ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 65

ఎమ్జీయార్‌ బాగానే కోలుకున్నాడు. కోలుకున్నాక జయలలిత గురించి నిజానిజాలు తెలుసుకున్నాడు. మళ్లీ ఆమెను ఆదరించసాగాడు. అదే సమయంలో జనాల్లో తన ఆరోగ్యం పట్ల వున్న అనుమానాలను పటాపంచలు చేయడానికి మధురైలో 1986లో ఒక పెద్ద…

ఎమ్జీయార్‌ బాగానే కోలుకున్నాడు. కోలుకున్నాక జయలలిత గురించి నిజానిజాలు తెలుసుకున్నాడు. మళ్లీ ఆమెను ఆదరించసాగాడు. అదే సమయంలో జనాల్లో తన ఆరోగ్యం పట్ల వున్న అనుమానాలను పటాపంచలు చేయడానికి మధురైలో 1986లో ఒక పెద్ద ఊరేగింపు నిర్వహింపచేశాడు. తన అభిమాన సంఘాల వారిని, కార్యకర్తలను ఒక అన్నగా ఆహ్వానిస్తున్నాను, వచ్చి పాల్గొనండని ఒక న్యూస్‌ పేపర్లో యాడ్‌ యిచ్చాడంతే. 5 వేల బస్సుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు కుప్పలుతిప్పలుగా వచ్చిపడ్డారు. అటువంటి ఊరేగింపు రాజుల కాలంలో కూడా మధురై చూసి వుండకపోవచ్చు. ఎమ్జీయార్‌ బాగుపడ్డాడని అందరూ అనుకుంటూండగానే హఠాత్తుగా జబ్బుపడ్డాడు. 1987 డిసెంబరులో అర్ధరాత్రి అతని భార్య, వ్యక్తిగత వైద్యుడు సుబ్రమణియన్‌ అతన్ని అపోలో హాస్పటల్‌కు తీసుకుని వచ్చారు. ఊపిరాడక అవస్థ పడుతూనే తను యిక్కడున్నట్లు ఎవరికీ చెప్పవద్దని ఆసుపత్రి అధికారులను కోరాడు. వెంట వచ్చిన వాహనాలను వెనక్కి పంపించివేశాడు.  డిసెంబరు 24 ఉదయమే చనిపోయాడు. ఆ వార్త నగరంలో కార్చిచ్చులా వ్యాపించింది. అతనిది సహజమరణమే అయినా అభిమానులు, కార్యకర్తలు నగరంలో తమ శోకాన్ని వ్యక్తపరచడానికి విధ్వంసానికి పాల్పడ్డారు. అతని చావుకి, కరుణానిధికి ఏ సంబంధమూ లేకపోయినా ఒక యువకుడు మౌంట్‌ రోడ్డులోని కరుణానిధి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. తర్వాతి రోజుల్లో కరుణానిధి అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తిరిగి పెట్టిస్తాడని అనుకున్నారు కానీ అదేమీ చేయలేదు. ఆ విగ్రహం పెట్టాకనే అధికారం పోయిందని, విగ్రహం పోవడంతో శని వదిలిపోయి అధికారం తిరిగి వచ్చిందని రుణానిధి భావించాడని అంటారు. నిజానిజాలు ఏమైనా కరుణానిధి యిప్పటిదాకా మరో విగ్రహం పెట్టించుకోలేదు. 

ఎమ్జీయార్‌ మరణించాడని తెలియగానే జయలలిత అతని యింటికి వెళ్లి అతని శవం తల వద్ద నిలబడింది. 1984లో ఇందిరా గాంధీ చనిపోయినపుడు ఆమె శవాన్ని టీవీల్లో రోజంతా చూపించి జనాల మెదళ్లల్లో ఆమె మృతిని ముద్రించివేశారు. ఆమె అంత్యక్రియలు రాజీవ్‌ నిర్వహించడం కూడా టీవీలో విపులంగా చూపించారు. దేశఐక్యత కోసం ఆమె తన ప్రాణాలు అర్పించిందని పదేపదే ప్రచారం చేసి, ఆమెకు సరైన వారసుడు రాజీవ్‌ గాంధీయే అనే విషయాన్ని విజువల్‌గా కూడా ఎస్టాబ్లిష్‌ చేసి, ఆ వీడియోలను ఎన్నికలలో వాడుకుని రాజీవ్‌కు అపూర్వ విజయాన్ని కట్టపెట్టేట్లా చేశారు. ఇప్పుడు జయలలిత అదే చేద్దామనుకుంది. ఎమ్జీయార్‌ శవాన్ని రోజంతా టీవీల్లో చూపిస్తారని, తమిళ ప్రజలంతా చూస్తారని ఆమెకు తెలుసు. ఎమ్జీయార్‌ మొహాన్ని చూపించినంత సేపు కెమెరా ఫ్రేమ్‌లో తను కూడా వచ్చేట్లు చూసుకుంటే ఎమ్జీయార్‌ వారసురాలిగా తను ప్రజల మనసులో ముద్ర పడిపోతుందని అంచనా వేసి, దాన్ని అమలు చేసింది. ఈ విషయంలో జయలలిత అమోఘమైన రాజకీయచతురత కనబరచిందని చెప్పాలి. జయలలిత అలా నిలబడగానే ఎమ్జీయార్‌ కుటుంబసభ్యులు, వీరప్పన్‌ వర్గీయులు మండిపడ్డారు. పట్టుకుని యీడ్చేద్దామంటే ఎదురుగా టీవీ కెమెరాలున్నాయి. దురుసుగా ప్రవర్తించలేరు. ఆమె మధ్యలో ఏ బాత్‌రూమ్‌కో వెళ్లినపుడు తిరిగి తల దగ్గరకు రాకుండా అడ్డుగా నిలబడదామనుకున్నారు. కానీ జయలలిత వాళ్లకు ఆ ఛాన్సు యివ్వలేదు. గంటల తరబడి  ఆహారం, నీళ్లు, ప్రాకృతిక అవసరాలు ఏమీ లేకుండా అలాగే ఎమ్జీయార్‌ మొహాన్ని తుడుస్తూ దీనవదనంతో నిలబడింది. ఈ విషయంలో మానవతాతీమైన శక్తి ప్రదర్శించిందనే అనాలి. 

మర్నాడు అంత్యక్రియలకై తీసుకెళ్లడానికి ఎమ్జీయార్‌ శవాన్ని ఒక వ్యాన్‌లో ఎక్కించారు. అతని భార్య, యితర కుటుంబసభ్యులు అందరూ ముందూ వెనకా వున్న వాహనాల్లో ఎక్కారు. ప్రభుత్వ లాంఛనాలతో తీసుకుని వెళ్లాలి కాబట్టి ఆ వ్యాన్‌లో వేరే ఎవరూ ఎక్కకూడదన్నారు. అయినా జయలలిత ఎక్కింది. శవం దగ్గర చతికిలపడబోతూ వుంటే ఎమ్జీయార్‌ భార్య జానకి మేనల్లుడికి విపరీతమైన కోపం వచ్చింది. జయలలిత హద్దు మీరిందని అనిపించి వ్యాన్‌ ఎక్కి దిగిపోమని అరిచాడు. పోలీసు అధికారులు వచ్చి చెప్పారు. నేను శవం మొహం మీద ఏదో వుంటే తుడుస్తున్నానని ఆమె జవాబు చెప్పి, వాళ్లు ఒప్పుకోకపోతే దిగసాగింది. ఏదో ఒక మిషపెట్టుకుని అక్కడే వుండిపోతే ప్రజల కళ్లల్లో మరీ పడుతుందని అనుకున్న మేనల్లుడు ఆమెను బలవంతంగా కిందకు యీడ్చాడు. ఈ లింకు చూస్తే ఆనాటి దృశ్యాలు కొంతవరకు అర్థమవుతాయి. https://www.youtube.com/watch?v=i1wNsd-D8UIF  దాంతో ఆమె తోకతొక్కిన తాచులా ''నేను శ్మశానానికి వెళ్లను, వెళ్లను'' అంటూ అరుచుకుంటూ వెళ్లిపోయింది. అది టీవీ కెమెరాల్లో ప్రముఖంగా వచ్చేసింది. ఓ పక్క అంతిమయాత్ర సాగుతూవుంటే 'తనను అవమానించారని, వ్యాన్‌ నుంచి తోసేశారనీ జయలలిత మీడియాకు చెప్పసాగింది. మెరీనా బీచ్‌లో ఎమ్జీయార్‌ను సమాధి చేశారు. 

ఇప్పుడు ఎమ్జీయార్‌ వారసులెవరు అనే ప్రశ్న వచ్చింది. తను బతికుండగా ఎమ్జీయార్‌ ఎవర్నీ నిర్ధారించలేదు, సూచించలేదు. వీరప్పన్‌కు అతని స్థానంలో రావాలని వున్నా, ఎమ్జీయార్‌ అభిమానులు సహించరన్న భయం వుంది. ఎమ్జీయార్‌ వారసత్వం కొనసాగుతోందని చూపించడానికి ఎమ్జీయార్‌ భార్య విఎన్‌ జానకిని ముఖ్యమంత్రిణిగా కూర్చోబెట్టి తను వెనక్కాల నుంచి చక్రం తిప్పుదామనుకున్నాడు. ఎమ్జీయార్‌ భార్యల గురించి 14 వ భాగంలో కాస్త చెప్పాను. అతను సినిమాల్లో వేషాలు దొరక్క అల్లాడుతున్న సమయంలోనే భార్గవి (తంగమణి అనే మరో పేరు కూడా వుంది) అనే అమ్మాయిని పెళ్లాడితే ఆమె మూణ్నెళ్లలోనే చనిపోయింది. ఆ తర్వాత సంతానవతి అనే ఆమెను పెళ్లాడితే ఆమెకు క్షయ వచ్చి 18 ఏళ్లపాటు బాధపడి మరణించింది. ఆమె బ్రతికి వుండగానే ఎమ్జీయార్‌  తనతో హీరోయిన్‌గా నటించిన వియన్‌ (వైక్కోమ్‌ నారాయణి) జానకి అనే నటి అంటే యిష్టపడ్డాడు. జానకి కేరళకు చెందిన అయ్యర్‌ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి. ఆమె పినతండ్రి పాపనాశం శివన్‌ కవి. సినిమాలకు కూడా పాటలు రాసేవారు. 1923లో పుట్టింది. 16 వ యేట గణపతి భట్‌ అనే అతనితో పెళ్లయ్యాక సినిమాల్లోకి వచ్చింది. ''మోహిని'', ''రాజముక్తి'', ''వేలక్కారి'', ''ఆయిరం తలైవాంగియ అపూర్వ చింతామణి'', 'మరుదనాట్టు ఇళవరసి'' యిత్యాది సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. వాటిల్లో కొన్ని సినిమాల్లో ఎమ్జీయార్‌ చిన్న పాత్రలు వేశాడు. అతని పారితోషికం కంటె ఆమె పారితోషికం రెట్టింపు వుండేది. అయినా ఆమె యితన్ని వలచి భర్తను విడిచి 1963లో యితని వద్దకు వచ్చేసింది. ఆమెకు మొదటి భర్తతో సురేంద్రన్‌ అనే కొడుకు కూడా వున్నాడు. విడాకులు యిచ్చిందనే అంటారు కానీ ఎమ్జీయార్‌ తన విల్లులో ఆమెను ''వి యన్‌ జానకి'' అనే పేర్కొన్నాడు కానీ ''జానకీ మెనోన్‌'' (వివాహం తర్వాత భర్త యింటిపేరు వస్తుంది కదా) అని అనలేదు. విడాకుల విషయంలో లీగల్‌గా ఏదైనా పేచీ వుందేమో తెలియదు. ఏది ఏమైనా వాళ్లిద్దరూ భార్యాభర్తలు గానే జీవించారు. 

తారగా ఆమె సంపాదించిన ఆస్తులున్నాయి, ఎమ్జీయార్‌ కూడా తను సంపాదించినది ఆమె పేర పెట్టాడు. తన పేర మద్రాసులో అవ్వయ్‌ షణ్ముగం రోడ్డులో వున్న భవనాన్ని భర్త పేర రాసింది. అక్కడే ఎడిఎంకె హెడ్‌క్వార్టర్స్‌ పెట్టారు. ఎమ్జీయార్‌ మరణించిన తర్వాత అతని పేర మ్యూజియం పెట్టడానికి టి నగర్‌లోని ఆర్కాట్‌ రోడ్డులోని తన యిల్లు రాసి యిచ్చేసింది. అత్తగారు (సత్య) పేర, తన పేర (జానకీ రామచంద్రన్‌) పేర ఎడ్యుకేషనల్‌, చారిటబుల్‌ సొసైటీలు పెట్టి అనేక విద్యాసంస్థలు ఏర్పరచి ఉచిత విద్య అందించింది. ఆవిడ వివాదరహితురాలు. రాజకీయాలు బొత్తిగా తెలియని మనిషి. జయలలితపై అసూయ చేత వీరప్పన్‌ మాటలు విని, కీలుబొమ్మగా ముఖ్యమంత్రి గద్దెమీద కూర్చోడానికి సమ్మతించడ మొక్కటే ఆమె చేసిన పొరపాటు. (సశేషం) ఫోటో – ఎమ్జీయార్‌ శవం వద్ద జయలలిత

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives