ఇక్కడ రోమన్ సామాజిక, పాలనా వ్యవస్థ గురించి క్లుప్తంగా చెప్పుకోవలసిన అవసరం వుంది. అప్పుడే తర్వాతి కథల్లో చెప్పుకునే రాజకీయాలు అర్థమవుతాయి. రోమన్ సమాజం ఎలా ఏర్పడిందో కాస్త తెలుసుకోవాలి. రోమ్ కొత్తగా ఏర్పడినపుడు రోములస్ యిస్తున్న స్వేచ్ఛ విని యితర దేశాల నుంచి పారిపోయి వచ్చినవారు, నేరస్తులు, చట్టం నుంచి తప్పించుకున్నవారు, దేశబహిష్కృతులు అందరూ వచ్చిపడ్డారు. మగవాళ్లు ఎక్కువై పోవడంతో ఆడవారు చాలలేదు. అందువలన పక్క వూళ్ల నుంచి ఎత్తుకు రాసాగారు. ఒకసారి సర్కస్ మాగ్జిమస్ అనే పెద్ద మైదానంలో (యిప్పటికి కూడా వుంది) పండగ జరుపుకుంటున్నామని చెప్పి లాటిన్, శాబిన్ ప్రాంతాల నుంచి అందర్నీ ఆహ్వానించారు. రథాల పోటీలు నిర్వహిస్తూ, మగవాళ్ల దృష్టి దానివైపు వుండగా ఆడవాళ్లను ఎత్తుకుపోయారు. ఒప్పుకున్నవాళ్లని పెళ్లి చేసుకున్నారు. తక్కినవాళ్లను బలాత్కరించారు. ఈ చర్య వలన సాబిన్, లాటిన్ వాళ్లు రోమ్‌పై దండెత్తారు కానీ రోమే గెలిచింది. దాంతో సాబిన్ రాజు రోములస్ సంధి చేసుకుని ఐదేళ్లపాటు యిద్దరూ కలిసి రెండు రాజ్యాలు కలిపి ఏలారు. రెండు ప్రాంతాల ఆచారాలు, క్యాలండర్లు, దేవుళ్లు, సైనికవ్యూహాలు యిచ్చిపుచ్చుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు సాబిన్ రాజు హత్యకు గురై రోములస్ ఏకైక పాలకుడయ్యాడు. తాత న్యూమిటార్ చనిపోయినప్పుడు అల్బా లాంగాను కూడా తన రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఇలా విభిన్న సంస్కృతుల వారిని కలుపుకుంటూ పోయాడు కాబట్టి ఆయా ప్రాంతాల ప్రతినిథులతో సెనేట్ ఏర్పరచి వారి సలహాల మేరకు రాజు నడుచుకోవాలన్నాడు. కానీ తనే కొంతకాలానికి వారిని నిర్లక్ష్యం చేసి అధికారాలన్నీ తన చేతిలోకి తీసుకోవడంతో సెనేట్ సభ్యులే అతన్ని చంపివేశారని అంటారు. అబ్బే కాదు, సుడిగాలి వచ్చి స్వర్గానికి తీసుకుపోయిందని కొందరు కథలు చెప్తారు.
ఇలా విభిన్న సంస్కృతుల వారిని కలుపుకుంటూ పోయాడు కాబట్టి ఆయా ప్రాంతాల ప్రతినిథులతో సెనేట్ ఏర్పరచి వారి సలహాల మేరకు రాజు నడుచుకోవాలన్నాడు. కానీ తనే కొంతకాలాని వారిని నిర్లక్ష్యం చేసి అధికారాలన్నీ తన చేతిలోకి తీసుకోవడంతో సెనేట్ సభ్యులే అతన్ని చంపివేశారని అంటారు. అబ్బే కాదు, సుడిగాలి వచ్చి స్వర్గానికి తీసుకుపోయిందని కొందరు కథలు చెప్తారు. సెనేట్ అనే పదం సెనెక్స్ అనే లాటిన్ మాట నుంచి పుట్టింది. దాని అర్థం వృద్ధుడు అని. మన రాజ్యసభను ఎల్డర్స్ హౌస్ అన్నట్టుగా అన్నమాట. ఎసెంబ్లీలు ఏర్పరచాడు. మూడు జాతుల ప్రతినిథులతో కమీషియా క్యురియేటా, కమీషియా ట్రైబ్యూటా అనే ఎసెంబ్లీలు వుండేవి. వీటికి అధికారం లేకపోయినా అది ఒక చర్చావేదికగా వుండేది. మిలటరీ అధికారులతో, భూస్వాములతో నిండిన కమీషియా సెంచూరియాటా (సెంచూరియన్ అంటే సైనికాధికారి) కాన్సల్స్‌ను ఎన్నుకోవడం ప్రధాన భూమిక వహించేది. కన్సీలియమ్ ప్లెబిస్ అనే ఎసెంబ్లీ చేసిన చట్టాలు మొదట్లో ప్లెబియన్లకు మాత్రమే వర్తించేవి. క్రీ.పూ. 287 తర్వాత అవి రోమన్లందరికీ వర్తించేవి. సెనేట్‌కు మాత్రం విశేషాధికారాలున్నాయి. దానిలో 100 మంది వున్నత వంశాలకు చెందిన కుటుంబపెద్దలతో రోములస్ ఏర్పరచాడు. ఐదవ రాజు వచ్చేసరికి వీరి సభ్యులను 200 కు పెంచాడు. ఏడవ రాజు వీరిలో కొంతమందిని ఉరి తీసేసి, వారి స్థానంలో వేరెవర్నీ నియమించలేదు. క్రీ.పూ.535లో రాజ్యానికి వచ్చిన లూసియస్ తార్క్విన్ సుపర్బస్ అనే ఒక రాజు కొడుకు తన బంధువైన వివాహితను బలాత్కరిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ తన సోదరుడు బ్రూటస్‌కి యిదీ కారణం అని చెప్పింది. అతను రాజు మేనల్లుడే. ఆమె మరణాన్ని ఎత్తి చూపుతూ ప్రజలందరినీ కూడగట్టుకుని విప్లవం లేవదీసి రాజకుటుంబాన్ని బహిష్కరింపచేశాడు. ఇకపై రాజులుండకూడదని వారి బదులు యిద్దరు కాన్సల్స్ వుండాలని ప్రతిపాదించాడు.
కాన్సల్ సెనేట్ సభ్యుల కంటె ఎక్కువ కాదు. సమానుల్లో మొదటివాడు. (ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్) అందుకే అతని బిరుదు 'ప్రిన్సెప్స్' (నాయకుడు) అని వుండేది. ఇద్దరు కాన్సల్స్ కలిసి సంయుక్తంగా పరిపాలన, సైన్యపర్యవేక్షణ చూసుకుంటారు. వారికి ఆ పదవి ఏడాది కాలం మాత్రమే. ఏడాది ముగిశాక మళ్లీ పదేళ్ల దాకా ఎన్నుకోలేరు. ఇద్దరూ కలిస్తేనే కొత్త చట్టాలు చేయగలరు. వారిలో ఎవరు వీటో చేసినా (తిరస్కరించినా) చట్టం అమలు కాదు. సంక్షోభం తలెత్తినపుడు డిక్టేటర్ అనే పదవి సృష్టించి సర్వాధికారాలు అప్పగిస్తారు. కానీ అది ఆరు నెలలకు మించి కొనసాగడానికి వీల్లేదు. ఆ పెద్దలను కూడా ప్రజలే ప్రతీ ఏడూ ఎన్నుకోవాలని అన్నాడు. సెనేట్‌లో అప్పటివరకు పేట్రీషియన్స్ అనే అత్యున్నత వంశజులైన వారికే సెనేట్ సభ్యత్వం వుండేది. ఇప్పటినుంచి సంపదలో వారి తర్వాతి స్థానంలో వున్న ఈక్వయిట్స్‌కు కూడా సభ్యత్వం యివ్వాలన్నాడు. గతంలో ప్రజలు తమను పాలించే హక్కు (ఇంపీరియమ్)ను రాజుకి యిచ్చారని, యిప్పుడు వారు యీ రిపబ్లిక్ యివ్వాలని వాదించాడు. వీరే పాలకులను (కాన్సల్స్‌ను) ఎన్నుకుంటారని అన్నాడు. ప్రజలందరూ దానికి సమ్మతించి రాచరికం స్థానంలో గణతంత్రాన్ని నెలకొల్పారు. బ్రూటస్, చనిపోయిన అతని సోదరి భర్త తొలి కాన్సల్స్ అయ్యారు.
రోమన్ పరిపాలనలో సెన్సార్ అనే పదవి ఒకటి వుంది. పౌరసత్వం నమోదు చేయడం, ఆర్థిక వ్యవహారాలు చూడడం, ప్రజాధనంతో కట్టే నిర్మాణాలను పర్యవేక్షించడం యితని పనులు. సెన్సస్ (జనగణన, నమోదు) రోమ్‌లో చాలా ముఖ్యమైన పని. ఐదేళ్ల కోసారి ప్రతీ పురుషుడు తన పేరు, కుటుంబ వివరాలు, భార్యాబిడ్డలు, బానిసలు, ఆస్తిపాస్తులు అన్నీ నమోదు చేసుకోవాలి. అప్పుడు అతనికి పౌరసత్వం లభిస్తుంది. ఆ పౌరసత్వంతో అతను సెనేట్‌కు ఎన్నిక కాగలడు. సైన్యంలో చేరడానికి తగిన పురుషులు ఎందరున్నారో ప్రభుత్వానికి యీ విధంగా తెలిసేది. పౌరసత్వపు నమోదులో సాంఘికపరమైన అంతస్తు కూడా నిర్ధారించేవారు. వ్యవసాయం సరిగ్గా చేయకపోయినా, పిల్లలు లేకపోయినా, భార్య చెడునడవడిని నిరోధించలేకపోయినా స్థాయి దింపేసేవారు. రోమన్ సమాజం ఉన్నతులు (పాట్రీషియన్లు, ఈక్వైట్లు) కాకుండా, పనివారు (ప్లెబియన్లు అనేవారు), బానిసలు యిలా దొంతరలుగా వుండేది. ఉన్నతవర్గాలలో వున్నవారికి కొన్ని బాధ్యతలు కూడా వుంటాయి. వారిలోంచి పుట్టుక బట్టి, పదవి బట్టి 300 మంది సభ్యులను ఎంపిక చేసి వారితో సెనేట్ ఏర్పడేది. క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి ప్లెబియన్లు కూడా ఎంపిక కాసాగారు. వీరు స్వయంగా చట్టాలు చేయలేకపోయినా సలహా మండలిగా వ్యవహరించేవారు. ఆర్థిక, విదేశాంగ వ్యవహారాల్లో వీరి మాట చెల్లేది. వీరి పదవీకాలం ఏడాది మాత్రమే. సెనేట్‌లో విస్తృతంగా చర్చలు జరిగేవి. మంచి వక్తలు యితరులను ఒప్పించగలిగేవారు. సెనేట్ సభ్యత్వం వున్నంతకాలం వ్యాపారాలు చేయకూడదనే నిబంధన వుండేది. పోనుపోను చక్రవర్తి వ్యవస్థ ఏర్పడి సెనేట్‌ను నిర్లక్ష్యం చేయడంతో రోమన్ సామ్రాజ్యపతనం ప్రారంభమైంది.
రోమన్ సామ్రాజ్యం అనగానే గ్లాడియేటర్లు, బానిసలు గుర్తు రాక తప్పదు. ఆ బానిసలు క్రీ.పూ. 73లో తిరుగుబాటు కూడా చేశారు. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన స్పార్టకస్ పై ఆధారపడిన నవలను అనుబంధంగా యిస్తున్నాను. దానిలో బానిస వ్యవస్థ గురించి, గ్లాడియేటర్ల గురించి కొంత చెప్పాను. బానిసత్వం అనేది ప్రాచీనకాలం నుండి అనేక నాగరికతల్లో వుంది. అయితే రోమన్ సామ్రాజ్యంలో అది విపరీతమైన స్థాయికి చేరింది. బానిసల చేత పని చేయించుకోవడం వలననే ఎన్నో నిర్మాణాలు చేపట్టారు వాళ్లు. కానీ బానిసలపై పూర్తిగా ఆధారపడడం చేత రోమన్ పౌరులు బద్ధకస్తులై నైపుణ్యం పోగొట్టుకున్నారు. స్వేచ్ఛ పొందిన బానిసలు వారిని వ్యాపారాల్లో సులభంగా వెనక్కి నెట్టేయగలిగారు. చౌకగా పనివాళ్లు దొరకడంతో పనిని సులభతరం చేసే సాంకేతిక పరికరాలను, యంత్రాలను కనిపెట్టలేదు. బానిసలను రోమన్లందరూ ఒకేలా చూడలేదు. కొందరు దయగా చూసేవారు. మరి కొందరు క్రూరంగా వుండేవారు. ఎలా చూసినా , వారిని ఏం చేసినా ప్రభుత్వం వారినేమీ అనేది కాదు. వారిని పశువుల కంటె వారి స్థాయి ఎక్కువేమీ కాదు. అయితే బానిసలు విడిగా పనిచేసి, ఆ డబ్బు దాచుకుని, యజమాని నుండి స్వాతంత్య్రాన్ని కొనుక్కునే వీలుండేది. స్వేచ్ఛ పొందిన బానిసకు పౌరసత్వం లభించేది.
స్పార్టకస్ నవలలో కొట్టవచ్చేట్టు కనబడే మరో అంశం – లైంగిక విశృంఖలత్వం. రోమన్లకు స్త్రీ అంటే సెక్స్‌కు ఉపయోగపడే ప్రాణి మాత్రమే. ప్రేమ అనేది ఆడంగి లక్షణమని వారి ఉద్దేశం. ఇంట్లో భార్య పని పిల్లల్ని కనడం మాత్రమే. భర్త ఎవరితో సంబంధం పెట్టుకున్నా అడగడానికి లేదు. సంతానవతి కాని భార్యను వదిలేయవచ్చు. ఇద్దరు యువతీయువకులు సంప్రదాయబద్ధమైన వివాహం చేసుకోకుండా ఒప్పందంతో కలిసి వుండే సౌకర్యం కూడా వుండేది. బానిస స్త్రీలతో, పురుషులతో భార్యాభర్తలు సెక్స్ అనుభవించినా దాన్ని పట్టించుకునేవారు కారు. ఎందుకంటే వారి దృష్టిలో బానిసలు సాటి మనుషులు కాదు. భార్య సమాజంలో యితర కులీనులతో సంబంధం పెట్టుకుని బాహాటంగా తిరిగినప్పుడే భర్తకు తలవంపులయ్యేది. ఈ విషయాలు గుర్తు పెట్టుకుని స్పార్టకస్ నవలా సంగ్రహం చదవండి. దీన్ని 2010లో ఒకసారి పరిచయం చేశాను. ఆర్కయివ్స్‌లో వెతికే పని లేకుండా కింద కొత్తగా లింకు యిస్తున్నాను. దీని తర్వాత సీజర్ కథలోకి వెళదాం. ఎందుకంటే యీ నవలలో తారసిల్లే సేనాని క్రాసస్ సీజర్ జీవితగాథలో ప్రధానపాత్ర వహిస్తాడు. (సశేషం) (ఫోటో – సర్కస్ మాగ్జిమస్ ప్రస్తుతరూపం, సెనేట్‌లో చర్చ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)