ఎమ్బీయస్: ఫిల్మ్ యిన్‌స్టిట్యూట్‌లో సమ్మె

పుణెలోని ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో జూన్ 12 నుంచి సాగుతున్న సమ్మె తగ్గుముఖం పట్టే సూచనలు కనబడటం లేదు. జులై 6న నటీమణి పల్లవి జోషి ఇన్‌స్టిట్యూట్ గవర్నింగ్ కౌన్సిల్‌లో తన…

పుణెలోని ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో జూన్ 12 నుంచి సాగుతున్న సమ్మె తగ్గుముఖం పట్టే సూచనలు కనబడటం లేదు. జులై 6న నటీమణి పల్లవి జోషి ఇన్‌స్టిట్యూట్ గవర్నింగ్ కౌన్సిల్‌లో తన సభ్యత్వాన్ని వదులుకుని ‘తను నమ్మిన సిద్ధాంతాల కారణంగా రాజీనామా చేస్తున్నా’నని ఇన్ఫర్మేషన్ శాఖకు తెలియపరిచింది. ఆమె కంటె ముందు ప్రసిద్ధ దర్శకనిర్మాత జహ్ను బరువా, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ సంతోష్ శివన్ కూడా ఇదే కారణాలు చెప్పి తప్పుకున్నారు. గజేంద్ర సింగ్ చౌహాన్‌ను ఆ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా నియమించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బిజెపి ప్రభుత్వం అనేక ప్రభుత్వ సంస్థల్లోనే కాక, కళారంగానికి సంబంధించిన సంస్థల్లో సైతం కాషాయవాదులను అధిపతులుగా నియమిస్తోందని, ఆ రకంగా భావప్రకనా స్వేచ్ఛను హరిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మోదీ ప్రచార చిత్రాలను తయారు చేసిన పహ్లాజ్ నిహ్లానీని సెన్సారు బోర్డు చైర్మన్‌గా నియమిస్తే ఆయన 20 పదాలు సినిమాల్లో వాడకూడదని (వాటిల్లో బొంబాయి ఒకటిట) నిషేధించారు. మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముకేశ్ ఖన్నా (‘‘మహాభారత్’’ టీవీ సీరియల్‌లో భీష్మపాత్రధారి, ‘‘శక్తిమాన్’’ వంటి టీవీ సీరియల్స్‌లో నాయకుడు, కొన్ని సినిమాల్లో వేశారు)ను చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీకి చైర్మన్‌గా వేశారు. ఈ ఇద్దరూ ఆశారాం బాపు అనుచరులు. ఇప్పుడు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా వచ్చిన గజేంద్ర చౌహాన్ ‘‘మహాభారత్’’ టీవీ సీరియల్‌లో ధర్మరాజు పాత్రధారి. కొన్ని సినిమాల్లో నటించినా పెద్ద పేరు తెచ్చుకోలేదు. అయితే అతను బిజెపి సమర్థకుడు. 2014 ఎన్నికలలో బిజెపి అభ్యర్థులకై ప్రచారం చేశాడు.

ఇతనే కాదు, ఇన్‌స్టిట్యూట్ కౌన్సిల్‌లో నియమించిన మరొక నలుగురికి కూడా కాషాయ బంధాలున్నాయి. అనఘా ఘాసియాస్ ఆరెస్సెస్ సభ్యుడు, మోదీని సమర్థిస్తూ డాక్యుమెంటరీ చిత్రాలు తీశాడు. నరేంద్ర పాఠక్ ఎబివిపి, మహారాష్ట్ర శాఖకు నాలుగేళ్లపాటు అధ్యక్షుడు. ప్రాంజల్ సైకియా ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన సంస్కార భారతిలో పదవి నిర్వహిస్తాడు. రాహుల్ సోలాపూర్‌కర్ బిజెపి టిక్కెట్టుకై ప్రయత్నించాడు. ఇవన్నీ చూసి విద్యార్థులు తిరగబడ్డారు. ‘‘గజేంద్ర చౌహాన్ పెద్ద నటుడు కాదు, నిర్మాత, దర్శకుడు కాదు, సృజనాత్మక ఏమీ లేదు. ఇంతకు ముందు చైర్మన్‌గా వున్న సయీద్ మీర్జా క్రియేటివిటీతో పోలిస్తే ఇతను ఎందుకూ చాలడు. సయీద్ వెళ్లిపోయిన ఆర్నెల్లు ఖాళీగా వుంచి, సినిమా విషయంలో దేశంలోనే గొప్ప సంస్థ అయిన దీనికి యితన్ని వేయడమేమిటి? ఇతను ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఎప్పుడూ చదవలేదు, పాఠాలు చెప్పలేదు, దీనితో ఏ సంబంధమూ లేదు. ఇతను ఈ పదవికి తగడు. ఇతన్ని తీసివేయాల్సిందే.’’ అని ఆందోళన మొదలుపెట్టారు. ఇన్‌స్టిట్యూట్‌కు ఏటా రూ.40 కోట్లు నిధులిచ్చే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖను నిర్వహించే మంత్రి అరుణ్ జైట్లే ఈ సమ్మెను పట్టించుకోలేదు.

చివరకు జూన్ 17న కొందరు ప్రతినిథులను పంపి విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటామన్నారు. ఇన్‌స్టిట్యూట్ తరఫున 10 మంది ప్రతినిథుల సమితికి దర్శకుడు గిరీశ్ కాసరవల్లి నాయకత్వం వహించారు. విద్యార్థులు ఎంత గొంతు చించుకున్నా తాను దిగేది లేదని గజేంద్ర స్పష్టం చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. స్థాపించిన 55 ఏళ్లలో ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పటివరకు 40 సమ్మెలు జరిగాయి. దానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలని అందరూ అంటూ వుంటారు. కానీ దాని కాళ్ల మీద అది నిలబడాలంటే ఫీజులు భారీగా వసూలు చేయాలి. దానికి విద్యార్థులు ఒప్పుకోరు. ప్రభుత్వంపై నిధులకోసం ఆధారపడినప్పుడు వారు తమకు ఇష్టులైన వారిని నియమిస్తూ వుంటారు. వారికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తూ వుంటారు. ప్రసిద్ధులైన వారిని నియమిస్తే ప్రభుత్వం తనను తాను సమర్థించుకునే వీలుండేది. అనామకుడైన గజేంద్ర చౌహాన్‌ను నియమించడంతో ఈ చిక్కు వచ్చి పడింది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)

[email protected]