రివ్యూ: మంత్ర 2
రేటింగ్: 2/5
బ్యానర్: గ్రీన్ మూవీస్
తారాగణం: ఛార్మి, చేతన్, తనికెళ్ల భరణి, ఢిల్లీ రాజేశ్వరి, రాహుల్ దేవ్, ఉత్తేజ్ తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
కూర్పు: బాబు సిద్ధంశెట్టి
ఛాయాగ్రహణం: తనికెళ్ల రాజేంద్ర
నిర్మాతలు: పి. శౌరి రెడ్డి, వి. యాదగిరి రెడ్డి
కథనం, దర్శకత్వం: ఎస్.వి. సతీష్
విడుదల తేదీ: జులై 31, 2015
హారర్ సినిమాగా మొదలై, కాసేపటికి క్రైమ్ థ్రిల్లర్‌గా టర్న్ అయి, మళ్లీ హారర్ సినిమాగా మారి, చివరకు కామెడీ సినిమాగా ఎండ్ అవుతుంది మంత్ర 2. చీకట్లో కెమెరా పాన్ చేస్తూ పోతే అరిచి గీ పెట్టడానికి ప్రిపేర్ అయిపోయి వస్తుంటారు హారర్ సినీ ప్రియులు. మిగిలిన జోనర్స్ కంటే హారర్ సినిమాలు తీయడం ఈజీ. తక్కువ బడ్జెట్‌లో, మినిమం స్టార్ కాస్ట్‌తో చేసేయవచ్చు. ఒక ఇంట్లోనే మొత్తం సినిమా తీసేసినా కానీ ఎలాంటి కంప్లయింట్స్ వుండవు. కాకపోతే భయపెట్టడం అందరి వల్ల కాదు. ఒకే విధమైన ట్రిక్కులతో మళ్లీ మళ్లీ భయపెట్టడం కుదరదు. కొత్త ఆలోచనలతో భయపెట్టాలి. ఏ క్షణంలో హడలిపోయే సీన్ వస్తుందోనని చూస్తున్న ప్రేక్షకులు అనుక్షణం అలర్ట్‌గా వుండాలి. ఎంత ప్రిపేర్డ్‌గా వున్నా కానీ ఊహించని విధంగా జర్క్‌లిచ్చి షాక్‌కి గురి చేయాలి. ఇదంతా ఆర్టు. చెప్పుకోడానికి సింపుల్‌గానే అనిపిస్తుంది కానీ కుప్పలు తెప్పలుగా హారర్ సినిమాలొచ్చేసిన తర్వాత మళ్లీ ఆ జోనర్‌లో సినిమా తీయడమంటే, దర్శకుడిలో క్రియేటివిటీ బాగా ఉండాలి. భయపెట్టే వాతావరణాన్ని సెట్ చేయగలగాలి. ఆ మూడ్‌లోకి తీసుకెళ్లిపోయి తెరపై పాత్రలు పడే ఉత్కంఠ ప్రేక్షకులకి తెలిసేట్టు చేయాలి.
హాలీవుడ్‌లో కూడా క్వాలిటీ హారర్ సినిమాలు రావడం లేదీమధ్య. ఎప్పుడో ఇన్‌సీడియస్, కాంజురింగ్‌లాంటి అరుదైన సినిమాలు తప్ప హారర్ ప్రియులకి తృప్తినిచ్చేవి రావడం బాగా తగ్గిపోయింది. తెలుగు హారర్ సినిమాల్లో అంత క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేయలేం కానీ అడపాదడపా కొన్ని రీజనబుల్ హారర్ సినిమాలు మనకీ వస్తుంటాయి. ఈ సినిమాలకి వుండే సెపరేట్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ తరచుగా ఈ జోనర్‌లో సినిమాలు తీస్తూనే వున్నారు. ఇటీవల హారర్‌కి హాస్యం జోడించి సక్సెస్ అయిపోతున్నారు. 'మంత్ర 2'లో అటు హడలగొట్టే హారర్ కానీ, ఇటు గిలిగింతలు పెట్టే కామెడీ కానీ లేదు. సినిమా అంతా ఒకెత్తు అయితే క్లయిమాక్స్ ఒక్కటీ ఒకెత్తు అన్నట్టుంది. అంతవరకు కాస్తో కూస్తో ఫర్వాలేదని అనేవాళ్లున్నా కానీ ఈ క్లయిమాక్స్ చూస్తే ఫకాలున నవ్వేస్తారు. ఎంత హారర్ సినిమా అయితే మాత్రం నమ్మశక్యం కాని సన్నివేశాలతో ఇష్టమొచ్చినట్టు తీసేయవచ్చా? ట్టిస్ట్‌లు ఇవ్వడం కోసమని మినిమమ్ లాజిక్ లేకుండా ఏది తోస్తే అది రాసేసుకోవచ్చా?
మామూలుగా డీసెంట్ యాక్ట్రెస్ అయిన ఛార్మి ఈ చిత్రంలో చాలా సందర్భాల్లో క్లూలెస్‌గా కనిపించింది. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలో తెలియని అయోమయం ఆమె ముఖంలో గోచరించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తల పండిపోయిన తనికెళ్ల భరణి కూడా తడబడిన సినిమాలో ఛార్మి అలా కన్‌ఫ్యూజ్ అవడంలో వింత లేదు. చేతన్ కొన్ని సన్నివేశాల్లో అచేతనంగా నిలబడిపోయాడు. నటీనటులే కాదు అటు సంగీత దర్శకుడికి కూడా ఎక్కడ భయపెట్టే ఎఫెక్ట్ ఇవ్వాలనేది అర్థమైనట్టు లేదు. హారర్ సినిమాకి మ్యూజిక్ చేసే వాళ్లకి సైలెన్స్ వేల్యూ ఏమిటనేది తెలిసుండాలి. లేదంటే ముందు జరగబోయే దానికి క్లూస్ అన్నీ తమ మ్యూజిక్‌తోనే ఇచ్చేస్తుంటారు. నిజంగా భయపెట్టాల్సిన చోట నిశ్శబ్ధం పాటిస్తారు. ద్వితీయార్థంలో ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తుంది. దాదాపుగా చీకటి అలముకున్న ఇంట్లో లైటింగ్ ఎఫెక్ట్స్ వరకు బాగానే కుదిరాయి.
సినిమాలోని మొదటి సన్నివేశం చూస్తే, ఇందులో వచ్చే కీలకమైన ట్విస్టుని ఊహించడం అంత కష్టమేం కాదు. కాకపోతే ఆడియన్స్‌ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుని ఆ ట్విస్టు చుట్టూ అర్థం పర్ధం లేని సన్నివేశాలు తీసి పారేసారు. అసలు కథ ఏంటనేది తెలిస్తే మొత్తం సినిమానే ట్రాష్ అనిపించేట్టు వుంటుంది. స్క్రిప్టులోని లోపాల సంగతి అటుంచి కనీసం టేకింగ్ పరంగా అయినా ఈ చిత్రం ఆకట్టుకుందా అంటే అదీ లేదు. ప్రథమార్థంలో సన్నివేశాల మధ్య పొంతన లేదు. ఇంటర్వెల్‌కి గానీ గాడిన పడని కథ ఆ తర్వాత కాసేపు భయానక వాతావరణంతో కొంచెం ఆసక్తి రేకెత్తిస్తుంది. భయపెట్టడానికి ఆస్కారం వున్నా కానీ ఈ సెటప్‌ని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. అసలు ట్విస్ట్ ఏంటనేది రివీల్ అయ్యేసరికే ఆలస్యమైపోతుంది. అప్పటివరకు చూసిందే ఫార్సు వ్యవహారమనిపిస్తే ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పిన తర్వాత 'మంత్ర 2' మరీ స్టుపిడ్‌గా తోస్తుంది.
కొన్ని ట్విస్టులు, ఇంటర్వెల్ తర్వాత కాసేపు వున్న ఉత్కంఠపూరిత క్షణాలు మినహా 'మంత్ర 2' నిరాశపరుస్తుంది. నిడివి తక్కువే అయినా కానీ ఆ కాస్త సమయంలోనే చాలా వరకు వృధా సన్నివేశాలతో విసిగించిన ఈ చిత్రం మరీ నీడని చూసి కూడా జడిసిపోయే వాళ్లని మినహా పదేళ్ల పిల్లల్ని కూడా భయపెట్టలేదు. హారర్ ఎలిమెంట్ సంగతి అటుంచి కనీసం కంటెంట్ అయినా రీజనబుల్‌గా లేదు. ఫలితం ఏంటనేది ముందే ఊహించిందో ఏమో… తన సినిమా ఏది వస్తున్నా కానీ హడావుడి చేసి పారేసే ఛార్మి ఈ చిత్రం గురించి మాత్రం వ్యూహాత్మక మౌనం పాటించింది.
బోటమ్ లైన్: ఆవులింతల హారర్!
– గణేష్ రావూరి