నగ్న సాధువులు నాగరిక ప్రపంచంలోకి రావటాన్ని నిషేధించాలా?
మరి నాగరిక ప్రపంచంలో నగ్నయోగం పేరిట ప్రయోగాలు చేస్తున్న వారి మాటేమిటి?
నఖ సిగ పర్యంతం ఎటువంటి ఆచ్ఛాదనా లేకపోవటమే నగ్నత్వమా?
తల నుండి మొల దాకా ప్రదర్శించటం నగ్నప్రదర్శన కాదా?
అశ్లీలాన్ని భరించగా లేనిది నగ్నత్వాన్ని ఎందుకు నిషేధించాలి?
నగ్నత్వం ఆత్మవిశ్వాస ప్రకటన అంటున్న ప్రయోగశీలుర మాటల అంతరార్థం ఏమిటి?
సాధువులు నగ్నంగా నాగరిక సమాజంలో తిరగటం బుద్ధిలేని పని అంటూ ఈ మధ్య గోవా మంత్రి సుదిన్ ఒక సుదినాన వార్తల్లోకి ఎక్కారు. పూర్వ కాలంలో ఇలా తిరిగారంటే అర్థం ఉంది కానీ 2020లోకి దూసుకుపోతూ కూడా ఇలా నగ్నంగా తిరగటం హర్షించదగ్గ చర్య కాదు… సాధువులు ఇలా నగ్నంగా తిరగటాన్ని నిషేధించాల్సిందే అంటూ మాటల తూటాలు పేల్చారు.
అవి కొందరి గుండెలను తూట్లు పొడిచాయి. ఆధ్యాత్మికపరుల ప్రాంగణాలలో బాంబులు పడ్డట్లయింది. ఈ సుదిన్‌కి మంత్రిపదవి ఇవ్వటమే బుద్ధిలేని పని అంటూ భక్తిపారవశ్యంతో మునిగితేలుతున్నవారు పైకే అనేసారు. హిందూదేశంలో ఉంటూ ఇటువంటి మాటలు వినటమే మహాపాపం అన్నట్టు చెవులు మూసుకున్నారు. అసలు ఈ నిషేధించటాన్ని గోవాబీచ్‌లో నగ్నంగా తిరుగాడుతున్న నాగరికులకు మొదట వర్తింపచేస్తే సరిపోతుంది కదా అని బాహాటంగానే అన్నవారూ ఉన్నారు.
అవును కదా… ముందు మన ఇల్లు చక్క బరచుకోవాలన్న ఆలోచన ఈ గోవామంత్రికి వచ్చినట్లు లేదు … లేదా గోవా బీచ్‌లో నగ్నంగా తిరుగుతున్న నాగరీకులలోని నగ్నత్వం వీరి చూపులకు చిక్కలేదేమో?!
మొత్తానికి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మనది నాగరిక సమాజం… మనందరిదీ ఆధునికతను మేళవించుకున్న సభ్యవర్తనం… అశ్లీలతను చుట్టపు చూపుగానైనా వినోదించటం తెలిసిన హాస్యప్రియులం. ఇంతటి సఖ్యత మధ్య అపడపడైనా ఇలా దిగంబరంగా సన్యాసులు తిరగాడటం అసహ్యకరచర్యనా?
అన్నట్టు, ‘టవల్’కి ‘షవర్’కి మధ్య జీవితాంతం నగ్నత్వం పరచుకునే ఉంటుందని ఎపడో చదివిన మాటలు గుర్తొచ్చి, ఆహా ఎవరి నగ్నత్వాన్ని వారే అనుభవించటంలో వెనకడుగు వేయటం లేదు కదా అనిపించింది. మరి ఈ నగ్నత్వాన్ని కవర్ చేస్తూనే కదా మన వధారణ. అయినా నేటిమేటి సమాజంలో అర్ధనగ్నత్వం అందలం ఎక్కుతూనే ఉంది. మనం ఈ అర్థనగ్నత్వాన్ని ఆహ్వానిస్తూ, ఆహ్లాదిస్తూ, హర్షిస్తూనే ఉన్నాం. మొత్తానికి అర్థనగ్నత్వాన్ని సహించ గలుగుతున్నాం … వల్గారిటీని సహించ ప్రయత్నిస్తున్నాం.
ఇలా వర్తమానంలో అంటే సభ్య సమాజంలో మనం ఆశ్లీలాన్ని సహించగలుగుతున్నాం కానీ నిజంగానే నగ్నత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నామా? అందుకే అనిపిస్తుంటుంది సభ్యత్వం, అసభ్యత్వం కనిపించే నగ్నత్వంలో ఉందా? చూసే చూపులో ఉందా? అని. చూసే చూపును బట్టి నగ్నత్వానికి మార్కులు పడుతుంటాయి. చూసే చూపును బట్టే నగ్నత్వం అసభ్యత్వం అనీ అనిపించుకుంటుంది.
ఏ కుంభమేళాలలోనో లేక ఏడాది కొక్కమారో నగ్న సాధువులు ఏ పుణ్యనదీ స్నానాలకోసమో ఆ నదీ తీరాలకు చేరుకోవటం హర్షించదగ్గ చర్య కాదంటే ఎలా? పోనీ వారు మానాన వారు వెళ్తుంటే వారి నగ్న రూపాల్ని మనం కళ్లప్పగించి చూస్తుండటం మాత్రం సభ్యచర్యనా? అయినా వారేవిూ కొత్తగానో, వారు ప్రతిరోజూ ఉండే విధానానికి వ్యతిరేకంగానో వర్తించటం లేదే?! మనమే విపరీతాలకు పోతూ ఇలా అనుచితవ్యాఖ్యలు చేస్తున్నామేమో?!
సముద్ర మథనం తర్వాత దేవతలు అమృతాన్ని తీసుకు వెళ్తుండగా ఆ అమృతభాండంలోని అమృత బిందువులు నాలుగు నదీ జలాలలో పడ్డాయట. అలా పడ్డ గంగానదీ హరిద్వారం, సరస్వతీ నదీ ప్రయాగ, గోదావరీ నదీ నాసిక్, సిప్రానదీ ఉజ్జయినీలలో ప్రతీ మూడేళ్లకో మారు ఒక్కో ప్రాంతంలో దాదాపు నలభై అయిదు రోజుల పాటు ‘కుంభమేళా’ జరుగుతుంటుంది. ఇలా కుంభమేళా జరుగుతున్న రోజులలో అక్కడి నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం.
ఆరేళ్లకో మారు ‘అర్థకుంభమేళా’ ఒకమారు హరిద్వార్‌లోను మరొకమారు ప్రయాగలోను జరుగుతుంటుంది. పన్నెండేళ్లకో మారు ‘పూర్ణకుంభమేళా’ ప్రయాగలో నిర్వహించబడుతుంది. 144 సంవత్సరాల కొకమారు ‘మహా కుంభమేళా’ ప్రయాగలోనే జరుగుతుంది.
ఈ ఏడాది జులై 14న నాసిక్‌లోని రామకుండంలో కుంభమేళా ప్రధానోత్సవం ప్రారంభమవుతున్న తరుణంలో సుదిన్‌కి సభ్య సమాజంలోకి నగ్న సాధువులు రావటం ఏమిటి అన్న ఆలోచన వచ్చింది కాబోలు… మన భారతీయ ఆధ్యాత్మిక నేపధ్యాన్ని మరచి పుసుక్కున నిషేధించాలని అనేసారు. ఈ కుంభమేళాకి హిమాలయ పర్వత ప్రాంతాల నుండో, కీకారణ్యాల నుండో శైవారాధకులైన నగ్న నాగ సాధువులు లక్షల సంఖ్యలో హాజరవుతారన్న విషయం తెలిసే ఆయన అలా అన్నారు.
నాగసాధువులు వొంటినిండా విభూతి పట్టించుకుని చేత్తో త్రిశూలాలతోను, మానవ పుర్రెలతోను తమ మానాన తాము సాగిపోతుంటారు. జడలు కట్టిన పొడవాటి జుట్టుతో ఎముకలు కొరికే చలిలోనైనా నగ్నంగానే తిరుగుతుంటారు. చిలుము పీలుస్తూ మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంటారు. తమ ఆధ్యాత్మిక పరిణామానికి తమ నగ్నత్వం కానీ, మత్తు పదార్థాల సేవనం కానీ అవరోధం కాదని వీరు త్రికరణశుద్ధిగా విశ్వసిస్తుంటారు. పైగా మృత్యువుకు ఏ కోశానా భయపడరు. ఎంతలా నగ్నంగా తిరుగుతున్నా సంయమనాన్ని ఏమాత్రం కోల్పోరు. అటుకలిసీ ఇటుకలిసీ గుమ్మడికాయ దొంగ ఎవరా అంటే భుజాలు తడుముకున్నట్టు మన సుదిన్ వంటి వారు మాటల్లో నైనా సంయమనాన్ని కోల్పోతుంటారు.
ఈ నాగ సాధువులనే నగ్నసాధువులనీ అంటుంటాం. బహుశా వీరిని చూసే కాబోలు ఈనాడు ప్రపంచ దేశాలలో ‘నగ్నయోగం’ ఒకటి పుట్టుకొచ్చింది. ఎటువంటి వధారణ లేకుండా నగ్నంగా ఉంటూ భౌతిక సంపదలపై కానీ, కామతృష్ణ కానీ లేకుండా ఉండటమే ఈ నగ్నయోగ సాధనా ప్రయత్నం.
మొత్తానికి విదేశాలలో వ్యాప్తిలోకి వస్తున్న ఈ నగ్నయోగం అనేది భారతదేశం నుండే ప్రపంచ దేశాలకు దిగుమతి అయిందట. మానసిక, ప్రాపంచికాలైన శారీరక కట్టడుల నుండి బయటపడి స్వేచ్ఛగా యోగసాధన కొనసాగించ వచ్చనేది నగ్నయోగ ప్రధాన సూత్రం. ఈ దిగంబర యోగ ఛాయలలోనే యోని యోగం, లింగ యోగం అంటూ ఇతర శాఖలూ ప్రారంభమయ్యాయి.
“why does nudity upset some people and why does it excite others to such a degree?” అన్నది ఈ దిగంబర యోగ సాధకుల ప్రశ్న. ‘‘సామాన్యంగా ఒకరిముందు వివం కావటానికి చాలమంది బిడియ పడుతుంటారు. బిడియపడుతున్నంత కాలం ఆత్మవిశ్వాసం ప్రబలం కాదు. జన్మతః ప్రతి ఒక్కరిదీ నగ్నరూపమే. ఈ నగ్నత్వమే దైహిక సహజత్వం. కాబట్టి నగ్నత్వాన్ని గురించి విరుద్ధ ఆలోచనలు, వాదనలు, ఫీలింగ్స్, అవహేళనగా, అసభ్యంగా మాట్లాడుకోవటం ఎందుకు?’’ అన్నది సమాధానం.
ఇంతకీ నగ్నయోగసాధన వల్ల..
- నెగటివ్ ఎమోషన్స్ నుండి బయటపడతాం.
- మనల్ని గురించి మనేక బాగా తెలిసివస్తుంది.
- మనల్ని మనం ప్రేమించుకోగలగటమే కాక ఇతరుల్ని సైతం ప్రేమించగలగుతాం.
- మనలో వైయక్తికవికాసం, ఆత్మవిశ్వాసం అధికం కావటమే కాక, వాటితో ఇతరుల్నీ ప్రభావిం చేయగలం.
మొత్తానికి నగ్నత్వం అంటే భౌతికంగా నూలుపోగు లేకుండా ఉండటమే కాదు… మానసికంగాను అన్ని ప్రాపంచిక అపేక్షల్నీ త్యజించటం … ఏమాత్రం కామదాహం లేకుండా ఉండటం.
నగ్నయోగ సాధనతో..
- అంతర్గత సౌందర్యం దేదీప్యమౌతుంది.
- దైహిక విశ్వాసం వృద్ధి చెందుతుంది.
- ముఖ్యంగా మహిళలు కొన్ని పరిధులలోనే ఆలోచించటం కాక విస్తృత్వం అవుతారు.
- స్త్రీలలో వైయక్తిక ఎదుగుదల, మానసిక పరిణతే కాక ఎమ్‌పవర్‌మెంట్ అనేదీ సాధ్యమౌతుంది.
సంకుచిత భావజాలం నుండి బయటపడటానికి ఉపయోగపడుతుంది.
అసలు మన సంపూర్ణ వికాసానికి మన నగ్నత్వమే నిజమైన పెట్టుబడి. నగ్నంగా పుడమిపైకి వచ్చినపుడు ఏ లిమిటేషన్స్ లేవు. వస్త్రాలంకరణతో జీవించటం ప్రారంభించాక రకరకాల అభిప్రాయాలతో, నమ్మకాలతో, నిర్ణయాలతో వర్తించవలసి వస్తోంది. అందుకే మన నగ్నత్వాన్ని ఆనందించటం తెలిస్తే మనకు సంపూర్ణస్వేచ్ఛ అంటే ఏమిటో తెలిసివస్తుంది.
‘నాగరీకంగా జీవించటం అలవాటైన తర్వాత ఇలా నగ్నంగా ఉండటం కష్ట సాధ్యమైన విషయం కదా’ అంటే వారి జవాబు ‘‘ఒకే ఆలోచనతో సాధనకు వచ్చే వారి ముందు బట్టలు తీసేసి నగ్నం కావటం మొదట్లో కాస్త కష్టం గానే ఉంటుంది. ఎపడైతే మన వేషాలంకరణే మన ప్రాపంచిక స్టేటస్‌ని తెలియచేసేదని, నగ్నత్వమే మన సహజలంకారమని తెలిసిన తర్వాత ఏ బిడియాలూ ఉండవు. అందరూ అదే ధోరణిలోనే ఉంటారు కాబట్టి ఒకే దృక్పథంతో ఉన్నవారి ముందు ఆత్మన్యూనతతో ఉండాల్సిన అవసరం రాదు. అందరూ నగ్నంగా ఉండేప్పటికి ప్రాపంచిక ఔన్నత్యాలు, స్థితిగతులు అన్న ప్రశ్న తలెత్తదు. అసలు నగ్నత్వాన్ని సెక్స్ పరంగా చూడటం మానుకుంటే ఏ ఇబ్బందులూ ఉండవు. పైగా నగ్నయోగసాధన వల్ల మనలో ఆనెస్టీ, ఆథెంటిసిటీ పెరుగుతుంది.’’
“To remove clothing is to remove restrictions” అన్నది నేకెడ్ యోగసూత్రం. పైగా ఈ యోగసాధన “A Journey of working out negative feelings to a more positive head space” సింపుల్‌గా చెపకోవాలంటే నగ్నయోగం అనేది “Revealed Authentic and wise” అట. పైగా కుండలినీ, విన్యాస యోగాల సంయోగమే ఈ నగ్నయోగం.
నగ్నంగా సాధన చేస్తున్న స్థితిలో “The toxins in the body find an outlet leading to purification of body and” కాబట్టే మనదేశ నాగసాధువులు ఈ నగ్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకీ ఎంతో సభ్య, నాగరీక దేశాలనుకుంటున్న ప్రపంచ దేశాలు భారతీయ ఆధ్యాత్మికంలో అంతర్భాగమైన నగ్నత్వాన్ని అర్థం చేసుకుని సాధనకు పూనుకుంటుంటే మహిమాలయాలైన హిమాలయాలలోనో, ఎటువంటి పొల్యూషన్‌లేని కీకారణ్యాలలోనో సాధన కొనసాగించే నగ్న సాధువులు కలిసికట్టుగా కుంభమేలాళలకు రావటాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందా అని.
డా. వాసిలి వసంతకుమార్
సెల్ : 9393933946