ఎమ్బీయస్‌ క్రైమ్‌ రచన : ముంద్‌డా ఎల్‌ఐసి స్కాము

విజయ్‌ మాల్యా ఎగిరిపోయాడు. తను పారిపోలేదని, తిరిగి వచ్చేందుకు ప్రస్తుత తగిన సమయం కాదు కాబట్టి విదేశంలో వున్నానని ట్వీటిస్తున్నాడు. మరో ఘరానా మోసగాడిగా తేలిన మాల్యాకు యుపిఏ, ఎన్‌డిఏ ప్రభుత్వాలు రెండూ సహకరించాయని…

విజయ్‌ మాల్యా ఎగిరిపోయాడు. తను పారిపోలేదని, తిరిగి వచ్చేందుకు ప్రస్తుత తగిన సమయం కాదు కాబట్టి విదేశంలో వున్నానని ట్వీటిస్తున్నాడు. మరో ఘరానా మోసగాడిగా తేలిన మాల్యాకు యుపిఏ, ఎన్‌డిఏ ప్రభుత్వాలు రెండూ సహకరించాయని తేటతెల్లమౌతోంది. బ్యాంకు అధికారులు కానీ సిబిఐ కానీ సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోలేదు. అన్ని విధాలా దగా పడిన కింగ్‌ ఫిషర్‌ ఉద్యోగులు మొత్తుకుంటున్నా యీ అధికారులు చలించకపోవడానికి కారణం ప్రభుత్వంలో మాల్యాకు వున్న దన్నే. యుపిఏ హయాంలో అతనికి బ్యాంకులు అనవసరంగా మద్దతు యిచ్చాయని ఎన్‌డిఏ సర్కారు అంటోంది తప్ప తాము వచ్చిన ఏడాదిన్నరలో పరిస్థితి చక్కదిద్దడానికి తామేం చేశారో చెప్పదు. 'మీరు మాల్యాను పారిపోనిచ్చారు' అని కాంగ్రెసు అంటే, 'మీరు కత్రోకిని పారిపోనిచ్చారుగా' అంటోంది బిజెపి. కత్రోకికి, సోనియాకు వున్న బాంధవ్యం అందరికీ విదితమే. మరి మాల్యాకు బిజెపిలో ఎవరితో బాంధవ్యం వుందో యింకా తెలియదు. ఒకరినొకరు నిందించుకుంటూ కూర్చుంటే మాకేం లాభం అంటారు కింగ్‌ ఫిషర్‌ ఉద్యోగులు. బ్యాంకుల ఉన్నతాధికారులు పడిన లాలూచీ కారణంగా బ్యాంకింగ్‌ వ్యవస్థే రోగగ్రస్తమై ఉద్యోగులు, డిపాజిటర్లు నష్టపోయే పరిస్థితి వచ్చింది. 'ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే, ఆర్థిక నేరస్తులు తమ పనులు సాధించుకోగలరు. మంత్రులు, సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో ఉన్నతోద్యోగులు వారికి కావలసినవన్నీ చేసి పెడతారు' అనేది కఠోర వాస్తవం. ఇది యివాళ ప్రారంభమైనది కాదు, స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచీ వున్నదే. స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లలోనే నెహ్రూ హయాంలో ఒక స్కాము బయటపడి సాక్షాత్తూ ఆర్థికమంత్రి రాజీనామా చేయవలసి వచ్చింది. అలా జరగడం అదే తొలిసారి. దాన్ని బయటపెట్టిన ఘనత నెహ్రూ అల్లుడు ఫిరోజ్‌ గాంధీదే.

హరిదాస్‌ ముంద్‌డా కలకత్తాకు చెందిన మార్వాడీ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1918లో పుట్టాడు. చిన్నవయసులోనే ఎలక్ట్రిక్‌ సామాన్ల వ్యాపారంలో దిగాడు. దానిలో కంటె అతను షేర్ల వ్యాపారంలో ఎక్కువ సంపాదించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కలకత్తా స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో షేర్లు కొని, అమ్ముతూ బ్యాంకుల దృష్టిని ఆకర్షించాడు. వాళ్లు ఋణాలివ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్లిచ్చిన డబ్బుతో అతను అనేక ఇంగ్లీషు కంపెనీలలో మెజారిటీ షేర్లు కొని మేనేజ్‌మెంటు తన చేతిలోకి వచ్చేట్లు చూసుకునేవాడు. తర్వాత ఆ కంపెనీ ఆస్తులు అమ్మి, కుదువబెట్టి డబ్బులు సంపాదించి, మరో కంపెనీ కొనేసేవాడు. అలా అనేక కంపెనీలను తన కనుసన్నల్లో శాసిస్తూ దీనితో బాటు షేర్‌ మార్కెటులో కూడా దుస్సాహసాలు చేయసాగాడు. వసంతం ఎల్లకాలం వుండదు. ముంద్‌డా కొన్న షేర్ల విలువ పడిపోయి 1957 వచ్చేసరికి అతను కలకత్తా స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి భారీ మొత్తాలు బాకీ పడ్డాడు. అప్పటి ఆర్థికమంత్రి టిటి కృష్ణమాచారి ప్రవేశపెట్టిన బజెట్‌ సోషలిజానికి ఊతమిచ్చేట్లు వుంది. దాంతో స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల ధరలు పతనమయ్యాయి. ఆ స్థితిలో ముంద్‌డా అప్పులు రూ.5.25 కోట్లు అయితే మొత్తం ఆస్తుల విలువ రూ.1.55 కోట్లు. దీనిలోంచి బయటపడడానికి అతను ప్రభుత్వధనాన్ని ఉపయోగించుకుందా మనుకున్నాడు. 

చాలామంది ప్రయివేటు వ్యక్తులు ఇన్సూరెన్సు కంపెనీలు పెట్టి ప్రజల్ని మోసగిస్తూ వుండడంతో ప్రభుత్వం అంత కితం ఏడాదే జూన్‌లో 245 చిన్నా, పెద్దా యిన్సూరెన్సు కంపెనీలను జాతీయం చేసి లైఫ్‌ ఇన్సూరెన్సు కార్పోరేషన్‌గా (ఎల్‌ఐసి) ఏర్పరచింది.  తన ఖాతాదారులకు యిన్సూరెన్సు సొమ్ము, బోనస్సు వగైరాలు చెల్లించడానికై వాళ్లు కట్టిన ప్రీమియమ్‌ సొమ్మును సరైన కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టి ఆదాయాన్ని ఆర్జించే వెసులుబాటు ఎల్‌ఐసికి వుంది. తన కంపెనీ షేర్లను ఎల్‌ఐసికి అంటగడదామని ముంద్‌డా ప్లాను చేశాడు. అయితే ఆ సంస్థ ఆర్థిక శాఖ కింద వస్తుంది. ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీగా వున్న ఎచ్‌ఎమ్‌ పటేల్‌ను ఆశ్రయించాడు. ఎచ్‌ఎమ్‌ పటేల్‌ పూర్తి పేరు హీరూభాయ్‌ మూల్జీభాయ్‌ పటేల్‌. ముంద్‌డా కంటె 14 ఏళ్లు పెద్దవాడు. గుజరాత్‌లో పుట్టి, ఆక్స్‌ఫర్డ్‌లో ఎకనామిక్స్‌ చదివి, ఐసియస్‌ (ఐఏఎస్‌ కంటె ముందు వుండేది) అధికారిగా బ్రిటిషువారి వద్ద పనిచేశాడు. 1946లో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ హోం మంత్రి అయినప్పుడు ఆయన వద్ద కాబినెట్‌ సెక్రటరీగా చేరాడు. దేశవిభజన సమయంలో శరణార్థులకు ఆశ్రయం కల్పించడం విషయంలో, సంస్థానాలను విలీనం చేసే విషయంలో పటేల్‌కు కుడిభుజంగా పనిచేశాడు. సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. సర్దార్‌ పటేల్‌కు ఆత్మీయుడైన యీ పటేల్‌కు నెహ్రూ అన్నా, నెహ్రూ సోషలిస్టు విధానాలన్నా పడదు. ఆర్థికమంత్రిగా వచ్చిన టిటి కృష్ణమాచారి స్వయంగా వాణిజ్యవేత్త (టిటికె గ్రూపు ఆయనదే) కావడంతో ఆయనతో మంచి సమీకరణమే కుదిరింది.  

ఎచ్‌ఎమ్‌ పటేల్‌ వద్దకు 1957 జూన్‌ 21 న ముంద్‌డా వచ్చి ''నేను కష్టాల్లో వున్నాను. నా కంపెనీల షేర్లు ఒకేసారి అమ్మకానికి పెడితే ధరలు కుప్పకూలి నష్టపోతాను. అందువలన ఎల్‌ఐసి నా నుండి గుత్తగా రూ.80 లక్షల విలువున్న షేర్లు కొనేసి, అప్పుడప్పుడు షేర్‌ మార్కెట్లో అమ్మకానికి పెడుతూ ధర పడిపోకుండా చూసుకుంటూ పెట్టుబడి రికవర్‌ చేసుకోవచ్చు. దీనితో బాటు ప్రజల్లో నా కంపెనీలపై నమ్మకం పెరగడానికి ఎల్‌ఐసి షేర్‌ మార్కెటు నుంచి డైరక్టుగా రూ. 30-40 లక్షల విలువున్న నా కంపెనీ షేర్లు కొనాలి.'' అని ప్రతిపాదించాడు. ''అంతేనా?'' అన్నాడు పటేల్‌. 

''అంతే అంటే, యింకోటి వుంది. మీరు ఎల్‌ఐసి ద్వారా నాకు కోటి రూపాయల లోను యిస్తే నేను మీ ఎల్‌ఐసికి కోటి రూపాయల బిజినెస్‌ యిప్పిస్తాను.'' అన్నాడు ముంద్‌డా. ''అంతేనా?'' 

''ఇంకోటుంది.. నా కంపెనీల్లో ఎల్‌ఐసి రూ.1.25 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే నేను ఏటా రూ. 15 లక్షల ఫయర్‌ యిన్సూరెన్సు బిజినెస్‌ యిప్పిస్తాను.'' 

వీటిల్లో ప్రభుత్వానికి జరిగే మేలేం చూశాడో పటేల్‌కే తెలియాలి కానీ మర్నాటి కల్లా పటేల్‌ ఎల్‌ఐసికి చైర్మన్‌గా వున్న జిఆర్‌ కామత్‌ను పిలిచి యీ ప్రతిపాదనల గురించి ఆలోచించమన్నాడు. ''మొదటిది ఫర్వాలేదు కానీ తక్కిన రెండూ మాత్రం లాభం లేదు'' అన్నాడాయన. 

''సరే అలాగే కానీయండి, రేపు ఆదివారమైనా సరే, ముంద్‌డాతో మీటింగు పెట్టి డిస్కస్‌ చేద్దాం. స్టేట్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పిసి భట్టాచార్యను కూడా రమ్మంటాను. మీరూ రండి.'' అన్నాడు పటేల్‌. ముగ్గురు అధికారులూ కలిసి ముంద్‌డాతో ''మళ్లీ షేరు మార్కెటు ద్వారా విడిగా కొనడం దేనికి, మొత్తమంతా మీ దగ్గరే కొనేస్తాం. ఏయే కంపెనీల షేర్లు కొనాలో ప్రణాళిక వేసుకుని రండి'' అన్నారు. 

మర్నాటికల్లా ప్రణాళిక సిద్ధం. ఈ సారి సమావేశంలో ఎల్‌ఐసి మేనేజింగ్‌ డైరక్టరు వైద్యనాథన్‌ కూడా వున్నాడు. ముంద్‌డా కు చెందిన రిచర్డ్‌సన్‌ అండ్‌ క్రడ్డాస్‌, స్మిత్‌ స్టెయిన్‌స్ట్రీట్‌, ఆస్లర్‌ ఎలక్ట్రిక్‌ లాంప్‌, జెస్సప్‌ అండ్‌ కంపెనీ, ఏంజిలో బ్రదర్స్‌, బ్రిటిషు ఇండియా కార్పోరేషన్‌ కంపెనీలకు చెందిన షేర్లను రూ.1.26 కోట్లకు ఎల్‌ఐసి కొనడానికి ఒప్పందం కుదిరింది. ఈ విధంగా ఎల్‌ఐసి పెట్టిన ఏడాదిలోగానే ప్రజాధనాన్ని ఆగమేఘాల మీద దుర్వినియోగం చేయడం జరిగింది. 

ఈ విషయాన్ని ఫిరోజ్‌ గాంధీ 1957 డిసెంబరులో బయటపెట్టాడు. అతను అధికార పార్టీకి చెందిన ఎంపీ. ప్రధానికి అల్లుడు. అయినా పార్లమెంటులో ప్రసంగిస్తూ ఎల్‌ఐసికి ఖాతాదారులుగా వున్న 55 లక్షల మంది డబ్బుతో మార్కెట్‌ రేటు కంటె ఎక్కువ పెట్టి ముంద్‌డా కంపెనీల షేర్లను కొన్నారని ఆరోపించాడు. ఆర్థికమంత్రి 'అది నిజం కాదు' అన్నాడు. నెహ్రూ నివ్వెరపోయి, వెంటనే విచారణకు ఆదేశించి బొంబాయి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా చేసి రిటైరైన ఎమ్‌సి చాగ్లాతో ఏకసభ్య యింక్వైరీ కమిటీ వేశాడు. బహిరంగంగా జరిగిన ఆ విచారణలో కృష్ణమాచారి, పటేల్‌ ''మేం యీ పెట్టుబడులు పెట్టకపోతే కలకత్తా షేర్‌ మార్కెట్‌ కుప్పకూలి ఎంతోమంది నష్టపోయేవారు. వారి కోసం యీ పని చేశాం.'' అని కమిటీ ముందు వాదించారు. చాగ్లా స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లోని టాప్‌ షేర్‌ బ్రోకర్లను పిలిచి మాట్లాడాడు. 

''అటువంటి పరిస్థితి ఏమీ లేదు, నిజానికి అతని కంపెనీల షేర్లు జూన్‌ 10 నుంచి కాస్తకాస్త పెరుగుతున్నాయి కూడా. మాలో కొంతమంది ఎల్‌ఐసి యిన్వెస్ట్‌మెంట్‌ కమిటీలో సభ్యులం కూడా. ఎల్‌ఐసి చైర్మన్‌, ఎండీ మా కమిటీని సంప్రదించి వుంటే ముంద్‌డా షేర్లను ఫోర్జరీ చేస్తూ 1956లో పట్టుబడ్డాడని చెప్పి వుండేవాళ్లం.'' ఆ కమిటీకి డిప్యూటీ జిఎంగా వున్న ఎచ్‌టి పారేఖ్‌ కూడా అవును ముంద్‌డా ఫోర్జరీ చేశాడు అని సాక్ష్యం యిచ్చాడు. విచారణ 24 రోజుల్లో ముగిసింది. చాగ్లా తన తీర్పులో 'పటేల్‌, ఎల్‌ఐసి చైర్మన్‌, ఎండీ ముంద్‌డాతో చేతులు కలిపి అతని బాగు కోసం ఎల్‌ఐసి నిధులను దుర్వినియోగం చేశారు…స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ను నిలబెట్టడానికి కాదు' అని చెప్పాడు. విషయం బయటకు వచ్చాక కృష్ణమాచారి తన ఆమోదం లేకుండా పటేల్‌ తీసుకున్న నిర్ణయమిది అని చెప్పాడు. ఆయనకు చెప్పే చేశాను, ఆయన అభ్యంతర పెట్టలేదు అన్నాడు పటేల్‌. పటేల్‌ కృష్ణమాచారికి చెప్తుండగా వారితో వున్న భట్టాచార్య సాక్ష్యంతో చాగ్లా మంత్రికి తెలిసే జరిగింది అని తన నివేదికలో పేర్కొన్నాడు. 

చాగ్లా రిపోర్టు బయటకు రాగానే ప్రభుత్వానికి కాలుచేతులు ఆడలేదు. నెహ్రూ అయిష్టంగానే కృష్ణమాచారి చేత రాజీనామా చేయించాడు. ఇక స్కాములో పాలు పంచుకున్న ముగ్గురు పబ్లిక్‌ సర్వెంట్స్‌పై ఏ చర్య తీసుకోవాలో నిర్ణయించడానికి ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (డిసిప్లిన్‌ అండ్‌ ఎప్పీల్స్‌) చట్టం, 1958 కింద ఒక బోర్డ్‌ ఆఫ్‌ ఇంక్వైరీని సుప్రీం కోర్టు జడ్జి వివియన్‌ బోసు నేతృత్వంలో వేశారు. పటేల్‌ తన పదవిని వుపయోగించి కామత్‌, వైద్యనాథన్‌లను ముంద్‌డా షేర్లు కొనిపించాడని బోర్డు తీర్పు యిచ్చింది. దానిపై యుపిఎస్‌సి పునర్విచారణ జరిపి కామత్‌ను మందలించి, పటేల్‌ను క్షమించి వదిలేసింది. అబద్ధమాడినందుకు మంత్రిని అభిశంసించింది. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే వివియన్‌ బోస్‌ ముందు ముంద్‌డా సాక్ష్యం చెపుతూ 1957లో తను కాంగ్రెసు పార్టీకి ఉత్తర్‌ ప్రదేశ్‌ యూనిట్‌కు రూ.1.50 లక్షల విరాళం, సెంట్రల్‌ యూనిట్‌కు రూ. 1.00 లక్ష తన కంపెనీ డబ్బులోంచే యిచ్చానని చెప్పాడు. ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది. ఇన్‌కట్‌ టాక్సు శాఖ వారు కూడా అతనితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని అతని బకాయిలను మాఫ్‌ చేశారు. వ్యాపారస్తుడు- రాజకీయనేత- బ్యూరోక్రాట్‌ల కూటమి ఎలా పనిచేస్తుందో దేశప్రజలందరికీ తెలిసి వచ్చింది. 

ఈ కథకు 'కట్‌ చేస్తే…' ముక్తాయింపులు కూడా చెప్పుకోవాలి. ఎల్‌ఐసి ముంద్‌డా కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులన్నీ బూడిదపాలయ్యాయి. నాలుగేళ్లు పోయాక 1962లో నెహ్రూ కృష్ణమాచారిని మళ్లీ కాబినెట్‌లో తీసుకున్నాడు.  ఫోర్జరీ నేరానికి, మోసం చేసిన నేరానికి ముంద్‌డా అనేకసార్లు అరెస్టయి, బెయిల్‌ మీద బయటకు వచ్చేస్తూ వుండేవాడు. 1979 వచ్చేసరికి అతని పేరు మళ్లీ పేపర్ల కెక్కింది. బొంబాయి మలబార్‌ హిల్స్‌లో రిచర్డ్‌సన్‌ అండ్‌ క్రడ్డాస్‌కు  చెందిన ఒక భవంతిని అతను తన భార్య పేర బదిలీ చేయించేసుకున్నాడు. ఆ కంపెనీని జాతీయం చేశారు కానీ యితను అంతకుముందే జాగ్రత్తపడ్డాడు. ఆ భవంతిలో రెండు నేషనలైజ్‌డ్‌ బ్యాంకుల ఆఫీసులున్నాయి. వాటిని ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు కానీ అంత మంచి లొకాలిటీని అవి వదులుకోవడానికి యిష్టపడలేదు. 1979లో అప్పటి ఆర్థికమంత్రితో మాట్లాడి ఆయన ద్వారా బ్యాంకు చైర్మన్లకు చెప్పించి ముంద్‌డా ఆ ఆస్తిని స్వాధీనంలోకి తీసుకుని దాని మంచి ధరకు అమ్మి బాగా లాభపడ్డాడు. బ్యాంకులు అలా ఎందుకు ప్రవర్తించాయి అని ప్రశ్నలు వుదయించాయి. ఆర్థికమంత్రి ఒత్తిడి మేరకు అని సమాధానం వచ్చింది.

ఆ ఆర్థికమంత్రి వేరెవరో కాదు, ఎచ్‌ఎమ్‌ పటేలే! అతను ఉద్యోగంలో రిటైరయ్యాక స్వతంత్ర పార్టీలో చేరి, తద్వారా జనతాపార్టీలోకి వచ్చి 1977లో జనతా పార్టీ తరఫున మొరార్జీ దేశాయి ప్రధాని అయినప్పుడు ఆయన అభిమానాన్ని చూరగొని ఆర్థికమంత్రి అయిపోయాడు. అంతేకాదు, మొరార్జీ కొడుకు కాంతి దేశాయిపై అనేక ఆరోపణలు వచ్చినపుడు అతన్ని రక్షించినవాడు పటేలే! చెప్పవచ్చేదేమిటంటే – కాంగ్రెసు పార్టీ అయినా, జనతా పార్టీ అయినా ముంద్‌డా వంటి నేరస్తులను రక్షిస్తూనే వచ్చింది. పేర్లు మారవచ్చు కానీ పార్టీల స్వభావం మారదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]