్తోంది.
మన దేశం రాజరికం వర్ధిల్లినపుడు కూడా రాజులు తమ ఆస్థానాలలో విదూషకులను, వికటకవులను పోషించేవారు. రాజు చేసే తప్పులను వ్యంగ్యంగా ఎత్తిచూపే చనువు, అధికారం వీరికి వుండేవి. వీరి వ్యాఖ్యలతో రాజులు వులిక్కిపడి, తమ తప్పులు దిద్దుకునేవారు. బ్రిటిషువారు రాజ్యం చేసే రోజుల్లో కూడా పత్రికల్లో కార్టూన్లను ఒక హద్దువరకు అనుమతించేవారు. నెహ్రూ ప్రధాని కాగానే ''శంకర్స్ వీక్లీ'' అనే కార్టూన్, వ్యంగ్య పత్రిక నడిపే శంకరన్ పిళ్లయ్‌ను పిలిచి 'నన్ను వదిలిపెట్టవద్దు, అవసరమైతే చీల్చి చెండాడు.' అని కోరాడు.
అలాటి ఉదారవాది కూతురు ఇందిరా గాంధీ ఎమర్జన్సీ, సెన్సార్‌షిప్ విధించడంతో దానికి నిరసనగా శంకరన్ తన వీక్లీని మూసివేశాడు. భారతదేశంలోనే యీ పాటి స్వేచ్ఛ వున్నపుడు, ఉదారవాదానికి పుట్టినిల్లయిన ఫ్రాన్సు వాతావరణం కలుషితం కావడం వామపక్ష భావాలున్న వారిని మరీ బాధించింది. వారు నడిపే పత్రికే ''చార్లీ హెబ్డో''. ఇది ఇస్లామ్‌కే కాదు, ఏ మతానికైనా, ఏ వ్యవస్థకైనా, ఏ ఉగ్రవాదానికైనా వ్యతిరేకమే.
ఒక్క మాటలో చెప్పాలంటే దేనిలోనైనా అతి కనబడితే అది వదిలిపెట్టదు. ప్రతిఘటిస్తుంది. దానికి అది వుపయోగించే ఆయుధం – వ్యంగ్యం. హిట్లర్ అంటే ప్రపంచమంతా వణికే లేక గౌరవించే రోజుల్లో చార్లీ చాప్లిన్ అతన్ని వెక్కిరిస్తూ ''గ్రేట్ డిక్టేటర్'' తీశాడు. ఇప్పుడు చార్లీ చేస్తున్నదీ అదే. ఇటీవలి కాలంలో మతం అనేది పెద్ద వ్యవస్థగా ఏర్పడి, దాని పేర హింస పెరిగింది కాబట్టి మతంపై ఎక్కువగా దృష్టి పెట్టింది.
మతం పేర మీద హింస జరిపేవారిని చూసి భయపడవద్దు, ఫకాలున నవ్వండి, ఆ విధంగా వారిని నిర్వీర్యం చేయండి అన్నదే వారి ఫిలాసఫీ. ఇది మతం పేర జనాలను కూడగట్టేవారిని, అడలగొట్టేవారిని మండిస్తోంది. తమను చూసి హేళనగా నవ్వుతూండే వారిని ఎలా లొంగదీసుకోవడం?
కరక్టుగా చెప్పాలంటే చార్లీ పత్రిక ఇస్లాంకు కాదు, ఇస్లాం పేర మీద నడుస్తున్న టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తోంది. వెక్కిరిస్తోంది. ఇటీవలి కాలంలో ఇస్లాం పేర ఉగ్రవాదం పెరిగింది కాబట్టి చార్లీ వెక్కిరింతలూ పెరిగాయి. అంత మాత్రం చేత వాళ్లు మరో మతాన్ని నెత్తిన పెట్టుకున్నారని అనుకోనక్కరలేదు.
''జీసస్ ఆన్ ద క్రాస్'' అని పాప్యులర్ బ్రిటిష్ టీవీ షో వస్తే దాన్ని వెక్కిరిస్తూ 2006లో ఆ పత్రిక శిలువపై వున్న క్రీస్తును ముఖచిత్రంగా వేసి ''నేను సెలబ్రిటీనర్రా, యిక్కణ్నుంచి దింపండి'' అని మొర పెట్టుకుంటున్నట్టు కార్టూన్ వేశారు. 2010లో పోప్ బెనెడిక్ట్ 16 బొమ్మ ముఖచిత్రంగా వేసి, ఆయన చేతిలో కాండోమ్ పెట్టారు.
2011లో మహమ్మద్ ప్రవక్త బొమ్మ వేసి ''నవ్వకపోతే 100 కొరడా దెబ్బలు'' అని బెదిరిస్తున్నట్లు రాశారు. ఈ సంచిక వెలువడ్డాక ఆ పత్రిక ఆఫీసులపై బాంబులు పడ్డాయి. రాజకీయ నాయకులు, పత్రికాధిపతులు అనేకమంది 'ముస్లిములతో ఎందుకు వచ్చిన గొడవ, వూరుకోవాల్సింది' అని సలహా యిచ్చారు. ఫ్రాన్సులో, అమెరికాలో వున్న మతాధికారులు హెచ్చరించారు కూడా. మేమనుకున్నది మేం చెప్పకూడదా? అని అడిగితే 'మీకా స్వేచ్ఛ వుంది..
అయినా లేనిపోని తంటాలు ఎందుకు తెచ్చుకోవడం అని మా సలహా' అని మాటలు నాన్చారు. 'మేం అలా అనుకోవడం లేదు. హాస్యానికి, వ్యంగ్యానికి ప్రయోజనం వుంది. టెర్రరిస్టులంటే ప్రజలు భయపడడం మానేసినప్పుడే వారు నిర్వీర్యం అవుతారు. మీరు వారిని చంపడానికి సైన్యాన్ని పంపుతున్నారు. మేం హాస్యంతో వారి యిమేజిని దెబ్బ తీస్తున్నాం' అని వాదించింది చార్లీ. ఇస్లాం పేర మీద జరుగుతున్న ఉగ్రవాదాన్ని మహమ్మద్ ప్రవక్త కూడా నిరసిస్తున్నాడన్న అర్థంలో కార్టూన్ వేశారు. ప్రవక్త చుట్టూ అతని నేటి అనుచరులు వుంటారు.
వీళ్లను ఏం చేయాలో తెలియక ఆయన తల పట్టుకుని 'ఇలాటి మూర్ఖుల చేత ప్రేమింపబడడం మహ కష్టం సుమా' అంటూంటాడు. అలాగే యీ జిహాదీలు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఆయన్నే దెబ్బ తీస్తున్నారన్న అర్థంలో ఐయస్ వాళ్లు ప్రవక్త తల ఎగరేస్తున్నట్లు కార్టూన్లు వేశారు. ఇక యీ పత్రికను ఏదో ఒకటి చేయకపోతే తమను అందరూ బఫూన్లుగా చూస్తారన్న భయం పట్టుకుంది ఐయస్‌కు. తక్కినవారిని భయపెట్టాలంటే ముందు యీ విదూషకుడి పని పట్టాలి. అందుకే ఘోరంగా చంపివేశారు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)