‘హర్షాలీ మల్హోత్రా’ ఈ పేరు ఇప్పుడు బాలీవుడ్లో మార్మోగుతోంది. భజరంగి భాయీజాన్లో సల్మాన్‌ఖాన్ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసిన కీలక పాత్రధారి ఏడేళ్ల హర్షాలీ మల్హోత్రాని ఇప్పుడు అందరూ కాబోయే కత్రినా అంటున్నారు. చిన్నారి హర్షాలీలో కత్రినా కైఫ్ పోలికలు బాగా ఉన్నాయని సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల దాకా మాట్లాడుతున్నారు.
కొన్ని వెబ్సైట్లలో అయితే కత్రినా చిన్ననాటి ఫొటోలు, హర్షాలీ ఫొటోలు పక్కపక్కనే పెడుతున్నారు. ఈ విషయంపై కత్రినా స్పందిస్తూ‘‘ఆ అమ్మాయి అచ్చం నాలానే ఉందని కబీర్‌ఖాన్‌తో సహా చాలా మంది చెప్పారు. ఆ సంగతేమో గాని… తన రూపం, నటన నాకు చాలా బాగా నచ్చింది’’ అంటోంది కత్రినాకైఫ్. యష్‌రాజ్ ఫిలిమ్స్ షూటింగ్ సమయంలో హర్షాలీని కలిసిన కత్రినా… చాలాసేపు తనతో ముచ్చట్లాడింది. ‘‘ఈ చిన్నారిని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తోంది’’ అంటూ మురిసిపోయింది.
మూగమ్మాయి మున్నీగా అందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్న హర్షాలీ రెండున్నరేళ్ల వయసున్నప్పుడే నటన మొదలు పెట్టింది. హార్లిక్స్, హెచ్‌డిఎఫ్‌సి, అపోలో టైర్స్… వంటి ప్రకటనలతో పాటు కొన్ని టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. అయితే ఆమె ఫస్ట్ టైమ్ బిగ్‌స్క్రీన్ ఎంట్రీ ఇదే. ఈ సినిమా కోసం ఎంపిక చేసిన తర్వాత, సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఈ పాపను ఎవరికీ కనపడకుండా సీక్రెసీ మెయిన్‌టెయిన్ చేశారు. దీంతో రిలీజ్ తర్వాత ఒక్కసారిగా మీడియా మొత్తం సల్మాన్ కన్నా హర్షాలీ ఇంటర్వ్యూలకే క్యూ కట్టింది. ‘‘సినిమాలో అందరికన్నా నీ నటనే బాగుందని సల్మాన్మామ పొగిడాడు’’ అంటూన్న ఈ క్యూట్ కిడ్… మొదట్లో సల్మాన్‌ని అంకుల్ అని పిలిచేదట.
అయితే సినిమా చివరి సన్నివేశంలో మామా అని పిలిచినప్పటి నుంచి సల్మాన్ మామ అనే పిలుస్తున్నానంది. ‘‘సల్మాన్ మామ ఎప్పుడడిగినా నాతో చక్కగా ఆడుకోవడానికి వచ్చేవాడు. టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్లం. చాలా సార్లు నేనే గెలిచా కూడా. కాశ్మీర్లో షూటింగప్పుడు మంచులో బాగా ఆడుకున్నా. నాకు సల్మాన్మామ, కరీనాకపూర్, కత్రినాకైఫ్, నవాజుద్దిన్ సిద్దిఖి, సోనాక్షి సిన్హాల సినిమాలు ఇష్టం. డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్స్ అంటే కూడా భలే ఇష్టం. సల్మాన్ మామా కబీర్ అంకుల్ నాకు కొనిచ్చేవారు’’ అంటూన్న హర్షాలీ… తనను పోలుస్తున్నందుకైనా కత్రినా కైఫ్‌తో కలిసి నటించాలనుకుంటున్నానంది. పెద్దయ్యాక ఏమవుతావ్? అంటే ‘సూపర్‌స్టార్’ అనేసింది సింపుల్‌గా.