శీర్షిక చూడగానే పోలవరం ప్రాజెక్టు గురించేమోనన్న సందేహం రావచ్చు. కాదు, ముల్ల పెరియార్ డామ్ గురించి కేరళ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం యిది. ఈనెల 7 వ తారీకున సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. కేరళలోని పడమటి కనుమలలోని కార్డమామ్ హిల్స్‌లో పెరియార్ నది పశ్చిమాభిముఖంగా అరేబియన్ సముద్రంలోకి ప్రవహిస్తూ వుంటుంది. ఆ కొండలకు యివతల నుండి తమిళనాడు ప్రారంభమవుతుంది. మధురై పక్కన వైగై నది పారుతుంది కానీ అది చిన్నది కావడం చేత మధురైకు సాగునీటి సమస్య వచ్చింది. బ్రిటిషువారు యీ సమస్య గుర్తించి 1887-95 మధ్య 176 అడుగుల ఎత్తున్న యీ డామ్ కట్టి పెరియార్ న*ప్రవాహాన్ని తూర్పు ముఖంగా మళ్లించి నాలుగు జిల్లాల దాహార్తిని తీర్చారు. ముల్లయార్, పెరియార్ నదులు కలిసే చోట డ్యామ్ కట్టారు కాబట్టి ముల్లపెరియార్ డ్యామ్ అన్నారు. ఉండడం కేరళలో వున్నా, దాని మేన్‌టెనెన్స్ అంతా తమిళనాడుదే. మొదట్లో యిరిగేషన్‌కు మాత్రమే వుపయోగించినా తర్వాతి రోజుల్లో జలవిద్యుత్‌కు కూడా వాడుకుంటున్నారు. దానిలో 152 అడుగుల వరకు నీటిని నిలువ చేసేవారు.
1979లో మోర్వీలో డామ్ బద్దలై 15 వేల మందిని మరణించిన తర్వాత, కేరళలో యీ డ్యామ్ గురించి ఆందోళన ప్రారంభమైంది. తమిళనాడు ప్రభుత్వం డామ్‌ను సరిగ్గా మేన్‌టేన్ చేయడం లేదని, పగుళ్లు, లీకులు వచ్చినా వాటి గురించి పట్టించుకోవటం లేదని, ఎపుడైనా రిక్టర్ స్కేలుపై 6 కి మించిన భూకంపం వచ్చి డామ్ బద్దలయితే నష్టం కేరళకే ననీ, దాని నుండి లబ్ధి పొందుతున్న తమిళనాడుకి ఏ చింతా లేదని కేరళ ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ స్వయంగా వచ్చి పరిశీలించి నిలువ నీటి ఎత్తును 152 నుండి 142కి తగ్గించమన్నారు. ఆ తర్వాత దాన్ని 136కి తగ్గించమన్నారు. రిపేర్లు కూడా చేపట్టమన్నారు. తమిళనాడు చేసిన రిపేర్లు కేరళ ప్రభుత్వం తరఫున వచ్చిన పరిశీలకులకు తృప్తి కలిగించలేదు. 1988లో డ్యామ్‌కు 20 కి.మీ.ల దూరంలో రిక్టర్ స్కేలుపై 4.5 పరిమాణం కల భూకంపం వచ్చి చాలా నాశనం జరిగింది. అందువలన యిప్పుడున్న 136 అ.ల ఎత్తుకు మించి నీటిని నిలువ చేయకూడదని కేరళవాసుల అభిప్రాయం.
కానీ తమిళనాడు ప్రభుత్వం 152 అడుగుల ఎత్తుదాకా నిలువ చేస్తామని పట్టుబట్టింది. ఎందుకంటే తేని, మధురై, శివగంగ, రామనాథ్ జిల్లాలకు అదే తాగునీరు, సాగునీరు అందిస్తుంది. ఎత్తు తగ్గించిన తర్వాత 1980 నుండి 2005 మధ్య 40 వేల ఎకరాలకు నీరు అందకుండా పోయిందని వాదించింది. అయితే కేరళ దాని వాదాన్ని తిప్పికొట్టింది. 1979-80లో 1.71 లక్షల ఎకరాలు సాగు చేయగా 136 అ.లకు తగ్గించిన తర్వాత 1994-95లో 2.30 లక్షల ఎకరాలు సాగయ్యానని గణాంకాలు చూపింది. అంతగా కావాలంటే 110 సం||ల క్రితం సున్నపురాయితో కట్టిన పాత డ్యామ్‌ను కూల్చేసి, ఆధునిక విజ్ఞానంతో కొత్త డ్యామ్ కట్టుకోండి అని తమిళనాడుకు సూచించింది. తమిళనాడుకి యీ ప్రతిపాదనలు నచ్చలేదు. సుప్రీం కోర్టుకి వెళ్లింది. ముగ్గురు సభ్యుల కమిటీ వేస్తే వారు 142 అ.ల వరకు పెంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దాని సిఫార్సు మేరకు 2006 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు అమలు చేయకుండా చూడడానికి 15 రోజులు తిరక్కుండా కేరళ ఎసెంబ్లీ సమావేశమై ఆ డ్యామ్‌ను ఎన్‌డేంజర్‌డ్ (ప్రమాదభూయిష్టమైనది, కాపాడవలసినది) షెడ్యూల్‌లో చేరుస్తూ చట్టం చేసింది. డామ్ సేఫ్టీ అథారిటీ అనే ప్రభుత్వసంస్థను ఏర్పరచి 136 అ.ల లోపునే నీటిని నిలువ చేసేట్లు డ్యామ్ రక్షణను దానికి అప్పగించింది.
ఈ చట్టం కారణంగా కోర్టు తీర్పు అమలు కాకుండా పోయింది. ఏం చేయాలో పాలుపోని సుప్రీం కోర్టు రెండు ప్రభుత్వాలూ పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవచ్చు కదా అంది. పరిష్కారం ఎలా పొసుగుతుంది? డ్యామ్ వలన ప్రయోజనం ఒక రాష్ట్రానికి కలుగుతోంది, రిస్కు మరో రాష్ట్రానిది! చివరకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేసి రాష్ట్రం చేసిన చట్టంపై భవిష్యత్తులో రాబోయే పరిణామాల గురించి అధ్యయనం చేయమంది. దాని నివేదిక ఆధారం చేసుకుని ఈ మే 7 న తీర్పు వెలువరించింది. కేరళ అసెంబ్లీ అలాటి చట్టం చేసి న్యాయవ్యవస్థ అధికారాలను ఛాలెంజ్ చేసిందని, రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ – ఏ వ్యవస్థకు వుండే గౌరవం దానికి వుండాలని ఒకదానిని మరొకటి అతిక్రమించరాదని తీర్పులో చెప్పింది. కేరళ పాస్ చేసిన చట్టం కొట్టేసింది. 142 అ.ల ఎత్తువరకు నీరు నిలువ చేసుకోవచ్చని అంది. అది అమలయ్యేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన కేరళ, తమిళనాడు ప్రతినిథులు కలిసి పనిచేయాలని చెప్పింది. తమిళనాడు ప్రభుత్వం డ్యామ్‌కు మరమ్మత్తులు చేయాలని, కేరళ ప్రభుత్వం వారిని అనుమతించాలని కూడా చెప్పింది.
రాష్ట్రాలు విడగొట్టడం సులభమే. కానీ విభజన వలన తలెత్తే సమస్యల్లో నీటి పంపకాల సమస్య ప్రధానమైనది. థాబ్దాలైనా ఆ రగడ సాగుతూనే వుంటుంది. ఆంధ్ర, తెలంగాణల మధ్య ఏం జరగబోతోందో యీ ముల్లపెరియార్ డ్యామ్ ఉదంతం సూచిస్తోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్