జవాబులు – నేను నిజంగా అజ్ఞానినే. మారుతి వంటి ఒక ప్రయివేటు లిమిటెడ్ కంపెనీని ప్రభుత్వం మూసేయగలదని నాకు తెలియదు.
స్వాతంత్య్రానంతరం ప్రతిపక్షంగా నిలదొక్కుకున్న ప్రతిపక్షాల్లో సోషలిస్టు పార్టీని చెప్పుకోవాలి. జవహర్‌లాల్‌తో పోటీ పడగల ప్రజాదరణ సంపాదించుకున్న జయప్రకాశ్ నారాయణ్ దానికి లీడరు. ఆయనతో పాటు ఆచార్య నరేంద్ర దేవ్, అచ్యుత్ పట్వర్ధన్, అశోకా మెహతా, డా|| రామ్ మనోహర్ లోహియా, ఎస్‌ఎం జోషిలు కూడా ఆ పార్టీలో ప్రముఖులే. ఇది 1934లో ఆవిర్భవించి కాంగ్రెసు పార్టీలో అంతర్భాగంగా వుంటూనే కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ (సిఎస్‌పి) పేర తనకంటూ వేరే రాజ్యాంగం, సభ్యత్వం, ప్రత్యేక సిద్ధాంతం నిలుపుకుంది. కాంగ్రెసు పార్టీ ప్రధాన నాయకత్వం చర్చల ద్వారా స్వాతంత్య్రం సంపాదించగలమని నమ్మగా, సిఎస్‌పికి మాత్రం ఆ నమ్మకం లేదు. అందువలన బ్రిటిషు ప్రభుత్వం తరఫున వచ్చిన కాబినెట్ మిషన్‌తో చర్చలు బహిష్కరించింది. అధికార బదిలీకి తొలిమెట్టుగా ఏర్పరచిన కాన్‌స్టిట్యుయంట్ ఎసెంబ్లీలో, మధ్యంతర ప్రభుత్వంలో కూడా పాలు పంచుకోలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వుండమంటే వుండలేదు. మౌంట్‌బాటెన్ చేసిన దేశవిభజన ప్రతిపాదనను తిరస్కరించింది. స్వాతంత్య్రం తర్వాత సోషలిస్టు మార్గంలోనే ముందుకు సాగుతాం అని ప్రకటించాలని కాంగ్రెసుపై ఒత్తిడి తెచ్చింది.
కాంగ్రెసు పార్టీ యొక్క బలమూ, బలహీనతా ఏమిటంటే విభిన్న సిద్ధాంతాల నాయకులు ఆ గొడుగు కింద స్వాతంత్య్రం కోసం పోరాడారు. పూర్తి రైటిస్టు భావాల నుంచి పూర్తి లెఫ్టిస్టు భావాల వరకు కాంగ్రెసు విధానాల్లో ప్రతిఫలిస్తూ వచ్చాయి. కాంగ్రెసులో ఒక గ్రూపుగా వుంటూనే దాని విధానాన్ని తమవైపు ఆలోచనా ధోరణికి అనువుగా తిప్పుదామని రైటిస్టులూ, లెఫ్టిస్టులూ యిద్దరూ ప్రయత్నించారు. ఒక్కోప్పుడు ఒక్కోరిది పై చేయి అయింది. మతపరమైన సిద్ధాంతాల్లో గానీ, మరొకటి గానీ కాంగ్రెసు మధ్యేమార్గం అవలంబించింది. స్థిరమైన పంథా లేదు. అందరికీ అన్నీ చేస్తామంటూనే ఎవరికీ పెద్దగా ఏమీ చేయకుండా, అలాగని పూర్తిగా మానేయకుండా, సిద్ధాంతాలు వల్లిస్తూ నెట్టుకొచ్చింది. కొన్ని చోట్ల ఆ సిద్ధాంతాలు బాగా అమలయ్యాయంటే స్థానికంగా వున్న నాయకుడి గొప్పతనమే. అలా ఎందుకు చేశావని అతన్ని నిలదీయడం కానీ, అతనిలా నువ్వెందుకు చేయలేదని యితరులను తప్పుపట్టడం కానీ వుండవు. కమ్యూనిస్టు, జనసంఘ్ పార్టీల్లా కాంగ్రెసులో క్రమశిక్షణ గురించి పట్టింపు లేదు. అధినాయకత్వాన్ని చూసి దడవడం లేదు. ఎవరైనా ఎప్పుడైనా దేని గురించైనా మాట్లాడవచ్చు, నాయకత్వంతో విభేదించవచ్చు. వారిపై చర్యలు ఓ పట్టాన తీసుకోరు. కొంతకాలానికి పార్టీ విడిచి వెళ్లిపోయినా, మళ్లీ వచ్చి చేరినా పట్టింపు లేదు. ఇలా ఒక రకమైన ప్రజాస్వామ్యం వుండబట్టే కాంగ్రెసు యింతకాలంగా నెగ్గుకొచ్చింది. ప్రజలు దాన్ని ఆమోదిస్తూ వచ్చారు. కాంగ్రెసును విమర్శిస్తూ బయటకు వెళ్లిన నాయకులు సైతం తమ పార్టీ పేరులో కాంగ్రెసును ధరించకపోతే చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడింది.
రైటిస్టులు యీ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. పైకి సోషలిజం మా సిద్ధాంతం అని పార్టీ చెపుతున్నా వారు పార్టీనే అంటిపెట్టుకుని వుండి, ఆచరణలో తమకు అనుకూలమైన విధానాలు జరిగేట్లు చూసుకున్నారు. స్వాతంత్య్ర సమరం కాలంలో కాంగ్రెసు భూసంస్కరణలంటూ జమీందార్లకు, కార్మికసంఘాలు పెట్టి పెట్టుబడిదారులకు, ప్రజాహక్కులంటూ సంస్థానాధీశులకు వ్యతిరేకంగా పోరాడేది. వారంతా బ్రిటిషువారికి మద్దతు యిచ్చేవారు. స్వాతంత్య్రం వచ్చాక వారంతా గాంధీ టోపీలు ధరించి కాంగ్రెసులో చేరిపోయారు. నిజాం రాజ్యంలో కమ్యూనిస్టుల నిజాం తాబేదార్లయిన జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడి భూములు లాక్కుని పేదలకు పంచిపెట్టారు. పోలీసు చర్య తర్వాత యీ జమీందార్లు కాంగ్రెసు పార్టీలో చేరి, ఆ కమ్యూనిస్టులను కాల్పించి, తమ భూములు తాము వెనక్కి తెచ్చుకున్నారు. మీలాటి ప్రజాపీడకులు మాలో చేరకూడదు అని కాంగ్రెసు అనలేదు. వీళ్లను బాలన్స్ చేయడానికి సోషలిస్టులు కాంగ్రెసులోనే వుంటే ఏం జరిగేదో తెలియదు కానీ వాళ్లు మొండిగా వ్యవహరించారు. తాము చెప్పినట్లు సోషలిస్టు ఎజెండాను అమలు చేస్తానని కాంగ్రెసు ప్రకటించలేదు కాబట్టి అది రైట్‌వింగ్ బూర్జువా పార్టీ అని ఆరోపించి గొడవ చేశారు. దాంతో కాంగ్రెసులో రైటిస్టులు 'ఒక పార్టీలో వున్నవారు ఒకే రాజ్యాంగానికి లోబడాలి. సోషలిస్టు పార్టీ మనలో భాగంగా వుండాలంటే వాళ్ల రాజ్యాంగాన్ని, విడి సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలి' అని డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీకి అది సమంజసంగా తోచి 1948లో ఆ మేరకు ఒక నియమం ఏర్పరచింది.
దాంతో 1948 మార్చిలో సోషలిస్టు పార్టీ విడిగా వెళ్లిపోయి 'సోషలిస్టు, డెమోక్రాటిక్ సమాజస్థాపనే మా ధ్యేయం' అని ప్రకటించింది. వెనక్కి తిరిగి చూసుకుంటే యిది ఆ పార్టీ చేసిన అతి పెద్ద తప్పిదం. కాంగ్రెసు పార్టీలో వారి సంఖ్య తక్కువే. సంస్థాపరంగా, పదవుల పరంగా వారి పట్ల వివక్షత వుండేది. కానీ సిద్ధాంతాల పరంగా వారి భావాలకు విలువ యిచ్చేవారు. వారు బయటకు వెళ్లిపోవడంతో రైటిస్టులు క్రమక్రమంగా కాంగ్రెసును తమ విధానాలకు అనుగుణంగా తిప్పుకోగలిగారు. నెహ్రూ సోషలిజం ప్రవచించే రోజుల్లో కూడా వారు కిమ్మనలేదు. నిశ్శబ్దంగా వుంటూ తమ స్థానాన్ని దృఢపరచుకుంటూ పోయారు. కమ్యూనిస్టులు కానీ, సోషలిస్టులు కానీ నెహ్రూ వంటి నాయకుణ్ని తయారు చేసుకోలేకపోయారు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆచార్య నరేంద్ర దేవ్ వంటి వివేకవంతుడైన నాయకుడు కాంగ్రెసు నుండి విడివడాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. కానీ పార్టీ ఆదేశాన్ని శిరసా వహించాడు. సోషలిస్టుల నిష్క్రమణతో నెహ్రూ కాంగ్రెసు పార్టీలో బలహీనపడ్డాడు. రైటిస్టులది పై చేయి అయింది.
తమ బలాన్ని అతిగా వూహించుకుని కాంగ్రెసు నుండి బయటకు వచ్చిన సోషలిస్టు పార్టీ 1951-52 ఎన్నికలలో దెబ్బ తింది. 10.6% ఓట్లు వచ్చినా లోకసభలో 12 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ పార్టీ జాతీయ నాయకులందరూ ఓడిపోయారు. రాష్ట్రాలలో వున్న 2248 సీట్లలో కేవలం 124 గెలిచింది. దాని అభ్యర్థులలో 58% మందికి డిపాజిట్లు దక్కలేదు. దానికి బలం వుందనుకున్న ఉత్తర ప్రదేశ్‌లో 390 సీట్లలో 18, బిహార్‌లో 240లో 23, బొంబాయిలో 269లో 9 వచ్చాయి. కాంగ్రెసు పక్షాన మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం, బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన పిసి ఘోష్, 1950 వరకు కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచేసి మళ్లీ ఎన్నికవడానికి ప్రయత్నించిన జెబి కృపలానీ వ్యక్తిగతమైన కారణాలతో కాంగ్రెసుని వీడి బయటకు వచ్చేసి కృపలానీ నాయకత్వాన 1951 జూన్‌లో కిసాన్ మజ్‌దూర్ ప్రజా పార్టీ (కెఎంపిపి) నెలకొల్పారు. మా సిద్ధాంతాలు గాంధీ సిద్ధాంతాలు, వాటిని అమలు చేయడమే మా పార్టీ ఆశయం అని చెప్పుకున్నారు. ఎన్నికలలో వాళ్లకు పరిస్థితి సోషలిస్టు పార్టీ కంటె అధ్వాన్నమైంది. 5.8% ఓట్లు తెచ్చుకుని లోకసభలో 9 సీట్లు తెచ్చుకున్నారు. అసెంబ్లీలలో 77 సీట్లు వచ్చాయి. ఓ పక్క కమ్యూనిస్టులు, మరో పక్క కాంగ్రెసు బలంగా వున్నాయి కాబట్టి తాము విడివిడిగా వుంటే దెబ్బ తింటామని భావించి రెండు పార్టీలు 1952 సెప్టెంబరులో విలీనమై ప్రజా సోషలిస్టు పార్టీ (పిఎస్‌పి)గా ఏర్పడి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించబడింది. దానికి కృపలానీ చైర్మన్, అశోకా మెహతా జనరల్ సెక్రటరీగా వున్న యీ పార్టీకి దేశమంతా సంస్థాగతమైన బలం వుంది. 17.4% ఓట్లున్నాయి. ఎందరో ప్రజాదరణ పొందిన నాయకులు ఆ పార్టీలో వున్నారు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం యిదే అనుకున్నారు. అయితే ఆ ముచ్చట ఎక్కువకాలం కొనసాగలేదు. (సశేషం) (ఫోటో – సోషలిస్టు నాయకుడు ఆచార్య కృపలానీ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)