ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 21

శీతాకాలం గడిచాక బ్రూసు 33 నౌకల్లో 300 మంది మనుష్యులతో స్కాట్లండ్‌కి బయలుదేరాడు. కానీ ఆరాన్‌ దీవికి వచ్చేసరికి స్కాట్లండ్‌ తీరంలో ఎంతమంది ఇంగ్లీషు సైనికులు వున్నారో అన్న జంకు కలిగింది. అందువలన  ఒక…

శీతాకాలం గడిచాక బ్రూసు 33 నౌకల్లో 300 మంది మనుష్యులతో స్కాట్లండ్‌కి బయలుదేరాడు. కానీ ఆరాన్‌ దీవికి వచ్చేసరికి స్కాట్లండ్‌ తీరంలో ఎంతమంది ఇంగ్లీషు సైనికులు వున్నారో అన్న జంకు కలిగింది. అందువలన  ఒక అనుచరుణ్ని ముందుగా విడిగా పంపించాడు. ''అక్కడ ఇంగ్లీషు సైనికులు పెద్దగా లేకపోయినా, మనకు మద్దతిచ్చేవారు తగు సంఖ్యలో వున్నా ఫలానా రోజున నా పాత కోట టర్న్‌బెరీకి పక్కన వున్న కొండ మీద పెద్ద మంట వెయ్యి. మేమంతా కదిలి వస్తాం.'' అని చెప్పాడు. ఆ చెప్పిన రోజు వచ్చేసరికి బ్రూసు, అతని అనుచరులు తమ దృష్టిని ఆ కొండ మీదే నిలిపి వుంచారు. పొద్దుణ్నుంచి ఏ మంట కనబడలేదు. మిట్టమధ్యాహ్నం వేళ పొగ, కాస్సేపటికి మంట గోచరించాయి. వెంటనే హర్షధ్వానాలతో బోట్లలో దూకి తీరం వైపు సాగారు. తీరం మీద బ్రూసు గూఢచారి వాళ్ల కోసం వేచివున్నాడు. నిజానికి ఆ మంట అతను వేసింది కాదు. ఊరంతా ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీషు సైనికులు వున్నారు. బ్రూసు కోట ఇంగ్లీషు దళపతి లార్డ్‌ పెర్సీ అధీనంలో వుంది. ఈ సమయంలో బ్రూసు రావడం ప్రమాదకరం అనుకుని అతను కొండ మీద మంట వేయలేదు. కానీ ఎవరో ఎందుకో అక్కడ మంట వేశారు. వేశారన్న సంగతి కూడా యితనికి చీకటి పడేదాకా తెలియలేదు. తెలియగానే తనే యీ మంట వేశానని అనుకుని వీళ్లు వచ్చేస్తారని, వచ్చి ప్రమాదంలో యిరుక్కుంటారని భయపడ్డాడు. అందుకే తీరం వద్ద కాచుకుని, వాళ్లు రాగానే విషయం చెప్పి వెనక్కి వెళ్లిపోమని చెప్దామని వచ్చాడు.

అంతా విని బ్రూస్‌ తన తమ్ముడు ఎడ్వర్డ్‌ కేసి తిరిగి ఏం చేద్దాం? అని అడిగాడు. ''వచ్చాం కదా, తాడోపేడో తేల్చుకుందాం'' అన్నాడు అతని కంటె ఘనుడైన తమ్ముడు. రాత్రికి రాత్రే వీళ్లు కోటమీద దాడి చేసి ఇంగ్లీషువారిని ఓడించారు. ఆయుధాల సద్దు వినగానే వచ్చి పడినవారు ఎందరో తెలియక భయపడి పెర్సీ కోటలో ఒక గదిలోకి పోయి దాక్కున్నాడు. వీలు చిక్కగానే తప్పించుకుని ఇంగ్లండు పారిపోయాడు. ఈ విజయంతో బ్రూసు కథ ఒక మలుపు తిరిగింది.  కొన్ని విజయాలు సాధించాడు. కొన్నాళ్లు పోయాక తన తరఫున పోట్లాడే సైనికులు యింకా ఎక్కువమంది కావలసి వచ్చారు. తన తమ్ముళ్లను ఐర్లండ్‌కు పంపి ప్రయత్నించమన్నాడు. వాళ్లు 700 మందిని సేకరించి పంపించారు. కానీ వాళ్లు స్కాట్లండ్‌లో దిగగానే ఇంగ్లండు పక్షం వహించిన స్కాట్‌ జమీందారు ఒకడు వాళ్ల మీద దాడి చేశాడు. కొంతమందిని నరికేశారు. మరి కొందరు సముద్రంలో మునిగిపోయారు. మిగిలినవారు ఖైదుపాలయ్యారు. పట్టుబడినవాళ్లలో బ్రూసు యిద్దరు సోదరులున్నారు. వారిని ఎడ్వర్డు ఉరి తీయించాడు. బ్రూసు సన్నిహితులు కొంతమంది పోయారు. మళ్లీ అతని కష్టాలు ప్రారంభమయ్యాయి. 

బ్రూసు అనుచరుల్లో ఒంటికన్ను వాడొకడున్నాడు. వాడు నమ్మకస్తుడు కాడని యితరులు చెప్పినా బ్రూసు వినలేదు. ఎడ్వర్డు అతనికి డబ్బు ఆశ చూపాడు.  అతను అవకాశం ఎదురు చూస్తూంటే ఒకరోజు బ్రూసు తన పనివాడితో నడుస్తూ అడవుల్లో ఎదురయ్యాడు. ఒంటి కన్నువాడి చేతిలో కత్తి వుంది, తోడుగా వున్న యిద్దరు కొడుకుల్లో ఒకడి చేతిలో కత్తి, బల్లెం వున్నాయి, మరొకడి చేతిలో కత్తి, గొడ్డలి వున్నాయి. బ్రూసు ఒంటిపై కవచం లేదు, కత్తి తప్ప వేరే ఆయుధం లేదు. పనివాడి దగ్గర విల్లు, బాణం వున్నాయంతే. ఈ ముగ్గురి హావభావాలు చూస్తూనే బ్రూసు సంగతి గ్రహించాడు. పనివాడి దగ్గర్నుంచి విల్లు, బాణం తీసుకుని అతన్ని దూరంగా వెళ్లిపొమ్మన్నాడు. ఒంటికన్నువాడు మాయమాటలు చెప్పబోయాడు కానీ బ్రూసు అతని వరస కనిపెట్టి బాణంతో అతని కంటిని చీల్చాడు. దాంతో యిద్దరు కొడుకులు బ్రూసుపై పడ్డారు. కత్తితో వాళ్లకు బుద్ధి చెప్పాడు. కొద్ది నిమిషాల్లోనే ముగ్గురూ నేలకు రాలారు.

బ్రూసు అనుచరుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చి ఒక దశలో 60కు చేరింది. బ్రూసును సమూలంగా నాశనం చేయడానికి యిదే అదను అనుకున్న ఇంగ్లీషు సేన వేటకుక్కలతో అతని కోసం వెతికింది. నదికి అవతలి వైపున బ్రూసు వున్నాడని విని ఆర్ధరాత్రి నది దాటబోయింది. నది చాలా లోతుగా వుంది. అయితే ఒక చోట రెండు గట్లను కలుపుతూ నేల పైకి తేలింది. అక్కణ్నుంచే దాటాలని దళపతి భావించాడు. కానీ అది ఎంత సన్నగా వుందంటే ఒకసారి ఒక్కరే వెళ్లగలరు. నదికిి అవతలి ఒడ్డున వున్న బ్రూసు తన సైన్యాన్ని విశ్రమించమని చెప్పి యిద్దరు సహచరులతో సహా యీ వంతెన దగ్గర కాపలా కాశాడు. కాస్సేపటికి ఇంగ్లీషు సైనికుల కలకలం వినబడింది. తన వెంట వున్న యిద్దర్నీ తక్కినవారిని పిలుచుకుని రమ్మనమని పంపి, తనొక్కడే యిక్కడ కాపలా కాశాడు. కాపలా వున్నది ఒక్కడే అని వెన్నెల కాంతిలో గ్రహించిన ఇంగ్లీషు దళపతి ఒక్కోరిని గుఱ్ఱం మీద పంపసాగాడు. వాళ్లు తీరం చేరుతూండగా బ్రూసు గొడ్డలి చేత ధరించి పీక తెగేయసాగాడు. ఇది పెద్ద గందరగోళానికి దారి తీసింది. వెనక్కాల వున్నవాళ్లకు ముందేం జరుగుతోందో తెలియలేదు. భయపడి వెనక్కి పరిగెట్టిన గుఱ్ఱాలు రౌతులను పడదోశాయి. వాళ్లు నదిలో పడ్డారు. అలా రెండు వందల మంది ఇంగ్లీషు సైనికులు నాశనమై పోయారు. బ్రూసుకు ఏమీ కాలేదు.

ఈ ఓటమి తర్వాత ఇంగ్లీషు సేన ఒక వేటకుక్కను సంపాదించింది. అది ఒకప్పుడు బ్రూసుకు సంబంధించినదే. అది తన యజమాని అడుగుజాడలను సులభంగా గుర్తు పట్టగలదు. దాని నుంచి తప్పించుకోవడానికి బ్రూసు తన సహచరుడితో కలిసి ఒక నదిని యీదుతూ వెళ్లాడు. నీటిలో వేటకుక్కలు జాడలు తీయలేవు. నది దాటాక వేటకుక్క పీడ వదిలింది కానీ ఆకలిదప్పులు బాధించాయి. తిండికోసం, ఆశ్రయం కోసం వెతుకుతూ, అడవిలో పడి నడుస్తూ ఎంతో దూరం వెళ్లారు. ఒక్క కుటీరం కూడా కనబడలేదు. చివరకు వాళ్లకు ముగ్గురు తారసిల్లారు. ఒకడి భుజాల మీద గొఱ్ఱె వుంది. చూస్తే బందిపోటు దొంగల్లా వున్నారు. తనను పట్టిస్తే బహుమతి లభిస్తుందన్న దురాశతో ద్రోహం తలపెడతారన్న భయం కలుగుతున్నా బ్రూసు ''ఎక్కడికి వెళుతున్నారు?'' అని పలకరించారు. ''బ్రూసు సేనలో చేరదామనుకుంటున్నాం. ఆయన ఎక్కడున్నాడో తెలుసా?'' అని అడిగారు వాళ్లు. వీళ్లను నమ్మాలో లేదో తెలియక బ్రూసు ''నాతో వస్తే చూపిస్తా'' అంటూ దారి తీశాడు, వాళ్లు అనుసరించారు. వారిలో ఒకడికి బ్రూసులో రాచఠీవి గోచరించి యితనే బ్రూసని సందేహం కలిగి అప్పగించి డబ్బు గడిద్దామన్న ఆశ కలిగింది. అతని కళ్లల్లో మెదిలిన ఆ ఆశను బ్రూసు పసిగట్టాడు. ముందు నడుస్తూంటే వెనక్కాల నుంచి పొడుస్తాడేమోనని ''మీరు ముందు నడవండి, వెనక్కాల మేం నడుస్తాం'' అన్నాడు. వాళ్లు గునిసినా, చివరకు సరే అనాల్సి వచ్చింది. 

చివరకు పొద్దు వాటారుతుండగా వాళ్లు ఒక పాడుపడిన కుటీరానికి చేరి గొఱ్ఱెను చంపి, కాల్చుకుని తిన్నారు. ఆకలితో, అలసటతో నీరసించిన బ్రూసుకు కడుపునిండా తినగానే నిద్ర ముంచుకు వచ్చింది. కళ్లు కూరుకుపోతూండగా తన అనుచరుణ్ని కాపలా కాయమని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు. అలాగే అన్న అనుచరుడు కూడా కాస్సేపటికి నిద్రాదేవి తన ఒడిలో తీసుకుంది. వాళ్లు గాఢనిద్రలో మునిగారన్న ధైర్యం చిక్కాక ముగ్గురూ కత్తులు దూసి పాక్కుంటూ బ్రూసు వద్దకు వచ్చారు. అంతలో అతనికి చటుక్కున మెలకువ వచ్చింది. చుట్టూ చీకటి అలుముకుంటోన్నా యింకా చల్లారని పొయ్యి వెలుతురులో వాళ్లను గమనించాడు. కాలితో తన అనుచరుణ్ని తట్టి, లేచి నిలబడ్డాడు. అనుచరుడు లేచేలోపునే ఒకడు అతని గుండెల్లో కత్తి దించాడు. ఎంతగానో అలసిపోయి, సరైన నిద్ర కూడా దక్కని బ్రూసు ఆ బాధలేవీ లేని ముగ్గురితో తలపడవలసి వచ్చింది. బ్రూసు ఎంతటి వీరుడంటే అతి త్వరగా ఆ ముగ్గురూ చచ్చిపోయి, అతని పాదాల వద్ద శవాలుగా పడ్డారు. (సశేషం) (చిత్రాలు – స్టిర్లింగ్‌ వద్ద బ్రూసు విగ్రహం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives