నాగార్జున కొత్త పాత్రలోకి ప్రవేశించాడు. మీలో ఎవరు కోటీశ్వరుడూ అంటూ ప్రేక్షకులతో ఓ ఆటాడేసుకొంటున్నాడు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్ పతికి ఇది తెలుగు వెర్షన్. నాగ్ వ్యాఖ్యాత అనగానే ఈ పోగ్రాంకి ఇంకాస్త గ్రామర్ యాడ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ట్రైల్ షూట్‌లూ సాగాయి. నాగ్‌ని కొత్తగా చూసి ఫ్యాన్స్ కూడా ముచ్చట పడుతున్నారు.
కానీ ఒక్కటే లోపం.. ఆ తెలుగు ఉచ్ఛరణ ఏమిటని..?? ప్రశ్నలు చదవడం చూస్తుంటే.. పదాన్ని ఎక్కడ విరవాలో, ఎక్కడ పుల్‌స్టాప్ పెట్టాలో కూడా నాగ్‌కి అర్థం కావడం లేదా..? అనిపిస్తోంది. ప్రశ్నల్ని చదివే విధానం చూసి ఆయన ఫ్యాన్స్ కే నవ్వొచ్చేస్తోంది. హాట్ సీట్లో కూర్చున్న వారిని టెన్షన్‌కి గురి చేయడం నాగ్‌కి చేతకావడం లేదని వీక్షకులు చెబుతున్నారు.
కొన్ని సార్లు నాగ్ మరీ డ్రమటిక్‌గా మారిపోతున్నాడని, అంత డ్రామా అవసరం లేదని కూడా చెబుతున్నారు. అయితే ఇదంతా ఆయనకు కొత్త కదా, నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుందన్న భరోసా వీక్షకుల్లో ఉంది. పోటీదారులతో నాగ్ బాగానే మమేకం అవుతున్నారని, ఓ స్టార్ అన్న మాట మర్చిపోగలుగుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి తొలి అడుగుల్లో నాగ్ సగం మార్కులే తెచ్చుకొన్నాడు. ఫస్ట్ క్లాస్ మార్కులు ఎప్పటికి సాధిస్తాడో.