‘‘ఆంధ్రా వాలే భాగో’ అని నినాదం యిచ్చి రెచ్చగొట్టిన కెసియార్ యింకో నెల్లాళ్లకు ‘అక్రమంగా మా ఉద్యోగాల్లో తిష్టవేసిన వారిని ఉద్దేశించి ఉద్యమంలో నినాదంగా అన్నాను కానీ నా భావం అది కాదు’ అని వివరణ యిచ్చారు కానీ సామాన్య తెలంగాణ ప్రజల్లో ఆంధ్రవాళ్లు నిజంగా పరుగులు పెట్టి పారిపోతారన్న భావం నెలకొన్నట్టే వుంది. చట్టప్రకారం అలా జరిగేట్లా చేయలేమని తెలిశాక వాళ్ల ఫ్రస్ట్రేషన్ ఏ మేరకు వుంటుందో ఎవరూ వూహించలేం. కొన్ని చోట్ల చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నాలు జరగవచ్చు. దేశవిభజన గురించి రాసినపుడు రాశాను. పాకిస్తాన్ ఏర్పడడానికి అంగీకరించినపుడు మన జాతీయ నాయకులు (జిన్నాతో సహా) హిందువులు ఇండియా వైపు, ముస్లిములు పాకిస్తాన్ వైపు తరలి వెళ్లిపోతారని వూహించలేదు. ఎక్కడున్నవారు అక్కడే వుంటారు, పాలన మాత్రం చేతులు మారుతుందనుకున్నారు. కానీ ప్రజల్లో భయం పుట్టింది. పరదేశస్తులపై దాడులు మొదలుపెట్టారు.
ఇప్పుడు మళ్లీ అలాటివి జరిగి తెలంగాణలో ఆంధ్రులపై, వారి ఆస్తులపై దాడులు జరుగుతాయన్న భయం పాలకులకు వున్నట్టుంది. అందుకే కేంద్రప్రభుత్వం మాటిమాటికీ ‘సీమాంధ్రుల రక్షణ’ అంశం లేవనెత్తుతోంది. దానికి ప్రత్యేకమైన చట్టం వుంటుందని, శాంతిభద్రతలు కేంద్రం చేతిలో వుంటాయనీ చెప్తోంది. చట్టప్రకారం ఎంత రక్షణ కల్పించినా సామాన్యులకు భయంగానే వుంటుంది. చట్టాన్ని నమ్ముకోవడం కంటె స్థానికంగా వున్న రాజకీయనాయకులను, రాజకీయనాయకులతో పేరుతో చలామణీ అయ్యే గూండాలను నమ్ముకోవడం మేలు అనుకుంటారు. ఇది గ్రహించే ‘ఆంధ్రులు భయపడనక్కరలేదు, మేం వారిని జాగ్రత్తగా చూసుకుంటాం’ అంటూ హైదరాబాదులో వున్న ప్రతి రాజకీయనాయకుడు అభయం యిచ్చేస్తున్నారు. దానం నాగేందర్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ కావచ్చు, వి హనుమంతరావూ కావచ్చు.
ఇందరు కాండిడేట్లు తమ సర్వీసులు ఆఫర్ చేస్తూ వుంటే భయభీతులైన గృహస్తులు, పారిశ్రామికవేత్తలు ఎవర్ని ఎంచుకుంటారు చెప్పండి? మూకబలం, రూకబలం వున్న నాయకుణ్నే నమ్ముకుంటారు. ఆ విషయంలో జగన్‌ను మించినవారున్నారా? జగన్ వెనక్కాల దండధరులు చాలామంది వున్నారని, వారు తలచుకుంటే హైదరాబాదులో ఏ స్థలం గురించైనా సెటిల్‌మెంట్లు చేయగలరనీ ఎప్పటినుండో వినిపిస్తోంది. మామూలు రోజుల్లో అలాటివారికి దూరంగా వుండాలని అనుకున్నా, భద్రతకే ముప్పు కలిగినప్పుడు వాళ్లే దేవుళ్లలా కనిపిస్తారు. (నాయకన్ సినిమాలో పోలీసు అధికారి కూతురు రేప్‌కు గురయితే చట్టరీత్యా చర్యలు తీసుకోలేక అండర్ వరల్డ్ డాన్‌ను ఆశ్రయించి, కక్ష సాధిస్తాడు). అందువలన విభజనానంతరం హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గండ, ఖమ్మం వంటి అనేక జిల్లాలలో ఆంధ్రలో మూలాలు వున్నవారికి దిక్కుగా, ఛాంపియన్‌గా ఎదగడానికి వైకాపాకు చాలా మంచి ఛాన్సుంది అని తోస్తుంది. మరి ఆ క్రమంలో తెలంగాణవారికి అయిష్టుడుగా మారడా? అలా జరగదని జగన్‌కు నమ్మకం.
సమైక్యవాదిగా నిలబడినా తెలంగాణలో తనకు ఛాన్సుంది అని జగన్‌కి ఎప్పుడు కాన్ఫిడెన్సు వచ్చి వుంటుంది? జైలు నుండి బయటకు వచ్చిన రోజునా? నిజానికి అది ఒక వింత దృశ్యం. జగన్ జైలుకి వెళ్లినది – దేశం కోసం కాదు, రాష్ట్రభవిష్యత్తు బాగుపరచడానికి ఉద్యమం చేస్తూ కాదు. కేవలం ఆర్థికనేరస్తుడిగా వెళ్లాడు. బయటకు వదిలితే సాక్ష్యులను తారుమారు చేయగల ఘనుడీతను అని సిబిఐ భయపడి, కోర్టుని కూడా భయపెట్టింది. ఆ వాదనలో బలం వుందని కోర్టు నమ్మింది కూడా. అలాటి జగన్ ఎట్టకేలకు బెయిలు దొరికి బయటపడితే అంత ఘనస్వాగతమా? అదీ తెలంగాణ నడిబడ్డులో వున్న హైదరాబాదులో…? వారిలో కొందర్ని డబ్బు పెట్టి తీసుకుని వచ్చారనుకున్నా, మరి కొందరు జస్ట్ క్యూరియాసిటీ కొద్దీ గుమిగూడారనుకున్నా – అయిదారు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించేటంత లెవెల్లో జనం వచ్చారంటే యిది దేనికి సంకేతం? జగన్ గొప్పవాడనా లేక యితరులపై ప్రజలకు విశ్వాసం పోయిందనా?
మనం ఎలాటి అభిప్రాయమైనా ఏర్పరచుకోవచ్చు కానీ జగన్‌కి మాత్రం తను వెళుతున్నది సరైన దారే అన్న అభిప్రాయం కలిగి దానిలో దూసుకుపోతున్నాడు. సమైక్యం అన్నా తెలంగాణలో పార్టీకి ఏం కాదులే అన్న ధీమా అతనిలో వుంది. ‘విభజన వలన తెలంగాణ నష్టపోతుంది’ అని నచ్చచెప్పగలిగితే తెలంగాణలో కూడా తగుపాటి సీట్లు తెచ్చుకోవచ్చు. ఒకవేళ తెచ్చుకోలేకపోయినా 2014 అసెంబ్లీ ఎన్నికల వరకే ఎఫెక్టు వుంటుంది. ఆ తర్వాత జరిగే మునిసిపల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, ఏర్పడబోయే రాష్ట్రానికి రaార్ఖండ్‌లా అస్థిరత పట్టుకుంటే మధ్యంతర ఎన్నికలు.. యిలా అనేక అవకాశాలు వస్తాయి. అందువలన జగన్ తన సమైక్య సభను తెలంగాణ నడిబడ్డునే ప్లాన్ చేశాడు. తన పార్టీ సభే అంటే రెస్పాన్సు పరిమితం అయిపోతుందని ఏ పార్టీ వారైనా సరే, ఏ పార్టీలో లేనివారైనా సరే రావచ్చు అని ఆహ్వానించాడు. ఇక ఉద్యోగులు, తటస్థులు అందరూ తప్పకుండా మద్దతు యిస్తారు. హైదరాబాదులో జగన్ సభ పెడితే మానుకోట సంఘటన పునరావృతవుతుంది అని సవాళ్లు విసిరిన తెరాస వారు నాలిక కరుచుకునేట్లు చేస్తే తెరాసకు హైదరాబాదులో పెద్ద పట్టు లేదు అని నిరూపించినట్టవుతుంది.
ఎన్‌జిఓలు సభ పెడితే కిరణ్ మద్దతుతో జరిగిందని టి-కాంగ్రెసువాళ్లు అన్నారు. మరి దీనికి కూడా కిరణ్ మద్దతు వుందంటారో లేదో చూడాలి. ‘..లేదు సోనియాయే మద్దతు యిప్పించింది’ అని టి-కాంగ్రెసువాళ్లు అనలేరు. ఎందుకంటే తెలంగాణ యివ్వడానికి సోనియా కంకణబద్ధురాలై వుందని, అటు సూర్యుడు యిటు పొడిచినా యిచ్చి తీరుతుందని వాళ్లు అంటున్నారు. తెరాస కూడా జగన్ సభ వెనక్కాల సోనియా వుందని గట్టిగా అనరు. ఎందుకంటే తెలంగాణ వస్తుందో రాదో మనసులో సందేహం పీకుతున్నా, యీ దశలో సోనియాపై రాళ్లు వేయడానికి వాళ్లు సిద్ధంగా లేరు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2013)