మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి అనుసరించబోయే విధానాన్ని సూత్రప్రాయంగా వెల్లడించింది. కానీ ఈ రుణమాఫీ అనేది.. ఏకమొత్తంగా.. అప్పులు తీసుకున్న అందరు చిన్న సన్నకారు రైతుల కన్నీళ్లు తుడుస్తుందనే గ్యారంటీ మాత్రం లేదు. రుణమాఫీ విషయంలో కేసీఆర్ సర్కారు మడతపేచీలకు దిగుతున్నదనే ప్రచారం జరిగినప్పటినుంచి.. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. రుణాలు మాఫీ కావడం లేదనే ఆందోళనతో ఆగిన గుండెలు ఉన్నాయి. అయితే ఇలాంటి మరణాల గురించి సీఎం కేసీఆర్ హేళనగా మాట్లాడడం మాత్రం శోచనీయం. ఈ అంశాలన్నీ పక్కన పెడితే.. చివరికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి.. రుణమాఫీవిషయంలో తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు.
కేవలం పంటరుణాలు మాత్రం మాఫీ అవుతాయిట. గత ఏడాది జూన్ తర్వాత తీసుకున్న రుణాలు మాత్రమే అంటూ పెట్టిన నిబంధన ఉండదుట. కాలపరిమితి లేకుండా అన్ని పంటరుణాల్ని వడ్డీతో కలిపి లక్ష వరకు మాఫీ చేస్తున్నాం అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే ఈ మాఫీతో తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని అనుకుంటే భ్రమ. కేవలం పంట రుణాలు అనే మాటకు బ్యాంకుల దృష్టిలో ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఏదో ఒక ష్యూరిటీ ఉంటే తప్ప బ్యాంకర్లు సాధారణ రోజుల్లో రైతులకు సేద్యపురుణాలు ఇవ్వడం లేదనేది క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం. పెళ్లాల పుస్తెలను, బిడ్డ మనువుకోసం చేయించిన కొన్ని గ్రాముల బంగారాన్ని కుదువపెట్టి తెచ్చుకున్న బ్యాంకురుణంతో సేద్యాన్ని నమ్ముకునే చిన్నకారు రైతులే ఎక్కువ. కేవలం పంట రుణాలు అంటే.. బ్యాంకర్లను ఇన్‌ఫ్లూయెన్స్ చేయగల పైరవీకార్లకు మాత్రమే దక్కే రుణాలుగా ఒక పేరుంది. ఇప్పుడు ఆ స్థాయి వారి రుణాలు రద్దవుతాయి తప్ప.. కష్టం తీర్చుకోవడానికి ఉన్న నగలు కుదువపెట్టి రుణాలు తెచ్చుకున్న పేదలకు లాభం దక్కదు. అలాంటి వారు నిస్పృహతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.
ఆర్థికపరమైన పరిమితులు ఉంటే గనుక.. కేసీఆర్ రుణమాఫీ విషయంలో మాట మార్చవచ్చు. అది ఒక రకంగా బెటర్ అంతే తప్ప.. దానివలన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ‘అవి కాకమ్మ కథలంటూ’ హేళనగా మాట్లాడకుండా ఉంటే మంచిది.
లోపాలేమిటి?
తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో అనుసరిస్తున్న విధానం దళార్లకు దోచిపెట్టడమే అని ఒక వాదన వినిపిస్తోంది. ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుండేదనే విషయంలో పలు అభిప్రాయాలు ఉన్నాయి.
1) రూ.లక్ష లోపు రైతు రుణాలను మాత్రమే మాఫీ చేస్తాం అని కేసీఆర్ పదేపదే ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఇప్పుడు సరిగ్గా ఈ పదం చుట్టూ ఒక మడతపేచీ అల్లిక ఏర్పడింది.
2) వడ్డీతో కలిపి పంట రుణాల్లో ఒక లక్ష వరకు ప్రభుత్వం చెల్లించేస్తుందని ఇప్పుడు ప్రకటిస్తున్నారు.
3) అంటే, పంటరుణం పేరిట బ్యాంకర్లను ప్రభావితం చేసి పది లక్షల రూపాయలు రుణం తీసుకున్న భూస్వామికి కూడా.. లక్ష రూపాయల రుణం మాఫీ అవుతుందన్నమాట.
4) అదే సమయంలో వ్యవసాయ అవసరం కోసం పుస్తెలు కుదువపెట్టి 20వేలు, 50 వేలు చిన్న చిన్న రుణాలు తీసుకున్న బడుగు రైతుకు ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం లేదు.
ఏం చేస్తే బాగుండేది?
కేసీఆర్ సర్కారు ఎలాంటి మాట మార్చవలసిన అవసరం లేకుండా.. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం మెండుగా ఉంది. అంటే.. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తాం అన్న కేసీఆర్.. దాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. లక్షలోపు రుణం పుచ్చుకున్న వారికి మాత్రమే ఈ మాఫీ వర్తిస్తుందని ప్రకటిస్తే కేవలం చిన్న సన్నకారు రైతులు మాత్రమే లాభపడుతారు. భూస్వాములు, దళారీలు దీనివలన ప్రయోజనం పొందలేరు. అలాగే లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు వడ్డీ అసలు కలిపి లక్ష వరకు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని కేసీఆర్ ప్రకటిస్తే గనుక.. వాస్తవంగా బడుగులు, పేదలు అయిన రైతులకు మేలు జరుగుతుంది. పైగా ఇలాంటి మాఫీ పథకాలనుంచి దళార్లు లబ్ధిపొందకుండా అడ్డుకట్టవేయడం కూడా వీలవుతుంది.
కేసీఆర్ సర్కారు ఈ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
-కపిలముని