ఎమ్బీయస్‌: గోడ్సేని ఎలా చూడాలి? – 27

1948 జనవరి 30 న గాంధీ హత్య జరగగానే గోడ్సే ఒక్కడే పట్టుబడ్డాడు. జనవరి 20 నాటి హత్యాప్రయత్నం నాడు మదన్‌లాల్‌ పహ్వా పట్టుబడ్డాడు. కానీ వారి వెనుక బృందం వుండే వుంటుందన్న వూహతో…

1948 జనవరి 30 న గాంధీ హత్య జరగగానే గోడ్సే ఒక్కడే పట్టుబడ్డాడు. జనవరి 20 నాటి హత్యాప్రయత్నం నాడు మదన్‌లాల్‌ పహ్వా పట్టుబడ్డాడు. కానీ వారి వెనుక బృందం వుండే వుంటుందన్న వూహతో పోలీసులు పరిశోధించి, అనుమానితులను అరెస్టు చేసి ఐదునెలల్లో కేసును విచారణకు తెచ్చారు. ఈ  హత్య జరిగినది ఢిల్లీలో, దానికై కుట్ర జరిగినది బొంబాయి రాష్ట్రంలో. మామూలు న్యాయవిచారణ పద్ధతుల్లో అయితే ఎక్కడ విచారణ జరపాలి, ఎవరి పరిధిలోకి వస్తుంది వంటి ప్రశ్నలు వస్తాయి. వాటిని అధిగమించడానికి ఐసియస్‌లో జ్యుడిషియల్‌ బ్రాంచ్‌కు సంబంధించిన ఆత్మా చరణ్‌ను విచారణకు ప్రత్యేకంగా నియమించారు. 1948 జూన్‌ 22న ఢిల్లీలోని ఎఱ్ఱ కోటలో కేసు విచారణ ప్రారంభమైంది. వాదోపవాదాలు జరిగినప్పుడు పబ్లిక్‌ను అనుమతించారు, మీడియాను అనుమతించారు. నిందితులకు తమకు కావలసిన లాయర్లను నియమించే హక్కు యిచ్చారు. వారి వాదనలు అవీ పత్రికలలో విపులంగా వచ్చాయి. మొత్తం 8 మంది నిందితులు – నాథూరామ్‌ గోడ్సే, గోపాల్‌ గోడ్సే, నారాయణ ఆప్టే, విష్ణు కర్కారే, మదనలాల్‌ పహ్వా, శంకర్‌ కిష్టయ్య, దత్తాత్రేయ పర్చూరే, వినాయక్‌ సావర్కార్‌! గంగాధర్‌ దండావతే, గంగాధర్‌ జాదవ్‌, సూర్యదేవ్‌ శర్మ అనే ముగ్గురు పట్టుబడలేదు వారిపై ఇన్‌-ఆబ్సెన్షియా కేసు నడిచింది. దిగంబర్‌ బాహ్‌ాడగే అప్రూవరుగా మారాడు. 149 మంది సాకక్షులను ప్రవేశపెట్టారు. అసంఖ్యాకమైన దస్తావేజులు, ఉత్తరాలు సాక్షాలుగా ప్రవేశపెట్టబడ్డాయి. 

నవంబరు 6 నాటికి సాకక్షుల స్టేటుమెంట్లు రికార్డయ్యాయి. ఖైదీల వంతు వచ్చినపుడు వారు దీర్ఘప్రకటనలు చేశారు తప్ప, సాకక్షులను పిలిపించి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయించలేదు. తర్వాత నెల్లాళ్లపాటు ప్రాసిక్యూషన్‌ వాదనలు జరిగాయి. చివరకు 1949 ఫిబ్రవరి 10న తీర్పు వచ్చింది. సావర్కార్‌ను నిర్దోషిగా వదిలేశారు. గోడ్సే, ఆప్టేలకు మరణశిక్ష, తక్కినవారికి యావజ్జీవ శిక్ష. కావాలంటే 15 రోజుల లోపున అప్పీలు చేసుకోవచ్చు. తీర్పు వెలువడిన నాలుగు రోజులకే గోడ్సే తప్ప తక్కినవారు పంజాబ్‌ హైకోర్టుకు శిక్షపై అప్పీలు చేసుకున్నారు. గోడ్సే మాత్రం శిక్ష గురించి అప్పీలు చేసుకోలేదు. హత్య వెనుక కుట్ర జరిగిందన్న వాదనతోనే అతను విభేదించి, ఛాలెంజ్‌ చేశాడు. హత్యకు నేనొక్కణ్నే బాధ్యుణ్ని అని అతని వాదన. మామూలుగా హత్యకేసులో అప్పీలుకు వచ్చినపుడు యిద్దరు జడ్జిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ వింటే సరిపోతుంది. కానీ కేసుకు వున్న ప్రాముఖ్యత బట్టి పంజాబ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ముగ్గుర్ని నియమించాడు – జస్టిస్‌ భండారీ, జస్టిస్‌ అచ్రూరామ్‌, జస్టిస్‌ గోపాల్‌ ఖోస్లా. పంజాబ్‌ హైకోర్టు లాహోర్‌లో వుండేది. విభజన తర్వాత 1955లో చండీగఢ్‌కు శాశ్వతంగా ఏర్పడేందుకు ముందు, తాత్కాలికంగా షిమ్లాలో ఒక భవంతిలో పెట్టారు. అక్కడ 1949 మే 2 న పునర్విచారణ ప్రారంభమైంది. అప్పటిదాకా జరిగిన వాదప్రతివాదాలను 1131 ఫుల్‌స్కేపు ప్రింటెడ్‌ పేజీలు, అనుబంధంగా 115 ఫుల్‌స్కేపు సైక్లోస్టయిల్‌డ్‌ పేజీలు తయారుచేసి యిచ్చారు. 

శిక్ష పడిన ముద్దాయిల తరఫున లాయర్లు వచ్చారు. గోడ్సే మాత్రం తనకు లాయరు అక్కరలేదన్నాడు. తన కేసు తనే వాదించుకోవడానికి అనుమతి కోరాడు. కేసు చూడడానికి వచ్చిన సందర్శకుల ముందు, మీడియా ముందు తను చేసిన పనికి ఏ మాత్రం చింతించటం లేదని చూపించుకోవడానికి యిదే అవకాశం అనుకున్నాడు. వేలాది ముందు హత్య జరిగింది కాబట్టి తను నేరస్తుడు కానని వాదించడానికి గోడ్సేకు అవకాశమే లేదు. తనకు ఎలాగూ మరణశిక్ష పడుతుంది కానీ తన సహచరులు కూడా తనతో బాటు బాధపడడం దేనికి, వారిని తప్పిద్దామని గోడ్సే అనుకున్నాడు. అందువలన హత్య విషయాన్ని ఒప్పుకుంటూనే, కుట్ర విషయాన్ని ఖండించడానికి నిశ్చయించుకున్నాడు. గోడ్సే అవివాహితుడు, అప్పటికే 37 ఏళ్లవాడు. బాదరబందీలు లేవు. కానీ అతని తమ్ముడు 27 ఏళ్ల గోపాల్‌ వివాహితుడు. ఇద్దరు కూతుళ్లు. గోపాల్‌ తనతో బాటు హత్యలో పాలుపంచుకుంటా నన్నప్పుడు గోడ్సే అతనికి బాధ్యతలు గుర్తు చేసి వద్దని వారించాడు. కానీ గోపాల్‌ వినలేదు. గోడ్సే సహనిందితుడు ఆప్టేకి 36 ఏళ్లు. వివాహితుడు. కొడుకున్నాడు. పాకిస్తాన్‌కు యివ్వవలసిన రూ. 55 కోట్ల కోసం గాంధీ నిరాహారదీక్ష పట్టాడన్న రోజునే గోడ్సే, యితరులు గాంధీని తుదముట్టించడానికి నిశ్చయించుకున్నారు. గోడ్సే వెంటనే ఆ రోజే తన పేర వున్న రూ.2000 ఇన్సూరెన్సు పాలసీలో నామినీగా ఆప్టే భార్య పేరును మార్చాడు. మర్నాడు రూ.3000 పాలసీకి నామినీగా గోపాల్‌ భార్య పేరు మార్చాడు. 

ఆ తర్వాత జనవరి 20 నాడు గాంధీని చంపాలని ప్రయత్నించారు. దాని వివరాలు 2-4 భాగాల్లో చూడవచ్చు. ఆ దాడిలో మదన్‌లాల్‌ పహ్వా పట్టుబడ్డాడు. అతను పంజాబీ హిందువు. విభజన తర్వాత పాకిస్తాన్‌లో భాగమైన పాక్‌పట్టన్‌కు చెందినవాడు. పూనాలో ఆర్మీలో చేరాడు. కొన్ని రోజులకు బయటకు వచ్చేసి పాకిస్తాన్‌ వెళ్లే సమయానికి విభజన అల్లర్లు జరుగుతున్నాయి. అతని తండ్రిని ముస్లిం మూకలు అతని కళ్ల ఎదుటే హతమార్చాయి. బాధతో, కసితో ఇండియాకు శరణార్థిగా పారిపోయి వచ్చాడు. ఉద్యోగప్రయత్నాలు చేశాడు. ఏదీ దొరకలేదు. శరణార్థుల శిబిరాల్లో తిరుగుతూండగానే 1947 డిసెంబరులో గోడ్సే, ఆప్టేలను కలిశాడు. వారి సలహా మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ శరణార్థుల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాడు. జనవరి 20 నాటి ప్రయత్నంలో బాంబు పేలుస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతను తమ ఆచూకీ చెప్పేస్తాడని, పోలీసులు తమను వెతికి పట్టుకునే లోగా రెండో ఎటాక్‌ చేయాలని గోడ్సే, ఆప్టే అనుకున్నారు.

మదన్‌లాల్‌ పోలీసుల వద్ద నోరు విప్పేలోగానే అతని గురించి బొంబాయిలో నివసించే హిందీ ప్రొఫెసర్‌, రచయిత డా|| పిసి జైన్‌ పోలీసులకు అతని పథకాన్ని చెప్పేశాడు. ఆయన వద్ద మదన్‌లాల్‌ కొంతకాలం పనిచేశాడు. శరణార్థిగా వచ్చానంటే ఆయన జాలిపడి తన పుస్తకాలను అమ్మి కమిషన్‌ తీసుకోమన్నాడు. అది పెద్దగా లాభసాటిగా సాగలేదు కానీ ఆయన వద్ద మదన్‌లాల్‌ తన హృదయం విప్పి ఆవేశకావేషాలను వెలిబుచ్చేవాడు. రావుసాహిబ్‌ పట్వర్ధన్‌ హిందూ-ముస్లిం ఐక్యత గురించి అహ్మద్‌నగర్‌లో ఒక సభలో ఉపన్యసిస్తూ వుంటే ఆయనపై దాడి చేశానని, పట్టుకున్న పోలీసులూ హిందూత్వవాదులే కాబట్టి వదిలేశారని చెప్పుకున్నాడు. జనవరి మొదటివారంలో జైన్‌తో మాట్లాడుతూ ఒక పెద్ద నాయకుణ్ని హత్య చేసేందుకు కొందరితో కలిసి ప్లాన్‌ చేస్తున్నానని చెప్పాడు. అన్నీ కోల్పోయిన శరణార్థి యిలా మాట్లాడడంలో వింత లేదనుకుని జైన్‌ వూరుకున్నాడు కానీ తర్వాతి సారి కలిసినపుడు ఇంతకీ ఎవరా నాయకుడు అని అడిగాడు. గాంధీ అని చెప్పగానే, జైన్‌ నమ్మలేకపోయాడు. నిజమేనా అని అడిగి 'పెద్దవాడిగా చెప్తున్నాను, యిలాటి పిచ్చి ఆలోచనలు చేయకు. ఇప్పటికే హింసకు నువ్వు, నీ కుటుంబం బలి అయ్యారు, నువ్వు మళ్లీ హింసకు పాల్పడకు.' అని హితవు చెప్పాడు. మదన్‌లాల్‌ తలకాయ వూపడంతో తన సలహా విని చల్లారాడని అనుకున్నాడు కానీ జనవరి 20 నాటి సంఘటన జరగగానే ఆయనకు అర్థమైంది – మదన్‌లాల్‌కు నిజంగా గాంధీని చంపే వుద్దేశం వుందని. అప్పుడే బొంబాయి వచ్చిన కేంద్ర హోం మంత్రి సర్దార్‌ పటేల్‌కు ఫోన్‌ చేశాడు, ఆయన దొరకలేదు. బొంబాయి ప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యకక్షుడు ఎస్‌కె పాటిల్‌కు చేసినా ఆయనా దొరకలేదు. బొంబాయి ముఖ్యమంత్రి ఖేర్‌ దొరికారు. ఆయనతో ఫోన్లో చెపితే ఆయన తన వద్దకు స్వయంగా రమ్మన్నాడు. వెళ్లి ఆయన్ను, బొంబాయికి హోం మంత్రిగా వున్న మొరార్జీ దేశాయిని కలిసి మదన్‌లాల్‌ గురించి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Previous Articles