ఎమ్బీయస్‌ : గోడ్సేని ఎలా చూడాలి? – 30

పైన చెప్పిన ఘటనలు, కోర్టు విశేషాలు తన పుస్తకంలో ('ద మర్డర్‌ ఆఫ్‌ ద మహాత్మా' – జైకో ప్రచురణ, 1965) రాసిన జస్టిస్‌ ఖోస్లా రాశారు – ''గోడ్సే ఉపన్యాసం సాగుతున్నంత సేపు…

పైన చెప్పిన ఘటనలు, కోర్టు విశేషాలు తన పుస్తకంలో ('ద మర్డర్‌ ఆఫ్‌ ద మహాత్మా' – జైకో ప్రచురణ, 1965) రాసిన జస్టిస్‌ ఖోస్లా రాశారు – ''గోడ్సే ఉపన్యాసం సాగుతున్నంత సేపు కోర్టులో వున్నంతవారందరూ నిశ్శబ్దంగా వింటూ చలించిపోయారు. కొందరు మహిళలు కన్నీరు కార్చారు. మగవాళ్లు దుఃఖం ఆపుకోవడానికి చిరుదగ్గు దగ్గుతూ జేబురుమాళ్ల కోసం వెతుక్కున్నారు. నాకేదో డ్రామాయో, హాలీవుడ్‌ సినిమాయో చూస్తున్నట్లుంది. కేసుకి సంబంధం లేని విషయాలపై మాట్లాడవద్దని గోడ్సేను హెచ్చరిద్దామని ఒకటి రెండుసార్లు అనుకున్నాను కానీ 'ఇతనెలాగో కొన్నాళ్లలో చావబోతున్నాడు. తను చెప్పుకోవలసినది చెప్పుకోనీ' అనుకుని వూరుకున్నాను. ఆ రోజు ఆడియన్సును జ్యూరీ సభ్యులుగా కూర్చోబెట్టి వుంటే వాళ్లలో చాలామంది 'నాట్‌ గిల్టీ' అని అనేసి వుండేవారు. కానీ వాస్తవాలు వాస్తవాలే కదా.  కుట్ర జరిగిందన్నది నిర్ద్వంద్వంగా రుజువైంది. గోడ్సే, ఆప్టేలకు మరణశిక్ష, గోపాల్‌, మదన్‌లాల్‌, కర్కారేలకు యావజ్జీవ శిక్ష ఖరారు చేశాం. పర్చూరే, శంకర్‌లను వదిలేశాం, సావర్కార్‌ను కింది కోర్టే వదిలేసింది.''
గోడ్సే, ఆప్టేల ఉరితీత గురించి కూడా ఖోస్లా రాశారు. 1949 నవంబరు 15 న వారిని అంబాలా సెంట్రల్‌ జైల్లో ఉరి వేశారు. ఉరిశిక్షకు ఎదురుచూసే రోజుల్లో  గోడ్సే పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేశాడు. ఆప్టే భారతీయ తత్త్వశాస్త్రంపై వ్యాఖ్యానం రాశాడు. ఉరి తీసే రోజున గోడ్సే కంటె ఆప్టే ఎక్కువ నిబ్బరంగా కనబడ్డాడని జైలు సూపరింటెండెంట్‌ అన్నాడట. ఉరికంబం వైపు అతని అడుగులు దృఢంగా పడితే, గోడ్సే అడుగులు అప్పుడప్పుడు తడబడ్డాయట. అఖండ్‌ భారత్‌ – అమర్‌ రహే నినాదాలిస్తూ యిద్దరూ వధ్యస్థలం వైపు నడిచారు. ఉరి తీశాక ఆప్టే వెంటనే మరణించగా, గోడ్సే శరీరం స్పృహ కోల్పోయి, భావరహితంగా అయినా ప్రాణం మిగిలి వుందన్నదానికి గుర్తుగా పావుగంట సేపు కాళ్లు కొట్టుకొని, శరీరం మెలికలు తిరిగింది. కొద్ది సేపటికి రెండు శవాలను కిందకు దింపి జైల్లోనే దహనక్రియలు నిర్వహించారు. దహనస్థలాన్ని తవ్వేసి, దున్నేశారు. అస్థికలను ఘగ్గర్‌ నదిలో ఎవరికీ తెలియని చోట కలిపివేశారు. 

యావజ్జీవ శిక్ష పడినవారి పరిస్థితి ఏమైందో గోపాల్‌ గోడ్సే వెలువరించిన గోడ్సే వాఙ్మూలం పుస్తకం ముందుమాటలో వుంది. తమను విడుదల చేయాలని గోపాల్‌ గోడ్సే 22 సార్లు సుప్రీం కోర్టులో కేసు వేశాడు, కానీ ప్రభుత్వానికి దురుద్దేశం వున్నట్లు రుజువు చేయలేకపోయాడు. నేరస్థులపై తమకు పూర్తి అధికారం వుందని, వారు మరణించేవరకు బంధించి వుంచదలిచామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయినా 1964 అక్టోబరు 13 న ముగ్గుర్నీ విడుదల చేసింది. అంటే వాళ్లు జైల్లో 16 సంవత్సరాల కొద్ది నెలలు వున్నారు. బయటకు రాగానే గోపాల్‌ గోడ్సే, కర్కారేలకు వాళ్ల మిత్రుల స్వాగతోత్సవం ఏర్పాటు చేశారు. అక్కడ తమ చర్యలను సమర్థించుకుంటూ వాళ్లు చేసిన ఉపన్యాసాలు ప్రభుత్వానికి కోపం తెప్పించాయి. విడుదల చేసిన 40 రోజుల్లోనే డిటెన్షన్‌ చట్టాన్ని ఉపయోగించి మళ్లీ జైల్లో పెట్టారు. 18 నెలల తర్వాత విడిచి పెట్టారు. బయటకు వచ్చాక గోపాల్‌ గోడ్సే  తన వాదనలతో 'గాంధీ హత్యా అణి మీ' (గాంధీ హత్యా-నేనూ) అనే పుస్తకం రాశాడు. దాన్ని ప్రభుత్వం నిషేధించింది. హైకోర్టు ఆ నిషేధాన్ని కొట్టివేసి ఖర్చులు యిప్పించింది. అప్పుడు అతను గోడ్సే వాఙ్మూలం పుస్తకాన్ని కూడా వివిధ భాషల్లో ప్రచురించాడు. కర్కారే అహ్మద్‌ నగర్‌లో వ్యాపారం చూసుకుంటూ 1974లో పోయాడు. మదన్‌లాల్‌ విడుదలయ్యాక పెళ్లి చేసుకుని బొంబాయిలో కాగితపు మిల్లుల వ్యాపారంలో వున్నాడు.

ఇక్కడితో గోడ్సే వాఙ్మూలం, కోర్టులో విచారణ, తీర్పు వివరించడం పూర్తయింది. ఇప్పటికే పాఠకులకు గోడ్సే చర్య సమంజసమో, కాదో ఒక అభిప్రాయం ఏర్పడి వుంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం తెలుపుతూ యీ సీరీస్‌ ముగించడానికి ముందు ''నైన్‌ అవర్స్‌ టు రామా'' పుస్తకాన్ని క్లుప్తంగా పరిచయం చేస్తాను. నవలగా, సినిమాగా (1963) వచ్చింది. మన దేశంలో రెండిటినీ నిషేధించారు. దాని గురించి ఎందుకు అంటే – యిప్పటిదాకా జరిగిన ఎకడమిక్‌ చర్చలతో తల వేడెక్కిపోయి వుంటుంది. ఈ హిస్టారికల్‌ ఫిక్షన్‌ కాస్త రిలీఫ్‌ యిస్తుందని ఆశ. హిస్టరీ బోరుగా వుంటుంది కానీ హిస్టారికల్‌ ఫిక్షన్‌ ఉత్కంఠభరితంగా వుంటుంది. ఉత్కంఠ కోసం పాత్రల స్వభావాలు, స్థలాలు, సమయాలు కాస్త మారుస్తూ వుంటారు. సంఘటనలను గుదిగుచ్చి వేగం పెంచుతారు. అయితే దాన్ని ఎంజాయ్‌ చేయాలంటే చరిత్ర కూడా చదవాలి. ఈ సందర్భంలో యిష్టం వుండో లేకనో చరిత్ర తెలిసింది కాబట్టి యిప్పుడీ ఫిక్షన్‌ చదవడం బోనస్‌. దీనిలో రచయిత ఏ మేరకు కల్పన చేశాడో, పాత్రల స్వభావాన్ని ఎంత మార్చాడో గమనించడం ఆసక్తికరంగా వుంటుంది. 

గాంధీ హత్యకు 9 గంటల ముందుగా నవల ప్రారంభమై, ఫ్లాష్‌ బ్యాక్‌లలో పాత్రల నేపథ్యాలను వివరించే వారి గతాన్ని చెపుతుంది. ఇది స్టాన్లీ వోల్‌పర్ట్‌ అనే ఒక అమెరికన్‌ మెరైన్‌ ఇంజనియర్‌ రాసిన నవల. 21 ఏళ్ల వయసులో నవలకు థీమ్‌ గురించి వెతుకుతూ అతను 31-01-1948న ఇండియాకు వచ్చాడు. ఆ ముందురోజే గాంధీ హత్య జరిగింది. అప్పటి  సాంఘిక, రాజకీయ వాతావరణాన్నంతా కళ్లతో చూశాడు. దీనిపై నవల రాస్తే బాగుంటుందనిపించింది కానీ ధైర్యం చాలలేదు. 1954 వరకు ప్రపంచమంతా పర్యటించి 1954లో తొలి నవల వెలువరించాడు. ఆ తర్వాత ఇండియా గురించి కక్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ తర్వాత 1962 లో యీ నవల రాశాడు.  గాంధీ, గోడ్సే, ఆప్టేల పాత్రల పేర్లు మాత్రమే నిజమైనవనీ, తక్కినవన్నీ కల్పితమైనవని ముందే చెప్తాడు. దీని తర్వాత భారత్‌, పాక్‌ నాయకులనేకులపై పుస్తకాలు రాశాడు. ఇండియా అంటే అస్సలు ఏమీ తెలియనివారికి సైతం బోధపడేలా అప్పటి రాజకీయ వ్యవస్థను, విభజన వలన వచ్చిన సామాజిక సమస్యలను, హిందూ ఆచారవ్యవహారాలను స్పృశిస్తూ యీ నవల రూపొందించాడు. మనకు అవన్నీ తెలుసు కాబట్టి, సంఘటనలను మాత్రం ప్రస్తావిస్తూ క్లుప్తంగా పుస్తకసారాంశాన్ని చెప్తాను. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives