బిజెపి తలకెక్కిన 'నషా' (నరేంద్ర-అమిత్ షా జోడీలో మొదటి, చివరి అక్షరాల కూర్పు)ను దించేసిన ఢిల్లీ ఓటరు ఎందుకలా చేశాడన్నదానిపై అన్ని పార్టీల, పత్రికల విశ్లేషణ కొనసాగుతూనే వుంది. బిజెపి ఓటుబ్యాంకు మరీ అంత ఘోరంగా దెబ్బ తినలేదు, కానీ సీట్లు చూస్తే ఘోరాతిఘోరంగా వచ్చాయి. అంటే అన్ని నియోజకవర్గాలలోను ఆప్ ముందంజలో వుందన్నమాట. ఎందుకలా? పరికించి చూస్తే అమిత్ మైక్రో మేనేజ్‌మెంట్ పిరమిడ్ స్ట్రక్చర్‌లో లోపం ఏమీ లేదు. ఢిల్లీలో వున్న 70 అసెంబ్లీ స్థానాలను ఏడు పార్లమెంటు స్థానాల యూనిట్లగా విభజించుకున్నారు. ఒక్కో యూనిట్‌కు ఒక్కొక్క ఆరెస్సెస్ ప్రచారక్‌ను నియమించారు. విష్ణు దత్ శర్మకు మాత్రం రెండు యూనిట్లు, అంతే 20 అసెంబ్లీ స్థానాలకు యిన్‌చార్జి చేశారు.
ఆ విధంగా మొదటి దొంతరలో 6గురు ఆరెస్సెస్ ప్రచారకులున్నారు. రెండవ దొంతరలో 14 మంది కేంద్రమంత్రులు లేదా బిజెపి జాతీయ నాయకులకు అయిదేసి అసెంబ్లీ స్థానాలు అప్పగించారు. అంటే ఒక్కొక్కరు 5 స్థానాలను పర్యవేక్షించాలి. వాటిలో ఒకదాన్ని డైరక్టుగా చూసుకోవాలి. మూడవ దొంతరలో 57 మంది బిజెపి నాయకులున్నారు. వారు ఢిల్లీ వాసులు కాని బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన మంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. వీరు తమకు నిర్దేశించిన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోందో గమనిస్తూ స్థానిక నాయకుల మధ్య కోఆర్డినేట్ చేయాలి. 4 వ దొంతరలో వున్న 14 మంది సీనియర్ బిజెపి/ఆరెస్సెస్ ఫుల్‌టైమర్స్ వున్నారు. వారు తమకప్పగించిన 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో బూత్ కమిటీల మధ్య సమన్వయం చూసుకోవాలి. 5 వ దొంతరలో 80 మంది బిజెపి/ఆరెస్సెస్ ఫుల్‌టైమర్లను ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్లకు, కార్యకర్తలకు అనుసంధానకర్తలుగా నియమించారు. వీళ్లందరూ ఢిల్లీకి సంబంధించనివారే. వీరు కాకుండా కార్యకర్తలుగా పనిచేయడానికి వేలాదిమంది ఆరెస్సెస్/బిజెపి కార్యకర్తలను ఢిల్లీ బయటినుంచి దింపారని అందరికీ తెలుసు. అమిత్ తక్కిన ఎన్నికలలో ఎంత పక్కాగా వున్నారో, వీటిల్లోనూ అంతే పటిష్టమైన ప్రణాళికలు రచించి, అమలు చేశారు. ఇంతకు మించి ఎవరు మాత్రం ఏం చేయగలరు? మరెందుకీ అపజయం?
మహారాష్ట్ర, హరియాణాలలో మోదీ అక్కడ వున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓట్లు సంపాదించారు. కానీ ఢిల్లీకి వస్తే అక్కడ తనదే ప్రభుత్వం, ఏడాదిగా కేంద్రం చేతిలోనే వుంది. అక్కడి లోటుపాట్లకు ప్రధానిగా అతనే బాధ్యుడు. ఢిల్లీ ఎసెంబ్లీ ఎన్నికలు దాటవేసిన కొద్దీ ఆప్‌కు బెంగ పెరిగింది. మోదీ వంటి చాణక్యుడు వాయిదా వేస్తున్నాడంటే దానికి ఏదో ఒక కారణం వుండే వుంటుందనుకుని ఆప్ నాయకత్వం భయపడింది. జులైలో అంతర్గతంగా ఒక సర్వే నిర్వహించింది. తమకు 33% ఓట్లు వస్తే తమ కంటె బిజెపికి 13% ఓట్లు ఎక్కువ వస్తాయని తెలిసింది. సెప్టెంబరు నాటికి మోదీ అంతర్జాతీయంగా అనేక సభల్లో పాల్గొని ఒక వెలుగు వెలుగుతున్నారు. అప్పుడు తమ గతి ఎలా వుందా అని యింకో సర్వే నిర్వహించి చూసుకుంటే 16% వెనకబడినట్లు తెలిసింది. అంతలో వారికి యింకో విషయం తెలిసింది – 'ఢిల్లీలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నా మోదీ ఎందుకు తాత్సారం చేస్తున్నట్లు, తమను అధికారం నుంచి దూరంగా వుంచి అతనేం సాధిస్తున్నట్లు?' అని బిజెపి ఢిల్లీ యూనిట్‌లో రుసరుసలు వున్నాయని! మోదీ ఎప్పటికీ అజేయుడిగానే వుండలేడని వాళ్లకు ఆశ కలిగింది.
గతంలో కాంగ్రెసును, బిజెపిని విమర్శించి అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు పాజిటివ్ ఓటుతో గెలవాలి అనుకుని పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి వీధివీధుల్లో కమిటీలు ఏర్పరచి 30 వేల మంది కార్యకర్తలను తయారుచేసుకున్నారు. ఆప్ గెలుస్తుందన్న భయంతోనే బిజెపి ఎన్నికలు వాయిదా వేస్తోందని వారికి నమ్మకం కలిగించడానికి బిజెపిని ఛాలెంజ్ చేస్తూ 'చునావ్ కరో' (ఎన్నికలు పెట్టండి) అనే ఆందోళన మొదలుపెట్టారు. ఆప్ వాళ్లు యింకో విషయం గమనించారు – బిజెపి కార్యకర్తల అసంతృప్తి అధినాయకత్వానికి చేరటం లేదు. ఇప్పుడు బిజెపిలో నాయకత్వం యిద్దరి చేతుల్లో కేంద్రీకృతమైంది. వారు మామూలు కార్యకర్తలతో సంప్రదింపులు జరపడం లేదు. ఎప్పుడు చూసినా ట్వీట్‌లు, మెసేజ్‌లు – అంతా ఒన్‌సైడ్ వ్యవహారం. కమ్యూనికేషన్ లేదు. దానికి విరుద్ధంగా తాము అందరి కష్టసుఖాలు తెలుసుకుంటాం అనే అభిప్రాయం కలిగించడానికి ''ఢిల్లీ డైలాగ్'' అనే కార్యక్రమం చేపట్టాడు. సందుల్లో కూడా తిరిగి సామాన్యులు ఏకరువు పెట్టే బాధలను వినడం మొదలుపెట్టారు. ఈ చర్యల వలన ఆప్ కార్యకర్తలు బిజీ అయిపోయారు, బిజెపి వారు చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నారు. వారి అధినాయకత్వం కదలలేదు మరి.
తర్వాతి స్టెప్‌గా అరవింద్ అప్పుడే ఎన్నికలు వచ్చేస్తున్నట్లు, తనూ ఢిల్లీ బిజెపి అధ్యకక్షుడు జగదీశ్ ముఖీ ముఖ్యమంత్రి పదవికై పోటీ పడుతున్నట్లు ఒక భ్రమ కల్పించాడు. ఆటోల వెనక్కాల పోస్టర్లు వెలిశాయి – 'మీలో ఎవరు కావాలి మీకు? అరవిందా? జగదీశా?' అంటూ. అరవింద్‌కు వున్నంత గ్లామర్ జగదీశ్‌కు లేదని అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాల కారణంగా డిసెంబరు నాటికి ఆప్‌కి ప్రజాదరణ పెరిగింది. ఈ సారి సర్వేలో బిజెపి కంటె 3% ఓట్లు ఎక్కువ వచ్చాయని తేలింది. ఈ ఫలితాలను బిజెపివారికి చేరేట్లా చూశారు ఆప్‌వారు. అరవింద్-జగదీశ్ పోలిక కారణంగా ఎన్నికలు యింకా ఆలస్యం చేస్తే యీ 3% తేడా రెట్టింపై ఆప్ గెలిచేస్తుందేమోనని అమిత్ భయపడి ఎన్నికలు ప్రకటింపచేసి, అరవింద్‌కు పోటీగా ముందు మోదీని దింపి 12 ర్యాలీలు ప్లాన్ చేశారు. మొదటిది ఫ్లాప్ కావడంతో భయపడి కిరణ్ బేదీని తెచ్చారు. కిరణ్ రాగానే ఆప్ ఆటోల వెనక్కాల పోస్టర్లు మార్చింది. 'నిజాయితీపరుడు కావాలా? అవకాశవాది కావాలా?' అంటూ! ఇంకో సర్వే చేసి చూసుకుంటే తాము బిజెపి కంటె 5% ముందు వున్నట్లు తెలిసింది. ఈ థలో బిజెపి చాలా తెలివితక్కువగా అరవింద్‌పై నెగటివ్ కాంపెయిన్ మొదలుపెట్టింది – పలాయనవాది, మావోయిస్టు, ఉపద్రవ గోత్రీకుడు, అడవుల్లో వుండవలసినవాడు అంటూ! వెంటనే అరవింద్ కిరణ్‌ను అవకాశవాది అని కూడా అనడం మానేసి, ఆ పోస్టర్లు తీయించేశాడు.
చాలా బుద్ధిమంతుడిలా ఎవర్నీ ఏమీ అనకుండా వుండడంతో జనాలు అతని పట్ల జాలి పడ్డారు. తన వ్యాగన్-ఆర్‌లోనే తిరిగేవాడు. ఆవేశపూరిత ఉపన్యాసాలు యివ్వకుండా తాపీగా వివరించే ప్రసంగాలు చేశాడు. మఫ్లర్ కట్టుకుని, యింటిపక్క మనిషిలా కనబడ్డాడు. 49 రోజుల పాలన తర్వాత పారిపోవడం గురించి అరవింద్ చాలా సంజాయిషీయే యిచ్చుకోవలసినది – 'నేను పొరపాటు చేశాను, నేరం చేయలేదు' అని ప్రజలకు చెప్పుకున్నాడు. మీడియాతో 'నా పాలనాకాలంలో ధరలు తగ్గించాను, అవినీతికి పాల్పడలేదు, అందువలన ప్రజలు నాపై కోపంగా లేరు' అని వాదించాడు. 'అరకొరగా సీట్లు యిస్తే తక్కినవాళ్లు చెప్పినట్లు ఆడాలి, పూర్తి మెజారిటీ యిచ్చి చూడండి, ఐదేళ్లు పాలిస్తా' అంటూ 'పాంచ్‌సాల్, కేజ్రీవాల్' అనే స్లోగన్ కాయిన్ చేశారు. ఆప్‌కు మద్దతుగా మేరఠ్, భువనేశ్వర్, ముంబయి, బెంగుళూరుల నుండి 10 వేలమంది వాలంటీర్లు వచ్చారు.(సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)