ఎమ్బీయస్‌ :ద్రౌపది పుట్టిన చోటు

రామ జన్మభూమి గురించి జరుగుతున్న వివాదం అందరికీ తెలుసు. అసలు రాముడు అమ్మమ్మ గారింట్లో పుట్టకుండా అయోధ్యలో పుట్టడమేమిటి అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏ వివాదమూ లేనిది ద్రౌపది జన్మస్థలం. కానీ దాని…

రామ జన్మభూమి గురించి జరుగుతున్న వివాదం అందరికీ తెలుసు. అసలు రాముడు అమ్మమ్మ గారింట్లో పుట్టకుండా అయోధ్యలో పుట్టడమేమిటి అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏ వివాదమూ లేనిది ద్రౌపది జన్మస్థలం. కానీ దాని గురించి ఎవరికీ పట్టటం లేదు. రాముడు పురుషోత్తముడైతే ద్రౌపది ఆత్మాభిమానానికి, ఆభిజాత్యానికి ప్రతీక. సీతలా అణకువగా బతికినది కాదు. స్వయంవరంలో తన యిష్టం ప్రకటించి కర్ణుణ్ని పెళ్లి చేసుకోను పొమ్మనమంది, దుశ్శాసనుడు వచ్చి 'నీ భర్త నిన్ను జూదంలో ఓడిపోయాడు, సభాస్థలికి రా' అంటే 'నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?' అని లా పాయింటు లాగింది. విరటుని సభలో కీచకుడు తనను అవమానిస్తూ వుంటే మౌనంగా వున్న తన భర్త ధర్మరాజును దెప్పి పొడుస్తూ 'నా భర్త జూదరి, అందుకే నా బతుకు యిలా రచ్చకెక్కింది' అని ఎత్తిపొడిచింది. కురుసభలో తనను అవమానించినవారిపై ప్రతీకారం తీర్చుకోమని భర్తలను మాటిమాటికి ప్రేరేపించి, పగ తీరిన తర్వాతే జుట్టు ముడేసింది. ఆమె సౌందర్యం ఆమె పాలిట శత్రువైంది. దాసి వేషంలో వున్నా కీచకుడి పాల బడింది. ఆడపడుచు మొగుడు కూడా ఆమెపై కన్నేసి ఎత్తుకుని పోబోయాడు. అయినా పౌరుషం, ప్రతాపం చూపిస్తూనే వచ్చిన ఆ శక్తి స్వరూపిణి భారతీయ స్త్రీలందరికీ సీత కంటె ఆదర్శప్రాయురాలని నీరా మిశ్రా అనే ఢిల్లీ సోషల్‌ ఎంట్రప్రెనార్‌ భావించింది. రామజన్మభూమిలో దేవాలయం గురించి వెంపర్లాడే, ఉద్యమాలు నడిపే పురుషప్రపంచం ద్రౌపది జన్మస్థలాన్ని పరిరక్షించే విషయం గురించి పట్టించుకోకపోవడం అన్యాయం అనుకుంది. ద్రౌపది ట్రస్టు అనే పేర ఒక ట్రస్టు పెట్టి ఆ పని తలకెత్తుకుంది.

మహాభారతంలో ప్రస్తావించిన పాంచాల దేశం ఈనాటి ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌ జిల్లాలో వుంది. పాంచాల దేశపు రాజధాని కాంపిల్యయే నేటి కంపిల్‌. ద్రోణుడికి గురుదక్షిణగా అర్జునుడు ద్రుపదుణ్ని ఓడించడం భారతంలో చదివాం. ద్రోణుడు క్షమించి వదిలిపెట్టిన తర్వాత తన రాజ్యానికి తిరిగి వచ్చిన ద్రుపదుడు ద్రోణుణ్ని చంపే కొడుకు, అర్జునుడికి భార్య కాగల కూతురు కావాలని యాగం చేశాడు. ఆ హోమకుండంలోంచి ద్రౌపది, ధృష్టధ్యుమ్నుడు పుట్టారు. గంగానది ఒడ్డున వున్న ఆ హోమకుండం వద్ద  ఏటా జాతర జరుగుతుంది. అదే వూరిలో ద్రుపదుడి కోటగా చెప్పబడే దిబ్బ వుంది. భారతకాలం నాటి కోట యిప్పటిదాకా ఎలా వుంటుందన్న సందేహం వస్తుంది కదా. బ్రిటిషు హయాంలో నెలకొల్పిన ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తొలి డైరక్టర్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ కన్నింగ్‌హామ్‌ ఆదేశాల మేరకు 1878లో ఆ దిబ్బ వద్ద సర్వే జరిగి, దాన్ని పురాతన ప్రదేశంగా గుర్తించి రక్షించడం మొదలుపెట్టారు. తర్వాతి రోజుల్లో తవ్వకాలు జరిపి అనేక శిల్పాలు, వస్తుసామగ్రి వెలికితీసి భద్రపరిచారు. అవి కుషాణుల కాలానికి, గుప్తుల కాలానికి చెందినవాటిగా గుర్తించారు. దొరికిన వాటిలో వున్న పింగాణీ సామగ్రి క్రీ.పూ. 370 నాటి వని అభిప్రాయపడ్డారు. మహాభారతకాలం అంటే యింకా పాతవై వుండాలి. ఏది ఏమైనా క్రీస్తు పూర్వం నాటి శిథిలాలు అక్కడ వున్నాయి కాబట్టి అవి ద్రుపదుడి కోటవి అయినా కాకపోయినా, భద్రపరచవలసిన, పరిశోధించవలసిన అవసరం వుంది. కానీ గత 30 ఏళ్లగా ఆర్కియాలజీ శాఖకు దానిపై ఆసక్తి తగ్గి పట్టించుకోవడం మానేసింది.

ఈనాడు ద్రౌపది కుండ్‌లో కంపు కొట్టే మురికి నీరు తప్ప మరేమీ లేదు. ద్రుపదుడి కోటగా చెప్పే దిబ్బను స్థానికులు ఆక్రమించి పొగాకు పండిస్తున్నారు. ఇది రక్షితస్థలమని తెలిపే బోర్డు సైతం లేదు. 2003లో ద్రౌపది పేర ట్రస్టు నెలకొల్పిన నీరా, ద్రౌపది జన్మస్థలంలోని మహిళలనైనా సొంత కాళ్లపై నిలబడేట్లా చేద్దామనుకుంది. వృత్తివిద్యలలో, కంప్యూటర్‌ కోర్సులలో వాళ్లకు తర్ఫీదు యిప్పిస్తోంది. దాంతో బాటు ద్రౌపది జన్మకుండ్‌కు రావలసిన గుర్తింపు కోసం ఉద్యమించి ప్రభుత్వ ఏజన్సీలలో చలనం తెప్పించింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా వారి అనుమతి సంపాదించి లక్నో యూనివర్శిటీ చేత 2010-12 మధ్య అక్కడ తవ్వకాలు జరిపించింది.  వాళ్లు 30 కందకాలు తవ్వి ఐదు వేర్వేరు కాలాలకు చెందిన పరికరాలను కనుగొన్నారు. ఆమె కృషి వలన 2012లో కాన్పూరు ఐఐటి వారి సివిల్‌ ఇంజనీరింగు విభాగం రాడార్‌తో భూమిలోపల వున్న అవశేషాలను స్కాన్‌ చేశారు. ఆ రిపోర్టు ప్రకారం దిబ్బ కింద రాళ్లు పరిచిన రోడ్లు, నీళ్లు పోయే కాలువలు, గోడలు కనబడ్డాయిట. కానీ పని మందకొడిగానే సాగుతోంది. తవ్వకాలు జరపడానికి పెద్ద యంత్రాలు తేవాలి. పక్కనున్న స్థలాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు పొలాలు పాడై పోతాయని గోల చేస్తున్నారు. స్థానికులు కలిసి రావటం లేదు. వాళ్లు తవ్వకాల్లో బయటపడిన యిటుకలను పట్టుకుపోయారు, శిల్పాలను యిళ్లకు తీసుకెళ్లి పూజాగృహాల్లో పెట్టేసుకున్నారు. ద్రౌపది ట్రస్టు పెట్టాక నీరా మిశ్రా వాళ్లందరినీ ఒప్పించి వెనక్కి తీసుకుని వచ్చి వూళ్లో వున్న గుళ్లో వాటిని భద్రపరిచింది. అలనాటి ద్రౌపది చాలా కష్టాలే పడింది. ఆ ద్రౌపది స్మృతికి గౌరవం చేకూర్చాలని శ్రమిస్తున్న యీ నీరా ఎన్ని పడాలో!

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]