ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 – 4

రాజ్‌ నారాయణ్‌ చాలా చిత్రమైన మనిషి. వైరుధ్యాల పుట్ట. చాలా డబ్బున్న భూమిహార్‌ కుటుంబంలో 1917లో పుట్టాడు. కానీ సోషలిస్టు పార్టీలో చేరి, పేదల పక్షాన మాట్లాడాడు. చనిపోయినప్పుడు బ్యాంక్‌ బాలన్స్‌ 1450 రూ.లు…

రాజ్‌ నారాయణ్‌ చాలా చిత్రమైన మనిషి. వైరుధ్యాల పుట్ట. చాలా డబ్బున్న భూమిహార్‌ కుటుంబంలో 1917లో పుట్టాడు. కానీ సోషలిస్టు పార్టీలో చేరి, పేదల పక్షాన మాట్లాడాడు. చనిపోయినప్పుడు బ్యాంక్‌ బాలన్స్‌ 1450 రూ.లు వుందట. తన కులనామాన్ని ఎప్పుడూ వాడలేదు. బనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఎంఏ ఎల్‌ఎల్‌బి చదివాడు, కానీ చదువుకోనివాడు ప్రవర్తించినట్లు ప్రవర్తించేవాడు. ముతకభాష వాడేవాడు. పెళ్లయి నలుగురు పిల్లలున్నారు. కానీ కుటుంబం వున్నట్టుగా ఎప్పుడూ చెప్పుకోలేదు. వాళ్లెవరితో సంబంధ బాంధవ్యాలు వున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడూ ప్రజల మధ్యనే దర్బారులో వుండేవాడు. ఏ పార్టీలోనూ స్థిరంగా లేడు. అనేక పార్టీలు మారి, 1986లో చనిపోయేందుకు ఒక ఏడాది ముందు సోషలిస్టు పార్టీ అని పెట్టాడు. ఎవరి వద్దకు చేరినా వాళ్ల కొంపకు అగ్గి పెట్టగల సమర్థుడు. అందరూ హాస్యగాడిగా, బఫూన్‌లా చూసేవారు. డ్రస్సు కూడా దానికి తగ్గట్టే వుండేది. కానీ అతనిలో విలన్‌ లక్షణాలు కూడా పుష్కలంగా వున్నాయి. ఎవరినైనా పీడించ దలచుకుంటే వాళ్ల జీవితం నరకం చేయగలడు. వచ్చి కాళ్లు పట్టుకోగలడు, ఆ కాళ్లు లాగి వేయనూ గలడు. ఇప్పటి రాజకీయనాయకులతో పోల్చి చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామిలో కొంతవరకు అతని లక్షణాలున్నాయి. స్వామి చెప్పేవన్నీ అబద్ధాలు కావు, అలాగని నిజాలూ కావు. కొన్ని సార్లు వట్టి అభాండాలు, వితండవాదనలు కూడా. గోరంత ఆధారం వుంటే దొరికితే చాలు, కొండంత కథ అల్లి, భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గోల చేస్తాడు. కేసులు పెట్టి అవతలివాడి దుంప తెంపుతాడు. 

ఆనాటి యువకులందరిలాగానే రాజ్‌ నారాయణ్‌ 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. మొదటి నుంచి సందడి చేయడం, అల్లరి పెట్టడం అలవాటు. రకరకాల ఆందోళనలు చేసి చనిపోయేదాకా మొత్తం 58 సార్లు జైలుకి వెళ్లాడు. ఆనాడు రాజకీయ ఉద్యమంలో అగ్రస్థానంలో వుంది కాబట్టి కాంగ్రెసు పార్టీలోనే చేరాడు. కాంగ్రెసులో అప్పట్లో  సోషలిస్టు భావాలున్న వారు కాంగ్రెసు సోషలిస్టు పార్టీ (సిఎస్‌పి) పేరుతో ఒక గ్రూపుగా వ్యవహరించేవారు. సోషలిస్టు భావాలున్న రాజ్‌ నారాయణ్‌ దానిలో చేరాడు. స్వాతంత్య్రానంతరం సోషలిస్టు పార్టీలో చేరాడు. సోషలిస్టు పార్టీ గురించి, కాంగ్రెసులో సోషలిజం పేరుపై కాంగ్రెసులో వచ్చిన విభేదాల గురించి సిపిఎం ఆవిర్భావం సీరీస్‌లో కొంత రాశాను, యింకా రాస్తాను. సోషలిస్టు పార్టీకి నాయకులుగా ఆచార్య నరేంద్ర దేవ్‌, డా|| రామ్‌ మనోహర్‌ లోహియా, జయప్రకాశ్‌ నారాయణ్‌ వుండేవారు. ముగ్గురిలో యితని తరహా లోహియాకు బాగా నచ్చి, శిష్యుడిగా చేసుకున్నాడు. ఉత్తరాదిన యీ రోజు వెలుగొందుతున్న ములాయం, నీతీశ్‌, లాలూ – వీళ్లందరూ లోహియా వాదులే. లోహియా వారి పాలిట దైవం. లోహియా శిష్యుడు కాబట్టే రాజ్‌ నారాయణ్‌ విగ్రహాన్ని యిటీవల అఖిలేశ్‌ యాదవ్‌ ఆవిష్కరించాడు.  లోహియా పేర వున్న (కొత్తగా పెట్టలేదు, అంతకు ముందు వున్న పేరు మార్చారు) ఆసుపత్రిలోనే రాజ్‌ నారాయణ్‌ మరణించాడు. 

ఇక్కడ లోహియా గురించి కూడా కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే ఎమర్జన్సీకి ముందూ, వెనకా ఇందిరకు వ్యతిరేకంగా పోరాడిన పెద్ద నాయకులు – జార్జి ఫెర్నాండెజ్‌, మధు లిమయే, మధు దండవతే, కర్పూరీ ఠాకూర్‌, నాథ్‌ పై యిత్యాది ఎందరో నాయకులు లోహియా అనుచరులే. అందరినీ మించి జయప్రకాశ్‌ నారాయణ్‌ లోహియాకు సన్నిహితుడే. ఉత్తరాదిన బిసిలకు రాజకీయాధికారం రావడానికి భూమిక ఏర్పరచినది లోహియాయే. ఆయన 1910లో ఉత్తర ప్రదేశ్‌లో పుట్టాడు. లోహవ్యాపారం చేసే కుటుంబం. తండ్రి వ్యాపారరీత్యా బొంబాయికి మారడంతో అక్కడే మెట్రిక్‌ పాసయి, బెనారస్‌ యూనివర్శిటీ నుండి ఇంటర్‌, కలకత్తాలో బిఏ పాసయ్యాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని చదువు మానేశాడు. పై చదువులకు ఇంగ్లండ్‌ వెళ్లి, అక్కడి నుంచి జర్మనీ చేరాడు. అది మొదటి ప్రపంచ యుద్ధంలో చావు దెబ్బ తిన్న జర్మనీ కాస్త కాస్త కోలుకుంటున్న రోజులవి. మూడు నెలల్లో జర్మన్‌ భాష నేర్చుకుని గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంపై 1932 లో డాక్టరేటు చేశాడు.

పై ఏడాది దేశానికి తిరిగి వచ్చి కాంగ్రెసు పార్టీలో చేరి రాజకీయ నాయకుడయ్యాడు. పెళ్లి ఆఫర్లు వచ్చినా తిరస్కరించి అవివాహితుడిగా వుండిపోయాడు. చరిత్ర, సంస్కృతిలపై మంచి అధ్యయనం, అవగాహన వుండేవి. గాంధీవాదంపై మక్కువ వుండేది. నెహ్రూకు సన్నిహితుడుగా వుండేవాడు. 1936లో నెహ్రూ కాంగ్రెసు అధ్యక్షుడు కాగానే లోహియాను విదేశీ వ్యవహారాల కార్యదర్శి చేశాడు. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలోని ప్రగతి శీల ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని మన ఉద్యమానికి విదేశాల్లో సానుభూతి కలిగేట్లు చేశాడు. అతన్ని సోషలిజం ఆకర్షించింది. 1940లో విప్లవ ప్రసంగాలు చేసి అరెస్టయ్యాడు. తర్వాతి రోజుల్లో అజ్ఞాతవాసం చేస్తూ సోషలిస్టులైన జయప్రకాశ్‌ నారాయణ్‌, అచ్యుత్‌ పట్‌వర్ధన్‌, అరుణా అసఫ్‌ అలీలలో కలిసి నేపాల్‌ నుంచి రహస్య రేడియో నిర్వహించాడు.  కాంగ్రెసు సోషలిస్టు పార్టీలో ముఖ్యుడిగా వుండేవాడు.

గాంధీ మరణం తర్వాత లోహియా కాంగ్రెసు పట్ల విముఖత పెంచుకున్నాడు. అధికారంలో వచ్చాక నెహ్రూ తను ఉద్యమసమయంలో ప్రవచించిన సిద్ధాంతాలపై ఆచరణవాదం పేర రాజీపడడం లోహియాకు మింగుడు పడలేదు. నెహ్రూ వేసిన ప్రతి అడుగును విమర్శించాడు, ద్వేషించాడు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్టులు. వారినీ విమర్శించాడు. 'కమ్యూనిస్టుల సోషలిజం కేవలం ఆర్థిక సమస్యలకు సంబంధించినదే కానీ నా వాదం సామాజికవాదంతో కూడినది' అనేవాడు. ఆయన సామాజికవాదంలో స్త్రీ, పురుష సమానత అనే అంశం కూడా వున్నా ప్రధానంగా కులం చుట్టూ తిరిగింది. కులరహిత సమాజం కోసం పాటుపడుతున్నాం అని పైకి చెప్పడమే లోహియా కానీ, తమిళనాడులోని ద్రవిడ ఉద్యమం కానీ అగ్రకులాల నుండి వెనుకబడిన కులాలకు అధికారం సిద్ధింపచేసుకోవడానికే ఉపయోగపడ్డాయి. వీళ్లు హిందువుల్లో అగ్రవర్ణాలపైనే ద్వేషం చిమ్మారు. ఇతర మతస్తుల్లో కూడా యిలాటి వ్యత్యాసాలున్నా, మూఢాచారాలున్నా ఆ జోలికి వెళ్లలేదు, వాటిని విమర్శించలేదు. దళితుల గురించి పైకి మాట్లాడడమే తప్ప వాళ్లను అక్కున చేర్చుకోలేదు. ఎందుకంటే గ్రామాల్లో బిసిలు రైతులు, దళితులకు రైతుకూలీలు. వారి మధ్య వర్గవైషమ్యం తప్పదు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives