అహంభావియైన అమ్మాయికి బుద్ధి చెప్పడం గయ్యాళియైన పెళ్లాన్ని వంచి వినయవంతురాలిని చేయడం ప్రేక్షకుడికి వినోదం కలిగించే అంశాలు. ఎన్నో సినిమాలలో యిలాటి ఘట్టాలు పెట్టి మనవాళ్లు విజయాలు సాధించారు. అయితే పూర్తిగా గయ్యాళి భార్య మీదనే తీసిన సినిమా విఠలాచార్యగారి కథతో తయారైన ''నిన్నే పెళ్లాడుతా'' అనే 1968 నాటి సినిమా. దానికి మూలం అంతకు పదేళ్ల క్రితం ఆయనే దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ''వద్దంటే పెళ్లి'' అనే సినిమా. దానికి మూలం అంతకు ముందు మూడున్నర శతాబ్దాల క్రితం షేక్‌స్పియర్ రాసిన 'టేమింగ్ ఆఫ్ ద ష్రూ' అనే హాస్యనాటకం. 350 ఏళ్లలో సాంఘికజీవితంలో, మానవదృక్పథంలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని నేటి జీవితానికి అనుగుణంగా కథను మలచుకోవడం సహజం. అదే యింగ్లండ్‌లో అదే కథ ఈనాటి సమాజంలో అయితే ఎలా వుంటుంది అని బిబిసివారు 2005లో 'టేమింగ్ ఆఫ్ ద ష్రూ' అని టీవీ సినిమా తీశారు. మన తెలుగు సమాజంలో యిమిడేట్లా ఆ కథను మనవాళ్లు ఎలా మలచారో చూడడానికి మూలరచనతో పాటు దాన్ని బిబిసి సినిమా కూడా పోల్చుదాం. తెలుగు సినిమా 'నిన్నే పెళ్లాడుతా'తో మొదలు పెట్టి, మూలనాటకంలో ఎలా వుందో చూస్తూ, దాన్ని బిబిసి వాళ్లు ఏ విధంగా మార్చారో చూద్దాం.
తెలుగు సినిమా ప్రారంభంలోనే తెలుస్తుంది – హీరోయిన్ పేరు భారతి శ్రీమంతుల యింటిపిల్ల. హాయిగా షికార్లు కొట్టి ఆలస్యంగా అర్ధరాత్రి అయినా యిల్లు చేరలేదు. ఇదేమిటని ఆమె తండ్రి రావి కొండలరావు లబలబ లాడుతున్నాడు. అతి గారాబంతో ఆమెను చెడగొట్టిన తల్లి సూర్యకాంతం ఆమెను వెనకేసుకొస్తోంది. భార్యావిధేయుడైన రావి కొండలరావు నోరెత్తలేకపోతున్నాడు. అతనిలాటి నోరు లేని జీవే అతని కొడుకు కాకరాల. వాళ్లింట్లో గుమాస్తాగా వున్న రమణారెడ్డికి పరిస్థితంతా తెలిసి బాధపడుతున్నాడు. చివరకు అమ్మాయిగారు అర్ధరాత్రి కారు దిగాక, భర్త ముందు ఆమెను వెనకేసుకుని వచ్చినా సూర్యకాంతం విడిగా కూతుర్ని మందలించబోయింది. రేపు పొద్దున్న పెళ్లయితే ఎలా? అని. 'పెళ్లి అంటే బానిసత్వం. నేను పెళ్లాడను.' అంది భారతి.
హీరో ఎన్టీయార్ రమణారెడ్డి అన్న కొడుకు. మంచి అటగాడు. మొండివాడు. పెళ్లంటే యిష్టం లేదన్నాడు కానీ అమ్మాయి అందంగా వుందని బాబాయి అనడంతో నాటకాలాడి లొంగదీసి పెళ్లి చేసుకుంటానని మాట యిచ్చాడు. సంగీతం మాస్టారిగా ఆ యింట్లో చేరాడు. హీరోయిన్‌ను రెచ్చగొట్టాడు. ఆడది తలచుకుంటే మగాణ్ని మైనపుముద్దగా చేసేయగలదని ఆమె అంటే నేను కరగను, నాకు ఆడాళ్లంటే అసహ్యం అన్నాడు యితను. అతన్ని ఎలాగైనా పెళ్లికి ఒప్పించి పందెం గెలవాలని ఆమె అనుకుంది. ఈ క్రమంలో ఆమె అతన్ని వుచ్చులోకి లాగాలని చూసింది. రొమాంటిక్ స్టోరీస్ చెప్పమంది. చెప్పనంటే ఉక్రోషం వచ్చి అతనిమీద వస్తువులన్నీ విసిరేసింది. అతను ట్యూషన్‌కు రావడం మానేశాడు. ఓ మూడురోజులు చూసి రాకపోతే బెంగ పెట్టుకుంది. అతనికి పెళ్లేమోనని ఎవరో అంటే కంగారు పడింది. నేనే పెళ్లి చేసుకుని సాధిస్తానని ప్రతిజ్ఞ చేసింది. తలిదండ్రులను ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది. అతను లోపల యిష్టం వున్నా పైకి యిష్టం లేనట్టు పెద్ద డ్రామా ఆడాడు. మొత్తానికి పెళ్లి అయిపోయింది.
ఇక్కడిదాకా జరిగిన కథ ఒరిజినల్‌లో ఎలా వుందో చూద్దాం. షేక్‌స్పియర్ నాటకంలో ఓ డబ్బున్నాయన వున్నాడు. ఆయనకు యిద్దరుకూతుళ్లు. ఇద్దరూ అందగత్తెలే కానీ రెండో కూతురు వినయవంతురాలు కూడా. పెద్ద అమ్మాయి గయ్యాళితనం వలన పెళ్లి సంబంధాలు రావటం లేదు. రెండో అమ్మాయిని పెళ్లాడడానికి వచ్చినవాడితో అమ్మాయిల తండ్రి పెద్దమ్మాయికి పెళ్లి అయితే తప్ప రెండోదానికి పెళ్లి చేయనన్నాడు. రెండో అమ్మాయిని పెళ్లాడదామనుకున్నవాళ్లలో ఒకడికి వాడి ఫ్రెండు తగిలాడు. డబ్బు బాగా వుందంటే ఎలాటి అమ్మాయినైనా చేసుకుంటాను అన్నాడు ఆ హీరో. గయ్యాళిఅక్కను చూసి ఆమె అందానికి ముగ్ధుడై చేసుకుంటానన్నాడు. సంగీతమాస్టారిని వెంటపెట్టుకుని వెళ్లాడు. ఆమె వాళ్లను తన్ని పంపించింది. ఆమె అందాన్ని మెచ్చుకున్నా విరుచుకుపడుతోంది. ఇతని మీద పడి రక్కింది. అయినా యితను పెళ్లి చేసుకుంటానన్నాడు. దాంతో ఆమె తండ్రి అతనికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఏ కళనుందో ఆమె సరేనంది. కానీ హీరో ఆమెను శతవిధాలా అవస్థపెట్టాడు. పెళ్లి జరిగే చర్చి దగ్గరకు ఆలస్యంగా వచ్చి ఆమెను కంగారు పెట్టాడు. పిచ్చి డ్రస్సులో వచ్చి తల వంచుకునేట్లా చేశాడు. పెళ్లి కాగానే హనీమూన్‌కి వెళ్లిపోదామన్నాడు. రిసెప్షన్ జాన్తానై అన్నాడు. ఈ కథను బిబిసి వాళ్లు తీసిన సినిమాలో ఆధునికంగా ఎలా మార్చారో చూదాం.
38 ఏళ్లు వచ్చినా హీరోయిన్ కన్యగానే మిగిలిపోయింది. మగవాళ్లంటే పడదు. తండ్రి పోయాడు. డబ్బున్న తల్లి, మోడల్‌గా పనిచేసే చెల్లి వున్నారు. హీరోయిన్ రాజకీయాల్లో చేరి ప్రతిపక్షం నాయకురాలిగా ఎదుగుతోంది. కానీ ఆమెకు విపరీతమైన కోపం. తన వద్ద పనిచేసే అసిస్టెంటు సమాచారం తప్పుగా యిచ్చినందుకు పార్లమెంటు చర్చల్లో ఆమెకు అవమానం జరిగింది. అతనిమీద విరుచుకుపడుతోంది. ఓ రోజు వాళ్ల పార్టీ లీడరు వచ్చి మన పార్టీకి నాయకురాలిగా పోటీ చేయి. నీకు మంచి అవకాశాలున్నాయి అన్నాడు. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని లేకపోతే ఓటర్లు మరోలా అనుకుంటారని కాస్త అనునయంగానే చెప్పాడు. ఈమె ఛస్తే చేసుకోనంది. పెళ్లి చేసుకోమని తనను యిప్పటిదాకా ఎవడూ అడగలేదంది.
చెల్లెలు కొత్తగా ఓ 19 యేళ్ల యిటాలియన్ కుర్రాడితో ప్రేమలో పడింది. ఆమె మోడలింగ్ కెరియర్‌లో 12 యేళ్లగా ఆమె మేనేజర్‌గా వుంటూ తననే పెళ్లాడుతుందని కలలు కంటున్న హ్యారీ ఉలిక్కిపడ్డాడు. ఇది అన్యాయం నన్ను పెళ్లాడు అని అతనంటే మా అక్కకు పెళ్లి కాకుండా మన పెళ్లి ఎలా? అని మడతపేచీ పెట్టింది. గయ్యాళి అక్కను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడేవాడు ఎవడున్నాడు అని అతను వర్రీ అవుతుండగానే హీరో దిగడ్డాడు. హీరో హ్యారీకి స్నేహితుడు. ఒక రాజకుటుంబానికి చెందినవాడే కానీ ప్రస్తుతం డబ్బు లేదు. తండ్రి అప్పులు చేసి చనిపోయాడు. హ్యారీ చెప్పినది విని 'డబ్బుంది కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లాడడానికి నేను రెడీ' అన్నాడు.
మర్నాడు హీరోయిన్, ఆమె చెల్లి హోటల్‌కు వెళ్లారు. చెల్లెలు ప్రసిద్ధ మోడల్ కాబట్టి ఆమె అభిమానులు మూగి ఆటోగ్రాఫ్ అడిగారు. హీరోయిన్ యివ్వవద్దంది. అయినా ఆమె యిచ్చింది. దాంతో హీరోయిన్‌కు కోపం వచ్చి టేబుల్ ఎత్తిపడేసింది. హోటల్లో అంతా గందరగోళం. చెల్లెలి పార్టీలోంచి రుసరుసలాడుతూ బయటకు వచ్చిన హీరోయిన్ని హీరో లిఫ్ట్‌లో పట్టుకున్నాడు. లిఫ్ట్ చాలాసేపు అగిపోతే ఆ లోపున ప్రపోజ్ చేసి పడేశాడు. ఆమె నిర్ఘాంతపోయింది. మర్నాడు కలిసి హోటల్లో లంచ్ చేద్దామని ఫోన్ చేశాడు. నవ్వుకుంది. ఎలా వుంటుందో అనుకుంటూ క్యూరియాసిటీతో వెళ్లింది. అక్కడ హోటల్లో హీరో అందరితో పోట్లాడడం చూసి అతనూ తనలాటి కోపిష్టివాడే అని తెలుసుకుని ఊరడిల్లింది. హీరో తన పూర్వీకుల భవనం వద్దకు తీసుకెళ్లాడు. తమది రాచకుటుంబమని తెలిపాడు. ప్రస్తుతం డబ్బు లేదన్నాడు. ఇలా రాచకుటుంబీకుల టైటిల్ వుండడం రాజకీయంగా లాభదాయకం అనుకుని హీరోయిన్ పెళ్లికి సమ్మతించింది. హనీమూన్‌కి వుంటుందని అతని పేర ఓ భవనం కొనేసింది.
పెళ్లి జరగాల్సిన చర్చికి హీరో ఆఖరినిమిషం దాకా రాలేదు. రాడేమో, పెళ్లి ఆగిపోతుందేమో, ఓటర్లలో తన పరువు పోతుందేమోనని హీరోయిన్ బెంగపడింది. హీరో ఆఖరినిమిషంలో తప్పతాగి పిచ్చిడ్రస్సులో దిగాడు. హీరోయిన్ పెళ్లి కాన్సిల్ చేద్దామనుకుంది కానీ రాజకీయజీవితం దెబ్బతింటుందని వర్రీ అయింది. అదే ఆమె వీక్ పాయింటు కాబట్టి హీరో రెచ్చిపోయాడు. రిసెప్షన్ లేదు, ఏమీ లేదు, పద హనీమూన్‌కి అన్నాడు. గందరగోళం మధ్య పెళ్లి అయింది. అవుతూనే ఆమెను ఎయిర్‌పోర్టుకు ఎగరేసుకుని పోయాడు హీరో. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)