ఫ్రాన్స్ వరుస ఉగ్రదాడులతో విలవిల్లాడుతోంది. రాజధాని ప్యారిస్‌లోని ఓ పత్రికా కార్యాలయంపై బుధవారం తీవ్రవాదులు దాడికి తెగబడిన విషయం విదితమే. ఆ రోజు ఆ ఘటనలో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన తీవ్రవాదులు, నిన్న మళ్ళీ కాల్పులు జరిపారు ఓ మెట్రో రైల్‌లో. అక్కడా ఓ పోలీస్ ప్రాణాలు కోల్పోగా, కొందరికి తీవ్రగాయాలయ్యాయి.
తాజాగా ఈ రోజు మరోమారు తీవ్రవాదులు రెచ్చిపోయారు. విమానాశ్రయానికి దగ్గరలోగల ఓ గొడౌన్‌లోకి చొరబడిన తీవ్రవాది, కొందర్ని ఆ గొడౌన్‌లో బందీగా పట్టుకున్నాడు. ఐదారు గంటలుగా ఆ గొడౌన్ చుట్టూ భారీగా భద్రతాదళాలు మోహరించాయిగానీ, ఆ ఆపరేషన్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంకోపక్క ఓ తీవ్రవాది, గ్రోసరీ స్టోర్‌లోకి చేరి, ఇద్దర్ని బలితీసుకున్నాడు, మరికొందర్ని బందీలుగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నాడు.
ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడాల్సి వుందనీ, పత్రికా కార్యాలయంపై దాడి ఘటన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుడ్ని విడుదల చేయాలనీ దుండగులు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఇప్పటిదాకా ఇలాంటి తీవ్రవాద దాడుల్ని చూడని ఫ్రాన్స్ ఒక్కసారిగా తీవ్ర గందరగోళంలో పడిపోయింది. తీవ్రవాదుల్ని ఎలా ఎదుర్కోవాలో ఫ్రాన్స్ భద్రతాదళాలకు సైతం అర్థంకాని పరిస్థితి.
ఇదిలా వుంటే, ఫ్రాన్స్ పొరుగుదేశాల్లోనూ తీవ్రవాదులు జొరబడే అవకాశాలున్నాయంటూ ఆయా దేశాల్లోని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించేసరికి, అక్కడి భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ప్రధానంగా బ్రిటన్‌లో విమానాల హైజాక్ జరిగే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగినట్లుగా తీవ్రవాద దాడి జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో, బ్రిటన్ అంతటా హైఅలర్ట్ ప్రకటించి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.