మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కాల్సిన 'కత్తి' సినిమా ప్రారంభానికి ముందే వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ సినిమా కథ తనదేనంటూ ఓ వ్యక్తి సినీ పరిశ్రమ పెద్దల్ని ఆశ్రయించారు. దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్‌లో రచయిత ఎన్.నరసింహారావు ఫిర్యాదు చేయడంతో, 'కత్తి' సినిమాకి సహాయ నిరాకరణ తప్పదని ఆయా సంఘాలు అల్టిమేటం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి 'కత్తి' సినిమా తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కింది. దాన్ని తెలుగులోకి చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. వినాయక్ దర్శకుడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దర్శకుడెవరు.? అన్న విషయమ్మీదనే ఇంకా స్పష్టత లేని పరిస్థితి. వినాయక్ దర్శకుడు.. అన్నది 'అట' మాత్రమే. పరుచూరి బ్రదర్స్ సినిమా కథకి మెరుగులు దిద్దుతున్నారన్నది ఇంకో గాసిప్.
తమిళ సినిమాని రీమేక్ చేయడమంటే, ఆ సినిమా హక్కుల్ని కొనుక్కోవడమే కదా. సినిమాని యదాతథంగా దించేయొచ్చు.. లేదా మార్పులు చేసుకోవచ్చు. కథ సహా, సన్నివేశాలు సహా.. అన్నిటినీ 'రీమేక్' పేరుతో కొనుక్కుంటున్నప్పుడు, 'ఆ కథ నాది..' అని నరసింహారావు అనే వ్యక్తి వివాదానికి తెరలేపడమే హాస్యాస్పదం. చూస్తోంటే, ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అన్పిస్తోంది తప్ప, వాస్తవం వున్నట్లు కన్పించడంలేదు.
పైగా, ఈ ఎపిసోడ్‌లోకి దాసరి నారాయణరావు పేరు కూడా విన్పిస్తోంది. ఆయనే, సహాయ నిరాకరణ పట్ల అత్యుత్సాహం చూపారన్నది సినీ వర్గాల్లో విన్పిస్తోన్న గాసిప్. ఈ వివాదంపై 'కత్తి' యూనిట్‌గానీ, సినీ పరిశ్రమగానీ స్పందించలేదు. రచయిత నరసింహారావు మాత్రం, ఆ కథ తనదేనని తెగేసి చెబుతున్నారు.