''సౌండ్ ఆఫ్ మ్యూజిక్'' అనే 1965 నాటి హాలీవుడ్ సినిమా చాలా చాల గొప్ప హిట్. ఇల్లాలు లేని ఒక యింట్లోకి గవర్నెస్‌గా వచ్చి సంగీతంద్వారా పిల్లలను ఆకట్టుకుని ఓ పద్ధతిలో పెట్టిన ఓ పడుచమ్మాయి కథ అది. దాని ఆధారంగా ''రావుగారిల్లు'' అనే సినిమా తెలుగులో 1989లో వచ్చింది. ''సౌండ్ ఆఫ్ మ్యూజిక్'' సినిమాకు ఆధారం ఓ మ్యూజికల్. కథంతా ఆస్ట్రియాలో నడుస్తుంది. ఆ సినిమాలో హీరో ఓ నేవీ కాప్టెన్. ఏడుగురు పిల్లలు. భార్య పోయింది. యుద్ధరంగం వదలి యింటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటున్నాడు. అయితే వాళ్లను మిలటరీ క్రమశిక్షణలో పెంచుదామని చూస్తున్నాడు. కానీ ఆ పిల్లలు రాలుగాయలు. వాళ్ల సంరక్షణ చూసుకోవడానికి వచ్చినవాళ్లను అడలగొట్టి పంపేస్తున్నారు. ఇంట్లోనే వుండి పిల్లల్ని చూసుకుంటూ వాళ్లకు మర్యాదా, మప్పితం నేర్పుతూ చదువుసంధ్యలు పట్టించుకుంటూ వుండేవాళ్లను గవర్నెస్ అంటారు. పోను పోను కెప్టెన్‌కి గవర్నెస్‌లు దొరకడం మానేశారు. సమీపంలో వున్న ఓ చర్చ్‌కి రాశాడు. నన్‌లుగా ట్రెయినింగ్ అయ్యేవారిలో ఎవరినైనా పంపమని
ఆ చర్చిలో నన్‌గా ట్రెయినింగ్ అవుతున్న మేరియా అనే అమ్మాయి వుంది. ఆ అమ్మాయి మంచిదే కానీ అక్కడి డిసిప్లిన్‌కు లొంగని స్వేచ్ఛాజీవి. చర్చిలో ప్రార్థనలకంటె పచ్చిక బయళ్లలో తిరుగుతూ హాయిగా పాటలు పాడుకోవడం ఆమె సరదా. క్రమశిక్షణ అంటే ఆమె వంటికి పడదు. నేవీ కాప్టెన్ నుండి ఉత్తరం రాగానే మదర్ సుపీరియర్‌్ ఈ మేరియాను వదిల్చేసుకుంది. ఆ పిల్లలకు గవర్నెస్‌గా వెళ్లి వాళ్లను సంస్కరించు అంటూ తోలేసింది. ఇక ఈ అమ్మాయి 'కెప్టెన్, ఏడుగురు పిల్లలూట, బాబోయ్' అంటూ గుండెలు బాదుకుంటూనే అయినా సాధిస్తా అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ కెప్టెన్‌గారి భవంతికి చేరింది. కెప్టెన్ విజిల్‌తో కంట్రోలు చేస్తూ తన పిల్లల్ని హీరోయిన్‌కు పరిచయం చేశాడు. కెప్టెన్ క్రమశిక్షణతో పిల్లల్ని పద్ధతిగా పెంచుతున్నానని అనుకుంటాడు. కానీ ఆయన పని మీద యింకో వూరు వెళ్లగానే వీళ్లు తోక ఝాడిస్తారు. కెప్టెన్‌గారు పెద్ద జమీందారు. ఎస్టేటు వ్యవహారాలుంటాయి కదా!
ఇంగ్లీషు సినిమాలో యీ పిల్లల తల్లి యైన హీరో మొదటి భార్య గురించి ఏమీ వుండదు. ఆమె ఎలాటిదో, పిల్లలు యిలా ఎందుకయ్యారో ఏమీ తెలియదు. అయితే తెలుగు సినిమా యిలా ప్రారంభం కాదు. హీరో, అతని మొదటి భార్యతో ఎంత అన్యోన్యంగా వుండేవాడో, వాళ్లిద్దరూ కలిసి పిల్లల్ని ఎంత చక్కగా పెంచేవారో విపులంగా చూపించారు. హీరో నాగేశ్వరరావు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆయన భార్య జయసుధ చాలా మంచి గృహిణి. పెళ్లయి 18 ఏళ్లయింది. ఇద్దరూ అన్యోన్యంగా వుంటారు. వాళ్లకు అయిదుగురు పిల్లలు. కాలేజీకి వెళ్లే ఓ కూతురు, తర్వాత ఇంటర్ చదివే ఓ కొడుకూ, ఆ తర్వాత ముగ్గురు చిన్నపిల్లలూ వున్నారు. చిన్నపిల్లలు ఓ రకమైన అల్లరి చేస్తే, పై వాళ్లిద్దరిదీ మరో రకమైన వికారం. అమ్మాయికి సినిమాతారల పిచ్చి. అబ్బాయికి చదువు ఎగ్గొట్టే లక్షణం. వాళ్లకో ఫ్యామిలీ ఫ్రెండ్ – మురళీమోహన్. అతను ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్. ఇలా సరదాగా సాగే వీళ్ల సంసారం అనుకోకుండా ఓ దుర్ఘటన. జయసుధ యాక్సిడెంటులో పోయింది. దీనితో నాగేశ్వరరావు కృంగిపోయాడు. తాగుడుకు బానిసయ్యాడు. పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. ప్రాక్టీస్ మూలబడింది. పిల్లలు చెడిపోసాగారు. చిన్నపిల్లలకోసం టీచరును పెడితే వాళ్లని తరిమేస్తున్నారు. పరిస్థితి చూసి మురళీమోహన్ తనకు దూరపుచుట్టం ఒక అమ్మాయిని టీచరుగా పెడతానన్నాడు. ఆమెయే రేవతి. ఆమె గవర్నెస్‌గా రాగానే పిల్లలు తమ ట్రిక్కులు వుపయోగించి హడలగొట్టి పంపేయబోయారు. కానీ నాగేశ్వరరావు అది కనిపెట్టి వాళ్లను దండించబోయాడు. కానీ రేవతి చల్లార్చి ఊరుకోబెట్టింది. పిల్లల గదులు సర్దింది. రుచిగా వంట చేసి పెట్టింది. ఏం చేసినా పెద్ద కొడుకు, పెద్ద కూతురు యీమె అంటే అసహ్యించుకుంటూనే వున్నారు. ఆమె చేసిన వంట తినేవారు కాదు.
ఇంగ్లీషు ఒరిజినల్‌లో హీరోయిన్ యింత పద్ధతైన మనిషి కాదు, అందువలన డైనింగ్ టేబుల్ వద్దకు లేటుగా వస్తూ హీరో చేత చివాట్లు తింటోంది. ఆయన మిలటరీ డిసిప్లిన్‌కి తట్టుకోలేక అల్లాడుతోంది. ఇంట్లో అంత డిసిప్లిన్ వున్నా ప్రేమ దారి దారిదే. హీరో పెద్ద కూతురు అంతస్తులు మరచి ఓ పోస్ట్‌మన్‌తో ప్రేమలో పడింది. ఓ రాత్రి బయటి తోటలో వర్షంలో తడిసి తండ్రి కంట పడడానికి భయపడి హీరోయిన్ గదిలోకి చొరబడింది. ఈమె ఆదరించి ఆమె అభిమానాన్ని చూరగొంది.
తెలుగులో ప్రేమ గొడవ పెట్టకుండా కూతురు సినిమాకి వెళ్లి రావడం పెట్టారు. రేవతి ఆమెను వెనకేసుకుని వచ్చింది – అచ్చం తల్లిలాగానే! మరి చిన్నపిల్లలు ఎలా ఆకర్షింపబడ్డారంటే.. పెద్ద పిల్లలు హారర్ సినిమా చూస్తూంటే వీళ్లూ చూసి భయపడిపోయారు. రేవతి గదిలోకి వచ్చి ఆశ్రయం పొందారు. ఆమె వీళ్లని చేరదీసి కథలు చెప్పింది. చిన్నపిల్ల తనను స్కూల్లో దింపమని అడిగితే స్వయంగా దింపింది.
ఇంగ్లీషులో హారర్ సినిమా అక్కరలేకపోయింది, గట్టిగా ఉరుములు, మెరుపులు వచ్చి పడితే వాళ్లు యీమె వద్దకు వచ్చి చేరారు. ఈమె ఓ బ్యూటిఫుల్ సాంగ్ పాడి వాళ్లను హుషారు చేసింది. దానికి గాను పిల్లల తండ్రి చేత తిట్లూ తింది. నిజానికి ఇంగ్లీషు సినిమాలో సంగీతానిదే ప్రముఖపాత్ర. అదే గవర్నెస్‌ను, పిల్లలను దగ్గరకు చేరుస్తుంది. పిల్లలకు సంగీతం నేర్పి, వాళ్లలో హుషారు కలిగిస్తుంది హీరోయిన్. నిజానికి హీరో కూడా సంగీతప్రియుడే. కానీ భార్య పోయాక సంగీతాన్ని మర్చిపోయాడు. పిల్లలను దండించి అదుపులో పెట్టబోయాడు. హీరోయిన్ పిల్లలచేత పాటలు పాడించడంతో అతనికీ గతం గుర్తుకు వచ్చింది. సంగీతం, నాట్యం మళ్లీ పుంజుకున్నాయి. ప్రేమ కనబరచి పిల్లలకు చేరువయ్యాడు. తనను పిల్లలకు చేరువ చేసిన ఈ గవర్నెస్ అంటే యిష్టపడ్డాడు.
కథ యింత సాఫీగా నడిస్తే గొప్పేముంది? దానికో మెలిక పెట్టాలి. ఓ జమీందారిణి రూపంలో పెట్టారు. ఈ హీరో ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు. ఆవిడ వితంతువు. ఆవిడ తననూ, తన పిల్లల్నీ బాగా చూసుకుంటుందని హీరో నమ్మకం. అయితే ఆవిడకు యీ పిల్లలంటే విసుగు. వాళ్లను రెసిడెన్షియల్ స్కూల్లో పడేసి హీరోతో హాయిగా వుందామని దీర్ఘప్రణాళిక వేసుకుని పెళ్లికి ఒప్పుకుంది. అయితే కాస్సేపయినా పిల్లలంటే ప్రేమ వున్నట్టు నటించాలి కదా. ఈ హీరో, హీరోయిన్, జమీందారిణి మధ్య జరిగే ట్రయాంగిల్ ఎఫయిర్ ఇంగ్లీషు సినిమాలో కాస్సేపు నడుస్తుంది. తెలుగులో యిది లేదు. ఈ సినిమాలో హీరోయిన్ జూలీ ఆండ్రూ. తన పాటలతో, నటనతో ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. హీరోగా వేసినది క్రిస్టఫర్ ప్లమ్మర్. మంచి హుందాగా వుంటూ, తన పాటలు తనే పాడుకున్నాడు.
హీరో జమీందారిణిని తన ఎస్టేటుకి తీసుకువచ్చి పిల్లలకు సన్నిహితం చేద్దామని అనుకున్నాడు. పిల్లలు చాలా క్రమశిక్షణలో పెరిగారని చెప్పబోయాడు. తీరాచూస్తే వాళ్లు వచ్చే సమయానికి గవర్నెస్ పిల్లలతో బాటు తనూ ఆడిపాడి, నీళ్లలో తడిసి వస్తోంది. దాంతో ఒళ్లు మండి, పిల్లలను లోపలకి పంపించి గవర్నెస్‌తో నీ శిక్షణ యింత లక్షణంగా వుందేమిటని చడామడా తిట్టాడు. పిల్లలు ఎదుగుతున్నారనీ గ్రహించి, వారి మనోభావాలు అర్థం చేసుకుంటే మంచిదని హీరోయిన్ హీరోతో వాదించింది. సరదాగా వున్నంత మాత్రాన చెడిపోయినట్టు అర్థంకాదని గట్టిగా నొక్కి చెప్పింది. నా పిల్లల గురించి నువ్వేం చెప్పనక్కరలేదు, యిక దయచేయ్ అన్నాడు. అంతలో యింట్లోంచి ఓ పాట వినబడింది. లోపలకి వెళ్లి చూస్తే తన పిల్లలు జమీందారిణికి పాట వినిపిస్తున్నారు. గతం గుర్తుకు వచ్చి తనూ గొంతు కలిపాడు. జమీందారిణిని తన పిల్లలు మెప్పించడం చూసి మురిసిపోయి వాళ్లకు ట్రైనింగ్ యిచ్చిన హీరోయిన్ వద్దకు వెళ్లి వుండిపోమని కోరాడు.
ఆ మాత్రం ప్రోత్సాహం యిస్తే మన హీరోయిన్‌ను పట్టతరమా? వెంటనే ఓ పప్పెట్ షో ఏర్పాటు చేసింది. హీరోని మొహమాట పెట్టి పాట పాడించేసింది. ఇంట్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేసినపుడు పిల్లలతో అద్భుతమైన పాట పాడించింది కూడా …అంతేకాదు, హీరోతో కలిసి అద్భుతంగా డాన్సు చేసింది. ఆ క్రమంలో అతనిపై ఆమెలో ప్రేమ రగిలింది. అది జమీందారిణి గుర్తించింది. ప్రేమలో పడుతున్నావు సుమా అని హెచ్చరించింది. చర్చిలో నన్ (బ్రహ్మచారిణి)గా తర్ఫీదు అవుతున్న తను యిలాటి ప్రమాదాలకు దూరంగా వుండాలనుకుని హీరోయిన్ ఎవరికీ చెప్పకుండా చర్చికి తిరిగి వెళ్లిపోయింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)