రైటర్‌గా జర్నీ స్టార్ట్ చేసిన కొరటాల శివ 'మిర్చి'తో దర్శకుడిగా మారారు. రెండు ఊళ్ల మధ్య వైరం అనే చాలా రొటీన్ పాయింట్‌తో బ్లాక్‌బస్టర్ మెటీరియల్ సిద్ధం చేసి రచయితగా తన నేర్పుని, దర్శకుడిగా తన ప్రతిభని చాటుకున్నారు. దర్శకుడిగా తన రెండో ప్రయత్నంగా ఒక ఊరిని, అక్కడి మనుషులు అందర్నీ దత్తత తీసుకునే శ్రీమంతుడి గురించి సినిమా చేస్తున్నారు. ఎలాంటి కథ తీసుకున్నా కానీ స్ట్రాంగ్ ఎమోషన్స్‌కే ప్రాధాన్యత ఇస్తానంటూ, తన సినిమాలు ఏవైనా కానీ మెజారిటీ ఆడియన్స్‌కి కేటర్ చేయనిదే నిద్రపోనంటోన్న కొరటాల శివ 'శ్రీమంతుడు' రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తన సినిమా గురించి తను ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదని, సినిమానే మాట్లాడుతుందనే ధీమాతో వున్న ఆయనతో గ్రేట్‌ఆంధ్ర చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ…
శ్రీమంతుడు ఎవరు.. అతని కథ ఏంటి?
బాగా డబ్బున్న వ్యక్తి తాలూకు ఎమోషనల్ జర్నీ ఇది. అతను జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, అతనికి ఎదురు పడే సందర్భాలు, సింపుల్‌గా వుండే, తనకి తోచిన విధంగా వెళ్లిపోయే ఒక గుడ్ సామరిటన్ స్టోరీ.
ఊరిని దత్తత తీసుకునే హీరో…! ఈ పాయింట్‌లో హీరోయిజం వుందని, దీంతో ఒక కమర్షియల్ సినిమా తీయవచ్చని ఎలా అనిపించింది?
ఫలానా వాళ్లు తమ సొంత ఊరికోసం అది చేసారని, తాము సంపాదించిన దాంట్లోంచి ఊరి కోసం ఖర్చు పెట్టారని… లాంటి ఆర్టికల్స్ చిన్నప్పట్నుంచీ పేపర్లో చదువుతూ వుండేవాడిని. ఆ చిన్న చిన్న ఆర్టికల్స్ చదవడానికి నాకు భలేగా అనిపించేవి. వారెన్ బుఫెట్, బిల్ గేట్స్ లాంటి వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి, 'మా ఆస్తిలో మూడొంతులు పేదలకి ఇచ్చేస్తున్నాం' అంటే, ఎంత హీరోయిజమ్ వుందందులో! ఎవరైనా సాయం కోరి వచ్చిన వారికి వంద రూపాయలిస్తేనే మనం చాలా గొప్పగా ఫీలవుతాం. అలాంటిది అన్ని కోట్ల ఆస్తిలో మూడొంతులు ఇచ్చేస్తే దానిని చారిటీ అనే సింపుల్ పదంతో సరిపెట్టకూడదు. దానికి చాలా గట్స్ కావాలి, చాలా దమ్ముండాలి. నా ఆస్తిలో సగమిచ్చేస్తున్నా అనడమనేది మనకి చిన్న డైలాగ్‌లా అనిపించొచ్చు. కానీ దాని వెనుక చాలా ఆలోచన వుంటుంది. ఎంతో పెద్ద హార్ట్ వుండాలి. అలాంటి ఆలోచనలున్న కథానాయకుడి పాత్రతో సినిమా తీయాలి. దానిని వీలయినంత కమర్షియల్‌గా, హార్డ్ హిట్టింగ్‌గా చెప్పాలి.. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే ఆలోచనతో శ్రీమంతుడు చేయడం జరిగింది.
మహేష్ తన సొంత ఊరిని దత్తత తీసుకోవడం వల్ల ఈ కథతో తనని అప్రోచ్ అవ్వాలనిపించిందా, లేక..
లేదండీ. అది ప్యూర్ కోన్‌ఇన్‌సిడెన్స్ అంతే. ఈ కథని నేను ఆయనకి వన్ ఇయర్ క్రితమే చెప్పాను. ఆయన ఇలా తన ఊరిని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారనే సంగతి తర్వాత ఎక్కడో చదివాను. అది ఆయన పర్సనల్ విషయం కనుక దాని గురించి ఆయనతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఇలాంటి కోఇన్‌సిడెన్స్ రావడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది.
జనరల్‌గా ఈ తరహా పాయింట్స్‌తో స్వదేశ్‌లాంటి ఆర్ట్ సినిమాలొస్తుంటాయి. దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌కి స్కోప్ ఎంత వుంది?
బేసిక్‌గా నాకు ప్రీచింగ్ అస్సలిష్టం లేదండీ. నేను సందేశాలు తీసుకోను, ఎవరికీ ఇవ్వను! ప్రతి ఒక్కరికీ తమ జీవితమేంటనేది వాళ్లకే బాగా తెలుసు. ఇంకొకరొచ్చి మనకి ఏదైనా చెప్పినా కోపమొస్తుంది, అలాగే ఎవరికైనా ఏదైనా చెప్పడానికి మనం కూడా పెద్దగా ఇష్టపడం. అందులోను ఈ జనరేషన్‌కి! వాళ్లు ఏదైనా ఇన్సిడెంట్ చూసి, లేదా ఎవరినైనా చూసి వాళ్లంతట వాళ్లే ఇన్‌స్పయిర్ అవుతారు కానీ, పర్టిక్యులర్‌గా ఎవరైనా వచ్చి ఇలా చేయండి, అలా చేయండంటూ చెప్తే వినరు. పర్సనల్‌గా నేను కూడా మెసేజ్‌లు ఇవ్వడానికి యాంటీ. అందుకే ఇందులో అలాంటి ప్రీచింగ్‌లాంటిది, క్లాసులు పీకడం లాంటిది వుండదు. ఒక డబ్బున్న వాడొచ్చి ఊరిని దత్తత తీసుకుని, డబ్బులు ఖర్చు పెట్టి వెళ్లిపోయాడంటే అదొక డాక్యుమెంటరీలా వుంటుంది. కానీ ఇందులో హీరో ఊరితో పాటు అక్కడి చెడ్డ వాళ్లని కూడా దత్తత తీసుకుంటాడు. అందులోనే ఒక కమర్షియల్ యాంగిల్ వుంది. ఒక కొత్త ఎక్స్‌ప్రెషన్ పట్టుకుని దానిని కమర్షియల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా చేశాను. ఆ కేర్ ప్రత్యేకంగా తీసుకున్నాను.
సినిమా రిలీజ్ అయ్యే వరకు కథ ఏంటనేది తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ మీరు మాత్రం ఎప్పుడో రిలీజ్ చేసిన టీజర్‌లోనే ఈ సినిమా దేని గురించి అనేది చెప్పేసారు. ఎందుకిలా, ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయడానికా?
బీయింగ్ ఏ రైటర్… చిన్న టీజర్‌లో అయినా కానీ కథేంటో చెప్పేద్దామని అనిపిస్తుంది. హీరో, హీరోయిన్‌దొక అందమైన విజువల్ వేసి, ఒక ఫైట్‌లోని షాట్ లేదా చిన్న మ్యూజిక్ బిట్‌తో సరిపెట్టేయడం నాకు నచ్చదు. టీజర్ రిలీజ్ చేయడం వెనుక మన సినిమాని ప్రమోట్ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం అయినప్పుడు హీరో వాకింగ్ షాట్ లేదా, ఫైట్ బిట్ వేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. దాని బదులు సింపుల్‌గా పోస్టర్ రిలీజ్ చేసుకోవచ్చు. టీజర్ చూసినప్పుడే ఈ సినిమా కంటెంట్ ఏంటనేది అర్థమవ్వాలని, ఇది ఏ టోన్‌లో వుండబోతుందనేది క్లియర్‌గా తెలియాలని అనుకుంటాను. వాళ్లకి ఏం చెప్పకపోయినా ఫర్లేదు కానీ కన్‌ఫ్యూజ్ చేయడం ఇష్టముండదు. అందుకే నా సినిమా ఇదీ అని చెప్పాలనుకున్నాను. పది సెకన్ల టీజర్ అయినా కానీ ఆ టైమ్‌లో కథ ఎలా చెప్పవచ్చు అనేదే ఆలోచిస్తాను.
మీరు ఈ కథ చెప్పినప్పుడు మహేష్ రియాక్షన్ ఏంటి?
ఆయన ఎక్సయిట్‌మెంటే నేను ముందుకెళ్లడానికి డ్రైవ్ చేసిందండీ. ఆయన ఒకటే అన్నారు.. ''మీరు డెఫినెట్‌గా కమర్షియల్ స్క్రిప్ట్‌తోనే వస్తారని తెలుసు. అయితే వింటుంటే ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుని ఇంత పెద్ద కథ రాయవచ్చా.. అనిపించింది. పాయింట్ చాలా స్ట్రయికింగ్‌గా వుంది. కమర్షియల్‌గా వుంది. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది చెప్పినట్టు తీయండి. మీరు ఎలా కావాలంటే అలా మౌల్డ్ అయి చేద్దాం ఈ సినిమా..'' అంటూ ఆయన మాట్లాడిన విధానం నాకు బాగా ఎంకరేజింగ్‌గా అనిపించింది. నా కథ కాబట్టి నేను ఎక్సయిట్ అవుతాను. కానీ నా లీడ్ యాక్టర్, నా ప్రొడ్యూసర్స్.. ఇలా అందరూ ఎక్సయిట్ అయితేనే బాగా తీయగలుగుతాను. కథ విన్నప్పుడు ఆయన ఎంకరేజ్‌మెంట్ ఎలా వుందో, సినిమా షూటింగ్ పూర్తయి, డబ్బింగ్ చెప్పే వరకు కూడా అలాగే వుంది. స్క్రిప్ట్‌ని నేనెంత నమ్మానో… నాకంటే ఒక లెవల్ ఎక్కువ నమ్మారాయన. దానికి చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను.
కథగా మిమ్మల్ని అంత ఎక్సయిట్ చేసినది ఇప్పుడు తెరపై చూస్తుంటే ఎలా అనిపిస్తుంది?
ఆనందంతో పాటు ఎక్సయిటెడ్‌గా, ఓవర్ ఎంతూజియాస్టిక్‌గా వున్నానండీ ఇప్పుడు. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగాం. నా టీమ్‌ని ఓపెన్‌గా అడిగాను, ఎలా వుందీ అని. వాళ్లు ఇచ్చిన కాంప్లిమెంట్స్ చాలా పెద్దవి. కానీ ఈ ఫేజ్‌లో ఐ వాంట్ టు స్టే వెరీ లో. ఎందుకంటే ఏదైనా తక్కువున్న దానిగురించి అయితే ఎక్కువ మాట్లాడవచ్చు. కానీ నా సినిమానే ఎక్కువ మాట్లాడనుంది. కంటెంట్ ఎక్కువుంది, అనుకున్నది అనుకున్నట్టు తీసాం, బెస్ట్ యాక్టర్స్ వున్నారు, బెస్ట్ టీమ్ దొరికింది.. నేననుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అవుట్‌పుట్. పేపర్ మీద రాసినప్పుడు స్క్రిప్ట్ బాగుందనిపిస్తుంది. విజువలైజ్ చేసినపుడు దాంట్లో ఒక ఎయిటీ పర్సంట్ వచ్చినా చాలనుకుంటాం. కానీ ఈ సినిమాకి మోర్ దేన్ హండ్రెడ్ పర్సంట్ అవుట్‌పుట్ వచ్చింది. అందుకే నేను దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా, సినిమానే మాట్లాడితే బాగుంటుందని అనుకుంటూ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.
మీ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే కొన్ని మాస్ టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అవన్నీ కాదని శ్రీమంతుడు అనే టైటిల్ పెట్టాలని ఎందుకనిపించింది. ఈ టైటిల్ పెడదామని అన్నప్పుడు మహేష్ రియాక్షన్ ఏంటి?
మేము ఇంకా ఏ టైటిల్ పెట్టాలనేది డిసైడ్ కాకముందే కొన్ని టైటిల్స్ ప్రచారమయ్యాయి. ఆ టైటిల్స్ విని 'ఓహో.. ఇలాంటి టైటిల్ కూడా పెట్టవచ్చా' అని మేం కూడా అనుకున్నాం. ఈ సినిమాకి ఏ టైటిల్ పెడితే బాగుంటుందో తెలీలేదు. ఎందుకంటే ఇదో కొత్త జోనర్ సినిమా. ఒక మాస్ కథ చెప్తే మాస్ టైటిల్ పెట్టొచ్చు. ఒక సాఫ్ట్ లవ్‌స్టోరీ అయితే అలాంటి టైటిల్ పెట్టొచ్చు. కానీ ఈ సినిమాలో మల్టిపుల్ ఎమోషన్స్ వున్నాయి. చాలా వేరియేషన్స్ వున్నాయి. అన్నీ సమరైజ్ చేసే ఒక ఎక్స్‌ప్రెషన్ దొరకలేదు. ఏ టైటిల్ పెడదామన్నా కానీ కథకి సరిపోతుందనిపించలేదు. ఇదొక బిలియనీర్ కథ. ఒక శ్రీమంతుడి కథ. సో ఆ కథకి శ్రీమంతుడు అని పెడితే యాప్ట్ అనిపించింది. ఈ టైటిల్ అనుకుంటున్నానని ప్రొడ్యూసర్స్‌కి చెప్తే.. 'మీ ఇష్టం సర్.. మాకు అంత ఎక్స్‌పీరియన్స్ లేదు కదా' అన్నారు. మహేష్‌కి చెప్తే… ఆయన దేనికైనా రియాక్ట్ అయ్యేది చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా స్ట్రయికింగ్‌గా వుంటుంది. బాలేకపోతే డిప్లమాటిక్‌గా ఆలోచించరు. బావున్నా ఆలోచించరు. ఆయనతో ఇదే అన్నా… 'శ్రీమంతుడి కథ కద్సర్.. శ్రీమంతుడు అని పెడితే ఎలా వుంటుంది' అని అంటే, ఆయన చాలా క్యాజువల్‌గా 'భలే వుంది సర్. ఎందుకంత ఆలోచించడం. మనం చెప్పేది ఒక రిచ్ మ్యాన్ కథే కదా. ఈ టైటిల్ బాగుంటుంది' అనేసారు. దేనికైనా అంత స్పాంటేనియస్‌గా వుంటుంది ఆయన రియాక్షన్.
మహేష్ పర్‌ఫార్మెన్స్ పరంగా కానీ, క్యారెక్టరైజేషన్ పరంగా కానీ ఇంతవరకు తను చేసిన క్యారెక్టర్స్‌కీ, శ్రీమంతుడికీ వుండే వ్యత్యాసమేంటి? మీ సినిమానుంచి మహేష్ ఫాన్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
ఆయన ఇంతవరకు చేయనిది ఇందులో చేసేసారు లాంటి స్టేట్‌మెంట్స్ నేను ఇవ్వను కానీ… ఒక యాక్టర్‌గా మహేష్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పర్‌ఫార్మెన్స్ బ్యాలెన్స్‌డ్‌గా వుంటుంది. కామెడీ కానీ, ఎమోషన్ కానీ ఏదీ లౌడ్‌గా వుండదు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్. ఇందులో ఆయన చాలా సింపుల్‌గా వుంటారు. కానీ చాలా స్ట్రాంగ్ హార్టెడ్. ఆయన పర్సనల్ క్యారెక్టర్ కూడా అదే. సూపర్‌స్టార్ అయినా కానీ చాలా సింపుల్‌గా వుంటారు. ఆయన మాటతీరు చాలా సహజంగా వుంటుంది. ఎక్కడా అతి వుండదు. షో ఆఫ్ వుండదు. ఇందులో క్యారెక్టర్ కూడా అదే. ఎక్స్‌ట్రీమ్ స్ట్రాంగ్ హార్టెడ్ క్యారెక్టర్ బట్ వెరీ సింపుల్ ఇన్ నేచర్. అలాంటి నేచర్‌తో ఆయన డైలాగ్ చెప్తే ఒక ఫీస్టేనండీ మనకి. ఇందులో ఆయన కొన్ని డైలాగ్స్ చెప్పిన తీరు చూస్తే చాలా రియల్‌గా అనిపిస్తుంది. శ్రీమంతుడిగా ఆయన పర్‌ఫార్మెన్స్‌ని ముందుగా చూడగలిగిన ప్రేక్షకుడినైనందుకు లక్కీగా ఫీలవుతున్నాను. షూటింగ్‌లో మోనిటర్‌లో చూస్తున్నప్పుడు ఒక డైరెక్టర్‌గా కంటే, ఆడియన్స్‌గా ఎక్కువ ఎంజాయ్ చేశా. నేను రాసుకున్న డైలాగ్స్ ఇంత అద్భుతంగా వున్నాయా అని నాకే అనిపించేలా చేశారు. నేను ఏ ఇంటెన్షన్‌తో డైలాగ్ రాసాననేది ఆయన గ్రహిస్తారు. ఆయన గుడ్ యాక్టర్ అనేయడంతో సరిపెట్టలేను. ఆయనో ఇంటిల్లిజెంట్ యాక్టర్. ఒక డైలాగ్ చెప్పగానే ఏ ఉద్దేశంతో రాసామనేది ఆయన గ్రహిస్తారు. ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకుని దానిని ఎంత ఇంటెన్స్‌గా చెప్పాలనేది ఆయనకి తెలుసు. నేను అంతగా ఇంటరాక్ట్ అయి చెప్పలేకపోయినా కానీ నేనేం చెప్పాలని అనుకుంటున్నాననేది ఆయన ఈజీగా గ్రాబ్ చేయగలరు. కథతో ట్రావెల్ అవడంతో పాటు క్యారెక్టరైజేషన్ మీద హోమ్ వర్క్ చేసుకుంటారు. ఈ క్యారెక్టర్‌ని ఆయన చేసిన తీరు, ఆయన డైలాగ్స్ చెప్పిన విధానం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఫాన్స్‌కే కాకుండా మూవీ లవర్స్ అందరికీ ఒక ఫీస్ట్‌లా వుంటుంది.
టైటిల్, క్యారెక్టరైజేషన్ అన్నీ క్లాస్‌గా అనిపిస్తున్నాయి. ఇందులో మాసెస్‌కి రీచ్ అయ్యే అంశాలేమున్నాయి?
నేను ఎమోషనల్ హైస్ బాగా నమ్ముతానండీ. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇష్టపడతాను. లైట్ ఎమోషన్స్ ఎక్కువ ట్యాప్ చేయలేను. ఏదైనా హార్డ్ హిట్టింగ్‌గా చెప్తా. నేను డైరెక్ట్ చేసిన మిర్చిలో కానీ, అంతకుముందు నేను రాసిన కథల్లో కానీ అది మీరు చూడొచ్చు. ఈ విషయంలో నాకు శ్రీశ్రీగారు ఇన్‌స్పిరేషన్. ఆయన చిన్న మాట కూడా కొట్టినట్టు చెప్తారు. నాకు తెలీకుండానే ఆయన ఇన్‌ఫ్లుయన్స్ నాపై వుంటుంది. అందుకే చిన్న మాట అయినా హార్డ్ హిట్టింగ్‌గా చెప్పాలనే తాపత్రయం వుంటుంది. సాఫ్ట్ ఎమోషన్‌ని కూడా హార్డ్ హిట్టింగ్‌గా చెప్పడానికే ట్రై చేస్తాను. మాస్ అంటేనే అది. నేను ఎంచుకున్న ఏ ఎమోషన్ అయినా కానీ మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరికీ అప్పీలింగ్‌గా చెప్పగలనని అనుకుంటాను. నా కథని మెజారిటీ వ్యూయర్స్‌కి చెప్పపోతే నిద్ర పట్టదు నాకు. హీరో లుక్ క్లాసీగా అనిపించొచ్చు. కానీ ఇందులో వుండే ఎమోషన్స్ మాత్రం మాస్, క్లాస్ అందరికీ నచ్చేలా వుంటాయి.
ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఏ కథనైనా కామెడీతో నింపడానికి ట్రై చేస్తున్నారు. మిర్చిలో మీరు ఆ ట్రెండ్ ఫాలో అవలేదు. ఈ ట్రెయిలర్స్ చూస్తున్నా కామెడీని హైలైట్ చేసే ప్రయత్నం కనిపించలేదు…
ఇంతవరకు సూపర్ స్క్రిప్ట్‌తో చేసిన సినిమాలు ఫ్లాపయిన సందర్భం లేదండీ. ఫార్ములా సినిమాలు హిట్టవుతుంటాయి. అలాగే ఫార్ములా ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంటుంది కూడా. కానీ ఒక పెద్ద కథ చెప్పిన ఏ సినిమా ఇంతవరకు మిస్‌ఫైర్ అవలేదు. ఫార్ములా కంటే కథని నమ్ముతాను. ఎక్కడా డీవియేట్ అవకుండా ఒక కథని ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చెప్పగలిగితే అది ఫెయిలవదు. నేను ఇండస్ట్రీకి వచ్చిందే కథలు చెప్పడానికి. కథ చెప్పడం ఇష్టం నాకు. మీరు ఇంటర్వ్యూకని కాకుండా సరదాగా కలిస్తే.. మీకు ఒక కథ చెప్తాను. కథలు చెప్పడాన్ని బాగా ఇష్టపడతాను. ఎప్పటికీ మంచి కథలు చెప్తూనే వుంటాను.
మీలా రైటర్స్ అంతా డైరెక్టర్స్ అయిపోతూ వుండడం వల్ల సరిపడా కథలు దొరకడం లేదనే కంప్లయింట్ ఉంది. వచ్చిన ప్రతి రచయితా ఎందుకు దర్శకుడు అయిపోతున్నాడంటారు.
అంటే డైరెక్టర్ కావాలనేదే వాళ్ల పర్సనల్ ఇంట్రెస్ట్ లేదా గోల్ అయి ఉండొచ్చు. మంచిదే కదండీ. రైటర్స్ డైరెక్టర్లయితే మంచి కథలు, మంచి సినిమాలు వస్తాయి. అలాగే మన పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరిలోను ఒక రైటర్ ఉంటాడు. ప్రతి మనిషిలోను ఒక రైటర్, ఒక క్రియేటర్ ఉంటాడని ఫీలింగ్ నాకు. ఏ ఒక్కరూ పుట్టుకతోనే రచయిత లేదా దర్శకుడు కాదు. ఇక్కడికొచ్చిన తర్వాత రైటరా, డైరెక్టరా అనే ట్యాగ్ యాడ్ అవుతుందంతే. ఏ రైటర్‌కి అయినా మన కథ మనమే చెప్దామనే ఆశ వుంటుంది. డైరెక్షన్ అంటే నథింగ్ బట్.. స్క్రిప్ట్‌ని స్క్రీన్‌పై నెరేట్ చేయడం. ప్రతి రైటర్‌కి, ప్రతి టెక్నీషియన్‌కీ తన కథ తనే చెప్పాలనే కోరిక వుంటుంది.
మీరు కూడా డైరెక్టర్ కావాలనే ఎయిమ్‌తోనే ఇండస్ట్రీకి వచ్చారా?
నా లైఫ్‌లో నేనేదీ ప్లాన్ చేసుకుని చెయ్యలేదండీ. అన్నీ యాక్సిడెంటల్‌గానే జరిగాయి. నాకు చిన్నప్నట్నుంచీ కథలు రాయడం ఇష్టం. కథలు చెప్పడం ఇష్టం. నలుగుర్ని వేసుకుని కూర్చుని ఏదోటి చెప్తుండే వాడిని. రైటర్‌ని, రాయాలి.. అంటే ఏం చెయ్యాలి. ఫిలిం ఇండస్ట్రీకి వస్తే రైటర్‌గా కంటిన్యూ కావచ్చు అనుకుంటూ వచ్చాను. పోసాని కృష్ణమురళిగారు నాకు రిలేటివ్ కావడంతో ఆయన దగ్గర కొన్నేళ్లు పని చేశాను. సినిమాకి కథ ఎలా రాయాలి, డైలాగ్స్ ఎలా రాయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత రైటర్‌నయ్యాను. కొన్ని సినిమాలకి పని చేశాను. నేను ఆన్ సెట్స్ వుండే రైటర్‌ని. సినిమా గురించి అన్నీ తెలుసుకునే వాడిని. పర్సనల్ ఇంట్రెస్ట్ వల్లే ప్రతీ విషయం దగ్గరుండి చూసేవాడిని. వన్ ఫైన్ డే.. నా కథని నేనే స్క్రీన్ మీద చెప్పాలనే ఆలోచన వచ్చింది. డైరెక్టర్‌నయితే నా కథని నేనే కొన్ని వేల మందికి చెప్పవచ్చనిపించింది. డైరెక్టర్ కావడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశాను.
మీరు చేస్తున్న సినిమాలు కానీ, చేస్తారని అంటున్న సినిమాలకి కానీ అందరూ పెద్ద హీరోల పేర్లే ప్రస్తావనకి వస్తున్నాయి. స్టార్ హీరోల కోసమే కథలు రాస్తున్నారా, లేక వాళ్లే మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా?
చెప్పాను కదండీ. నేనేదీ ప్లాన్ చేసుకోను. ఇలాంటివి చేద్దాం, పెద్ద సినిమాలతో వెళ్దాం అని కూడా వుండదు. అదలా కుదురుతుందంతే. ఇది రిలీజ్ అయిన తర్వాత నేను రాసుకున్న కథల్లో ఇప్పుడు ఏ కథైతే బాగుంటుందని వెతకాలి. ఒక ప్రేమకథ చెప్పినా కానీ స్ట్రాంగ్ ఎమోషన్‌తో చెప్పాలి. ఒక మరోచరిత్ర, ఒక సీతాకోకచిలక, ఏ పాయింట్ ఎంచుకున్నా సరే… స్ట్రాంగ్‌గా చెప్పాలి. నెక్స్‌ట్ కథేంటో నాకే తెలీదు. బ్రేక్ తీసుకోవాలి, దీనికి ప్రమోషన్స్ చేయాలి, దీనిని మొత్తం అనలైజ్ చేసుకోవాలి. మళ్లీ ఒక కదిలించే కథ దొరకాలి. ఏదైనా నాకు త్వరగా బోర్ కొడుతుంది. ఒక వన్ ఇయర్ పాటు నాకు బోర్ కొట్టని ఎమోషన్ వున్న కథ అయితే చూసుకోవాలి. అలాగే అది ఇప్పుడున్న యాక్టర్స్‌లో ఎవరికి యాప్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. అంతే కానీ నెక్స్‌ట్ వీళ్లతో చేసేద్దాం, వాళ్లతో చేద్దాం అనుకుంటూ ఏదీ ప్లాన్ చేయను. ఈ కథకి వీళ్లయితే బాగుంటారని అనుకుంటే, వెళ్లి వాళ్ల తలుపు కొడతాను. సర్ ఈ కథ రాసుకున్నాను, మీరైతే బాగుంటుందని అనుకుంటున్నానని చెప్తాను.
ఆల్రెడీ ఎన్టీఆర్‌తో మీ నెక్స్‌ట్ మూవీ ఓకే అయిపోయిందని అంటున్నారు కదా?
ఇంకా ఏదీ ఫైనలైజ్ అవలేదు. ఆయన నాకు పర్సనల్‌గా బాగా తెలుసు. నేను రైటర్‌గా వున్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. బృందావనంకి నేనే రైటర్. అప్పట్నుంచీ మేం బాగా క్లోజ్. సినిమాలనే కాకుండా చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా సరదాగా కలిసినప్పుడు సినిమాల గురించే కాక, ఇన్వెస్ట్‌మెంట్లు వగైరా విషయాల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. 'ఇప్పుడిప్పుడే కొంచెం సంపాదించుకుంటున్నావు. ఏమైనా కొన్నావా' అంటూ అడుగుతారు. అలాంటి పర్సనల్ రిలేషన్ వుంది ఆయనతో. డెఫినెట్‌గా మేమిద్దరం కలిసి సినిమా చేస్తాం. కానీ నెక్స్‌ట్ ఇదే అని ప్రోపర్‌గా ఏదీ ఫైనలైజ్ అవలేదు.
'మిర్చి' తర్వాత ప్రభాస్ 'బాహుబలి' వచ్చింది. అలాంటి సినిమాలు తీయడానికి చాలా టైమ్ అవసరమవుతుంది. ఒక కమర్షియల్ సినిమా తీయడానికే మీకంత టైమ్ ఎందుకు పట్టిందంటారు?
నేను ఈ సినిమా కోసమే అంత టైమ్ తీసుకున్నానని చెప్తే చాలా ఓవరాక్షన్ చేసినట్టవుతుంది (నవ్వుతూ). దీనికంటే ముందు నేనో సినిమా చేయాలి. అది మెటీరియలైజ్ కాలేదు. నెక్స్‌ట్ మహేష్‌గారితో చేయాలి. ఆయనకెప్పుడో కథ చెప్పేసాను. సో ఆయనని కలిసాను. అప్పటికి ఆయన ఆగడు షూటింగ్‌లో వున్నారు. అది అయిపోయే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది కానీ, నేను కావాలని ఇంత గ్యాప్ తీసుకున్నాను, ఈ టైమ్‌లో ఇంత పెద్ద కథ రాసాను అని చెప్తే అదంతా బిల్డప్ అవుతుంది. ఇండస్ట్రీనే నాకు టైమ్ ఇచ్చింది.
– గణేష్ రావూరి