ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదవ ఎడిషన్ రంజుగా సాగుతోంది. క్రికెట్ అభిమానులు సాయంత్రమయితే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. క్రికెట్ లవర్స్‌కి అంతకన్నా ఎంజాయ్మెంట్ ఇంకేముంటుంది.? ఆ మాటకొస్తే, వరల్డ్ కప్ క్రికెట్ పోటీలకన్నా కాస్త ఎక్కువగానే ఐపీఎల్ పట్ల క్రికెట్ అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తుండడం గమనార్హం.
ఏ జట్టుతో ఏ జట్టు గెలిచినా.. అందరూ మనోళ్ళే అన్న భావన కలుగుతోంది క్రికెట్ అబిమానులకి. నిజమే మరి, భారతదేశంలోని ఎనిమిది జట్లు, అందులో కొందరు విదేశీ క్రికెటర్లు.. వెరసి అన్ని జట్లలోనూ మేటి ఆటగాళ్ళు కన్పిస్తున్నారు.. ఎవరు బౌండరీ బాదినా, ఎవరు వికెట్ తీసినా మనదే అన్న భావన కల్పించడంలో ఆశ్చర్యమేముంటుంది.?
ఐపీఎల్ అంటే మేగ్జిమమ్ ఎంటర్టైన్మెంట్. అయితే ఈ పోటీల వెనుక అసలు ఉద్దేశ్యం వేరు. దేశీయ టాలెంట్‌ని వెలికి తీయడమే లక్ష్యంగా బీసీసీఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లక్ష్యం నెరవేరుతోందా.? లేదా.? అన్నది వేరే విషయం. అయితే, తెరవెనుక బెట్టింగ్ మాత్రం జోరుగా సాగుతోంది. ఫిక్సింగ్ వ్యవహారాలకు కొదవే లేదు. ఫిక్సింగ్, బెట్టింగ్‌లను కవలలుగా అభివర్ణించొచ్చు.
ఎంటర్టైన్మెంట్ ముసుగులో వందల వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతోందంటే అదంతా ఐపీఎల్ పుణ్యమే. ఎన్నో జీవితాలు ఐపీఎల్ పుణ్యమా అని నాశనమవుతున్నాయి. టెన్త్ క్లాస్ కుర్రాడు సైతం బెట్టింగ్ పట్ల ఆసక్తి చూపుతున్నాడు. ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో బెట్టింగ్ పాపమే ఓ యువకుడ్ని బలిగొన్న వార్త అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలకు కొదవే లేదు.
సాయంత్రమైతే టీవీలకు ఎంతమంది అతుక్కుపోతున్నారో, అందులో చాలామంది బెట్టింగ్తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానేఏ సంబంధం కలిగి వుంటున్నారన్నది అతిశయోక్తి కాదు. ఐపీఎల్లో అంతా మనోళ్ళే.. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నదీ మనోళ్ళే.. ఎంటర్టైన్మెంట్ ముసుగులో అక్రమ వ్యాపారం చేస్తున్నదీ మనోళ్ళే.. బెట్టింగ్‌లో మోసపోయి నష్టపోతున్నదీ మనోళ్ళే.!