1972. అవి గొల్లపూడి మారుతీరావుగారు ఆలిండియా రేడియోలో పని చేస్తూ సినిమాలకు రచనలు చేస్తూన్న కాలం. ఆయన నిర్మాతల్లో అట్లూరి పూర్ణచంద్రరావుగారు ఒకరు. ఆయన ఎస్.భావనారాయణ గారి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేసి ప్రతిభ, పరిశ్రమతో పాపులారిటీ సాధించి నిలదొక్కుకున్న నిర్మాత. సాహసి. వ్యాపారానికి కావలసిన ముందుచూపు, ఒక నిర్ణయం తీసుకోవడంలో మొండిధైర్యం కల మనిషి. కొత్త తరహా సినిమాలు కూడా తీసి ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి. హీరోల చుట్టూ కథలు తిరిగే రోజుల్లో లక్ష్మీ ప్రొడక్షన్స్ పేరిట వ్యాంప్ వేషాలు వేసే విజయలలితను స్టంట్ హీరోయిన్గా పెట్టి ''రౌడీరాణి'' (1970) సినిమా తీసి హిట్ చేశారు. ఆ సినిమాకు ఆధారం ''డెత్ రైడ్స్ ఎ హార్స్''. ''లాస్ట్ యిన్ ద డిజర్ట్'' అనే మరో ఆంగ్ల చిత్రాన్ని తెలుగులో తీయాలని గొల్లపూడిని రచయితగా పెట్టుకున్నారు. దీని కథంతా ఒక చిన్న పిల్లవాడి చుట్టూ తిరుగుతుంది. డబ్బున్న కుటుంబంలో ఏకైక సంతానమైన ఒక కుర్రవాడు తన మేనమామతో ప్రయివేటు విమానంలో వెళుతూండగా అది ఒక ఎడారిలో కూలిపోయింది. మేనమామ చచ్చిపోయాడు. కుర్రవాడు ఒంటరివాడై పోయాడు. అతన్ని రక్షించడానికి ఒక బృందం, అతన్ని చంపడం ద్వారా ఆస్తిని భక్షించడానికి మరో బృందం బయలుదేరతాయి. ఎడారిలో ఆ కుర్రవాడు అష్టకష్టాలు పడతాడు. ఈ కథకు గొల్లపూడి ''పాపం పసివాడు'' అని టైటిల్ సూచించి తెలుగు సినిమాకు కావలసినట్లుగా కథ అల్లారు. ఎడారిలో షూటింగుకై రక్షణ శాఖ అనుమతి తీసుకుని, ఎండల్లో ఎడారిలా మకాం పెట్టి 20 రోజుల షూటింగు చేశారు. ఒక చిన్న విమానాన్ని కొన్నారు. సినిమా ప్రచారానికి వూరూరా కరపత్రాలు విమానంలో ఆకాశం నుంచి వెదజల్లారు. కరుణరసం, ఉత్కంఠ కలిపిన యీ సినిమా పెద్ద హిట్ అయింది.
అప్పటి రాష్ట్రపతి వివి గిరిగారు తెలుగువాడు. ఆయనకు యీ సినిమా చూపిద్దామని నిర్మాత పూర్ణచంద్రరావు అనుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఎవరికో హిందీ పాఠాలు స్వామి అనే ఒకాయన ద్వారా రాష్ట్రపతి భవన్లో సినిమా ప్రొజక్షన్కు ఆహ్వానం లభించింది. 1973 జనవరిలో నిర్మాత, గొల్లపూడి, దర్శకుడు వి.రామచంద్రరావు ఢిల్లీ వెళ్లి గిరిగారిని కలిసి సినీనిర్మాణంలో వాళ్ల సాహసాలూ, సినిమా విజయం గురించి చెప్పారు. ఆయన ఓపికగా విన్నారు. తర్వాత ఆయనా, ఆయన కుటుంబసభ్యులూ, మరి కొద్దిమంది సభ్యులతో ప్రొజక్షన్ హాలు నిండింది. సినిమా చివరిదాకా చూసి వీళ్లను అభినందించారు. ఎలాగూ యింతదూరం వచ్చాం కదాని చండీగఢ్ వెళ్లి మళ్లీ ఢిల్లీ చేరారు.
పేపరు తిరగేస్తూంటే సాయంత్రం బెంగాలీ, హిందీ నటుడు ఉత్పల్ దత్ వేస్తున్న ''తూటా'' అనే బెంగాలీ నాటక ప్రదర్శన వుందని తెలిసింది. గొల్లపూడి, పూర్ణచంద్రరావు టిక్కెట్లు తెప్పించుకుని ఢిల్లీలో జనవరి చలి భరించలేక కోట్లు వేసుకుని బయలుదేరారు. హాల్లో మధ్య బ్లాక్‌లో మొదటి వరసలో కూర్చుని చూడసాగారు. బెంగాలీ సగంసగం అర్థమవుతూ ఉత్పల్ దత్ నటనాకౌశలానికి ముగ్ధులవుతూ వుండగా సగం నాటకం అయేసరికి ఎవరో వెనక మెల్లగా మాట్లాడుతున్నట్లనిపించి వెనక్కి చూశారు గొల్లపూడి. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ రెండో వరసలో అటు చివర కూర్చుని పక్కన కూర్చున్న బెంగాలీ మహిళ (ఆమె ఉత్పల్ భార్య సోయా) డైలాగుల అర్థం వివరిస్తూంటే వింటున్నారు. ఇందిర శాంతినికేతన్లో కొంతకాలం చదువుకున్నారు. బెంగాలీ కొద్దిగా తెలుసు. లలిత కళలంటే అభిమానం వుంది కాబట్టి, ఉత్పల్‌పై గౌరవంతో నాటకానికి వచ్చారు. దేశప్రధానిని అలా నాటకాభిమానిగా చూడడం థ్రిల్లింగ్‌గా తోచింది గొల్లపూడికి. పూర్ణచంద్రరావును గోకారు. ఆయనా చూసి తుళ్లిపడ్డాడు. నాటకం నడుస్తూండగా మధ్యమధ్యలో ఆమె కేసి చూడసాగారు. విచిత్రమేమిటంటే వీళ్లెన్నిసార్లు చూసినా ఆవిడా వీళ్లనే చూస్తోంది. అలా చూడడం గొప్పగా తోచి వీళ్లు మళ్లీ మళ్లీ చూశారు. ఆవిడా మళ్లీమళ్లీ…!
నాటకం అయిపోయింది. అప్పటికి ప్రేక్షకులందరికీ ప్రధాని హాల్లో వున్నట్టు అర్థమై లేచి కదలకుండా నిలబడ్డారు. ఆవిడ వెళ్లాకనే ఎవరైనా కదలాలి. అందుకే వీళ్లిద్దరూ కూడా నిలబడ్డారు. ఇందిర వీళ్లిద్దరినే గమనిస్తున్నారు. ఎంతోసేపు నిశ్శబ్దం. కాస్సేపయాక ఇందిర వీళ్లను సూటిగా చూసి ''కెన్ ఐ గో? (నేను వెళ్లవచ్చా?'' అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక వీళ్లు కంగారుపడిపోయారు. ఈ లోగా ఒకాయన వెనకనుంచి పరుగున వచ్చి ''బయలుదేరండి మేడమ్'' అన్నారు. అప్పుడావిడ కదిలారు. ఆ వచ్చిన వ్యక్తిని చూశాక వీళ్లకు విషయం అర్థమైంది. ఆ వ్యక్తి చొక్కా కాలరు కోటు బయట వేసుకుని వున్నాడు. అతను మఫ్టీలో వున్న యింటెలిజెన్సు ఆఫీసరు. ఆ నాటి వారి గుర్తు కోటు మీద కాలరు వేసుకోవడం. అంత మాత్రమే ప్రధానికి వారు చెప్పి వుంటారు. వీళ్లు కూడా యాదృచ్ఛికంగా కోట్లు వేసుకుని కాలరు బయటకు వేసుకున్నారు. వీళ్లు తన సెక్యూరిటీ అని ఆవిడ అనుకున్నారు. అందుకే వీళ్లు చూసినప్పుడల్లా ఆవిడ గమనించారు. చివర్లో బయలుదేరడానికి వీళ్ల క్లియరెన్సు కోసం అడిగారు. ఇది అర్థమయ్యేటప్పటికి వీళ్లకు తమాషాగా తోచింది.
మర్నాటి అనుభవంతో ప్రధాని సెక్యూరిటీ ఏర్పాట్లు ఎలా వుంటాయో యింకా బోధపడింది. ఆ రోజుల్లో రోజూ ఉదయం ఒక గంటసేపు సమయంలో సామాన్యులెవరైనా సరే ప్రధానమంత్రిని కలుసుకోవచ్చు. వీళ్లు వెళదామనుకుని స్వామి ద్వారా ఎపాయింట్మెంట్ తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు కారులో ప్రధాని యింటి సమీపంలోకి వచ్చేసరికి పంజాబీ దుస్తులు వేసుకుని వున్న ఒక బిచ్చకత్తె వాళ్ల కారుకి అడ్డంగా పరిగెత్తింది. డ్రైవరు బ్రేకు వేశాడు. వీళ్లు అచ్చమైన తెలుగులో ఆమెని తిట్టుకున్నారు. ఆమె రహస్య సిబ్బందిలో భాగం. వీళ్ల మాటలతో తెలుగువాళ్లని రహస్యశాఖకి ఉప్పందిపోయింది. అవి ప్రత్యేకాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు (ఈ సంఘటనలన్నీ తన ఆత్మకథ ''అమ్మకడుపు చల్లగా''లో రాసిన గొల్లపూడి విశాఖ ఉక్కు ఉద్యమం రోజులని పొరపాటుగా రాశారు), తెలుగువాళ్లు ఇందిరపై మండిపడుతున్నారు కాబట్టి తెలుగువాళ్లపై ఒక కన్నేసి వుంచమని యింటెలిజెన్సు వారి ఆదేశాలు. ప్రధానిని పేర్లు నమోదు చేసుకునే టైముకి యిద్దరు తెలుగులో పలకరించారు. ''హైదరాబాదు నుంచి వచ్చినవారెవరు?'' అని పదేపదే ప్రశ్నించారు. మేం కాదు అన్నారు వీళ్లు. తెలుగువాళ్లనగానే హైదరాబాదు అని వాళ్ల భావం. కానీ వీళ్లు వెళ్లినది మద్రాసు నుంచి. కాస్త కన్ఫ్యూజన్ వచ్చింది. అనుమతి పత్రం చేతికి వచ్చి లోపలికి వెళ్లేలోగా తమిళంలో మాట్లాడే అరవాయన, తెలంగాణ భాష మాట్లాడే ఆయన, మరో తెలుగాయన యిలా నలుగురైదుగురు తారసపడి వీళ్లని వడపోసేశారు.
ప్రధానిని కలుసుకోవడానికి వచ్చేవారికి చెట్ల కింద చిన్న చదరలు వేశారు. వచ్చిన బృందాలు ఒక్కొక్క చదర మీద కూర్చుంటారు, ప్రధాని వారి దగ్గరకొచ్చి పలకరిస్తారు. ముందున్న చదరల్లో వున్న పిల్లల వద్దకు ఇందిర వచ్చి ఆప్యాయంగా పలకరించింది. వాళ్లు లేచి నిలబడ్డారు. ఫోటో తీయించుకుంది. వీళ్లలో ఉత్సాహం పెరిగింది. వీళ్ల చదరలో ఎవరో కొత్త మొహం వచ్చి అటుతిరిగి కూర్చున్నాడు. పొమ్మంటే పోడు. కొత్త మనిషి గురించి స్వామి యింటెలిజెన్సు మనిషికి ఫిర్యాదు చేస్తే అతను సాధికారికంగా ''అతను మా మనిషి. అక్కడే వుంటాడు. మేడమ్ వచ్చినపుడు మీరు లేవకూడదు, కూర్చునే మాట్లాడాలి.'' అన్నాడు. ఇందిర రాగానే వీళ్లు పాపం పసివాడు కథ, గిరిగారు మెచ్చుకున్న విషయం చెప్పారు. ఆవిడ నవ్వారు. స్వామి ''మాతాజీ ఒక ఫోటో..'' అంటూ రెండుసార్లు రెట్టించేసరికి ఆవిడ క్లుప్తంగా ''నో, మీరు ఫోటో సినిమాలో కమ్మర్షియల్‌గా వాడితే నేను పార్లమెంటులో సమాధానం చెప్పుకోవాలి.'' అన్నారు. స్వామి మాతాజీ అంటూ లేవబోయేసరికి వెనక కూర్చున్న వ్యక్తి అతన్ని బలంగా కిందకి గుంజాడు.
ఇంత శ్రద్ధ తీసుకున్న రహస్య సిబ్బంది చుట్టూ వున్నా అదే చోట పదకొండు ఏళ్ల తర్వాత ఇందిర హత్య జరిగింది – ఆమె సిబ్బంది చేతిలోనే! – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)