ఇది నిజానికి చాలా సాహసోపేతమైన నిర్ణయం. దుస్సాహసం అని కూడా అనవచ్చు. ఎంతో సీనియారిటీ వుండి కుటిల రాజకీయాల్లో తలపండిపోయిన కాంగ్రెసు నాయకులు అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించారని ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజు సిండికేటు సమావేశంలో మొరార్జీ, కామరాజ్, నిజలింగప్ప, బొంబాయి పారిశ్రామిక వేత్తలకు అత్యంత సన్నిహితుడు, పార్టీ కోశాధికారి అయిన ఎస్‌కె (సదాశివ్ కానోజీ) పాటిల్, బెంగాల్ పారిశ్రామికవేత్తలకు సన్నిహితుడైన అతుల్య ఘోష్, సాదిక్ అలీ, పెండేకంటి వెంకట సుబ్బయ్య, కృష్ణ మెనోన్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కెసి అబ్రహాం, కేంద్రమంత్రిగా పనిచేసిన డా|| రామ్ సుభాగ్ సింగ్, యుపి ముఖ్యమంత్రి సిబి (చంద్ర భాను) గుప్త, మైసూరు ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్, గుజరాత్ ముఖ్యమంత్రి, మొరార్జీ అనుంగు శిష్యుడు అయిన హితేంద్ర దేశాయి వున్నారు. వీరిలో అబ్రహాం రాజీపడే అవకాశాలు పరిశీలించమని వాదిస్తున్నాడు. తక్కినవారు కఠినంగానే వున్నారు.
అదే సమయానికి ఇందిర ఆఫీసులో ఆమెతో పాటు సమావేశమైనవారిలో కశ్మీరు ముఖ్యమంత్రి జిఎం సాదిక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, హరియాణా ముఖ్యమంత్రి బన్సీలాల్, ఆసాం ముఖ్యమంత్రి బిపి చాలీహా, రాజస్థాన్‌కు ముఖ్యమంత్రి మోహన్‌లాల్ సుఖాడియా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతరావు నాయక్, జగజీవన్ రామ్, ఫకృద్దీన్ ఆలీ అహ్మద్, ఉమా శంకర్ దీక్షిత్, సి సుబ్రహ్మణ్యం, దినేశ్ సింగ్ వున్నారు. వీరికి తోడుగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డిపి మిశ్రా వచ్చి చేరాడు. వీరిలో అత్యధికులు ప్రతిక్షకులతో కఠినంగా వ్యవహరించాల్సిందే అంటున్నారు. 'నెహ్రూ కాలంలో ప్రధాని మాటే పార్టీ కూడా వింది. ఇప్పుడు నా హయాంలో కూడా అదే జరగాలి. నా చర్యలను ఎవరూ ప్రశ్నించకూడదు' అని ఇందిర హఠం. అటు సిండికేటు క్యాంపులో నిజలింగప్పది కూడా యిలాటి పట్టుదలే. 'ప్రధాని అయినా, సరే పార్టీ అధ్యక్షుడి ముందు తల వంచవలసినదే. పార్టీ ఆదేశాలను ధిక్కరించి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ఇందిరను శిక్షించి యిక్కడ బాస్ ఎవరో దేశప్రజలందరికీ తెలియచెప్పాలి' అని అతని అభిప్రాయం. బుద్ధి చెప్పడాలు లేవు, పార్టీలోంచి తీసేయాల్సిందే అని మొరార్జీ పంతం. పార్టీ చీలిపోతే నష్టపోతామన్న భయం కలిగినవారు ఇరుపక్షాలలో వున్నారు. 'ఇందిర క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడింది అనే అభియోగాన్ని తొలగిస్తే రాజీ సమావేశానికి హాజరవుతాం' అని ఇందిర పక్షం నుంచి ప్రతిపాదన వచ్చింది. 'ముందు సమావేశానికి రండి, అభియోగం మాట అవతల చూద్దాం' అని సిండికేటు వారు పట్టుబట్టారు. దానితో రాజీ విఫలమైంది. ముందే తయారు చేసుకున్న తీర్మానాన్ని ఒంటిగంటకు ప్రెస్‌కు విడుదల చేశారు. నిజానికి ఇందిరా గాంధీని పార్టీలోంచి తీసివేయబోతున్నారు అనే న్యూస్‌ను అభిజ్ఞవర్గాల భోగట్టాగా వారం రోజుల ముందే ఒక న్యూస్ ఏజన్సీ విడుదల చేసింది. అప్పట్లో సమాచారశాఖామంత్రి ఐకె గుజ్రాలే ఆ ఏర్పాటు చేశాడని అంటారు. దానిలో పనిలో పనిగా చవాన్‌ను కూడా పార్టీలోంచి తీసేస్తారని చేర్చారు. అప్పటిదాకా అటాయిటా అని వూగుతున్న చవాన్‌ను యిటు గుంజడానికి అది పనికి వచ్చింది.
ఈ తీర్మానంలో ఇందిర స్థానంలో కొత్త నాయకుణ్ని ఎన్నుకోవాలని కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీని ఆదేశించడమైనది కాబట్టి వారు సమావేశం కావాలి. అంతకంటె ముందే ఇందిర తనే సమావేశం ఏర్పాటు చేసి తనను సమర్థించే కాంగ్రెసు లోకసభ, రాజ్యసభ సభ్యులను ఆహ్వానించింది. రెండు సభలు కలిపి మొత్తం 429 మంది ఎంపీలు కాగా 330 మంది ఎంపీలు హాజరయ్యారని, వారిలో 260 మంది లోకసభ ఎంపీలని ఇందిర చెప్పుకుంది. సమావేశానికి వచ్చినవారు మొత్తం మీద 240 మందేనని విదేశీ జర్నలిస్టులు కథనాలు రాశారు. పార్టీ చీలినపుడు ఎక్కువమంది ఎవరివైపు వున్నారని తెలిస్తే తటస్థులు అటే మొగ్గుతారని అందరికీ తెలుసు. వారిపై మైండ్ గేమ్ ఆడడానికి తమవైపు వున్న వారి సంఖ్య పెంచి చెపుతూంటారు. అధికారం తమ చేతిలో వుంది కాబట్టి ఇందిర పత్రికలను మేనేజ్ చేసింది. అనేకమంది ఉన్నతాధికారులు ఆమెకు యీ పనిలో సాయపడ్డారు. కానీ ''స్టేట్స్‌మన్'' పత్రిక తన హెడ్‌లైన్స్‌లో '330 ఎట్ మీటింగ్ క్లెయిమ్‌డ్' అని రాసి, ఇందిర ఆగ్రహానికి గురైంది. తర్వాత ఒక బహిరంగసభలో ఇందిర ఆ పత్రిక పేరెత్తకుండా హెడ్‌లైన్స్ పత్రికాయజమానుల యిష్టాయిష్టాల మేరకు పెడుతుంటారని ఆరోపించింది. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఇందిరకు బలం పెరిగిందని ఒప్పుకోవాలి. పార్టీ చీలిక తర్వాత ఎంపీలు అధికారంలో వున్న వర్గంవైపు మొగ్గు చూపారు. ఎందుకంటే పార్టీవైపు వున్నా యిప్పట్లో ఒనకూడే లాభం ఏమీలేదు. మరో మూడేళ్ల దాకా ఎన్నికలు లేవు.
సిండికేటు కూడా ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. కనీసం 150 మంది వస్తారని ఆశిస్తే 70 మంది వచ్చారు. వారిలో లోకసభ సభ్యులు 60 మంది. తమ వర్గానికి లోకసభలో నాయకుడిగా వుంటానని మొరార్జీ ఉబలాటపడినా అశోకా మెహతా వంటి ఎంపీల అభ్యంతరాల మేరకు రామ్ సుభాగ్ సింగ్‌కు ఆ అవకాశం యిచ్చారు. మొరార్జీని పార్లమెంటరీ పార్టీకి చైర్మన్ చేశారు. ఇందిర పక్షాన నిలబడిన వారి వాస్తవసంఖ్య 77 మంది రాజ్యసభ ఎంపీలు, 220మంది లోకసభ ఎంపీలు మాత్రమే. 522 మంది సభ్యులున్న లోకసభలో యిది సగం కంటె తక్కువ. సిపిఐ ఎలాగూ ఇందిరకు మద్దతుగా నిలవగా సిపిఎం ఆమెను వ్యతిరేకిస్తున్నా అవతలివైపు వారు పూర్తి రైటిస్టులుగా కనబడడంతో సమర్థించక తప్పలేదు. 46 మంది ఎంపీలున్న కమ్యూనిస్టు పార్టీ కాకుండా ఇందిర నమ్ముకున్న యింకో పార్టీ డిఎంకె. కేంద్రాధికారాలను ఛాలెంజ్ చేసి అధికారంలోకి వచ్చిన డిఎంకె కేంద్రాన్ని బెల్లించి నిధులు పిండుకోవడానికి యిదే తరుణం అనుకుంది. కరువు సహాయనిధి పేర రూ.17 కోట్లు, ఒక స్టీలు ప్లాంట్ యిమ్మంది. కరువు ఆ స్థాయిలో లేదని తెలిసినా ఇందిర సరేనంది. వీరు కాక స్వతంత్రులను తనవైపు తిప్పుకుంది. జనసంఘ్, స్వతంత్ర పార్టీల నాయకత్వాలు సిండికేటుకు అనుకూలంగా నిలబడ్డాయి. కానీ దాని సభ్యుల్లో కొంతమంది కాంగ్రెసుకు మొదటి నుంచి వ్యతిరేకులు కాబట్టి నాయకత్వానికి ఎదురు తిరగబోయారు. క్రమశిక్షణ పేర నాయకులు వారిని వంచారు. పిఎస్‌పికి కమ్యూనిస్టులంటే బొత్తిగా పడదు. కమ్యూనిస్టులు సమర్థించే ఇందిర వైపు నిలబడాలో వద్దో తేల్చుకోలేక చివరకు అంశాలవారీగా మద్దతు యివ్వాలని అనుకున్నారు. ఎస్‌ఎస్‌పికి నెహ్రూ వ్యతిరేకత మూలాధారం కాబట్టి సిండికేటు వైపు మొగ్గింది. అదే సమయంలో ఇందిర విధానాల్లో సోషలిజాన్ని వ్యతిరేకించడమూ కష్టమైంది. అందువలన రెండు పడవల ప్రయాణం చేయబోయింది. నిజానికి సిండికేటులో వున్నవాళ్లంతా రైటిస్టులు, ఇందిర వైపు వున్నవాళ్లంతా లెఫ్ట్-ఆఫ్-సెంటరిస్టులు అని నిర్వచించడం కష్టం. సిండికేటు వైపు వున్నవారిలో సోషలిస్టు ఐన ఆశోకా మెహతా, ఉదారవాది అయిన సుచేతా కృపలానీ, తారకేశ్వరీ సిన్హా వున్నారు. ఇందిర వైపు వున్నవారిలో జగ్జీవన్ రామ్, ఫకృద్దీన్ పెట్టుబడిదారులకు ఆప్తులు.
రైల్వే మంత్రిగా వున్న రామ్ సుభాగ్ సింగ్ తన ప్రతిక్షకులతో చేతులు కలిపాడని తెలియగానే నవంబరు 4న ఇందిర తన కాబినెట్‌లోంచి తీసేసింది. ఆ సత్కారం జరగకముందే జై సుఖ్‌లాల్ హాథీ, సిపి పునాచాలు రాజీనామా చేశారు. పార్లమెంటరీ విభాగంపై పట్టు సాధించాక, సంస్థాగత విభాగంపై కూడా పట్టుకోసం ఇందిర ప్రయత్నించింది. ఆమె మద్దతుదారులు నవంబరు 17 న ఢిల్లీలో సమావేశమై నిజలింగప్పను పార్టీ నుంచి తీసేశారు. నిజలింగప్ప మద్దతుదారులు అలహాబాద్‌లో సభ ఏర్పాటు చేసి ఇందిరను మరోసారి పార్టీలోంచి తీసివేయడమే కాక నిజలింగప్ప పదవీకాలాన్ని యింకో ఏడాదికి పెంచారు. బొంబాయిలో డిసెంబరు 4 న ఇందిర సమర్థకులు సమావేశమై నిజలింగప్పను మరోసారి పార్టీలోంచి తీసేసి మాదే అసలైన కాంగ్రెసు అన్నారు. ఆ విధంగా కాంగ్రెసు రెండుగా చీలింది. సిండికేటు కాంగ్రెసు తన పేరు కాంగ్రెసు (ఓ-ఆర్గనైజేషన్) అని చెప్పుకోగా ఇందిర తన కాంగ్రెసును కాంగ్రెస్ (ఆర్-రిక్విజిషన్) అని చెప్పుకుంది. కాంగ్రెసు ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్, ఆసాం, హరియాణా, కశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇందిరవైపు నిలవగా, యుపి, గుజరాత్, మైసూరు ముఖ్యమంత్రులు పాత కాంగ్రెసు (కాంగ్రెసు(ఓ)ను అలాగే పిలిచేవారు) వైపు నిలిచారు. తనకు వ్యతిరేకంగా వున్న ముఖ్యమంత్రుల దుంప తెంచడానికి ఇందిర నిశ్చయించుకుంది. (సశేషం) ఫోటో – రామ్ సుభాగ్ సింగ్
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)