బిసిలకు క్రీమీ లేయర్ వుండాలా వద్దా అన్న ప్రశ్న యివాళ్టిది కాదు. ఎప్పణ్నుంచో ప్రభుత్వం ఆలోచించడం, దానికి బిసి నాయకులు అడ్డం కొట్టడం జరుగుతూ వచ్చింది. తమిళ రాజకీయాలు వ్యాసాల్లో రాశాను – 'బిసిలలో ధనికవర్గాలు మాత్రమే అన్ని ప్రయోజనాలు పొందుతూండడంతో రిజర్వేషన్ ఫలాలు పేదలకూ అందాలనే సదుద్దేశంతో 1979 పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎమ్జీయార్ బిసి రిజర్వేషన్‌లకు ఏడాదికి రూ.9 వేల రూపాయల కంటె ఎక్కువ ఆదాయం వచ్చేవారికి రిజర్వేషన్ వర్తించదని చట్టం చేశాడు. ఈ రూలు పెట్టిన తర్వాత వచ్చిన ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడంతో బిసిలకు కోపం వచ్చి పార్టీకి వ్యతిరేకమయ్యారని భావించి వెంటనే సీలింగు ఎత్తివేయడంతో బాటు బిసిల కోటాను ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 31% నుండి 50%కు పెంచివేశాడు. కులపరమైన జనగణన ఏమీ లేకుండానే ఆ పని చేశాడు. ఇక ఆ తర్వాత ఆ కోటాను తగ్గించడం ఎవరి తరమూ కాలేదు. ఏమైతేనేం ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో ఎడిఎంకెకు బాగా ఓట్లు పడి యిదే సరైన పద్ధతి అనుకునేట్లా జరిగింది.' అని. అప్పణ్నుంచి ఏ ప్రభుత్వమూ క్రీమీ లేయరు గురించి గట్టిగా పట్టుబట్టడం లేదు. ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వోద్యోగాల నియామకంలో అమలు చేయాలని తలపెట్టింది! వెంటనే బిసి నాయకులు, బిసిల సంక్షేమమే తమ ధ్యేయం అని చాటుకునే అన్ని పార్టీల నాయకులూ వ్యతిరేకత తెలుపుతున్నారు. కెసియార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారు. బిసిలకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారు.
ఈ సందర్భంగా రిజర్వేషన్ విధానం గురించి కొన్ని మౌలికమైన సందేహాలు వస్తాయి. రిజర్వేషన్లే వుండకూడదు, అవి అనుమతించాక మళ్లీ వాటిపై నిబంధనలు విధించకూడదు అని కొందరు వాదిస్తారు. మనం దీనిపై ఎంత సబబైన సూచన చేసినా, రాజకీయ కారణాల చేత దినదినం రిజర్వేషన్ల శాతం పెంచుతూ, కొత్తకొత్త కులాలను జాబితాల్లోకి చేరుస్తూ పోతారు కాబట్టి దీని గురించి ఆలోచించడమే దండగ అని కొందరనుకుంటారు. చాలామంది రిజర్వేషన్ల గురించి ఉదారంగా వుంటారు – అవి వారికి అడ్డు రానంతవరకు! వృత్తివిద్యలో సీటో, ఉద్యోగమో, ప్రమోషనో తమకు దక్కేవేళ రిజర్వ్‌డ్ కాండిడేటు ఎవరో వచ్చి తన్నుకుపోయినప్పుడు హఠాత్తుగా కసి పుట్టుకుని వస్తుంది – స్వాతంత్య్రం వచ్చి యిన్నేళ్లయినా యింకా రిజర్వేషన్లు ఏమిటండీ? అంటూ ఆక్రోశిస్తారు.
మొదటగా మనం అంగీకరించవలసినది – సమాజంలో అందర్నీ సమానంగా చేయడం ఎవరి తరం కాదు కానీ, సమానావకాశాలు కల్పించడం శ్రేయోసమాజ లక్ష్యంగా వుండాలి. సమానావకాశం అంటే అందరినీ వరసగా నిలబెట్టి పరుగు పెట్టి, ఎవరు వెళ్లి గమ్యం చేరుకుంటే వారికి బహుమతి అనేయడం కాదు. ఆటల్లో చూడండి – వయసురీత్యా, ఎత్తురీత్యా, బరువురీత్యా, లింగభేదంరీత్యా వర్గీకరణ చేసి అప్పుడు పందెం పెడతారు. మైదానంలో వృత్తాకారంలో పరుగుపందెం పెట్టినపుడు అందరి కంటె లోపల వున్నవాడు తిరగాల్సిన వృత్తం పరిధి తక్కువ కాబట్టి వాణ్ని వెనకగా నిలబడతారు, అందరి కంటె బయటి వృత్తంలో వున్నవాణ్ని ముందుగా నిలబెడతారు. సమాజంలో ముందు నుంచి చదువుసంధ్యలు వున్న కుటుంబాలు కొన్ని వుంటాయి. కొందరు ఆర్థికంగా బలంగా వుండి పిల్లలకు ట్యూషన్లు చెప్పించగలుగుతారు, డొనేషన్లు కట్టగలుగుతారు. కొన్ని ప్రాంతాలలో నీటివసతి, ఆరోగ్యకరమైన వాతావరణం, మంచి పాఠశాలలు, మెరుగైన విద్యుత్ సరఫరా, మంచి గ్రంథాలయాలు వుంటాయి. ఆ వాతావరణంలో ఆ కుటుంబాలలో పెరిగిన పిల్లలు యితరుల కంటె మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
రోజూ అయిదారు మైళ్లు నడిచి వెళ్లి రెండు మూడు బిందెల నీళ్లు యింట్లో పోసి స్కూలుకి వెళ్లే కుర్రవాడికి, నది పక్కన యిల్లుండే కుర్రవాడికి చదువుపై వెచ్చించే సమయంలో తేడా వస్తుంది. చదువుతో పాటు యింటి పనులు కూడా చేయవలసి వచ్చిన ఆడపిల్లకు, చేయనక్కరలేని మగపిల్లవాడికి తేడా వస్తుంది. ఏ చదువు చదివితే ఉపాధి అవకాశాలు బావుంటాయో, ఎక్కడ మంచి కళాశాలలు వుంటాయో తెలుసుకోవడంలో గ్రామంలో రైతు కొడుక్కి, నగరంలో అధికారి కొడుక్కి తేడా వస్తుంది. వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలో చదివినవాడికి, సౌకర్యాలున్న ప్రయివేటు కాన్వెంటులో చదివినవాడికి తేడా వస్తుంది. చదువు ప్రాముఖ్యం తెలియక కొన్నాళ్లు పొలం పనులకు పంపిన తలితండ్రులున్న పిల్లవాడికి, సకాలంలో పాఠశాలలో చేర్చిన తలితండ్రులున్న పిల్లవాడికి వయసు విషయంలో తేడా వస్తుంది. ఇరుకిళ్లల్లో ఐదారుగురి మధ్య, చాలీచాలని వెలుతురులో చదివిన వాడికి, ప్రత్యేకమైన గదిలో సకలసౌకర్యాలతో చదివినవాడికి తేడా వస్తుంది. పోటీ పెట్టినపుడు యిన్ని అంశాలు లెక్కలోకి తీసుకుని, ఒక్కో అంశానికి కొన్నేసి మార్కులు కలుపుతూ వస్తే అప్పుడు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ వస్తుంది.
కానీ ప్రస్తుత సమాజంలో కులం తప్ప యివేమీ పట్టించుకోవడం లేదు. ఫలానా కులంలో పుట్టావా, నీకు సకల సౌఖ్యాలు, సౌకర్యాలు వున్నా సరే రిజర్వేషన్ వుంది. ఫలానా కులంలో పుట్టావా నువ్వు అష్టదరిద్రుడవైనా, నీ తలిదండ్రులు నిరక్షరరాస్యులైనా రిజర్వేషన్ లేదు. ఈ పాలసీ వల్లనే సమాజంలో రిజర్వేషన్ పట్ల యింత విరోధభావం కలుగుతోంది. రిజర్వేషన్ పాలసీకి వాళ్లు చెప్పే ఏకైక భాష్యం – సామాజిక గౌరవం! దళిత కులాల్లో లేదా నిమ్న కులాల్లో పుడితే సమాజం గౌరవించడం లేదు అని. వెనుకబడిన కులాలని చెపుతున్న వాళ్లలో చాలా కులాల వారు తరతరాలుగా మర్యాద, గౌరవం పొందుతూనే వున్నారు. అయినా గౌరవం ఒకరిచ్చేది కాదు, ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం వుండాలి. ఒకసారి జగ్జీవన్ రామ్‌ను అడిగారు – ''ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఐయేయస్‌ల పిల్లలకు కూడా రిజర్వేషన్ వర్తింపచేయడంలో న్యాయం ఏముంది? అటువంటి హోదా దక్కాక వాళ్ల పిల్లల్ని వాళ్లు బాగా చదివించుకుంటారు, పెద్ద ఉద్యోగాలు వేయించుకుంటారు. పైగా వారికి సంఘంలో ఆటోమెటిక్‌గా ఉన్నతస్థానం లభిస్తుంది, అందరూ వంగి దణ్ణాలు పెడతారు. ఇంకా గౌరవం లేకపోవడం ఏమిటి?'' అని. దానికి జగ్జీవన్ రామ్ ''ఒక పేద వంటబ్రాహ్మణుడు హరిజన ఐయేయస్ కంటె ఉన్నతుణ్నని అనుకుంటాడు. ఆ భావం పోయేవరకు రిజర్వేషన్‌లు కొనసాగవలసినదే'' అని జవాబిచ్చారు.
నిజానికి ఎవడి కులం వాడికి గొప్ప. మరొకరి కంటె ఎక్కువ అని, తక్కువని అనుకోనక్కరలేదు. ఒకవేళ ఎక్కువనే భావం వున్నా అది కేవలం వ్యక్తిగతం. కొంతకాలానికి విజ్ఞత కలిగాక పోవచ్చు. అది వుందో, పోయిందో ఎలా తేలుస్తాం? జనాభాలో 99% మంది పోయి, 1% మందికి మాత్రం మిగిలిపోతే అప్పుడేం చేయాలి? సామాజికగౌరవం అనే బ్రహ్మపదార్థాన్ని సాకుగా చూపిస్తూ తమ రిజర్వేషన్లను నియంత్రించకుండా ఆ యా నాయకులు కాపాడుకుంటున్నారు. గతంలో ఎవరికి వారు మాది అగ్రకులం అని చెప్పేవారు. బిసిల రిజర్వేషన్లు అంటూ వచ్చాక ప్రతివాడూ మాది తక్కువకులం, తక్కువాతితక్కువ కులం, మమ్మల్ని సమాజంలో అందరూ హీనంగా చూస్తారు అని చెప్పుకుంటూ కోటాల్లో వాటాలు అడుగుతున్నారు. ఆత్మగౌరవం స్థానంలో ఆత్మన్యూనత వచ్చి చేరింది. ఇది అత్యంత దురదృష్టకరం. బిసి జాబితాలో చేరదలచిన కులాల జాబితా పెరిగిపోతోంది. వీరందరినీ చేరిస్తే అసలు వెనకబడిన కులాలు మరింత వెనకబడతారని ఒక భయం. క్రీమీ లేయర్ వంటి విధానాలను వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసే బిసి నాయకులు వాటిల్లో బాగా వెనకబడిన కులాల స్థితిగతులను ప్రస్తావిస్తారు. వాస్తవానికి చూడబోతే కోటీశ్వరులు, విద్యాధికులు, ఉన్నతాధికారులు బిసిల పేరుతో ఫలితాలు అందుకుంటున్నారు. (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)