సిఆర్‌పిఎఫ్‌ వారి అగచాట్లు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ చెలరేగారు. సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల ప్రాణాలు హరించారు. ''ఇది పిరికి చేష్ట'', ''ఓటమి వలన కలిగిన ఆగ్రహంతో చేస్తున్న చర్య'' ''తీవ్రవాదులను మట్టుపెట్టడానికి మళ్లీ అంకితం అయ్యాం'', ''చనిపోయిన సైనికుల కుటుంబాల…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ చెలరేగారు. సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల ప్రాణాలు హరించారు. ''ఇది పిరికి చేష్ట'', ''ఓటమి వలన కలిగిన ఆగ్రహంతో చేస్తున్న చర్య'' ''తీవ్రవాదులను మట్టుపెట్టడానికి మళ్లీ అంకితం అయ్యాం'', ''చనిపోయిన సైనికుల కుటుంబాల గురించిన వేదన నా మనసులో మెదులుతోంది'' – యిలాటి స్టేటుమెంట్లు ప్రధాని యిచ్చినా, హోం మంత్రి యిచ్చినా, రాష్ట్రపతి యిచ్చినా మనమేమీ ఉలిక్కిపడం. ఎన్నో ఏళ్లగా వింటున్న దంపుళ్లపాటే యిది. మావోయిస్టులు రెచ్చిపోతూనే వున్నారు. 'వారి కారణంగా మీ ప్రాణాలు పోతున్నాయటగా' అని సిఆర్‌పిఎఫ్‌ వార్ని అడిగి చూడండి, 'అబ్బే మా ప్రాణాలు బలి గొంటున్నది ప్రభుత్వం' అంటారు వాళ్లు. దాడి జరిగిన తర్వాత గాయపడినవాళ్లను 24 గంటల తర్వాతైనా ఆసుపత్రికి తరలించే సౌకర్యం లేదు మరి. దాడిలో కాకపోయినా తర్వాతైనా జవాన్లు చనిపోవడానికి కారణం యిదే. 

రాజకీయనాయకుల కోసం నిమిషాల్లో హెలిపాడ్‌ నిర్మించే ప్రభుత్వం సైనికుల కోసం మాత్రం కట్టటం లేదు. కొన్ని నెలల క్రితం ఒక జవాన్‌కు తన గుడారంలో వుండగానే తుపాకి గుండు తగిలింది. సరైన సమయంలో వైద్యసదుపాయం అందక అధికరక్తస్రావంతో అతను చచ్చిపోయాడు. వైద్యమే కాదు, వాళ్లకు మందులు కూడా దొరకవు. ఆ ప్రాంతాల్లో మలేరియా విపరీతంగా వ్యాపించి వుంది. చర్మవ్యాధులు ఎక్కువ. 150 మంది సైనికులకు కలిపి అయిదే అయిదు టాయిలెట్లు వున్నాయి. వాళ్లకు తినడానికి కూరగాయలు కూడా దొరకవు. ట్రక్కుల్లో కూరలు రావాలి. రావు. 'తెస్తూంటే మావోయిస్టులు అటకాయించి తీసేసుకున్నారు' అని డ్రైవరు చెప్తాడు. 

నిజమో, అబద్ధమో ఎవరికీ తెలియదు. 'ఎలాగోలా తెచ్చిపెట్టరా బాబూ యీ బంగాళాదుంపలు, సోయా నగ్గెట్లు తినలేక కడుపు పాడై పోతోంది' అంటూ లిక్కర్‌ బాటిల్‌ లంచంగా పెడుతున్నారు సైనికాధికారులు. సైనికుల్లో సగానికి సగం మంది ఏ సమయంలో చూసినా కడుపు చేత్తో పట్టుకుని వుంటారట. కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ యీ విషయంలో చేస్తున్న దేమిటంటే – చచ్చిపోయిన సైనికుల కోసం రూ. 50 కోట్లతో ఓ స్తంభం కడతానని ప్రకటించడం, మొన్న ఛత్తీస్‌గఢ్‌కు చుట్టపుచూపుగా చూసి వచ్చి తన ట్విట్టర్‌లో 'పరిస్థితిని పర్యవేక్షించమ'ని రాష్ట్రప్రభుత్వానికి సలహా యివ్వడం'! 

ఎమ్బీయస్‌ ప్రసాద్ 

[email protected]