జవాబులు – ''మదర్ ఇండియా''లో గడ్డివాముల సంఘటన గురించి నేను రాసినది తప్పు. నిజజీవితంలో జరిగినది తెరపై జరిగినట్లు పొరబడ్డాను. ఎత్తి చూపి, సవరించిన పాఠకుడికి ధన్యవాదాలు. 2) కేరళ నంబూద్రి బ్రాహ్మణుల సనాతన ఆచారాలకు వ్యతిరేకంగా తిరగబడినది నంబూద్రి యువకులే. ఆ సంస్కరణోద్యమ నాయకుల్లో ప్రముఖుడు – తర్వాత కమ్యూనిస్టు నేతగా ఎదిగిన ఇఎమ్మెస్ నంబూద్రిపాద్.
సంజయ్ గాంధీ ఏదైనా చేద్దామనుకున్నా చటుక్కున చేయలేడు కదా. అతనికి పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని ఏ పదవీ లేదు. కేవలం ప్రధాని గారి కొడుకు అంతే. అతనికి వెన్నుదన్నుగా నిలిచినవారు కొందరున్నారు. – ఆర్(రాజేంద్ర) కె (కుమార్) ధవన్, బన్సీలాల్, డి (దేవ) కె (కాంత) బరువా. నెహ్రూ కాలం నుంచి ప్రధాని కార్యాలయంలో పని చేస్తూ, ఇందిరకు 1971 రాయబరేలీ ఎన్నికల ప్రచారంలో పనిచేసి, అనుకోకుండా ఆమె చిక్కులకు కారణమైన యశ్‌పాల్ కపూర్‌కు మేనల్లుడు. అప్పుడతని వయసు 35. బ్రహ్మచారి. ప్రధాని కార్యాలయంలో ఎడిషనల్ ప్రయివేటు సెక్రటరీగా వుండేవాడు. పదేళ్ల క్రితం రైల్వేలో క్లర్కుగా పని చేసినా ప్రస్తుతానికి మాత్రం ఇందిరకు కళ్లు, చెవులూ అన్నీ. ఇందిర మనసును పూర్తిగా చదివేశాడని చెప్పుకుంటారు. ఆవిడ ఏదైనా ఫైలు కావలసి వచ్చి పేరు గుర్తుకు రాక తడుముకుంటూ ''అరే భాయ్, వో ఫైల్ జో హై..'' అంటూండగానే ఆవిడ మనసులో అనుకున్న ఫైలుని బల్ల మీద పెట్టేవాడట. అంటే ఏ క్షణాన ఆమె ఏం ఆలోచిస్తుందో అతనికి క్షుణ్ణంగా తెలుసు. అందువలన అతన్ని మంచి చేసుకోవాలని సంజయ్ చూడడంలో ఆశ్చర్యం లేదు. ఇద్దరూ కలిసి సరదాగా తిరిగేవారు. ఇందిరా గాంధీకి మ్యాన్ ఫ్రైడేగా వుంటే కలిగే సౌకర్యాలన్నీ ధవన్ పూర్తిగా వినియోగించుకున్నాడు. ఎంత సీనియర్ అధికారైనా, మంత్రి అయినా సాక్షాత్తూ ఇందిరే మాట్లాడినంత అథారిటీతో వాళ్లతో మాట్లాడేవాడు, మందలించేవాడు, గద్దించేవాడు. సంజయ్ ఎవరి వలన ఏం కావాలన్నా ధవన్‌కు చెప్పి చేయించుకునేవాడు. ఇతను సంతోషంగా చేసి పెట్టేవాడు.
సంజయ్‌కు నచ్చిన యింకో వ్యక్తి అతని కంటె దాదాపు 20 ఏళ్లు పెద్దవాడైన బన్సీ లాల్. హరియాణాను తన జాగీరుగా పాలించిన ముఖ్యమంత్రి. తన రాష్ట్రంలో నియంతగా ప్రవర్తించి సంజయ్‌కు ఆదర్శపాలకుడిగా నిలబడిన బన్సీ గురించి తెలుసుకోవాల్సింది చాలా వుంది. ఎమర్జన్సీ సమయంలో హరియాణాలో అతను సాగించిన రాక్షసపాలన గురించి తర్వాత చెప్పుకోవచ్చు కానీ సంజయ్ మారుతి ఫ్యాక్టరీకి హరియాణాలో భూమిని కట్టబెట్టి, అలహాబాదు తీర్పు తర్వాత అతని ప్రదర్శనలకు ధనాన్ని, జనాన్ని సప్లయి చేసి, ఎమర్జన్సీ విధించే తెగింపును ఇందిరకు తద్వారా కలిగించిన వ్యక్తి మూలాల గురించి, అతను ఎదిగిన వైనం గురించి యిక్కడ తెలుసుకోవాలి.
బన్సీ రాజస్థాన్, హరియాణా (అప్పట్లో పంజాబ్ రాష్ట్రంలో భాగంగా వుండేది) సరిహద్దు గ్రామమైన గోలా గఢ్ గ్రామంలో జాట్ కుటుంబంలో పుట్టాడు. తండ్రికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అతని 14 వ ఏట కాపురం లోహారు అనే పట్టణానికి మారింది. ఆ ప్రాంతం స్మగ్లర్లకు ప్రసిద్ధి. బన్సీ అక్కడ కిరాణా షాపులో గుమాస్తాగా పనిచేశాడు. బంధువులతో కలిసి బస్సు నడిపాడు, తనే కండక్టరు, ఒక్కోప్పుడు డ్రైవరు కూడా. ఇలా పని చేస్తూనే ''ప్రభాకర్'' పరీక్ష పాసయి డైరక్టుగా బిఏ పరీక్షకు కూర్చున్నాడు. ఏదో ఒక యూనివర్శిటీ ద్వారా బిఏ పట్టా సంపాదించాడు కూడా. ఆ తర్వాత 1940ల్లో జలంధర్ కాలేజీలో లా చదవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో పంజాబ్‌లో కాంగ్రెసు నాయకుడైన దేవీ లాల్‌ను వెళ్లి కలుస్తూండేవాడు. హిస్సార్ జిల్లా రాజకీయాల్లో తనకు సాయపడగలిగే యువకుడి కోసం చూస్తున్న దేవీలాల్‌కు యితను నచ్చాడు. హిస్సార్ మండల్ కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా, తర్వాత జిల్లా కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా చేశాడు. లాయరు పట్టా చేతికి వచ్చే ప్రాక్టీసు పెడితే క్లయింట్లు రాలేదు. దాంతో రాజకీయాలకే అంకితమై పోయాడు.
బన్సీ మొదటి నుంచి రామభక్త హనుమాన్ టైపు. నాయకులకు, వాళ్ల అవసరం పడేవాళ్లకు మధ్య దళారిగా పనిచేసేవాడు. తన నాయకుడు ఏం చెపితే అది తుచ తప్పకుండా చేసుకురావడంలో ఘనుడు, పనులు చేయించుకున్న వారిచ్చిన డబ్బును నిజాయితీగా పట్టుకుని వచ్చి యిచ్చేవాడు. దేవీ లాల్ యితన్ని అభిమానించాడు, ప్రోత్సహించాడు. 1960లో పంజాబ్ నుంచి నలుగుర్ని రాజ్యసభకు పంపవలసి వచ్చింది. జాబితా పంపండి అని అప్పటి కాంగ్రెసు అధ్యక్షుడు యుఎన్ ధేబర్ రాష్ట్ర కాంగ్రెసు నాయకులను అడిగాడు. ధేబర్‌కు జాట్‌లంటే పడదు. అందువలన జాబితాలో హుకుమ్ సింగ్ కనబడగానే కొట్టి పారేసి, వేరే పేర్లు పంపండి అన్నాడు. దేవీ లాల్ కూడా జాట్ నాయకుడే. జాట్ అయి వుండి పేరు బట్టి జాట్ అని కనుక్కోలేని వాడెవరా అని చూస్తే బన్సీ లాల్ కనబడ్డాడు. బన్సీ లాల్, బిఎ ఎల్‌ఎల్‌బి అని పేరు రాసి పంపితే ధేబర్ అతనెవరో బనియా అనుకుని ఓకే అనేశాడు. బన్సీ లాల్‌కు కూడా తన పేరు పంపుతున్న సంగతి తెలియదు. అతనికి చెప్తే బయటకు పొక్కుతుందేమోననుకుని 'ఈ పేరెవరిది?' అని బన్సీ అడిగినపుడు దేవీ లాల్ 'బన్సీ లాల్ మెహతా అని ఒకాయన వున్నాడులే' అని బదులిచ్చాడు. రాజ్యసభ టిక్కెట్టు వచ్చాక అసలు విషయం చెప్పాడు. అతను తెల్లబోయాడు. 'మీరు నాకు పితృసమానులు' అంటూ కాళ్ల మీద పడ్డాడు. ఢిల్లీ వెళ్లాక బన్సీ హరియాణా ప్రాంతానికి చెందిన గుల్జారీ లాల్ నందాకు శిష్యుడు అయిపోయాడు. ఆయన హోం మంత్రిగా పనిచేసేవాడు. చాలా చాలా నిజాయితీ పరుడు. అతనికి శిష్యులుగా పని చేసిన బన్సీ, బిహారు నాయకుడు ఎల్(లలిత్) ఎన్ (నారాయణ్) మిశ్రా పరమ అవినీతిపరులుగా పేరు తెచ్చుకోవడం ఒక విషాదం.
కొంతకాలానికి పంజాబ్ ముఖ్యమంత్రిగా వున్న ప్రతాప్ సింగ్ కైరాన్‌తో విభేదించి దేవీ లాల్, భగవత్ దయాళ్ శర్మ అనే మరో పెద్ద నాయకుడు కాంగ్రెసులోంచి బయటకు వచ్చేశారు. పంజాబ్ నుంచి హరియాణా విడగొడతారని తెలియగానే హరియాణాలో ప్రాముఖ్యత వస్తుందనే ఆశతో మళ్లీ కాంగ్రెసులోకి వచ్చారు. 1966 నవంబరు 1న హరియాణా ఏర్పడ్డాక యిద్దరూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. శర్మకు పదవి దక్కింది. అప్పటికి రాజ్యసభ సభ్యత్వం పూర్తయిన బన్సీను డిప్యూటీ మంత్రిగా తీసుకోమని నందా శర్మకు సిఫార్సు చేశాడు. కానీ బన్సీ గతచరిత్ర తెలిసిన శర్మ ఒప్పుకోలేదు. నాలుగు నెలల తర్వాత 1967 ఎన్నికలు జరిగి కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వచ్చింది. శర్మ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. అతను మొరార్జీకి అనుయాయి కాబట్టి ఇందిరకు అతనంటె యిష్టం లేదు. అతన్ని ఎలాగైనా పడగొట్టాలని పార్టీ ఫిరాయింపుల పర్వానికి తెర తీసింది. ఎన్నికలు కాగానే స్పీకరు ఎన్నిక జరిగితే ఇందిర అనుయాయులైన 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు ప్రతిపక్షంతో చేతులు కలిపి అధికార పక్ష అభ్యర్థిని ఓడించారు. ఇక అక్కణ్నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయి. డిఫెక్టర్లను 'ఆయారామ్, గయారామ్' గా వ్యవహరించడం అప్పటి నుంచే ప్రారంభమైంది. ఫిరాయింపులకు హరియాణా చిరునామాగా పేరు తెచ్చుకుని చాలాకాలం నిలబెట్టుకుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అప్పట్లో లేదు. ఒక ఎమ్మెల్యే 15 రోజుల్లో 5 సార్లు పార్టీ మారాడు. మరొకతను మూడు సార్లు మారాడు. శర్మ ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది. ప్రతిపక్ష నాయకుడైన రావు బీరేంద్ర సింగ్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున ముఖ్యమంత్రి అయ్యాడు. దేవీ లాల్ యునైటెడ్ ఫ్రంట్‌లో భాగస్వామి.
బీరేంద్ర సింగ్‌ను పడగొట్టడానికి ప్రయత్నించి విఫలమైన కాంగ్రెసు దేవీ లాల్‌ను దువ్వింది. కొంతమందినైనా చీల్చి తెస్తే ముఖ్యమంత్రి కావడానికి నీకు మద్దతు యిస్తామంది. కానీ బీరేంద్ర సింగ్ తెలివిగా చీలిక నివారించగలిగాడు. 8 నెలలైనా అతను ముఖ్యమంత్రిగా కొనసాగడం ఇందిర సహించలేక పోయింది. గవర్నరు బిఎన్ చక్రవర్తిని ఢిల్లీకి పిలిచి చివాట్లు వేసింది. అతను తిరిగి వస్తూనే 'ఏమిటీ పార్టీ ఫిరాయింపులు? తలచుకుంటేనే రక్తం ఉడికిపోతోంది. అందుచేత యీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేస్తున్నాను' అంటూ ఢిల్లీకి రాశాడు. ఫిరాయింపులు జరిగినప్పుడు నోరు మూసుకుని యిప్పుడు రియాక్ట్ కావడమేమిటి అని మేధావులు ఎద్దేవా చేసినా వినేవాళ్లు ఎవరూ లేరు. ప్రభుత్వం రద్దయింది. ఆర్నెల్లపాటు రాష్ట్రపతి పాలన నడిచింది. ఆ సమయంలో గవర్నరు కాంగ్రెసు కొరకై చేయాల్సిందంతా చేసి 1968 మధ్యంతర ఎన్నికలలో 81 సీట్లలో కాంగ్రెసుకు 48 సీట్లు వచ్చేట్లు చేయగలిగాడు. ఇందిరకు శర్మ అంటే పడదు కాబట్టి, అతనికి టిక్కెట్టు యివ్వలేదు. అయినా అతని అనుచరులు సంపాదించారు. 35 మంది నెగ్గారు కూడా. వాళ్లు శర్మనే ముఖ్యమంత్రి చేయాలని పట్టుబట్టారు. ఇందిరకు ఏం చేయాలో పాలుపోలేదు. కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డును సమావేశపరచి 'ఎమ్మెల్యేగా ఎన్నిక కానివారు ముఖ్యమంత్రి కాకూడదు' అని తీర్మానం చేయించింది. శర్మ కాకుండా వేరే ఎవరైనా ఫర్వాలేదు అనుకుని ఎవరిని చేయాలో తోచక తన స్నేహితులైన దినేశ్ సింగ్, ఐకె గుజ్రాల్‌లను గుల్జారీలాల్ నందా వద్దకు పంపింది.
''శర్మ కాకపోతే మరెవరున్నారు?'' అని అడిగాడు నందా.
''ఎవరైనా కావచ్చు. ఏం? మీ వెనక్కాల నిలబడి వున్నతను ఎందుకు కాకూడదు?'' అన్నారు వాళ్లు యాదాలాపంగా. ఆ వెనక్కాల వున్నతను బన్సీ లాల్! నందాను చూడడానికి వచ్చాడు. కేంద్ర మంత్రివర్గంలోంచి బయటకు వచ్చేశాక హరియాణాకు ముఖ్యమంత్రిగా వెళ్లాలన్న కోరిక నందాకు వుండింది. కానీ అది కుదరలేదు. ఇప్పుడీ బన్సీ అయితే తన మనిషి, అతనుంటే తను పాలించినట్లే అనుకుని 'ఓకే, బన్సీని ముఖ్యమంత్రి చేద్దాం' అన్నాడు. శర్మకు యీ విషయం చెపితే, నా శత్రువులు ఎవరో తన్నుకుపోయే బదులు యిలాటి అనామకుడైతే బెటరు అనుకుని ఆయనా సరే అనుకున్నాడు. ఆ విధంగా అనూహ్య పరిస్థితుల్లో బన్సీ హరియాణా ముఖ్యమంత్రి అయిపోయాడు. (సశేషం) (ఫోటో – ఆర్ కె ధావన్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)